తాతా ధిత్తై తరిగిణతోం 31

తాతా ధిత్తై తరిగిణతోం 31

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"ఇప్పుడు నా కర్తవ్యం కూడా తెలిసొచ్చింది బావా అందుకే ఇక ఇక్కడే వుండి ఏదైనా వ్యాపారం చేసుకుందామన్న ఆలోచనతో అక్కడి వ్యవహారాలన్నీ సెటిల్ చేసి మరీ వచ్చేశాను. రేపు పేపర్లో మ్యాట్రిమోనియల్ కాలమ్'లో 'వధువు కావాలని' ని ఓ ప్రకటన ఇచ్చి వెంటనే మా గోపాలానికి పెళ్ళికూడా చేసేయ్యాలనుకుంటున్నాను." చెప్పాడు హనుమంతు.

ఆ మాట విన్న విష్ణుమూర్తి మనసులో ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. దాన్ని వెంటనే బయట పెట్టకుండా అతనివైపు చూసి యదాలాపంగా అడిగాడు.

"మరి మీ అబ్బాయి కూడా ఇండియాలోనే వుండిపోతాడా?"

"అది వాడిష్టం. ఎలాగా ఎమ్ బి ఎ చదివాడు తల్చుకోవాలే గానీ రాజాలాంటి ఉద్యోగం ఇక్కడ దొరక్కపోదు. వాడు కూడా ఇక్కడే వుంటే, నేను హాయిగా వాడి నీడన కాలం గడిపేస్తాను. ఒకవేళ వాడికి మళ్లీ అమెరికా మీదకు గాలిమళ్ళితే వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు నేను ఏ కాశికో, రామేశ్వరానికో పోయి కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపిస్తాను.

హనుమంతు అలా చెప్తూంటే విష్ణుమూర్తి మనసులో అంతకు ముందు మెరిసిన ఆలోచన ఓ రూపు దిద్దుకోసాగింది.

అప్పుడే అక్కడకు వచ్చి కూర్చున్న గోపాలాన్ని చూసి అడిగాడు "ఏమోయ్ నీ ఉద్దేశ్యం ఏమిటి? పెళ్లయ్యాక అమెరికా వెళ్ళిపోతావా?" లేక మీ నాన్నతో పాటు ఇండియాలోనే వుండిపోతావా?"

"అంతా మా డాడీ ఇష్టం సార్ ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను." వినయంగా సమాధానం ఇచ్చాడు గోపాలం.

"ఒరేయ్ బడుద్ధాయ్. ఈయన నాకు బావైతే నీకు మావయ్యవుతార్రా. సార్ అంటావేమిటి?" మధ్యలో కల్పించుకుంటూ కొడుకును మందలించాడు హనుమంతు. ఆ తర్వాత విష్ణుమూర్తి వైపు తిరిగి నవ్వుతూ చెప్పాడు.

"దూరం వుంటే బంధుత్వాలు కూడా బరువైపోతాయి బావా. దగ్గరగా వున్నప్పుడే అవి బలపడతాయి.

"అదీ పాయింటేనయ్యా బావమరిదీ ఇప్పుడికి మీరు ఇండియా వచ్చారుగా దగ్గరైపోదాం." అంటూ అతని భుజంమీద చేయివేశాడు విష్ణుమూర్తి. అంతలో వంటమనిషి మంగమ్మ ట్రేలో కాఫీ కప్పులు పెట్టుకొచ్చి వాటిని ముగ్గురికి అందించింది.

కాఫీ తాగుతూ కొన్ని క్షణాల తర్వాత చెప్పాడు విష్ణుమూర్తి.

"నిజంగా మీ చెల్లాయి పంపినట్టే వచ్చాననిపిస్తోంది బావమరిదీ. నా బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకునేందుకు ఓ చాకులాంటి అల్లుడు కావాలని కూడా కోరుకుంటున్నాను ఆ అల్లుడు కూడా నీ కొడుకే అవుతాడు అప్పుడిక మీరు హాయిగా ఇక్కడే వుండచ్చు."

ఆ మాటలు విన్న తండ్రి కొడుకులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు కొన్ని క్షణాలు ఉలుకూ పలుకూ లేకుండా అలాగే వుండిపోయారు.

"అదేం? మాట్లాడరేం? నా ప్రపోజల్ బాగాలేదా? మీకు ఇష్టం లేదా? అడిగాడు విష్ణుమూర్తి ఆందోళనగా.

"భలే వాడివి బావా బందరు లడ్డూ లాంటి ప్రపోజల్ ఇచ్చావ్! ఇష్టం లేదని ఎలా అనగలం ? కావలసిన సంబంధం రావాల్సిన సమయానికే వచ్చాం. ముఖ్యంగా మా చెల్లాయి ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మా రొట్టె విరిగి సాంబారులో పడినంత సంబరంగా వుందనుకో." జేబులోంచి సిగిరెట్టు తీసి అందులోంచి ఓ 'సిగార్' లాగి నోట్లో పెట్టుకుంటూ చెప్పాడు హనుమంతు.

"మీ చెల్లాయి ఆత్మ సంతోషించటం ఎలా వున్నా. నువ్ వాడిన సామెత మాత్రం సబబుగా లేదోయ్ బావమరిదీ. రొట్టె విరిగి నేతిలో పడితే సరదా ఏముంటుందీ?" ఛలోక్తిగా అన్నాడు విష్ణుమూర్తి.

"అదంతేలే! మా అమెరికా వాళ్లకి నెయ్యి అంతగా పడదు. 'కొలస్ట్రాల్' ఎక్కువవతుందని భయం."

ఆ మాట విన్న విష్ణుమూర్తి నవ్వకుండా ఉండలేకపోయాడు.

*          *           *

రెండు రోజుల్నించీ అశ్విని తన గది విడిచిపెట్టి బయటకు రావటం లేదు వేళకు భోజనం కూడా చేయటం లేదు. శ్రీరామ్ తోనే తన జీవితాన్ని పంచుకోవాలన్న నిర్ణయంతో ఇంతకాలంగా ఎన్నో సాహసాలు చేసింది అనుక్షణం అతన్ని నీడలా వెంబడించింది తన మాటలతో, చేతలతో రెచ్చగొట్టింది. చివరకు తన వైపు ఆకర్షితుడయ్యెలా చేసుకోగలిగింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదని శాసించాడు తండ్రి నెలరోజులు తిరక్కుండా వేరే సంబంధం తెచ్చి తనకు పెళ్ళి చేస్తానంటూ ప్రతిజ్ఞ కూడా చేశాడు.

ఇప్పుడ తనేం చేయాలి?

తాను ప్రేమించిన శ్రీరాం కోసం తండ్రికి ఎదురు తిరిగి ఇంటి గడప దాటటమా? లేక తండ్రి మాటను గౌరవించి, మనసును చంపుకుని మరో మనిషిముందు తలవంచి తాళి కట్టించుకోవటమా? ఎటూ నిర్ణయించుకోలేక పోతోంది అశ్విని.

తనకు 'అమ్మ' ఎలా వుంటుందో తెలీదు. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని తాను అనుభవించలేదు. ఆ లోటు తెలియకుండా తనను కళ్ళల్లో పెట్టుకుని పెంచాడు తండ్రి చిన్నతనంలో తాను వేస్తున్న తప్పటడుగులకు నడక నేర్పాడు. వచ్చీరాని మాటలకు భాష నేర్పాడు కాస్తంత జ్ఞానం వచ్చాక, తాను మనసుపడిన ప్రతి వస్తువు కొనిచ్చాడు.

స్కూలు నిండి రావటం కాస్తంత ఆలస్యమైతే కలవరపడి పోయి తనకోసం వీధి గుమ్మంలోనే నిలబడి ఎదురు చూసే వాడు ఇప్పుడు తనకు, ఇంతవయసొచ్చినా, ఇంకా ఓ 'బుజ్జిపాపాయి'ని చూసినట్టే చూస్తూ బుజ్జగిస్తూ లాలిస్తూ తన తోటిదే లోకంగా గడుపుతున్న తండ్రిని తను నిర్లక్ష్యం చేయగలదా? కానీ తప్పదు శ్రీరామ్ ని కాకుండా మరోవ్యక్తిని తన భర్తగా ఊహించుకోలేదు.

అలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఎన్నో  ఆలోచనా కెరటాల తాడికితో తలమునకలవుతూ మంచంపై పడుకుని వున్న అశ్విని తండ్రి రాకను గమనించలేదు.

"బేబీ" ఆమె పక్కనే కూర్చుని, తలపై చేయివేసి ఆప్యాయంగా పిలిచాడు విష్ణుమూర్తి తనకు తెలియకుండానే కళ్ళల్లోకి ఉబికి వచ్చిన కన్నీళ్ళను తుడుచుకుంటూ లేచి కూర్చుందామె.

"నా మీద నీకింకా కోపం పోలేదా?" తల నిమురుతూ లాలనగా అడిగాడు ఆమె జవాబు చెప్పలేదు.

"కన్నబిడ్డ సుఖసంతోషాన్ని ఏ తండ్రైనా కోరుకోకుండా వుంటాడా?" మళ్లీ ప్రశ్నించాడు.

"నువ్వున్నావుగా?" అని అందామనుకుంది కానీ ఆ ఆవేశాన్ని తనలోనే అణుచుకుంది. ఇంతలో విష్ణుమూర్తి చెప్పాడు.

"కాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తారంటారు. ఎప్పుడు ఏది జరగాలని వుంటే అప్పడు, అది అలాగే జరిగి పోతూంటుంది బేబీ. మనం నిమిత్త మాత్రులం. అంతే."

తండ్రి చెప్పబోతున్నదేమిటో ఆమెకు అర్థం కాలేదు.