తాతా ధిత్తై తరిగిణతోం 21

తాతా ధిత్తై తరిగిణతోం 21

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

 

"ధనుంజయగారూ! ఈ సంబంధం కుదిరేది కాదు!" కర్చీఫ్ తో ముఖం తుడుచుకుంటూ పక్కనే నిలబడ్డ పెద్ద మనిషితో నెమ్మదిగా అన్నాడు విష్ణుమూర్తి.
అయోమయంగా చూశాడు సదరు ధనుంజయ పేరుగల పెద్దమనిషి.
"అసలే ఆయన ఛండశాసనుడట. పైగా మన మాటలన్నీ వినేవుంటాడు. గారాలకూచి, కోడలుగా 'గెటాన్' కాగలదా? అని!" తన సందేహాన్ని వ్యక్తం చేశాడు విష్ణుమూర్తి వెంటనే.
"అబ్బాయి గుణగణాలు ముఖ్యం కానీ వియ్యంకుడి ముఖంతో మనకు అవసరం వుండదు కదండీ. రేపు తమ అల్లుడుగారు మనూరొచ్చి తమ ఇంట్లోనే వుండి మీ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటే అప్పుడిక అమ్మాయిగారికి, మామగారి ఫేసుతో 'పేచీ' మాత్రం ఏముంటుందీ?" ధనుంజయం నచ్చచెప్పాడు.
"అదీ పాయింటే."
మరికొద్ది క్షణాల్లో వీరభద్రం వీధిలోంచి రానే వచ్చాడు.
"ముందు ఆ సోఫాలోంచి లేవండి." వస్తూనే స్టూడెంటు మీద మండిపడినట్టు అరిచాడు.
బెంచీ ఎక్కమంటాడేమో నన్నంత భయంగా ముసిముసిగా నవ్వుకుంటూ అనుకున్నాడు మనసులో.
"తాతా తధిగిణతో..."
'ఎంతవారైనా కాంతాదాసులే' అని హరిదాసు చెప్పినట్టు 'కార్లో వచ్చన వాళ్లయినా అయ్యాగారి నోరు చూస్తే పరారే' అనుకుంటూ, నీళ్ళ కావిడ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు.
"ఊ! శలవీయండి! ఈ దరిద్రపు ఫేసు గల ఉగ్రనరశింహునితో తమకేం పని పడినదో త్వరగా శలవీయండి!" వ్యంగ్య ధోరణిలో అడిగాడు వీరభద్రం.
"మీరు ముందుగా మమ్మల్ని మన్నించాలి. మీరు, 'మీరే' అని తెలియక" నీళ్లు నమిలాడు విష్ణుమూర్తి.
"ఇప్పుడు తెలిసివచ్చినది కదా! వచ్చిన పని చెప్పి దయచేయుడు."
"ఆ పాయింటుకే వస్తున్నా మేస్టారూ. అంటే అదీ! మా 'అబ్బాయికీ' మీ 'అమ్మాయి' నిచ్చి పెళ్ళి చేయాలనీ.
"మీ బొంద...మా కుమార్తెకు వివాహమై రెండు సంవత్సరములైనది. తమరిక వెళ్ళవచ్చు."
తన 'డైలాగ్ డెలివరి' లో జరిగిన పొరపాటు తెలుసుకుని, నాలిక కరచుకున్నాడు విష్ణుమూర్తి.
"ఛ. మాట తడబడ్డాను...మన్నించాలి! మీ 'అబ్బాయి' శ్రీరామ్' మా 'అమ్మాయి' అశ్వినినిచ్చి" వీరభద్రం ముఖంలోకి చూస్తూ నవ్యంగా మాట్లాడేందుకు దైర్యాన్ని కూడదీసుకుంటున్నాడు. 
"వీల్లేదు! అది జరగని పని!" మధ్యలోనే అన్నాడు వీరభద్రం.
ఇప్పుడు విష్ణుమూర్తితో వచ్చిన పెద్దలిద్దరూ కల్పించుకున్నారు.
"అయ్యా! తమరలా కోప్పట్టంలో తప్పులేదు.....జరిగిపోయిందేదో జరిగి పోయింది. మీరు పెద్దవారు!...ఆగ్రహం తగ్గించి శాంతంగా వినండి! అసలు సంగతేమిటంటే వీరు 'విస్సన్నపేట విష్ణుమూర్తి' గారనీ కృష్ణ పట్నానికి ఏకైక ధనవంతులు!" చెప్పాడు ధనుంజయ.
"అయితే ఏమిటట తమబొంద?...ఏ పాలసముద్రమునకో పొయిం ఆదిశేషునిపైన పవళించమనండి ఆదిలక్ష్మి చేత పాదము లొత్తించుకొమన్నండి."
"ఆహా!...మీ మాటల్లో హాస్యరసం తొణికిసలాడుతోంది" పోదిగితే తమ దారికి వస్తాడన్న ఆలోచనతో రెండో పెద్దమనిషి అందుకున్నాడు.
"ఇంకానయం...అల్లపురసం కారుతున్న దనలేదు...ఇంతకీ తమరెవరో?"
"చిత్తం! నాపేరు సుబ్బరాజు!...అతనిపేరు ధనుంజయ...మేమిద్దరం వీరికి ఆత్మీయులం!"
"అందుకే కాబోలు భట్రాజులై పొగడుతున్నారు."
"మీరేమనుకున్నా సరే! ఉన్నమాట చెప్పక తప్పదు. మా విష్ణుమూర్తిగారికి మూటలకొద్దీ డబ్బుంది...కోటలాంటి బంగళా వుంది. ఆ బంగళాకీ, కోట్లధనానికీ ఏకైక వారసురాలు వారి కుమార్తె!" చెప్పాడు సుబ్బరాజు.
"అంతేకాదు మాస్టారూ! వారమ్మాయికి డిగ్రీ ఎత్తు చదువుతుంది. చందమామ ఎత్తు అందముంది... నయాగారా జలపాతమంత ఉధృతమైన చలాకీతనముంది" ధనుంజయ తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు.
వీరభద్రం చివాల్న కుర్చీలోంచి లేచాడు కానీ మా సుపుత్రునికి ఏనాడో నిశ్చయం చేసుకున్న మేనరికమున్నది...ఆరు నూరైననూ, నూరు ఆరైననూ వేరే సంబంధం మాకు వలదుగాక వలదు! వెరొకరైన మీ ప్రేలాపనలు వీధిలో వినిన వెంటనే మీ కార్లటైర్లు తెగ్గోసి మీనోట నాలికలు కత్తిరించి వచ్చిన దారినే సాగనంపి యుండెడివారు!" అన్నాడు.  
ఇక లాభం లేదనుకున్నాడు విష్ణుమూర్తి ...అటో ఇటో తేల్చేసుకోవాలనుకున్నాడు.
"అదికాదు మేస్టారూ. మీ అబ్బాయీ, మా అమ్మాయీ గాఢంగా ప్రేమించుకున్నారు."
"ఆపండి మీ అధిక ప్రసంగము. అసలు మా రాముడికి 'ప్రేమ' అనే పదానికి అర్థము కూడా తెలియదు...బహుశా మీ పుత్రికే మా చిరంజీవికి ఏ మందో మాకో ఇచ్చి ముగ్గులోకి లాకి వుండవచ్చు. మీరు అశ్రద్ధ చేసినచో కాలు జారగలదు. అప్పుడిక మరే తలమాసిన వాడెవడూ మీ కుమార్తెను చేసుకొనుటకు ముందుకు రాడు...అటుపై మీ కోట్ల ఆస్తికానీ కోటవంటి బంగాళా కానీ....మీ పరువును కాపాడలేవు...జాగ్రత్త!" ఆ మాటలువిన్న విష్ణుమూర్తికి ఒళ్ళుమండిపోయింది.
"ఇక ఆపవయ్యా. ఏదో పెద్దవాడివి కదా' అనీ, 'మగపిల్లవాడి తండ్రిని కదా' అనీ ఇంతసేపూ మర్యాదిచ్చిమాట్లాడేను.!...కానీ నువ్వు నోరు పారేసుకుంటున్నావ్...కారు కూతలు కూస్తున్నావ్...మా 'అశ్విని' అంటే నాకు ప్రాణం కనకా, అది మీ అబ్బాయంటే ముచ్చట పడింది కనకా నీ ఇంటికి ముష్టికొచ్చాను. అంతేతప్ప నా కూతురుకి సంబంధం దొరక్కకాదు. నేను తలచుకుంటే అరగంటలో అమెరికా అల్లుణ్ణి కొనగలను. తెలుసా?" అన్నాడు నిలువెల్లా ఆవేశంతో ఊగిపోతూ.
"శుభం!..ఆపని చేయండి. కానీ హెచ్చరిక! అమెరికాలో అదేదో 'ఎయిడ్స్' రోగము తీవ్రముగా వున్నదట...వివాహమునకు ముందు నీక్కాబోయే అల్లునికి రక్త పరీక్ష చేయించుకో...లేదంటే ఏ 'పులిరాజా' వాతపడునో ఏమో" పెడసరంగా అన్నాడు వీరభద్రం.
"ఛీ! మీ 'ఫేసే' దరిద్రంగా వుందనుకున్నాను...మీ 'మాటలు' మరింత దరిద్రంగా వున్నాయి...మీతో మాట్లాడి, నేను మహా దరిద్రున్ని కాలేను." అంటూ విసవిసా వీధిలోకి వచ్చి కారెక్కేశాడు విష్ణుమూర్తి. అప్పటిదాకా వీళ్ళ సంభాషణంతా వంటింట్లో కూర్చొని వింటున్న పార్వతమ్మ హాల్లోకి వచ్చింది....
"నాది దరిద్రపు ఫేసట! తగిన శాస్తి చేసి పంపించాను." ఆమెతో గర్వంగా చెప్పాడు వీరభద్రం.
*           *         *