Rating:             Avg Rating:       343 Ratings (Avg 2.90)

తాతా ధిత్తై తరిగిణతోం 28

తాతా ధిత్తై తరిగిణతోం 28

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials, telugu serial comics and latest jokes online

 

"చదువుకొమ్మని టౌనికి పంపితే క్లాసులెగ్గొట్టి  అడ్డమైన సినీమాలు చూసిన తమరికి ఆ సంభాషణలు బాగుగానే ఒంటపట్టినవి. అయిననూ, నీ తాటాకు చప్పుళ్ళకు ఈ కుందేలు భయపడుట కల. నీకు 'త్రీ అవర్స్' అనగా అక్షరాలా మూడు గంటలు సమయమిస్తున్నాను. ఈ లోగా మనసు మార్చుకొమ్ము." వీరభద్రం కూడా ఆవేశంగానే హెచ్చరించాడు. 'హేంగర్' కి వేలాడుతున్న టవల్ తో చేయి తుడుచుకుంటున్న శ్రీరామ్ తండ్రి మాటల్ని లక్ష్యపెట్టలేదు. పెట్టకపోగా రెండడుగులు ఆయనకు ఎదురుగా వచ్చాడు.

"నీకు మూడు రోజులు గడువిస్తున్నా. ఈ లోగా నువ్వే మనసుమార్చుకుని మర్యాదగా మా పెళ్ళికి ఒప్పుకో. లేదంటే నాలుగోరోజు పొద్దున పదింటికిల్లా...నేనూ అశ్విని రిజిస్ట్రార్ ఆఫీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాం." అన్నాడు.

ఆ తర్వాత మరి మాట్లాడే అవకాశం తండ్రికివ్వకుండా ఒకవేళ మాట్లాడినా వినే అవసరం తనకు రాకుండా అక్కణ్ణించి వేగంగా వీధిలోకి వెళ్ళిపోయాడు.

తన ఆగ్రహావేశాల్ని అనుచుకునే ప్రయత్నం చేస్తూ పక్కనే కూర్చుని భోంచేస్తున్న చిదంబరంతో ఏదో చెప్పబోయాడు వీరభద్రం. కానీ అదేక్షనంలో అతని గుండెను ఎవరో  నొక్కి పట్టినట్టుగా ఉవ్వెత్తున నెప్పిలేచింది. చేయి కడిగేసుకుని ఎడం చేత్తో గుండెను ఎవరో నొక్కి పట్టినట్టుగా ఉవ్వెత్తున నేప్పిలేచింది. చేయి కడిగేసుకుని ఎడం చేత్తో గుండెను గట్టిగా ఒత్తుకుంటూ వెళ్లి మంచం మీద కూర్చుండిపోయాడు. ఒళ్ళంతా చెమట్లు పోశాయి.

చిదంబరం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు.

"ఏమిట్రా భద్ర. ఏమైంది?" అంటూ గబగబా వీరభద్రాన్ని చేరుకున్నాడు.

"ఏం కాలేదురా. కొంచెం నొప్పిగా వున్నది. స్కూల్ పిల్లలను సైతము గట్టిగా అరచుట తెలియని వాడను ఇప్పుడు ఆవేశమున వాడిపై విరుచుకుపడితిని గదా! అందుకనీ "గుండెను అలా చేత్తో అదుముకుంటూనే కళ్ళు మూసుకుని చెప్పాడు వీరభద్రం.

భర్త పరిస్థితిని గమనించిన పార్వతమ్మ భయంతో వణికిపోయింది. మనసెందుకో కీడు శంకించింది.

"డాక్టర్ గారి దగ్గరకు వెడదామా?" భర్తను చేరుకొని అడిగింది ఆందోళనగా.

'వద్ద'ని చేత్తోనే సైగ చేశాడు వీరభద్రం.

కానీ శరరీమంతా చెమటతో పోతూండటాన్ని గమనించిన చిదంబరం క్షణం ఆలస్యం చేయకుండా వీరభద్రాన్ని తన కార్లో ఎక్కించుకుని పక్కవీధిలోనే వున్న నర్సింగ్ హోంకి తీసుకెళ్ళాడు.

'నర్సింగ్ హోం'లో పరీక్షలన్నీ చేసిన డాక్టరు వీరభద్రానికి రక్తపోటు అధికమైందనీ, ఆ కారణం వల్లనే గుండెపోటుకూడా వచ్చిందనీ నిర్ధారణగా చెప్పాడు. కనీసం రెండు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని ప్రస్ర్కిప్షన్ కూడా రాసిచ్చాడు. ఉద్రేక పడద్దనీ, ఉప్పూ కారాలు వాడద్దనీ హెచ్చరించాడు. రెండు రోజులు ఇంటెన్సివ్ కేర్ లో వున్నాక మూడోనాడు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాడు వీరభద్రం.

ఆ రాత్రి చిదంబరం చెప్పాడు.

"రోజులు మారిపోతున్నాయిరా భద్రుడూ. వాటితో పాటు మనం కూడా మారుతూండాలి. ఒకప్పుడు బాల్యవివాహాలు చేసేవారు....పెద్దవాళ్ళే మంచి చెడ్డలన్నీ చూసి సంబంధాలు కుదిర్చేవారు. కానీ ఈ రోజుల్లో యవ్వన వివాహాలు మాత్రమే జరుగుతున్నాయి. యుక్త వయస్సొచ్చాక అబ్బాయీ, అమ్మాయీ ఒకరినొకరు చూసుకుని, అర్థం చేసుకుని ప్రేమించుకుని మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మనది జరిగిపోతున్న తరం. జారిపోతున్న తరం. కానీ వాళ్లది యువతరం...నవతరం. నువ్వు అనవసరంగా ఆవేశం తెచ్చుకున్నావే తప్ప ఇందులో మీ వాడి తప్పు  తొందరపాటు నాకేం కనిపించలేదు."

ఆ హితవచనాలు వీరభద్రానికి రుచించలేదు వాడిని సమర్థించుట నీ అవివేకము. నాకు ఎదురుపడుటకే ధైర్యములేనివాడు ఈ రోజున ఏకవచన ప్రయోగం గావిస్తూ "నువ్వు, నీకు అని సంబోధిస్తాడా?" అన్నాడు.

"అదిగో...నువ్ మళ్లీ ఆవేశం తెచ్చుకుంటూన్నావ్. అయినా పదిమందికి చెప్ప గలిగే మాస్టారువి నువ్వు ఆర్యధర్మంలో ఏం చెప్పారో నీకు తెలీదూ?" అడిగాడు చిదంబరం.

అర్థంకానట్టు చూశాడు వీరభద్రం.

"పుత్రుణ్ణి అయిదేళ్ళ వరకూ ప్రేమగా పెంచాలట. పదిహేనేళ్లు వచ్చేవరకూ దండించైనాసరే భయ భక్తుల్లో వుంచాలి. పదహారేళ్లు దాటిం తర్వాత స్నేహితుడిలాగా చూసుకోవాలాట" వివరించాడు చిదంబరం.

వీరభద్రం మౌనంగా వింటూ వుండిపోయాడు. అదే సమయమనుకున్న పార్వతమ్మ అక్కడకొచ్చింది.

"మీ చెల్లెలికిచ్చిన మాట తప్పినట్టవుతుందని భయపడుతున్నారే తప్ప రేపు ఆవిడ కూతుర్ని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుంటే ఏమవుతుందో ఆలోచించారా?" అడిగింది.

ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు వీరభద్రం.

తన ప్రశ్నకు జవాబుగా తనే మళ్లీ చెప్పింది పార్వతమ్మ.

"మీ బావగార్ని కట్నం కానుకలు ఇవ్వమని మనం అడగలేం." అంటూ ఇంకా చెప్పబోతుండగానే.

"అదిగో...ఆ కూతే కూయవద్దని చెప్పాను. కట్నం కానుకలు పుచ్చుకొనుట చట్టరిత్యా నేరం...అటుపై వాటిని మా సంఘం కూడా నిషేధించినది" అంటూ విరుచుకు పడ్డాడు వీరభద్రం.