తాతా ధిత్తై తరిగిణతోం 45

తాతా ధిత్తై తరిగిణతోం 45

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"చూడు వీరభద్రుడూ జరిగినదేదో జరిగిపోయింది. అసలు నేను పదిరోజులు ముందుగా ఇక్కడకు వచ్చి ఉంటే ఈ వివాహమే జరక్కుండా హెచ్చరిక చేసేవాణ్ణి. ఇప్పుడిక ఒక్కటే మార్గం."

"శలవీయండి స్వామీ. శిరసావహిస్తాను."

"నీకు శుభం జరగాలంటే నేటినుంచి పన్నెండు నెలలు గడువు లోపల నీవు తాతవు కాకూడదు."

"అనగా మా శ్రీరామ్ ఏడాదిలోపు తండ్రి కాకూడదన్నమాట."

"మా ఉద్దేశ్యం అదికాదు ఆ వ్యవధిలో నీ కోడలు గర్భవతి కూడా కాకూడదు. ఒకవేళ ఆ అరిష్టమే సంభవిస్తే ఆ మరుక్షనంలో నీకు మారకం తప్పదు." ధృడమైన స్వరంతో చెప్పాడు సాధువు.

ఆ మాటలు విన్న వీరభద్రానికి కొంత మనిస్థిమితం చిక్కినా ప్రాణభయం మాత్రం పూర్తిగా పోలేదు.

"ఈ రోజుల్లో గర్భం రావాల్సిన వచ్చినా గర్భం పోవాల్సిన అంతా పిల్లల నిర్ణయముల పైననే ఆధారపడి ఉన్నది కదా స్వామీ. కనుక మీరు చెప్పిన విషయాన్ని మా సుపుత్రుడికీ, కోడలుకీ చెప్తాను. వారిని తప్పక జాగ్రత్తపడమంటాను."

"వారి కంటే ముందు నీవు జాగ్రత్తపడాలి సుమా యవ్వనావేశంలోనూ, కామోద్రేశంతోనో వారు తొందరపడితే ఫలితం దారుణంగా వుంటుంది. ఆమెకు నెల తప్పితే నీ గుండెకు లయతప్పుతుంది. అటుపై గర్భవిచ్ఛిత్తి గావించుకున్న ప్రయోజనం వుండదు. వీరభద్రం వైపు సూటిగా చూస్తూ తీవ్రమైన స్వరంతో చెప్పాడు సాధువు.

ఆ సమయానికి ఆ ఇంటి పడగ్గదిలో అశ్వినీ శ్రీరామ్ ల 'శోభన వేడుక' కు ఏర్పాట్లు చేస్తోంది గీత.

వీరభద్రానికి అతని ముత్తాత నించి వారసత్వంగా వచ్చిన పందిరి మంచాన్ని మల్లెపూల మాలలతో అలంకరిస్తోంది. అంతకు పదిరోజుల క్రితమే. ఆ ఊరి మస్తాన్ సాహెబ్ తో పందిరి మంచం మీదకు ప్రత్యేకంగా బూరుగదూదితో పరుపు, తలగడలూ కుట్టించాడు వీరభద్రం. ఆ పరుపుమీద, తన హైదరాబాదు నించి తెచ్చిన 'బాంబే డయింగ్' కంపెనీ వాళ్ళ తెల్ల దుప్పటీని పరచింది. దాని మధ్యగా ఆ 'రీన్' గుర్తులో గులాబీ పూలు పేర్చింది. తలగడా గలేబులు మీద రంగుదారాలతో కుట్టిన రామచిలుకలు చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి. మంచం పక్కనే టేబుల్ మీద ఓ వెండి పళ్ళెం నిండా మనసున్ని వుండలూ, మరోవెండి పళ్ళెం నిండా మనసున్ని వుండలూ, మరోవెండి పళ్ళెంలో రకరకాల పళ్ళూ వుంచింది. శోభనం గదిని అలంకరించటం పూర్తయ్యాక గడియారం లో 'టైం' చూసింది...నాలుగున్నర కావస్తోంది.

"అంటే ముహోర్తానికే ఇంక మూడు గంటలే వ్యవధుంది.? దంపత తాంబూలాలు తీసుకునేందుకు, త్వరగా వెళ్లి ముత్తయిదువలని పిల్చుకురావాలి." అనుకుంటూ ఆ గదిలోంచి బయటకు వెళ్లబోతుంటే రాజేంద్ర లోపలకు ప్రవేశించాడు.

"ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావ్?" అడిగాడు.

"కనిపించటం లేదా?" పందిరిమంచాన్ని చూపించి కొంటెగా గులాబీ పువ్వుని అతని మీదకు విసురుతూ అడిగింది గీత.

"శోభనం ఏర్పాట్లు చేయటమంటే మీ ఆడవాళ్ళకు మహాసరదా." అలంకరించివున్న పందిరి మంచాన్ని చూస్తూ అసహనంగా అన్నాడు రాజేంద్ర.

"మరి మీ మగాళ్ళ సరదాలేమిటో?" ఓరకంటగా చూస్తూ అడిగిందామె వెంటనే.

"మగాళ్ళందరి సంగతీ నాకనవసరం నాకు మాత్రం నీ బాబు నా కట్నం బాకీ తీర్చినప్పుడే సరదా."

"మీ కెప్పుడు కట్నం గొడవే." మూతి ముడుచుకుంది.

"గొడవకాదు..హక్కు. బాకీ అన్నాక బాకీయే. కట్నం ఇచ్చుకోలేను అల్లుడా. అని ఆనాడే నాతో ఖచ్చితంగా చెప్పి వుంటే నేను ఆశలు పెంచుకునేవాణ్ణే కాను. అయినా కట్నం కానుకలు తనకు అవసరం లేకపోతే లేకపోయే ఇప్పుడు కోటిశ్వరుడి కూతుర్ని కోడలుగా తెచ్చుకున్నాడుగా. ఆడపడుచు లాంఛనపేరుతో ఓ యాభైవేలు తీసుకుని నీకిస్తే నా అప్పు జమేసుకునేవాణ్ణి."

"ఏమిటో అల్లుడు గారు అప్పూ, జమా అంటున్నారు?" సరిగ్గా అదేక్షణంలో ఆ గదిలోకి ప్రవేశించిన వీరభద్రం అల్లుడు మాట విని అడిగాడు.

రాజేంద్ర ఉలిక్కిపడ్డాడు మావగార్ని చూసేసరికి అతని 'మాట' పడిపోయింది.

"అల్లుడూ కడు స్వతంత్రుడూ అంటూంటారుగా...అడిగెయ్యండి." అంది గీత నెమ్మదిగా అతనికి మాత్రమే వినిపించేటట్టు. అయినా వీరభద్రం ముఖంలోకి సూటిగా చూస్తూ అసలు విషయాన్ని చెప్పే సాహసం చెయ్యలేకపోయాడు రాజేంద్ర.

"అడుగుతాను...నాకేమిటి భయం?" అంటూనే రెండడుగులు మావగారి ముందుకు వేసి ఆయన ముఖంలోకి చూస్తూ చెప్పాడు రాజేంద్ర.

"అబ్బే...అ...అ...అప్పు కాదండీ...ప.ప...పప్పు. పప్పు...గురించి మీ అమ్మాయికి చెప్తున్నాను." అన్నాడు తడబడుతూ.

"పప్పా? పప్పుజమేయుట ఏమిటి?

"జమేయటం కాదండీ...మేయటం...! ఇందాకా భోజనంలో మామిడి కాయపప్పు తిన్నాను కదా...చాలా రుచిగా వుంది. అందుకని దాంతోనే అన్నమంతా మేశానని చెప్తున్నాను. అదన్నమాట." చెప్పాడు.

తన తండ్రి మోహం లోకి సూటిగాచూస్తూ అసలు విషయాన్ని చెప్పలేకపోతున్న మొగుడి తిప్పల్ని చూసి మరొకపక్కకు తిరిగి తనలోతనే నువ్వకుంది గీత.

రాజేంద్ర నెమ్మదిగా ఆ గదిలోంచి బయటకు జారుకున్నాడు.

వీరభద్రం వచ్చి పందిరిమంచం మీద ఓ పక్కగా కూర్చుని మధ్యనున్న గులాబీ పూలను పక్కకు కూర్చుని మధ్యనున్న గులాబీపూలను పక్కకు తోసేస్తూ గీతను చూసి చెప్పాడు.