TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
పోయిన వారం కూర్మారావు ఫోన్ చేశాడు "నీ కాలమ్ చదువుతున్నాను. అంతా బాగానే వుంది. కానీ మనం కలిసి చదువుకున్న బాపట్ల అగ్రికల్చర్ కాలేజీ రోజుల గురించి రాయడం లేదే - అంతగా గుర్తుంచుకోవాల్సిన విషయాలేమీ లేవా - ఏంటి" అంటూ. ఎందుకు లేవూ! గుర్తుండిపోయే సంఘటనలు చాలా జరిగాయి ఆ రోజుల్లో. బాపట్ల వ్యవసాయ కళాశాలలో మూడేళ్ళు అంటే ఆరు సెమిస్టర్స్ పాటు, బి. యస్సీ (అగ్రి) చదివాను. కాదు - కాదు - దున్నాను అంటే సబబుగా వుంటుందేమో! మెడికల్ కాలేజీ ముందు ప్రహసనం ఇది. ఇంటర్ అయి. డిగ్రి చేరగానే ఏ కుర్రకుంకైనా మొట్టమొదట చేసే పని కాలర్ ఎగరేయడం, మీసం పెంచడం అద్దం ముందు ఎక్కువసేపు గడపడం - క్రాఫ్ చేరగక పోయినా మళ్ళీ మళ్ళీ దువ్వడం. కానీ నా దురదృష్టం ఇవన్నీ నేను ఫుల్ స్కేల్ లో చేయలేకపోయాను.
కారణం మా నాన్న అదే కాలేజీలో ప్రొఫెసర్ కాబట్టి. ఇల్లు కూడా, కాలేజీ ప్రక్కనే. కాబట్టి హాస్టల్ జీవితంలో మజా కూడా అనుభవించ లేకపోయాను. అప్పటికీ, నా శాయశక్తులా ప్రయత్నించి మా టైగర్ కళ్ళు కప్పి మస్తీ చేసేవాడిననుకోండి అది వేరే విషయం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడ్ని ఆపగలరా. మోచేతిని అడ్డుపెట్టి గురవడ్ని ఆపగలరా? ర్యాగింగ్ (అంటే కొత్తగా చేరిన జూనియర్లని సర్దాగా ఏడిపించడం) మరీ మితి మీరుతుందని ప్రిన్సిపాల్ గారు యాంటీ ర్యాగింగ్ కమిటీ క్రింద కొంతమంది ప్రొఫెసర్లని వేశారు. దానికి చైర్మన్, ఇంకెవరు మానాన్న.
ర్యాగింగ్ అతిగా చేస్తున్నారని, ఓ పదిమంది పేర్లు చైర్మన్ కి అందాయి. దాంట్లో మొదటి పేరు - ఇంకా చెప్పాలా - నాదే. ఇక చూస్కోండి. మిగతా వాళ్లందరికీ ఓ పావుగంట మాత్రమే తిట్లు. నాకు ఇంట్లో కూడా ఉతుకుడే ఉతుకుడు "ఛీ - వెధవా నా పరువు తీస్తున్నావురా" అంటూ. ఆ పోయిన పరువును మళ్లీ సంపాదించాలని బుద్దిగా మా నాన్న క్లాస్ లో ముందు వరుసలో కూచుంటే వెనకనించి "ఒరేయ్ మీ బాబు సుత్తేస్తున్నాడురా" అని కామెంట్స్. నిజానికి మా నాన్న పాఠాలు వాళ్లందరికీ ఇష్టం.
కానీ నన్ను ఇరకాటంలో పెట్టడానికే ఇదంతా. అందుకే, అమ్మానాన్నలు పనిచేసే దగ్గర, అస్సలు చదవకూడదు. అగ్రికల్చర్ కాలేజీలో ప్రతినెలా పరీక్షలుండేవి - క్విజ్ లని, పీరియాడికల్ టెస్టులని. తెగ చదివేసే వాళ్లం. క్విజ్ సాయంత్రం అయితే ఉదయం మొదలెట్టే వాళ్లం చదవడం. అంత కూడా చదవడం కుదరకపోతే కాపీ కొట్టేవాళ్లం వెనక వాడి పేపరులోంచి, మా బ్యాచ్ లో 120 మంది అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు వుండేవారు.
మన ఐరెన్ లెగ్ పుణ్యమా అని ఆ ఐదుగురు అమ్మాయిలు నా వెనక నెంబర్లే. నాది బి- 74-26 అయితే వాళ్ళు 27 నుంచి 31 దాకా. కాబట్టి కాపీ కొట్టడానికి కూడా నాకు ఇష్టమయిపోయేది. ఎలాగైనా అమ్మాయిలు ఇలాంటి తిక్కవేశాలు వేయరు కదా. నా క్లాస్ మేట్స్ చాలామంది దగ్గర ముళ్ళపూడి స్టైల్ లో 'ఓ ఫైవుందా' అని అప్పు చేసేవాడ్ని. వాళ్లందరికీ అలా అప్పులివ్వడం అలవాటయిపోయి, ఇప్పుడు బ్యాంక్ మేనేజరయిపోయి ఇంకా అప్పులుస్తూనే వున్నారు. నేను తీసుకుంటూనే ఉన్నాను.
రామకృష్ణగాడు ఈ 'నస' ఎందుకని అమెరికా వెళ్ళి 'నాసా'లో సెటిల్ అయిపోయాడు. అజయ్ కల్లం ఐఎఎస్ చేసి కలెక్టర్ అయిపోయా డు. అంకయ్య, ప్లాంట్ బ్రీడింగ్ లో ప్రొఫెసర్ అయిపోయాడు జిపి గాడు ఫారెస్ట్ ఆఫీసర్. రమణమూర్తిగాడు, రామానుజం గాడు Bank Managers అందరూ అడపాదడపా కలుస్తూనే వుంటాం. పాత రోజులు నెమరేసుకుంటూ ఉంటాం.
మా అమ్మాయిలు ఏమయ్యారంటారా? మయూర వల్లి కెనడాలో ఎంటమాలజిస్ట్ గా సెటిల్ అయిపొయింది. అశోకరాణి బాపట్ల కాలేజీలో ప్రొఫెసర్. రమాదేవి, రజని బ్యాంక్ ఆఫీసర్స్, అయినా వాళ్లెమైతే నాకేమిటి. నాకు చాలా కోపం వీళ్లంటే - క్విజ్ లో అన్సర్స్ చూపించనందుకు కాదు. నన్ను ఓ మరవలేని, మరపురాని అవమానానికి గురి చేసినందుకు. ఆ కథేమిటంటే - తిరుమల రావుగారు అని ఓ ఎంటమాలజిస్ట్ (కీటకశాస్త్రం - పురుగుల గురించి) గురువు గారుండే వారు. ఆయనకి కొత్త, కొత్త వింత వింత ఆలోచనలు వస్తూ వుండేవి. అలాంటి వింతల్లో, గ్రూప్ వైవా ఒకటి.
అంటే ఓ ఐదుగుర్ని ఒక్కసారే ప్రశ్నలేసి, సామూహిక మర్డర్ చేయడం. వెరసి అమ్మాయిలకీ నాకు కలిపి వైవా. అందరమూ మా ఇన్ సెక్ట్ బాక్స్ లు తీసుకుని లోపలికెళ్లాం. రకరకాల కీటకాల్ని పట్టి, పెట్టెలో పెట్టి, వాటికి నేమ్ బోర్డ్స్ కట్టి చూపించాలి. మనదే పురుగు జీవితం. మనకి వేరే పురుగుల్ని పట్టుకునే టైం ఏది?అందుకే ముందుగా అమ్మాయిలందర్నీఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్లకి పనికిరాని, రెక్కలో, కాళ్ళో విరిగిపోయిన హ్యాండీకాప్డ్ పురుగుల్ని దానం తీసుకుని, నా పెట్టెలో వీలయినంత అందంగా సర్దాను. తిరుమల రావుగారు, అమ్మాయిల కలెక్షన్ చూసి వెరీ గుడ్ అని తెగ ఆనందపడిపోయాడు.
చివరగా నేను నా బాక్స్ తెరిచాను, అంతే - ఆ తర్వాత ఆయన కుర్చీలోంచి క్రింద పడిపోవడం, జుట్టు పీక్కోవడం, తల గోడకేసి కొట్టుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. అంతటితో ఆగకుండా డిపార్ట్ మెంట్ లో అందర్నీ పిలిచి "వీళ్లనాన్న గొప్ప ఎంతమాలజిస్ట్ (కీటకాధిపతి). వీడి ఇన్ సెక్ట్స్ చూశారా ఎలా ఉన్నాయో! మీ నాన్న పరువు తీయడానికే పుట్టావురా నువ్వు" అని స్వచ్చమైన తేట తెలుగులో తిట్టాడు.
ప్రక్కనే మా అమ్మాయిల ముసిముసి నవ్వులు. కాళ్ళు విరిగి, రెక్కలూడిపోయిన ఆ పురుగుల్లో, నేను కూడా ఓ పురుగుగా మారిపోయాను ఆ క్షణంలో. ఆ అవమాన జ్వాలలు ఇంకా మండుతూనే ఉన్నాయి నా గుండెలో. నాలాటి ఓ అల్పజీవిని, ఎవరో ప్రేమగా 'గాడిద కొడకా' అని తిడ్తే ప్రక్కనే వెళ్తున్న గాడిద "వీడా నా కొడుకు" అని దుఃఖిస్తూ వెళ్లిపోయిందట. గొప్ప తండ్రులున్న ఏవరేజి కొడుకులకి అంకితం - ఈ నా కథ, వ్యధ.
|