రామ రామ...


 రామ రామ...

 

 


-పద్మశ్రీ


విశాలమైన రోడ్డు...

ఆ రోడ్డు సగంవరకూ ఇరుకు ఇరుకుగానైనా సరే అతీగతీ లేనివారు గుడిసెలు నిర్మించుకున్నారు. దానివల్ల ఆ రోడ్డు మూసుకుపోయింది... సరే.. మొత్తానికి అదో లోక్లాస్ బస్తీ అని మీకీపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఆ లోక్లాస్ బస్తీలో కామన్ గా రోజుకో గొడవ జరగడం మామూలు విషయమే... దానిగురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదు.. తాగి తందనాలు ఆడేవారి గురించి అసలే పట్టించుకోనక్కర్లేదు. ఇరుకు సందుల్లో ఆటలాడుతూ కొట్లాడుకునే పిల్లలు, ఆ పిల్లల గొడవల్లో పెద్దలు తలదూర్చడం, ఆ తర్వాత చిలికిచిలికి గాలివానలా చిన్న పిల్లల గొడవ కాస్తా పెద్దవాళ్ల గొడవగా మారి అతి పెద్ద గొడవవ్వడం ఆ లోక్లాస్ బస్తీలో కామనాతి కామను... కాబట్టి దాని గురించి కూడా పట్టించుకోనక్కర్లా...

మరి దేని గురించయ్యా పట్టించుకునేది...? అని కోపంగా మీరు ప్రశ్నిస్తున్నారు కదూ... అక్కడికే వస్తున్నా..!

ఈ గొడవలన్నీ ఏదో ఒక రోజు... ఏదో ఒక సందర్భంలో వస్తుంటాయి... కానీ.. కామన్ గా ప్రతీరోజు ఠంచనుగా.. ఓకే సమయానికి, ఓకేచోట, ఆ బస్తీలోనే అతి పెద్ద గొడవ జరుగుతుంది... బస్తీవారికి ఆ గొడవ కామనే..

కానీ... ఇప్పుడు ఆ గొడవ జరగడం కోసం, గొడవ జరుగున్నప్పుడు లైవ్ లో గొడవని కన్నులారా చూడాలని, గొడవని చూడడమే కాదు చెవులారా వినాలని కామన్ గా అనుకోకుండా కాస్త సీరియస్ గానే కొందరు సెలబ్రిటీలు చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయారు. వారు అలా అయిపోయారు కాబట్టి ఆ గొడవ మనకి టాక్ ఆఫ్ ది పాయింట్ అయిందన్నమాట... ఇంతకే ఎక్కడో లోక్లాస్ లోగొడవ జరుగుతుంటే సెలబ్రిటీల కెందుకంత ఇంట్రెస్టనే కదా మీ డౌట్..?

అదీ చెప్తా..

సెలబ్రేటిలంటే.. లేడీ సెలబ్రిటీలన్న మాట...

లేడీ సెలబ్రిటీలంటే... లేడీ పొలిటికల్ సెలబ్రిటిలన్నమాట...

మరి... ఉన్నపళంగా లేడీ పొలిటికల్ సెలబ్రిటీలకు లోక్లాస్ గొడవపై ఎందుకంత ఇంట్రెస్టు కలిగిందబ్బా... అని అనుకుంటున్నారా..?

అదీ చెప్తా..

ఎందుకంటే....

ఆ గొడవ మామూలు గొడవ కాదు... ఠంచన్ గా ఒకే సమయానికి, ఓకే చోట జరిగే గొడవ కదా.. అందుకు...? ఇంకో ముఖ్యమయిన విషయమేంటంటే... ఈ గొడవలో కేవలం లేడీసే పార్టిసిపేట్ చేస్తారన్నమాట.... అందుకే లేడీ పొలిటికల్ సెలబ్రిటీలకి లేడీస్ పార్టిస్ పేట్ చేసే గొడవ చూడాలన్న సీరియస్ ఇంట్రెస్ట్ కలిగిందన్నమాట...

అబ్బా... ఆ గొడవలో అంత స్పెషాలిటీ ఉందా...? అని అనుకుంటున్నారు కదూ... ఉండదు మరీ.. రోజుకొక్కసారి... ఓకే ఒక్కసారి మంచినీళ్లతో ట్యాంకర్ వచ్చినప్పుడు ఆ మంచినీళ్లని పట్టుకోవడానికి బిందెలు తీసుకుని బస్తీ లేడీసంతా మూకుమ్మడిగా ట్యాంకర్ మీద పడ్డప్పుడు ఆ గొడవ చూడాలి..

హబ్బో... చెబుతుంటేనే ఇలా ఉంటే,,, ఇంక లైవ్లో చూస్తే ఎలా ఉంటుందో కదా... అదిగదిగో... ఆ ఇంట్రెస్టుతోనే లీడింగ్ పార్టీలోని లేడీ పొలిటికల్ సెలబ్రిటిలందరూ ఇంపోర్టెడ్ కార్లేసుకుని సరిగ్గా నీళ్ల ట్యాంకర్ ఆ బస్తీలోకి అడుగు పెడుతున్న సమయానికి అక్కడికి వచ్చేశారు...

కార్లలో నుండి కిందకు దిగి, హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఓ ప్యాడ్, పెన్నూ తీసుకుని కాన్సన్ ట్రేషన్ మొత్తం కాబోయే గొడవపైనే పెట్టేశారు అందరూ...

ట్యాంకర్ వచ్చి ఆగింది.

ఆ ట్యాంకర్ పై బస్తీ లేడీసందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. అలా చేయడంతో ముందు బిందెల శబ్దం హోరెత్తింది. ఆ శబ్ధం విన్న లేడీ పొలిటికల్ సెలబ్రిటీలు పెదవి విరిచి, మళ్లీ సర్దుకుని కాన్సన్ ట్రేషన్ పెట్టేసారు.

గొడవ స్టార్టయింది... లేడీసందరూ నోటికి పనిచేప్పేశారు. ఎవరు ఎవరిని తిడుతున్నారో తెలీదు మొత్తానికి బండ బూతులు (ఈ పదం వాడక తప్పింది కాదు... సారీయే..) తిట్టుకుంటున్నారు.... ఆ బూతులు విని తట్టుకోలేక సిగ్గుతో తలదించుకుని మగోళ్లంతా అక్కడినుండి దూరంగా పారిపోతున్నారు...

మన సెలబ్రిటీలు మాత్రం వారు తిట్టుకుంటున్న వారిలో ఏ ఒక్క తిట్టు కూడా వదిలిపెట్టకుండా ఎడాపెడా రాసేసుకుంటూనే ఉన్నారు... గంటసేపు జరిగిన గొడవలో ఆ లేడీ పొలిటికల్ సెలబ్రిటీలకు ఎన్నో (బూతు) తిట్లు దొరికేసాయి... అవి దొరకడంతో వారి మొహాల్లో ఆనందం ఎలా ఉప్పొంగిపోతుందంటే... హైదరాబాదులో వర్షం పడగానే రోడ్లపై ఉన్న డ్రైనేజీలు ఎలా ఉప్పొంగిపోతాయె.. అలా ఉప్పొంగిపోతుంది... ఆ తిట్లు రాసిన ప్యాడ్ ని ఎంతో అపురూపంగా చూసుకుని జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుని వారి వారి ఇంపోర్టెడ్ కార్లలో చక్కగా వెళ్ళిపోయారు ఆయా పార్టీల లేడీ పొలిటికల్ సెలబ్రిటీలు... ఇప్పుడు వారు ఎంతో కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. వారి మొహాల్లో ఆనందం ఇందాక చెప్పిన మాదిరిగానే ఉప్పింగిపోతోంది...

అందుకోసం ఆ లోక్లాస్ బస్తీలో గొడవకి ఆ లేడీ పొలిటికల్ లీడర్లు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట...

ఇంతకీ ఆ (బూతు) తిట్లు వారికెందుకు...? అనే ప్రశ్నిస్తున్నారా...?

ఏంటండీ ఇందాకట్నుండి చూస్తున్నా అంత అమాయకంగా ప్రశ్నలడుగుతారు...

టీవీలు చూడరా మీరు...?

అందులోనూ న్యూస్ ఛానళ్లు చూడరా...?

మరీ అందులోనూ లేడీ పొలిటికల్ లీడర్లు మాట్లాడుతున్నప్పుడు చూడరా..?

ఇంతవరకూ చూడకపోతే త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి కదా...

అప్పుడు చూడండి టీవీలు... లేడీ పొలిటికల్ సెలబ్రిటీలు ఆ లోక్లాస్ బస్తీలో జరిగిన గొడవకి ఎందుకు ఇంపార్టెన్సు ఇచ్చారో తెలుస్తుంది..

అన్నీ నేనే చెప్పాలా..?

హన్నా...!