పుస్తకం నా ఆస్తి

'నాకు నచ్చిన పుస్తకం' గురించి మాట్లాడమని 'ఎన్' టీవీ (వనిత టీవి) వాళ్లు పిలిచారు. ముందస్తుగా ఇంత మంచి ఐడియా వచ్చినందుకు టీవీ వారికి నా అభినందనలు, మన తెలుగు భాషలో ఎన్ని మంచి పుస్తకాలున్నాయో! ఎంత గొప్ప రచయితలున్నారో, పుస్తక పఠనం అనే మంచి అలవాటు, అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అవసరం ఎంతైనా వుంది. కంప్యూటర్ లు, ఇ – మెయిల్ లు, ఇంటర్నెట్ లు, ఇ – బుక్స్ లాంటి సాంకేతిక అద్భుతాలు, ప్రభంజనాల్లాగా వచ్చి పడినా, తన ఉనికిని, సొగసును, స్థానాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతూనే వుంది పుస్తకం ఇంకా. ఓ ఎండా కాలం, చల్లటి గాలిలో, మేడ మీద పరుపు వేసి పాటలు వింటూ.

ఓ మంచి పుస్తకం చదివినప్పుడు వచ్చే తన్మయత్వం ఇంకెప్పుడు వస్తుంది చెప్పండి. అలానే, ఓ వర్షం పడే రాత్రిలో, కిటికీలోంచి చినుకుల్ని పలకరిస్తూ, సేనక్కాయలు (లేదా మొక్కజొన్న పొత్తు) తింటూ ఓ జేమ్స్ హెడ్లీ ఛేజ్ పుస్తకం చదివినప్పుడు వచ్చే 'కిక్కు' ఇంకెప్పుడు వస్తుంది చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే తెగ ఇష్టం. స్కూల్ లో డిబేట్స్ లో బహుమతులుగా, పుస్తకాలిచ్చే వాళ్లు. ఆ పుస్తకాల్ని ఎంతో అపురూపంగా దాచుకొని, మళ్లీ మళ్లీ చదువుకుంటూ వుండే వాడిని.

నాకు ఊహ తెలిసిన తర్వాత, గుర్తుండిపోయిన మొదటి పుస్తకం, “చుక్ - గెక్ అన్నదమ్ములు". ఆ రోజుల్లో సోవియట్యూనియన్ (ఇప్పటి రష్యా) నుంచి బోల్డన్ని పుస్తకాలు, తెలుగులో ముద్రితమయ్యేవి, చాలా చౌకగా కూడా దొరికేవి. ఈ పుస్తకం తర్వాత, నా తమ్ముళ్లకి గిఫ్ట్ గా ఇచ్చాను. అదింకా మా ముగ్గురిలో ఎవరి దగ్గరో వుండే వుండాలి. ఆ రోజుల్లో చందమామ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లం. దాంట్లో 'పరోపకారి పాపన్న' కథలు వస్తుండేవి. అది చదివి నేను తెగ ఇన్స్ పైర్ అయిపోయి, పెద్దయినాక నేను కూడా 'గుడ్ సమారిటన్ గురవన్న' లాగా మారిపోవాలని అనుకునే వాడిని.

ఇంటర్మీడియట్ లో చదివిన మొదటి ఇంగ్లీష్ పుస్తకాలు ఛేజ్ బుక్స్, ఇవి డిటెక్టివ్ నవలలు. 'వరల్డ్ ఇన్ మై పాకెట్' ఎన్నిసార్లు చదివానో గుర్తులేదు. ఆ రోజుల్లో EMESCO వాళ్లు 'ఇంటింటా సొంత గ్రంథాలయం' పేరుతో బోల్డన్ని అద్భుతమైన పుస్తకాలు, కారు చౌకగా అందజేస్తుండే వాళ్లు. యువ మాస పత్రిక మీద వడ్డాది పాపయ్య శాస్త్రిబొమ్మలు ఎంత బాగుండేవో.

తర్వాత రోజుల్లో విజయ అని ఓ మాసపత్రిక వచ్చేది. దానితో పాటు చిన్న నవలిక వచ్చేది. అవన్నీ బైండ్ చేసి పెట్టే వాడిని మా అమ్మ కోసం. మెడికల్ కాలేజీ రోజుల్లో యండమూరి అభిమానిని అయిపోయాను. తెలుగు దేశాన్ని ఊపేసి, ఆంధ్రభూమి వారపత్రిక సర్క్యులేషన్ పెంచిన 'తులసీ దళం' నాకు పెద్దగా నచ్చలేదు కానీ, 'ఆనంద్రోబ్రహ్మ', 'వెన్నెల్లో ఆడపిల్ల', 'నిశ్శబ్దం నీకూ - నాకూ మధ్య', 'ప్రార్ధన' లాంటివి నాకు నచ్చిన యండమూరి నవలలు.

ముందే చెప్పానుగా - I am a born romantic అని. యండమూరి నవల్లో ఆ భావుకత, రొమాంటిసిజమ్ నాకు తెగ నచ్చేవి. పుస్తకం చదివి, మదర్ తెరిస్సా లారా మారిపోతే అది మంచి పుస్తకం అనుకోనక్కర్లేదు. నా ఉద్దేశ్యంలో, గుండెల్లో తీపి అనుభూతుల్ని మిగిల్చి, మనసుని తేలిక పరచే ఏ పుస్తకమైనా మంచి పుస్తకమే. ప్రతి పుస్తకంలోనూ, సామాజిక స్పృహ వెతకనక్కర్లేదని నా అభిప్రాయం.

ఆ రోజుల్లో నా మనస్సులో చెరగని ముద్ర వేసిన ఇంకో రెండు పుస్తకాలు - అంపశయ్య (నవీన్), హోస్ సర్జన్ (కొమ్మూరి వేణుగోపాల రావు). నాకు ఇష్టమైన సాహిత్యం - ఆత్మ కథలు, హాస్య రచనలు, వ్యంగ్య రచనలు. బయోగ్రఫీలు. ఏ దేశం వెళ్లినా, మొదట కొనేది పుస్తకాలు. హిట్లర్ నుంచి గాంధీ దాకా ఎవరిదైనా జీవిత కథ అంటే చదవాల్సిందే. బారిష్టరు పార్వతీశానిది నాకు నచ్చిన హాస్య రచనల్లో అగ్ర తాంబూలం. అలాగే ముళ్ళపూడి పద ప్రయోగమంటే తెగ ఇష్టం.

'అమృతం కురిసిన రాత్రి' (బాల గంగాధర్ తిలక్) లోంచి బోల్డన్ని కొటేషన్స్ ఏరుకుని, వాటిని వాడుకొని ఎన్ని డిబేట్స్ గెలిచానో మెడికల్ కాలేజీలో. దేవులపల్లి సాహిత్యంలో లాలిత్యం నా గుండెల్లో ఆనందాన్ని నింపుతూనే వుంటుంది ఇప్పటికీ. "కనుదోయి నల్ల కల్వలుగా కనిపించు ప్రాయము నీది సన్నజాజి పువ్వు - నవ్వులని అనిపించు భావన నీది చీరె చెరగు గుసగుసమన్నా - చెలి అందియల సడివిన్నా - చిక్కులు సుమ్మా తెరచి వుంచేవు సుమ్మా త్వరపడి నీ హృదయమూ బిరబిరా ఏ సుందరియో చొరపడితే ప్రమాదమూ " ఇలాంటి తేనెలూరే మాటలు కృష్ణశాస్త్రి గారు కాక ఇంకెవరు రాయగలరు.

ఇలాంటి మహాకవులు రచించిన కవితలకు స్పందించని రస హృదయుడుండడు. “కలువలు పూచి నట్లు - చిరు గాలులు వీచినట్లు, తీవలు తలలూచినట్లు - పసిపాపలు చేతులు చాచినట్లు, క్రొవ్వలపులు లేచినట్లు - చెలువలు చేలువారగా చాచినట్లు, ఆత్మలు పెనవేసినట్లు. కవితల్ రచియింతురహో మహా కవుల్" - ఈ స్పందన ఇంకో మహాకవి కరుణశ్రీ గారిది. నా మిత్రుడు గజల్ శ్రీనివాస్ గొంతు నుంచి ఈ కవిత జాలు వారుతుంటే, పంచదార పాకం జుర్రుకున్నట్లే ఉంటుంది.

గుంటూర్లో, మా మెడికల్ కాలేజీలో, లైబ్రరీ ప్రాంగణంలో అద్భుతమైన కొటేషన్ వుండేది. దాని సారాంశం - “పుస్తకా లంటే ఇష్టపడే వ్యక్తికి, ఓ మిత్రుడు కాని, ఓ గురువు కానీ, ఓ సలహా దారుడు కానీ, ఓ మార్గ దర్శికానీ అక్కర్లేదు" అది ఎంత నిజమో! జీవితంలోని వెలుగు నీడల్లో, సుఖ దుఃఖాల్లో, జయాపజయాల్లో, శబ్ద కాలుష్య గందరగోళంలో, ఏకాంతంలో, నిశ్శబ్దంలో, మనల్ని అక్కున చేర్చుకొని, ఊపిరిచ్చే, ఓదార్చే, స్పూర్తినిచ్చే పుస్తకానికి - శతకోటి నమస్కారాలు.