ఐపీఎల్ఐసి (ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఇంఫర్మేషన్ సెంటర్ )

ఐపీఎల్ఐసి

(ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఇంఫర్మేషన్ సెంటర్ )

-పద్మశ్రీ

 

‘ఇచ్చట మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులని... ఛ... ఛ.... కాదు కాదు... ప్రధానమంత్రి ఒక్కడే కదా ఉండేది... ప్రధాన మంత్రి ఒక్కడిని, ఇంకా చోటా మోటా నాయకులందరినీ మూకుమ్మడిగా వేలం వేయబడును. వారిని కొనాలనుకునే వారందరికీ ఇదే మా ఆహ్వానం’ పేపర్లో ఆ ప్రకటన చూసిన జనాలు నోట్లో వేలేట్టుకున్నారు, మామూలుగా అయితే ఆశ్చర్యం కలిగించే సీన్ ని చూస్తే నోటిపై వేలేసుకుంటారు, కానీ అలా వేలేసుకోవాలనే స్పృహలో కూడా లేకుండా ఏకంగా నోట్లో వేలేట్టుకున్నారన్నమాట.

అలా వేలేట్టుకుని ఆ పేపర్ లో ప్రకటన కింద ఇచ్చిన మ్యాటర్ చూసి, షాకై నోట్లో ఉన్న వేలిని కసుక్కున కోరుకున్నారు. ఆ తర్వాత అబ్బో... బాబో... వామ్మో అని అరుచుకుంటూ కిందా మీదా పడ్డవాళ్ళు దేశంలో కోట్లలోనే ఉండి ఉంటారు. ఆ ప్రకటనకి అంత పవరుంది మరి. ఇంతకీ ఆ ప్రకటన కింద ఏమిచ్చారూ...?రాజకీయ నాయకులని కొనుక్కుని మీ ఇష్టమొచ్చిన రీతిలో, మీ ఇష్టమొచ్చిన విధంగా, మీ ఇష్టమోచ్చినట్టు, మీ ఇష్టప్రకారంగా, మీ ఇష్టానికి భంగం కలిగించకుండా, మీరు ఇష్టపడ్డట్టు, మీకు ఇష్టపడేవిధంగా, మీకు ఇష్టం కలిగే దాకా, మీలో ఇష్టం చల్లారే వరకూ, మీ ఇష్టాన్ని ఇష్టానుసారంగా వారిని ఏమైనా చేసుకోవచ్చు.

అసలు... రాజాకీయ నాయకులు చేసేదేంటీ... ప్రజాసేవ... వారు ప్రజాసేవ చేస్తే... వారిని వేలంపాటలో కొనుక్కున్న మీరు ఆ నాయకులని, ఆ నాయకుల పాలిస్తున్న ప్రజలని ఏమైనా చేసుకునే హక్కు మీకుంటుంది.. ఈ సువర్ణావకాశం ఈ దేశంలో ఉండే బడా బడా పారిశ్రామికవేత్తలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరులందరికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులారా... రండి... నాయకులని లీజుకు తీసుకోండి.. భారతదేశాన్ని గుత్తాధిపత్యంగా పాలించండి.. ప్రజలు, ప్రజానాయకులు మీ చేతుల్లోనే.. ఈ దేశాన్ని ఏమైనా చేసుకునే హక్కు మీకు కల్పిస్తుంది.

కొత్తగా వచ్చిన ఐపిఎల్ఐసి. అదేనండీ.. ఇండియన్ పిలితికల్ లీడర్స్ ఇన్పర్ మేషన్ సెంటర్. పాపం.. ఈ ప్రకటనే ప్రజల కొంప ముంచింది.. ఛ.. ఛ... కొంప కాదు.. వేలిని తెంచింది.. ఆరోజు దేశంలో ఉన్న ఆర్.ఎం.పి. డాక్టర్లతో పాటు పెద్ద పెడా డాక్టర్లందరూ చాలా సీరియస్ గా ‘వేళ్ళని’ బాగుచేసే పనిలో బిజీగా ఉండిపోయారు. అలా డాక్టర్లకీ ఆదాయం ఆ ఒక్క రోజులోనే కోట్లలో వచ్చింది... హు.. ఏమో... రానున్న కాలంలో క్రికెటర్ల మాదిరిగా మన రాజకీయ నాయకులని కూడా వేలం వేసేస్తారేమో.. ఏమో....!