TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
కరెక్టేనేమో...!
పద్మశ్రీ
అసెంబ్లీ హాలుదద్దరిల్లిపోతోంది. ప్రతిపక్షాలు, విపక్షాలు, మిత్రపక్షాలు, శత్రు పక్షాలు, ఆ పక్షాలూ ఈ పక్షాలూ అనే తేడా లేకుండా అందరూ మాకుమ్మడిగా మైకులు పట్టుకుని గగ్గోలు పెడుతున్నారు. వారి గగ్గోలుని వినే శక్తి లేకపోవడంతో స్పీకర్ గారు చెవిలో దూది పెట్టుకుని వారివైపు బ్లాంక్ గా చూస్తుండి పోయాడు.
ఏమి మాట్లాడుతున్నారో, అసలు మాట్లాడుతున్నారో, పోట్లాడుతున్నారో అర్థంకాక వారి అరుపులకి ఝడుసుకుని అసెంబ్లీ హాలులోనుండి బయటికి పరుగులు తీస్తున్నారు కొందరు. అరగంట నుండి అలా అరిచీ అరిచీ ఇక ఓపిక లేకపోవడంతో అందరూ ఒకేసారిగా కామ్ అయిపోయారు... అసెంబ్లీ సైలెంటవడంతో ‘హమ్మయ్యా’ అనుకుంటూ చెవిలోనుండి దూది తీసారు స్పీకర్ గారు. ఒకసారి గొంతు సవరించుకుని గంభీరంగా...
“ఊ.... ఇప్పుడు చెప్పండి... ఏమి డిసైడ్ చేసుకున్నారో...” అన్నారు సభ్యులందరినీ తేరిపార చూస్తూ.. “మేమా... ఏమీ డిసైడ్ చేసుకోలేదే...” అన్నారు ప్రతిపక్షాల వారు... స్పీకర్ గారు బిక్కమొహం వేశారు. “అదేమిటయ్యా అరగంటనుండి అరిచీ అరిచీ ఏమీ డిసైడ్ చేసుకోలేదంటారేమిటీ..” అంటూ అధికార పక్షం సభ్యుల వైపు చూస్తూ..
“మీరైనా చెప్పండయ్యా... పత్రిపక్షం వారు ఏమీ డిసైడ్ చేసుకోలేదంటున్నారు.. మరి మీరేమైనా డిసైడ్ చేసారా లేదా...” అన్నారు. “అధ్యక్షా... డిసైడ్ చేసుకోవడానికి మేమేమైనా చర్చించుకుంటే కదా..” అన్నారు ఓ సభ్యుడు కోపంగా...

“మరి.... ఈ అరగంట నుండి మీరు చేస్తుందేమిటీ...?” మరో అధికార పక్షం సభ్యుడు లేచాడు. “అధ్యక్షా... మేము ఎంతో నిదానంగా, ఓపికగా, కూల్ గా, తీయగా, కమ్మగా, ఇంకా చెప్పాలంటే... సుతి మెత్తగా... మరింకా చెప్పాలంటే సున్నితంగా.. వీటన్నింటికంటే మించి వినయంగా.... మరి... మేము చెప్పడం జరిగింది.... మేము చెప్పిందానికి ప్రతిపక్షాల వారు ఇలా చేయడం జరిగింది... కాబట్టి “అధ్యక్షా... మీరు వెంటనే ప్రతిపక్షాలపై చర్య తీసుకోవాలని నేను సవినయంగా కోరుతున్నాను..” స్పీకర్ గారు ఏడుపు మొహంతో... “ఇంతకీ మీరు చెప్పిందేమిటి... వారు చేసిందేమిటో కాస్త వివరంగా చెబుతారా...” “అధ్యక్షా.... నేనింత విడమరచి చెప్పినా కూడా మీకు అర్థం కాకపొతే ఇంక చేసేదేమీ లేదు... అధికార పక్షం వారిమి మేము, వారు ప్రతిపక్షం వారు... వారేదైనా చెబితే మీకర్థం కాలేదని అనాలిగానీ... మేమేం చెప్పినా మీకర్థం కావాలి... ఒకవేళ అర్థం కాకపోయిన అర్థం అయిందనే చెప్పాలి..” అనగానే వెంటనే ప్రతిపక్షాల సభ్యులు లేచారు... “అధ్యక్షా... అధికారపక్షం వారి మాటల్ని వింటున్నారు గదా... వారేం చెప్పినా మీరు తలూపాలంటున్నారు... మేమేమి చెప్పినా మీకర్థం కాలేదని అనమంటున్నారు... ఇదెక్కడి న్యాయం అని నేనడుగుతున్నాను...” ఆ వెంటనే....” చూసారా... అధ్యక్షా నేనన్నది మిమ్మల్ని కానీ వారిని కాదు కదా.... నేను మిమ్మల్నంటే వారికెందుకు మండుతుంది... కాబట్టి అధ్యక్షా... మీరు వెంటనే ప్రతిపక్షం వారిపైన తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను...” అంతే... ఆ మాటలకి మళ్లీ పత్రి పక్షం వారు, మిత్ర పక్షం వారు, శత్రు పక్షం వారు, ఆ పక్షం వారు, ఈ పక్షం వారు అనే తేడా లేకుండా మళ్లీ అందరూ లేచి అరవడం ప్రారంభించారు... షరా మామూలుగానే ఆ అరుపులకి స్పీకర్ గారు చెవిలో దూది పెట్టుకోవడం జరిగింది... ఆ తర్వాత షరా మామూలుగానే అరగంట గడిచిపోయింది.... తర్వాత కామన్ గానే సభ్యులందరూ అలసిపోయి సీట్లలో కూర్చోవడం జరిగింది... ఆ తర్వాత స్పీకర్ గారు ఈ సారి మరింత గంభీరంగా... సీరియస్ గా... మొహం పెట్టి.... ఓసారి సభ్యులందరినీ సీరియస్ గా చూసి చెవిలో నుండి దూది తీసి, గొంతు సవరించుకుని, మైకు సర్దుకుని... “గౌరవ సభ్యులారా... మీరు ఇలా పోట్లాడుకుంటా వుంటే టీవీలో లైవ్ టెలికాస్ట్ చూస్తున్న జనాలందరూ మీ గురించి ఏమనుకుంటారో తెలుసా.. అసలు మీరు ఏ విషయం పై ఇలా పోట్లాడుకుంటున్నారో.. అసలిలా పోట్లాడుకుని ఏం డిసైడ్ చేసుకున్నారో కనీసం మీకైనా తెలుసా అని నేనడుగుతున్నాను.. కాబట్టి సభా మర్యాదలను పాటించి మీరంతా సంయమనంతో సభని సజావుగా జరగనివ్వాలని అర్ధిస్తున్నాను.. అభ్యర్ధిస్తున్నాను....” ఆ మాటలు విన్న ప్రతి పక్ష సభ్యులొకరు లేచి మైకుపట్టుకున్నారు... “అధ్యక్షా.... కరెక్టు పాయింటు కొచ్చారు అధ్యక్షా... సరిగ్గా మేము మీరు చెప్పిన పాయింటు గురించే మాట్లాడుకుంటున్నాము...” “నేను చెప్పిన పాయింటా.... అదేమిటీ...?” “అదే అధ్యక్షా... టీవీలో అసెంబ్లీ సమావేశాలు లైవ్ టెలీకాస్ట్ ఇవ్వకూడదని అధికార పక్షం వారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము పోట్లాడుతున్నా మన్నమాట..” అనగానే మరోసారి సభ దద్దరిల్లిపోయింది... అధికార పక్షం సభ్యులు మినహా మిగతా సభ్యులందరూ మూకుమ్మడిగా అరవడం ప్రారంభించారు.. మళ్లీ స్పీకర్ గారు చెవిలో దూది పెట్టుకోవాలనుకున్నారు కానీ... అధికార పక్షం వారు కామ్ గా ఉండే సరికి.. ప్రతిపక్షం వారిని ఎలాగైనా ఊరడించాలని... మైకు సర్దుకుని.. “ప్లీజ్.... ప్లీజ్... సైలెంట్... సైలెంట్... అసలు అధికార పక్షం వారు లైవ్ టెలి కాస్టులని ఎందుకు ఇవ్వకూడదని అంటున్నారో వివరణ కోరుదాం.... ప్లీజ్ అందరూ సైలెంట్ గా ఉండండి.. సభా మర్యాదలను పాటించండి.. సభని సజావుగా నడిచేలా చూడండి.... ప్లీజ్.... ప్లీజ్..” స్పీకర్ గారు గొంతు బొంగురుపోయిన పట్టించుకోకుండా గట్టిగా అరిచే సరికి ఏమనుకున్నారో ఏమో గాని మిగతా సభ్యులందరూ కామ్ గా కూర్చుండిపోయారు... సభ ఒక్కసారిగా సైలెంటయిపోయే సరికి స్పీకర్ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా... అధికార పక్షం సభ్యులను ద్దేశించి అడిగారు... “ఊ.. ఇప్పుడు చెప్పండి... అసెంబ్లీ సమావేశాలని లైవ్ టెలికాస్ట్ ఇవ్వకూడదని మీరు నిర్ణయించుకోవడం వెనుక పీడ కుట్ర ఉందనీ, దగా అనీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి... దీనికి మీరేమని సమాధానం చెబుతాను...?” స్పీకర్ ప్రశ్న అడగడమే ఆలశ్యం... ఓ అధికార పక్ష సభ్యుడు లేచి నిలబడ్డాడు... “అధ్యక్షా... మేము తీసుకున్న ఈ నిర్ణయంలో ఎలాంటి కుట్రా లేదు... ఎలాంటి దగా లేదు... అసలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మన రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుంది.. తద్వారా దేశానికి కూడా మరెంతో మేలు చేకూరుతుంది... తద్వారా ప్రపంచానికి కూడా అంతో ఇంతో మేలు చేకూరుతుందని నేను మనవి చేస్తున్నాను..” అంటూ ఊపిరి పీల్చుకోవడానికి కాసేపు ఆగాడు ఆ సభ్యుడు.. ఇంతకీ ఆ మేలేమిటో కాస్త చెప్పండి..” ఎక్కడ ప్రతిపక్షాలు మళ్లీ మైకులు పట్టుకుంటాయోనని భయపడి వెంటనే అడిగాడు స్పీకర్ గారు. “అధ్యక్షా... అది మామూలు మేలు కాదు అధ్యక్షా.. నేడు మన రాష్ట్రంలో చూస్తే.. అదేవిధంగా మన జిల్లాల్లో చూస్తే.... మరదేవిధంగా గ్రామ గ్రామాల్లో చూస్తూ.. మరదేవిధంగా పట్టణాల్లో చూస్తే.... మరదేవిదంగా...” “గౌరవ సభ్యులు గారు నాన్చుడు ధోరణి వదిలి పాయింటుకి వస్తే చాలా సంతోషం ....”ఓ ప్రతిపక్ష నాయకుడి మైకులో నుండి విననే వినపడింది.. దాంతో స్పీకర్ గారి గుండె గుభేలుమంది... మళ్లీ చెవిలో దూది పెట్టుకునే పరిస్థితి వస్తుందేమోనన్న భయమూ కలిగింది... కానీ స్పీకర్ గారి అదృష్టం బావుండి.. స్పీచిస్తున్న సభ్యుడు ఆ మాటలని వినిపించుకోకుండా తన ప్రసంగాన్ని కంటిన్యూ చేసాడు... “కాబట్టి అధ్యక్షా... అసెంబ్లీ సమావేశాలని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా టెలికాస్ట్ చేయడం వల్ల ఎంతటి కీడు కలుగుతుందో... నా దగ్గర రికార్డులతో సహా ఉన్నాయి... కాబట్టి వెంటనే ప్రత్యక్ష ప్రసారాలని రద్దు చేయాలని మనవి చేస్తున్నా...” ప్రతిపక్ష సభ్యుడు లేచాడు.. “అధ్యక్షా.. విషయాన్ని పక్కదారి పట్టించకుండా వెంటనే ఆ రికార్డులేవో చూపించమని కోరుతున్నా..” “వస్తున్నా... వస్తునా. అక్కడికే వస్తున్నా..” అంటూ చేయి పైకెత్తి కొన్ని కాగితాలని చూపిస్తూ... “అధ్యక్షా... ఇవి మామూలు కాగితాలు కావు... రికార్డు కాగితాలు.. అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక ప్రసారాలని టి.వి.లో చూసి రాష్ట్రంలో ఉన్న కొన్ని వందల స్కూల్లు పాడు కావడానికి లింకేమిటయ్యా...” అసహనంగా అన్నాడు స్పీకర్... “వస్తున్నా.. వస్తున్నా.. అక్కడికే వస్తున్నా.... కాబట్టి అధ్యక్షా.. స్కూళ్ళో బుద్దిగా చదువుకుని పిల్లలందరూ అసెంబ్లీ సమావేశాలు టి.విల్లో చూసి పాడయిపోతున్నారని.... మాస్టారు చెప్పే పాఠాలను వినకుండా అచ్చు అసెంబ్లీలో ఉన్న గౌరవ సభ్యులు ఎలా ప్రవర్తిస్తారో అచ్చు అలానే ప్రవరిస్తున్నారని... వెరైటీ తిట్లకోసం స్కూళ్లు ఎగ్గొట్టి, అసెంబ్లీ సమావేశాల ప్రత్యేక్ష ప్రసారాలని ప్రత్యేకంగా తిలకించి మరి కొత్త రకం తిట్లు నేర్చుకుంటున్నారని రాష్ట్రం నలుమూలల నుండి కొన్ని వందల కంప్లెయింట్స్ మాకందాయి.. కాబట్టి అధ్యక్షా... నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలని వెంటనే ఆపేయాలని నేను మనవి చేస్తున్నాను...” ఆవేశంగా అంటూ గ్లాసెడు మంచి నీళ్ళు త్రాగి... కూర్చుండిపోయాడు గౌరవ అధికార పక్షం సభ్యుడు... ఇప్పుడు కాకపోయినా... భవిష్యత్తులో... ఈ కారణం వల్ల అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు ఆపేయాల్సిన పరిస్థితి వస్తుందేమో... ఏమో..
|
|