జీవితమంతా 'చిత్ర' మైన పులకింత

చాలా మంది అడుగుతుంటారు, నేను ఎముకల డాక్టరుని ఎందుకయ్యానని, ఏకా అయ్యానని. ఎంబిబిఎస్ అయిపోయే సరికి చాలా మందికి తర్వాత ఏం స్పెషలైజేషన్ చెయ్యాలి అన్న దానిమీద ఒక అవగాహన, ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి. అలానే నాక్కూడా కొన్ని ఏర్పడ్డాయి. మొదటినుంచీ, నాకు సర్జికల్ బ్రాంచ్ అంటే ఇష్టం. ట్యూబ్ లైట్ లు చూసి, ఎంబిబిఎస్ లో చేరినట్టు ఇష్టానికి వెనక్కూడా ఓ సిల్లీ (మీకనిపించొచ్చు నాక్కాదు) కారణం వుంది.

చిన్నప్పుడు చూసిన డాక్టర్ సిన్మాలన్నింటిలోహీరో ఆపరేషన్ థియేటర్ లోంచి చాలా స్టయిల్ గా బయటకొచ్చి గ్లోవ్స్ తీసేసి నుదుట చెమట బిందువులను అలవోకగా తుడిచేసుకుని 'ఆపరేషన్ సక్సెస్' అనడం, బయట దిగులుగా వెయిట్ చేస్తున్న బంధువులందరూ మూకుమ్మడిగా ఆ ప్రాణదాతని "మీరు దేవుడు డాక్టర్ గారూ" అని అభినందించడం, ఆ తర్వాత హీరోయిన్, హీరోని ఆరాధన పూర్వకంగా "వేణూ ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపే ప్రేమమూర్తివి - నువ్వు, నాకు దొరకడం, నా పూర్వజన్మ సుకృతం" అంటూ ఆయన గుండెల్లో ఒదిగి పోవడం ఇవన్నీ చూసి నేను కూడా సర్జన్ అయిపోదామని సెటిల్ అయిపోయాను. (అదేంటో చాలామంది సిన్మా డాక్టర్లకి వేణు అని పేరుంటుంది. 30 ఏళ్ళనుంచి చూస్తున్నా, ఏ సిన్మాలోనన్నా గురవారెడ్డి అని అంటుందేమోనని)

ఇక ఆర్థోపెడిక్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటారా? రెండు కారణాలు. ఒకటి ఈ బ్రాంచ్ లో బుర్ర ఖర్చుపెట్టి డయాగ్నసిస్ కోసం టెన్షన్ పడనక్కర్లేదు. ఎక్స్ రేలు చూస్తే చాలు, కాబట్టి నా దగ్గర తక్కువగా ఉన్న ఆస్తిని (బుర్ర) పొదుపుగా వాడుకొను వీలుంటుంది. రెండోది అపెండిక్స్, హైడ్రోసీల్ ఆపరేషన్లు అందరూ చేస్తుంటారు. కానీ చిన్న ఎముక విరిగినా, ఆ పేషంటు బొక్కల డాక్టరు దగ్గరికే వస్తాడు. కాబట్టి మనకు మినిమమ్ గ్యారంటీ ప్రాక్టీసుంటుంది. రాత్రిపూట రిక్షా తొక్కిపెళ్లాం పిల్లల్ని పోషించాల్సిన అవసరం రాదు నికరంగా. ఆలోచన బానే ఉంది కానీ ఇక్కడినుంచే ట్రాజెడీ సీను మొదలు. నాలాటి ఆలోచనలు, కోరికలు ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంది ఉండడం, వాళ్లందరికీ నాకంటే కొంచెం ఐక్యూ ఎక్కువ వుండడం, వాళ్లు నన్ను వెనక్కు తోసేసి, ఎంఎస్ సీటు కొట్టేయడం నేను విరిగిన ఎముకలా. అరిగినా జాయింటులా మిగిలిపోవడం చకచకా జరిగిపోయాయి.

ఇంతలో ఓ హితుడు "బాంబేలో డి.ఆర్ధో సీట్లు చాలా ఖాళీగా ఉండిపోతాయట. నీ అదృష్టం పరీక్షించుకోకూడదా" అని ఓ ఉచిత సలహా పారేశాడు. 'సాహసం చేయరా డింభకా' తరహాలో ఎవరూ తెలియకుండా, ఏమీ రికమెండేషన్ లేకుండా బాంబేలో దిగిపోయాను. “సర్, ఆర్ధోపెడిక్ సీట్లున్నాయి. మీరు మా కాలేజీలోనే చేరాలి" అని చాలామంది స్టేషన్ చుట్టూ మూగుతారని ఊహించిన నాకు నిరాశే ఎదురయింది. “మేలైన ఆర్ధోపెడిక్ సీట్లు ఉచితం - మొదటి 50 మందికి knee hammer ఉచితం. సంప్రదించండి" అన్న హోర్డింగ్ లు ఎదురవుతాయనుకున్న నాకు నిరాశతో పాటూ నిస్ప్రహ కూడా తోడయ్యింది. అయినా సరే, 'పట్టు' వదలని విక్రమార్కుడిలా 'కీలు'కి బలపం కట్టుకుని, అన్ని ఆస్పత్రులూ తిరిగాను. ఫలితం శూన్యం. ఈలోపు "పూనాలో సంచేటి హాస్పిటల్లో సీట్స్ వుంటాయి. అక్కడ ట్రై చేయి" అని ఇంకో ఉచిత సలహా దొరికింది.

బాగా గుర్తు - ఓ వర్షాకాలం సాయంత్రమది. వెతుక్కుంటూ, సంచేటి హాస్పిటల్ కి చేరాను. ఆమె పేరు చిత్ర. ఆఫీసులో క్లర్క్. “మొన్నే ఇంటర్వ్యూలై పోయాయి.సీట్లు లేవు" అని చావుకబురు చల్లగా చెప్పింది. చాలా నీరసపడిపోయాను. దిగులుతో మొహం చిన్న బుచ్చుకుని, బయటకు వస్తున్నాను. ఇక హైదరాబాద్ కి బస్సులు వెదుక్కుందామని. అప్పుడే నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరిగింది. కష్టకాలంలో మనల్ని ఉద్ధరించడానికి దేవుడు రకరకాల రూపాల్లో వస్తుంటాడట.

ఆ రోజు చిత్ర దేవదూతగా మారినట్లుంది. నేను మెట్లు దిగుతుండగా, తను నా వెంటే బయటకు వచ్చి అటూ ఇటూ చూసి "సెలెక్ట్ అయిన వాళ్లలో ఒక్కతను చేరలేదింకా. బాస్ ని కలువు. కాని నేను చెప్పానని చెప్పకు" అనేసి క్షణంలో మటుమాయం అయిపొయింది. ఆ తర్వాత నేను డాక్టర్ సంచేటిని కలవడం, ఆయన చిత్రకు ఫోన్ చేసి అడగడం, ఆమె ఒక్క సీట్ వుందని చెప్పడం, బాస్ ఆ సీటు నాకివ్వడం - అరగంటలో జరిగిపోయాయి. ఇది దైవికం కాక ఇంకేమిటి? ఆ సాయంత్రం, చిత్రకి నామీద జాలి కలిగి, ఆ ఇన్ ఫర్మేషన్ చెప్పకపోతే నాకు ఆ సీటు దొరికేది కాదు. డాక్టర్ సంచేటిని మొదటిసారి కలవడం నేను.

మొదటి పరిచయంలోనే, ఏ రికమండేషన్ లేకుండా సీటు ఇవ్వడం ఆయన గొప్పతనం - నా అదృష్టం. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు నా కెరీర్ లో, సంచేటి గారి ఆశీస్సులతో, ఇంగ్లాండ్ వెళ్లడం, మరిన్ని డిగ్రీలు సంపాదించడం, ఈ రోజు ఇంత మందికి సేవచేసే భాగ్యం కలగడం ఇవన్నీ ఆరోజు చిత్ర ఇచ్చిన లక్కీ బ్రేక్ వల్లనే. సీటు ఇచ్చిన గురువుగారికి ఎంత ఋణపడి ఉన్నానో ఆ దేవుడికి దారి చూపిన, పూజారి చిత్రకి కూడా అంతే ఋణపడి ఉన్నాను,

ఈ మధ్యే పూనా వెళ్లినప్పుడు చిత్రని కలుద్దామని ప్రయత్నం చేశాను. తను ఉద్యోగం మానేసినట్లు, స్పైనల్ కార్డ్ దెబ్బతిని పెరాలిసిస్ వచ్చినట్లు, నాగపూర్ లో తన కూతురి దగ్గర ఉన్నట్లు తెలిసింది. చాలా బాధ వేసింది. తను కోలుకోవాలని మౌనంగా ప్రార్ధించడం తప్ప నేనేం చేయగలను. జీవనపథంలో చేయూతనిచ్చిన పెద్ద పెద్ద వ్యక్తుల్ని అందరం గుర్తు పెట్టుకొంటాం. కాని, చిత్రలాంటి 'చిన్న' మనుషులు మనం పై మెట్లునెక్కడానికి, కీలక సమయంలో వాళ్ళు అందించిన సాయాన్ని మర్చిపోతాం. చిత్రలాంటి 'చిన్న పెద్ద' మనుష్యుల్ని గుర్తుచేసుకుని, వారందరికి కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్పమనమేం చేయగలం.