Rating:             Avg Rating:       480 Ratings (Avg 3.00)

తాతా ధిత్తై తరిగిణతోం 37

తాతా ధిత్తై తరిగిణతోం 37

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

 

"శుభలేఖల ప్రింటింగు" ప్రస్తావన రాగానే వీరభద్రం కొంచెం మెత్తపడ్డాడు. శ్రీరామ్ పెళ్ళికి ముహూర్తాలు పెట్టగానే తానుకూడా శుభలేఖలు ప్రింటు వేయించాలి. అందుకని ఆ వివరాలు ముందుగానే తెలుసుకోవాలనుకున్నాడు.

"శుభలేఖ లేమిటి? వివాహం ఎవరికి?" అడిగాడు.

"చిత్తం. మా అమ్మాయి జలజ పెళ్ళి నిశ్చయమైందండి వచ్చేనెల పదహారున ముహూర్త మండి శుభలేఖలు టౌన్లో ప్రింటు చేయించుకొచ్చాను" అంటూ చేతి సంధిలో వున్న శుభలేఖల కట్టను చూపించాడు ఆ మాటలు వినగానే అంతకు ముందెప్పుడో అనంతం తన కూతురు జలజను శ్రీరామ్ కి చేసుకొమ్మని అడిగిన సందర్భం గుర్తుకొచ్చింది వీరభద్రానికి.

"ఇంతకూ వరుడెవరు?" అడిగాడు యధాలాపంగా

"సీతాపురం హైస్కూల్లో హిస్టరీ టీచరుగా పనిచేస్తున్న రంగనాథం గారి పెద్దబ్బాయండి ఎమ్ ఎ చదివాడు శ్రీకాకుళంలో లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నారట."

"మరి పాఠశాలలోనే తమరితో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి పుత్రునితో మీ కుమార్తె వివాహము జరుగునని మీ బంధువెవరో ఆ మధ్య జ్యోతిష్యం చెప్పితిరి గదా?"

"చిత్తం"

"ఆ మాట నిజం కాలేదు కనుక ఆయనగార్కి జ్యోతిష్యంలో ప్రవేశం లేదన్న మాట."

"అబ్బెబ్బే ..అలా కొట్టి పారేయకండి కొన్నికొన్ని విషయాల్లో సమయాన్ని బట్టీ సందర్భాన్ని బట్టీ మనకి మను ఆ అంశాన్ని అన్వయం చేసుకోవాలని కూడా తమరికి ఆనాడు మనవి చేసుకున్నాను చెప్పాడు అనంతం.

అర్థం కానట్టు చూశాడు వీరభద్రం.

"సీతాపురం స్కూల్లో పనిచేస్తున్న ఆ రంగనాధం మేస్టారు తమరికి బంధువేనట మాటల సంధర్బంలో తెలిసింది. వారి పితామహులూ, మీ పితామహులూ మూడోతరం అన్నదమ్ములట మీ మధ్య రాకపోకలూ, పురుడు పుణ్యాలూ లేవట. కానీ వరసలన్నీ చూసుకుంటే ఆయన మీకు తమ్ముడవుతాడట. వారి కుమారుడు ఇప్పుడు నాకు అల్లుడవుతున్నాడు కనుక మీ కుమారుడి స్థానంలో ఆ విధంగా అన్వయించ బడిందని నేననుకున్నాను."

ఆ వివరణంతా విన్న వీరభద్రం ఏదో అర్థం అయినట్టు తల పంకించాడు ఆ వెంటనే ఏమీ అర్థం అయినట్టు తల పంకించాడు ఆ వెంటనే ఏమీ అర్థం కానట్టు బుర్రగోక్కున్నాడు ఈలోగా అటెండెన్సు రిజిషర్లో సంతకం చేసి బయటకు వెళ్ళిపోయాడు అనంతం.

*            *           *

గోపాలం చాలా దిగులుగా వున్నాడు తనకు అశ్వినితో పెళ్ళవుతుందనీ ఆ తర్వాత కొన్నాళ్ళకొ కొన్నేళ్ళకో విష్ణుమూర్తి పరలోకానికి ప్రయాణం కడితే లెఖ్ఖలేనంత ఆస్తీ, అంతస్తూ, తన సొంతమవుతాయని ఇన్ని రోజుల్నించీ గాలి మేడలు కడుతున్నాడు ఇప్పుడు 'అశ్విని' నడిపిన ఆత్మహత్య ప్రహసనంతో ఆ మేడలన్నీ పునాదులతో సహా కూలిపోయాయని అల్లాడిపోతున్నాడు.

ఆ బాధను దిగమింగటానికి తన గదిలో కూర్చుని పట్టపగలే విస్కీ బాటిల్ ఓపెన్ చేశాడు...వరుసగా నాలుగు పెగ్గులు కడుపులో పోశాడు అయిదో పెగ్గు పోసుకుంటున్న సమయంలో హనుమంతు ఆ గదిలో అడుగుపెట్టాడు అక్కడి వాతావరణం గమనించాడు కొడుకు ఆవేదన గ్రహించాడు.

"అయ్యేయ్యో పొద్దు వాలకముందే కుంపటి పెట్టేశావేమిట్రా? నువ్విలా మీ మామయ్యా కంటపడ్డావంటే మన కొంపకొల్లేరైపోతుంది" అంటూ గాభరాగా అక్కడున్న విస్కీ సీసానీ, గ్లాసునీ బల్లకింద దాచేశాడు.

"చూస్తే చూడనియ్ డాడీ. అశ్విని తోడులేని ఈ బ్రతుకు వ్యర్ధమన్న బాధతో తాగుతున్నానని చెప్తాను అప్పుడైనా నేను అశ్వినిని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకుంటాడు." చెప్పాడు గోపాలం.

"ఏడవలేకపోయావ్లే! నీ ప్రేమ సంగతి ఎలా వున్నా ఇలాంటి తాగుబోతుతో తన బిడ్డ పెళ్ళి తప్పిపోయిందని ఆనందిస్తాడు. ఆ తర్వాత నిన్నూ నన్నూ మెడపట్టి వాళ్ళ గూర్ఖాతో బయటకు గెంటిస్తాడు." విసుకున్నాడు హనుమంతు.

గోపాలం మాట్లాడలేదు.

"అయినా నువ్వాపిల్లని 'అంత' గాఢంగా ప్రేమిస్తున్నావా?" ఇంతలోనే అడిగాడు హనుమంతు.

"ప్రేమిద్దామని అనుకున్నాను డాడీ! అశ్విని చాలా బాగుంటుంది. మంచి ఛలాకీ గుర్రంలా వుంటుంది." మందు తలకెక్కటంతో మాటలు కొంచెం మత్తుగా వస్తున్నాయి.

"నీకు మాత్రం ఏం తక్కువ? హైతూ, వేయిటూ వున్నవాడివి...ఇది కాకపోతే మరో అరేబియా గుర్రం లాంటి ఆడపిల్ల నీకు దొరక్కపోదు. బాధపడకు."

"అశ్విని చేజారిపోయినందుకు బాధలేదు డాడీ. దాంతో పాటు ఆస్తి దక్కకుండా పోతోందే. అని ఆవేదన పడుతున్నాను. అయినవాణ్ణి మేనల్లుణ్ణీ నేనుండగా ఆ అనామకుడెవరో శ్రీరామ్ గాడట ఆ గొట్టం గాడికి ఈయన గారు పట్టం కడుతున్నారని వర్రీ అవుతున్నాను." సోఫాలో వెనక్కి జారగిలబడి బాధగా కళ్ళు మూసుకున్నాడు గోపాలం.

అతని పక్కనే భుజం మీద చేయివేసి చెప్పాడు హనుమంతు.