ఇదోరకం పిచ్చి లెండి... (Satire on Hair Craze)

వీక్ పీడియా

ఇదోరకం పిచ్చి లెండి...

(Satire on Hair Craze)

వి. నాగరత్న

 

ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చి ఉంటుంది. ఒకరికి డబ్బు పిచ్చి, ఇంకొకరికి నగల పిచ్చి, మరొకరికి తాగుడు పిచ్చి, ఇంకొకరికి గుర్రప్పందాల పిచ్చి. అలా మన హీరోయిన్ సీతకి జుట్టంటే యమా పిచ్చి.

నిజంగా సీతకి జుట్టంటే మహా మహా ఇష్టం. ఆమె పొద్దస్తమానం జుట్టు గురించే ఆలోచిస్తుంది. నిగనిగలాడే ఒత్తయిన పొడవాటి కురులున్న షాంపూ, హెయిర్ ఆయిల్ కట్టింగ్స్ దాచిపెట్టుకుంటుంది. గోడలకి జుట్టు అలలు అలలుగా కదలాడుతున్న అమ్మాయిల చిత్రాలు వేల్లాడుతుంటాయి. రోడ్డున పోయే ఆడవాళ్ళ కురుల అందాలను పరిశీలిస్తూ ఉంటుంది. బాగుంటే, “వీళ్ళ దుంప తెగ, ఏం తిన్తారోగానీ జుట్టు భలే ఏపుగా పెరిగిందే” అనుకుంటుంది. నచ్చకపోతే “వీళ్ళ మొహాలు తగలెయ్య, ఆ చెత్త జుట్టుతో బతక్కపోతే ఎవరేడ్చారు?” అనుకుంటుంది.

అసలామె జుట్టు పిచ్చి ఎంతటిదంటే, ఆఖరికి ఆవో, గేదో నడిచెళుతుంటే ఊగుతున్న దాని తోకనే కన్నార్పకుండా చూస్తుంది. ఆ బారెడు తోకలా జుట్టు పెరుగుతుందంటే, సీత గడ్డి తినదానిక్కూడా వెనకాడదంటే నమ్మండి. చివరికి ఆడ కోతి కనిపించినా దానికో విగ్గు తగిలిస్తే ఎలా ఉంటుంది అని ఊహల్లోకి వెళ్తుంది.

సీత బోల్డన్ని పుస్తకాలు చదువుతుంది. కధలు, కాకరకాయలూ క్నుకున్తున్నారా? అబ్బే, ఫిక్షను, జ్ఞానాలతో ఆమెకి నిమిత్తం లేదు. జుట్టుకు సంబంధించిన బుక్సే సీతక్కావలసింది. అలాంటి పత్రికలూ, పుస్తకాలు మట్టుకు వదలదు. వాటిల్లో రాసేన చిట్కాలూ గట్రా పాటిస్తుంటుంది. అంతెందుకు, గ్రో మోర్ లాంటి ఎరువులు తప్ప అన్నీ వాడిచూసింది. ఏ జలుబో, జ్వరమో వచ్చి డాక్టర్ దగ్గరికెళ్ళినా చివర్లో తప్పకుండా ఓ మాట అడిగితీరుతుంది. “ఏంటో డాక్టర్ గారూ, నా జుట్టు తెగ రాలిపోతోంది.. ఎందుకంటారు? ఈ జ్వరానికీ, జుట్టు ఊడటానికీ ఏమైనా సంబంధం ఉందంటారా? ఏం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది?” అని అడుగుతుంది. సీతకి జ్వరం తగ్గకపోయినా చింత లేదు, కానీ ఒక్క వెంట్రుక రాలిపోయినా నీరసం ముంచుకొస్తుంది. జుట్టు గురించే ఆమె నిరంతర ధ్యాస, ధ్యానం మరి.

సామాన్యంగా ఆడవాళ్ళు పొద్దున్నే లేచి ఇల్లూడ్చుకోవడం, వంటావార్పూ లాంటి పనీపాటల్లో మునిగిపోతారు. కానీ సీతకు అలాంటి పనులతో సంబంధం లేదు. చేయాల్సిన అవసరమూ లేదు. తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు లెక్కలేనన్ని ఉన్నాయ్. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయనేది సామెత. కానీ సీత పెద్దలు ఆర్జించింది కొండలు కావు, ఎస్టేట్లు. రాబోయే నాలుగు తరాలు పనీపాటా లేకుండా బెవార్సుగా తిని, జల్సాగా తిరిగినా తరగని గనులు.

సరే, ఇంతకీ సీతేం చేస్తోందో చూద్దాం. వెనుక ఉన్న విశాలమైన హాల్లో పనివాళ్ళు సకల ఏర్పాట్లూ చేశారు. నాలుక్కుర్చీలు, టీపాయ్ వేశారు. అద్దాలూ, దువ్వెన్లూ గట్రా అన్నీ అమర్చారు.

పనమ్మాయ్ పద్మ హెన్నా మిశ్రమాన్ని తెచ్చి “మీరు చెప్పినట్టే కిలో టీ పౌడర్ వేసి మరగ్గాసిన డికాక్షన్ లో హెన్నా పొడి, నిమ్మరసము, ఆలివ్ ఆయిలు కలిపానమ్మా” అంది.

చెప్పింది చక్కగా పాటించిన తన శ్రద్ధకు సీతమ్మ తప్పకుండా మెచ్చుకుంటుదనే నమ్మకంతో మురిసిపోతూ, కులుక్కుంటూ నిలబడింది పద్మ.

సీత పరమ చిరాగ్గా చూస్తూ “నన్ను అడక్కుండా ఇదెందుకు తయారుచేసావ్?? అంది.

అమ్మగారు మెచ్చుకోకపోగా, చిరాకుపడ్డం చూసి ఖంగు తింది పద్మ. “అదేంటమ్మా, నిన్న మీరేగా చెప్పారు, పొద్దున్నే హెన్నా రెడీగా పెట్టమని” “నిన్నేప్పుడో చెప్తే చేసేయడమేనా? పొద్దున అడిగి చావొచ్చుగా..”

పద్మకి కాలిపోయింది. ‘దీని మొహం తగలెయ్య. చెప్పింది చేయకపోతే ఒక తంటా, చేసినా తంటానే.. కొత్తగా మళ్ళీ ఏం చదివి ఏడ్చిందో..’ అని పళ్ళు నూరుకుంది. సీత అంతే చిరాగ్గా “హెన్నా వద్దు.. మందారపూలు కోసి నువ్వుల నూనెలో బాగా మరిగించి.. చల్లార్చి పట్రా” అంది.

“ఇప్పటికిప్పుడు మందారపూలు ఎక్కడినుంచి వస్తాయమ్మా?”

“పెరట్లో అన్ని చెట్లుంటే మందారపూలకే కరువొచ్చిందా?*

‘నీ మొహం మండ.. అన్ని చెట్లూ మందార చెట్లు కావే తల్లీ’ అని మరోసారి తిట్టుకుని “అవన్నీ మందారాలు కావుగదండీ” అంది.

“ఇకనుంచీ మందార చెట్లు ఎక్కువగా పెంచు.. ఇవ్వాల్టికి పక్కవాళ్ళ ఇళ్ళలో అడిగి తీసుకురా” అంటూ హుకుం జారీ చేసింది.

‘నీ పుణ్యమాని పూలు అడుక్కొచ్చే రాత పట్టిందన్నమాట.. దిక్కుమాలిన ఉద్యోగం తగలెయ్య, రేపేం పూలు కావాలి తల్లీ? కాయితప్పూలా, జిల్లేడుపూలా? ఎప్పుడో ఒకరోజు దురదగొండి ఆకు నూరి ఆ జుట్టుకి రాస్తే సరి..’ అని కసిగా తిట్టేసుకుని “మరి, ఈ హెన్నా వేస్టవుతుంది కదమ్మా” అంది.

“కావాలంటే నువ్వు రాసుకో, లేదంటే పడేయ్... ముందు చెప్పింది చెయ్” అనేసి హెయిర్ కండిషనర్లు, లోషన్ల గురించి చదవడం మొదలెట్టింది.

పద్మకి తిక్క రేగిపోయింది. ‘ఈ జుట్టు పిచ్చిది ఎక్కడ దొరికిందిరా బాబూ? ఒకరోజు మెంతులు నానబెట్టి రుబ్బమంటుంది. ఇంకోరోజు అవి పనిచేసి చావలేదు, మెంతికూర నూరు.. అంటుంది. ఒకరోజు గుడ్డు, ఇంకోరోజు పెరుగు, మరోరోజు బీరు.. ఈ మాట విన్న నర్సిగాడు “వామ్మో బీరు జుట్టుకి పట్టించేబదులు, నాలాంటోల్లకు ఇవ్వొచ్చుగా” అన్నాడు.. ఆడో తాగుబోతు సచ్చినోడు. ఆదికి తాగుడు పిచ్చి, ఈవిడగారికి జుట్టు పిచ్చి. ఈ పిచ్చిగోల చూసీ చూసీ నాకు పిచ్చెక్కుతోంది. ఎప్పుడూ ఏదో ఒకటి జుట్టుకి పట్టిస్తూనే ఉంటుంది. అందరూ పొట్టి జుట్టు ఫాషన్ అని కత్తిరించుకుంటూ ఉంటె, ఈవిడేమో కొండవీటి చాంతాడంత పొడుగ్గా ఉండాలని తంటాలు పడుతుంది.. అందుకే ‘వెర్రి వేయి విధాలు’ అన్నారు..- అని గొణుక్కుంటూనే

నానా తంటాలూ పడి, ఇరుగింట్లో, పొరుగింట్లో మందార పూలు అడిగి తెచ్చి, సీత చెప్పినట్లు నూనెలో మరిగించింది., ఆలస్యం అయ్యిందంటూ మళ్ళీ ఎక్కడ తిట్టేస్తుందోనని పరుగులెట్టుకుంటూ తెచ్చింది. తీరా పద్మ వచ్చేసరికి సీత రామానందంతో మాట్లాడుతోంది. ‘హమ్మయ్య, ఇప్పుడేమీ అనదులే’ అనుకుంది నిశ్చింతగా..

కుశల ప్రశ్నలు అయిపోగానే, సీత ఎప్పట్లాగే “ఏంటో బాబాయ్, నువ్వో పేద్ద బొటీక్ నడుపుతున్నావే గానీ, జుట్టు రాలకుండా మట్టుకు ఏమీ చెప్పలేవా?” అంది.

“కాస్తయినా జుట్టు రాలకుండా ఎలా ఉంటుంది?.. పండుటాకులు రాలి, చిగురాకులు వచ్చినట్లు.. కొన్ని వెంట్రుకలు రాలినా, మళ్ళీ వస్తాయి” వీలైనంత ఓపిగ్గా చెప్పాడు బాబాయ్.

“అలా తప్పించుకోకుండా ఏమైనా చెప్పు బాబాయ్”

“అయితే, వెంట్రుకలు అస్సలు రాలకూడదు, అంతేనా? సరే అయితే, కాస్త ఫెవికోల్ రాయి, ఒక్కటి కూడా ఊడదు” అని నవ్వేశాడు.

సీతకీ నవ్వాగలేదు. రామానందంతో కలిసి హాయిగా నవ్వేసింది.

పద్మ మట్టుకు నవ్వితే కొంపలెక్కడ మునుగుతాయోనని పట్టు బలవంతాన నవ్వును నోట్లోనే నొక్కేసి ‘అన్నిటికంటే, ఓ సీసాడు యాసిడ్ నెత్తిన పోస్తే పీడా వదుల్తుంది’ అనుకుంది.