డబ్బులు రాని ఉద్యోగం....

 డబ్బులు రాని ఉద్యోగం....

-పద్మశ్రీ

ఆరోజు పేపర్లో ఓ ప్రకటన వచ్చింది... పెద్ద పెద్ద అక్షరాలతో డబ్బులు రాని ఉద్యోగం అని హెడ్డింగు... దాని కింద... మంచి ఉద్యోగం ఉంది... కాని డబ్బులు రావు.. ఆసక్తి కలవారు సంప్రదించవలసిన చిరునామా ఫలానా... ఇదీ ఆ ప్రకటనలో సారాంశం...

వచ్చే డబ్బులే చాలడం లేని ఈ రోజుల్లో డబ్బులు రాని ఉద్యోగానికి ఎవరు వెళతారులే... అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే... ఆ ఉద్యోగం కోసం పోటీపడి మరీ వచ్చారు... అసలే చిన్న ఆఫీసు... అంత చిన్న ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులు నిండిపోవడంతో గాలాడక ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది... ఆ గది నిండిపోవడంతో పాటు.... ప్రకటన వచ్చిన పత్రికని చంకలో పెట్టుకుని పరుగు పరుగున వస్తున్న అభ్యర్థులని చూడగానే ప్యూను గుండె గుభేల్ మంది.

ఇలా కాదనుకుని వెంటనే ఆ గదిలో ఉన్న అభ్యర్దులందరినీ వరుస క్రమంలో నిలబెట్టే పనిలో చెమటలు కార్చేస్తున్నాడు... అలా వరుస క్రమంలో అనగా.. క్యూ పద్ధతిలో అభ్యర్దులని నిలబెడ్తే... ఆ క్యూ కాస్తా ఓ కిలోమీటర్ వరకు వెళ్ళిపోయింది.. ఆ క్యూలో నిలబడిపోయిన అభ్యర్థుల మొహాలలో ఆ ఉద్యోగం తమకే రావాలనే గాఢమైన కోరిక స్పష్టంగా కనిపిస్తుంది...

అంతేకాదు... అభ్యర్దులని వరుస క్రమంలో నిలబెడుతున్న ప్యూనుని ప్రలోభపెట్టి తమ బయోడేటాని తొందరగా చేరవేసే పనిలో కూడా కొందరు పడ్డారు... ఒక్కసారిగా తనకి వచ్చిన డిమాండ్ కి కార్చిన చెమటంతా ఆవిరయిపోయింది..

సార్... సార్... ప్లీజ్ సార్.. నా ముందు వాళ్ళకి కాకుండా ఆ ఉద్యోగం నాకు వచ్చేటట్టు చేయండి... సార్... ప్లీజ్ సార్.. మీ ఋణం ఉంచుకోను సార్... ఆ క్యూలో నిలబడ్డ ఓ అభ్యర్ధి ఫ్యూన్ ని బ్రతిమిలాడుకుంటున్నాడు.. అంతేకాదు ప్యాంటు జేబులోనుండి ఓ వంద నోటు తీసి ప్యూన్ జేబులో కుక్కడు...

ఏరా... ఓరే.. ఒనే పదానికి పడ్డ ప్యూను.... తనని సార్ అని పిలిచేసరికి...అతని ఛాతీ ఓ పది ఇంచుల వరకు పెరగాలనుకుంది కానీ... రోజూ సాయంత్రం సారాయి తాగే బాడీ కాబట్టి... పదించుల వరకు పెరగలేక... ఓ రెండించులు పెరిగింది...

ఆ ప్యూన్ జేబులో వందనోటు పెట్టడం చూసిన మరో అభ్యర్థి పరుగు పరుగున ప్యూన్ దగ్గరికి వచ్చాడు...

సార్... సార్.. ఆ ఉద్యోగం నాకు మాత్రమే వచ్చేలా చూడండి సార్... ఇతను మీ జేబులో వందరూపాయలే కుక్కాడు.. నాకా ఉద్యోగం రావడానికి సహాయపడితే... నేను ఇదిగో.. అంటూ జేబులోనుండి రెండు వంద నోట్లని తీసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్యూన్ జేబులో కుక్కాడు...

అంతే వారిద్దరి ప్రవర్తనతో అక్కడి వాతావరణం మారిపోయింది... హౌస్ ఫుల్ అయిన సినిమా టిక్కెట్టు బ్లాకులో అమ్మేవాడికి ఒక్కసారిగా ఎలా డిమాండ్ పెరుగుతుందో అలా అమాంతం పెరిగిపోయింది ప్యూన్ డిమాండ్.

మరో అభ్యర్ధి ఏమీ మాట్లాడకుండా ప్యూను జేబులో మూడు వందనోట్లు కుక్కాడు.. మరో అభ్యర్ధి నాలుగు.... మరో అభ్యర్ధి అయిదు....

నోట్లు పెరుగుతున్నాయి.. ప్యూను జేబు నిండిపోతుంది... రానురాను ప్యూను డిమాండు స్టాకు మార్కెట్లో ఒక్కసారిగా దూసుకుపోయే సెన్సెక్స్ మాదిరిగా పెరిగిపోతుంది... ఆఫీసు గదిలో జనాలమధ్య ఊపిరాడలేదు ప్యూనుకి ఇందాక... ఇప్పుడు వందనోట్లతో నిండివున్న తన జేబుని చూసుకుంటే ఊపిరాడటం లేదు... అభ్యర్దులందరూ ప్యూను చుట్టూ మూగారు.. వందనోట్లతో ఓ జేబు నిండిపోవడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతని రెండో జేబులో వందనోట్లని కుక్కడం మొదలు పెట్టారు అభ్యర్ధులు.

నెలకు పదివేల జీతం... నెలకు ఇరవై వేల జీతం.... అంటూ పేపర్లో వచ్చే ప్రకటనలని చూసి ఎంతమంది జనాలు వెళుతారో తెలియదు గానీ,... డబ్బులు రాని ఉద్యోగానికి వచ్చిన అభ్యర్థులతో ఆ వీది మొత్తం నిండిపోయింది. అంతేకాదు ప్యూను షర్టూ, ప్యాంటూ లకి కలిసి ఉన్న మొత్తం నాలుగు జేబులూ నిండిపోయాయి...

ఫ్యూను ఎంతగానో బాధపడ్డాడు... మరో రెండు జేబులని ఎందుకు కుట్టించుకోలేకపోయానా.. అని అయినా ఆ ధైర్య పడకుండా వచ్చే వందనోట్లని టిఫిన్ బాక్స్ తెచ్చుకున్న సంచిలో వేసేసుకుంటున్నాడు...

సార్.... ఎలాగైనా సరే... ఆ ఉద్యోగం నాకే రావాలి....

సార్... నేను మీకు ఆరొందలిచ్చుకున్నాను... నాకే ఉద్యోగం వచ్చేలా చేయాలి..

సార్ నేను అతనికంటే డబుల్ పన్నెండువందలిచ్చాను... ఈ డబ్బులు రాని ఉద్యోగం నాకే ఇప్పించాలి..

ఉద్యోగం ఎవరికి వస్తుందో తెలియదు కానీ... ప్యూన్ కి మాత్రం డబ్బులతో పాటుగా రిక్వెస్టులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి..

ఆ సంచి కూడా నిండిపోవడం... వచ్చే వందనోట్ల సంఖ్య పెరిగిపోతుండడంతో ఏం చేయాలా అని ఆలోచించిన ప్యూన్ కి ఓ బ్రహ్మాండమైన ఐడియా తట్టింది... ఒక అభ్యర్థి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ని తీసుకుని అతని భార్యకి ఫోన్ చేసాడు.

ఏమేయ్... వెంటనే ఓ ఖాళీ బియ్యంబస్తా తీసుకురా... అని ఆర్డరేశాడు... పది నిమిషాల్లో అతని భార్య బియ్యం బస్తాతో ప్రత్యక్షమయింది... తమకి తట్టిన మహార్ధశని చూసి పొంగిపోతూ... బియ్యం బస్తాని తెరిచి పట్టుకుంది...

అభ్యర్ధులందరూ వందనోట్లు ఆ బస్తాలో వేస్తూ.... ఆ ఉద్యోగం ఎలాగైనా తమకే ఇప్పించాలన్న రిక్వెస్టుని ఫ్యూన్ చెవిలో వేస్తున్నారు...

చూస్తూ ఉండగానే ఆ బియ్యం బస్తా వందనోట్లతో సగం నిండిపోయింది.... ఆ బస్తాని చూసి ఫ్యూన్ భార్య ఎంతో ఉప్పొంగిపోయింది... అయితే వారంతా తన భర్తకి అలా విచ్చలవిడిగా వందనోట్ల రూపాయలని ఎందుకు ఇస్తున్నారో అర్థం కాలేదు... అదే విషయాన్ని భర్తని అడిగింది...

ఏవండీ... యీళ్లంతా నీకు పైసలెందుకుకిస్తున్నారు...? అని...

ఈ రోజు పొద్దున పేపర్లో డబ్బులు రాని ఉద్యోగం అని ప్రకటన చూసిండ్రు....

ఆ డబ్బులు రాని ఉద్యోగం చేయడం కోసం ఒచ్చినోళ్లే వీళ్లు... ఆ ఉద్యోగం ఎట్లాగైనా తమకే వచ్చేలా చెయ్యమని నాకు లంచం ఇస్తున్నారన్నమాట... ఆనందంగా చెప్పాడు ప్యూను.. అతని మాటలకి బుగ్గనొక్కుకుంది ఆవిడ...

ఏందీ... పైసలు రాని పనికోసం యీళ్లంతా వొచ్చిండ్రా... పైసలు రాని పనిచేస్తే మీకేమొస్తదయ్యా... ఆశ్చర్యపోతూ కొందరు అభ్యర్థులని అడిగింది ఆవిడ...

వేరే సమయంలో అయితే ఆమె అలా ప్రశ్నిస్తే విసుక్కునే వారే కానీ.. తమకి ఉద్యోగం రికమండ్ చేసే ప్యూన్ భార్య కాబట్టి ఆమెకి కూడా అక్కడ డిమాండ్ పెరిగిపోవడంతో... ఓ అభ్యర్థి పళ్ళన్నీ బయటకు కనిపించేలా నవ్వుతూ అన్నాడు...

వెధవది ఈరోజు ఉంది రేపెళ్లిపోయే డబ్బెవడిక్కావాలండీ... శాశ్వతంగా ఉండే ఉద్యోగం ముఖ్యం గానీ... అన్నాడు వినయంగా....

డబ్బులు రాకపోతే ఎట్ట బ్రతుకుతరయ్యా.. అంది ఆవిడ ఆశ్చర్యపోతూ... మళ్లీ పళ్లికిలిస్తూ...

వధవ బ్రతుకు ఎట్టాగయినా బ్రతుకొచ్చు... అయినా.. పెద్దలు ఏమన్నారండీ... ఓ నాలుగు రాళ్లు వెనకేసుకోమన్నారు గానీ... నాలుగు డబ్బులు వెనకేసుకొమ్మన్నారా... చెప్పండి... ఇప్పుడు ఈ ఉద్యోగం గనక నాకు వస్తే.... ఆ నాలుగు రాళ్ళు వెనకేసుకునే పనిలోనే ఉంటాను... వినయంగా అన్నాడా వ్యక్తి...

ఇంతకీ వారు ఉద్యోగం ఏమై వుంటుందా అనే కదా... మీ డౌటు...

దేవాలయంలో దేవుడి నగలకు కాపలా ఉండే జాబన్నమాట అది.

ఆ జాబయితే... డబ్బులతో పనేముంటుందండీ... మీ పిచ్చిగానీ...