భూమత్స్యగుండ్ర

- ప్రసన్న కుమార్ సర్రాజు s


  అనగనగా ఒక వూళ్ళో ఆసామి. ఏసామి అని అడిగితే ఆసామి అని చెప్పాలి. ఆయనకోరోజు పుల్ల మజ్జిగ తాగి పడక్కుర్చీలో పడుకున్న సమయంలో ఒ కోరిక కలిగింది. అది ఏ కడుపుతో వుండే వాళ్ళకో కలిగే కోరికయితే ఓ పనసకాయతోనో బొప్పాయికాయతోనే తీరిపోయేది. కానీ ఈ సామికి కలిగిన కోర్కె మధురమైనదైనా అది తీరడం కొంచెం కష్టమైనా పనే అన్చెప్పొచ్చు. మర్నాడు పరధ్యానంగా చాలా అవకతవక పనులు చేశాడు ఆసామి. వేప్పుల్లనుకుని జనపపుల్ల నోట్లో పెట్టుకుని నమిలాడు. ఆ రోజు పొలంలో పచ్చి మంచినీళ్ళు ఆ రాత్రికి నిద్దరట్టలేదు కూడా ముట్టలేదు.

ఆయన చిన్న కొడుకుని ఆపు తన్నితే ఓహో అని ఊరుకున్నాడు. ఇలా నాల్రోజులు పోయేసరికి ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకీ ఆయనేదో తీరని కోరికతో బాధపడుతున్నాడని రూడీ అయింది. ఆరోజు ఆసామి బామ్మర్ది చెల్లెలు వుత్తరం చూసుకుని బావ కిష్టమైన కజ్జికాయలు తీసుకొచ్చి, బావగారి ముందు పళ్ళెంలో పెట్టి పలకరింపుగా నవ్వాడు. ఆసామి నవ్వలేదు. అయినా ఆ బామ్మర్ది ముఖం చిన్నపుచ్చుకోకుండా బావకి చక్కిలిగింతలు పెట్టైనా, కులాసాలోకి దింపుదామని నిశ్చయించుకున్నాడు. ఆ సాయంత్రం వూరు బయటకు షికారుకెడుతూ బావగారితో ఓ క్వార్టరు లాగించాక గానీ అసలు విషయం బయటపడలేదు. “నాకు ఫారినెళ్ళాలని వుంది బావా ...’’ అన్నాడు ఆసామి బాధగా, జాలిగా.

“దానికేం .. ఎల్లు ...’’ అనబోయి “ఏంటది?’’ అని అడిగాడు బామ్మర్ది. “ఫారిన్ ... అంటే ఇదేశం’’ అని విడమర్చి చెప్పటానికి ట్రై చేశాడు. నాలిక మొద్దుబారిపోయిందని కించిత్ సిగ్గుతో. “అదెల కుడురుద్ధి బావా! అయినా నీకీ వయసులో ఇదేం బుద్ది?’’ అని సంజాయిషీ కోరాడు బామ్మర్ది. “వయసుకీ, ఇదేషానికీ ఏముంది బావా సమ్మంధం? ఎంతమంది రోజూ యెల్లి రావటంలేదు? రోజూ పేపర్లో సూడటల్లా! యెన్ని ఫోటోలు! ఆళ్ళంతా యిదేషాలకెళ్ళి రావడంల్లా?’’ అన్నాడు ఆసామి. “అంటే పేపర్లో పడేదంతా నిజమనుకుంటున్నావా బావ? ఆ పుటలలో కొన్ని సంస్కరణలు, కొన్ని తప్పిపోయినవాళ్ళ ఆచూకీలు – పేపర్లో పుతో ఏయించుకున్న ప్రతీ వాడూ ఫారినెల్లాలంటే కుదురుద్దా బావా!’’ అన్నాడు బామ్మర్ది. ఆసామి కళ్ళు మిలమిల మెరిశాయి.

ఆ ఉత్సాహంలో ఓ ఫుల్లు ఓ ముంత కల్లు లాగించేశాడు. మర్నాడు చెల్లెల్ని అసింటా తీసికెళ్ళి విషయం చెప్పాడు బామ్మర్ది. చెల్లెలు నెత్తీ నోటూ కొట్టుకుంది. ఏ దొరసానమ్మ వలలో పడ్డాడోనని బావురుమనబోయి అంతలోనే కోపమొచ్చేసి విషయమేమిటో ఆసామినడిగి తెల్సుకుందావాని, ప్రాస కోసం ఓ సున్నా ఎక్కువైనా ఫరవాలేదని కొంగు బిగించింది. బామ్మర్ది చెల్లల్ని సముదాయించాడు. అల్లరి చేస్తే బావ మనకు దక్కడన్నాడు. రోజంతా కలలు కంటూ తాటి సెట్టు కిందే గడిపేస్తున్నాడు. చివరికి ఆ రోజు భోజనాలయ్యాక పంచలో చేరారు ముగ్గురూ. “ఏ వూరెడతా?’’ అడిగాడు బామ్మర్ది టిక్కెట్టు కలక్టరులా. ఆసామి సిగ్గు సిగ్గుగా చూశాడు. లండన్ అని సెప్తే మొకం మీద నవ్వుతారేమో, ఆళ్ళూళ్ళో చిన్నపిల్లోడి కాడ్నించి పెద్దోళ్ళదాకా లండనెల్తానంటే బాగా తెల్సు, ఒడ్డు, బాలా అది ... “అమెరికా’’ అన్నాడు ఏదో పేరు చెప్పాలి గదా అని. “అమెరికా వద్దు బావా ... అక్కడ పాలసీలు ఏం బాలా’’ చెప్పాడు బామ్మర్ది. ఏ పాలసీలు? అని అడగాలా ఆసామి. “పోనీ జాంబ్లాకా పొతే?’’ గంభీరంగా అన్నాడు. బామ్మర్ది ఒక్క క్షణం వులిక్కిపడ్డాడు.

అయినా ఏ మ్యాపులో ఏ దేశం వుందోనని గుంభనంగా “అక్కడికైతే ఏ అబ్జక్షనూ లేదనుకుంటాను’’ అన్నాడు. ఆసామి లోలోన ఆనందించాడు. జంబ్లాకా చాలా సుందరమైన నగరము ... విశాలమైన రహదార్లు ... నూటపది అంతస్తుల భవనములు, ప్రకృతి సిద్ధమైన వనరులతో విరాజిల్లుచుండును ... బామ్మర్ది ఆసామే ఆలోచనలను త్రుంచి వేస్తూ “అది సరే బావా! ఏం పనిమీదెళుతున్నట్లు పేపర్లో ఏయిద్దాం?’’ అడిగాడు. “పేపర్లో మనం యేయించేదేటి బావా? నేను జంబ్లాకా యెలుతున్నానంటే దేశంలో పత్రికలన్నీ ప్రముఖంగా అచ్చెయ్యవా?’’ అన్నాడు బొత్తిగా అనుబవం లేని బామ్మర్ది మీద జాలిపడుతూ. “నివ్వేం మినిస్టీరువా, సినిమా స్టారువా ... పేపర్లన్నీ నీ ఫుటో యేసి ఆళ్ళ సేల్సు పెంచుకోడానికి?’’ బామ్మర్ది సరసంగానే అన్నా ఆసామి మనసు చివుక్కుమంది. క్షణం మాట్లాడలేదు. అక్కణ్ణించి లేచి గదిలోకివెళ్ళి దుప్పటి ముసుగెట్టి పడుకున్నాడు. బామ్మర్దికేం పాలుపోలేదు. బేలగా చూస్తున్న చెల్లెలికి కళ్ళతోనే అభయమిచ్చి బజార్లోకెళ్ళాడు. సాయంత్రం బావగార్ని తీసుకుని పోలాలమ్మట షైరు కెడామని బయల్దేరదీశాడు. ఆసామి కాస్త ముభావంగానే బామ్మర్దిని అనుసరించాడు.

“చూడు బావా! నివ్వేమన్నా అనుకో, ఏనాడూ ఇదిగో నాకిది కావాలని అడగనే లేదు నువ్వు. ఈ నాడిలా ఇదేసీ ప్రయాణవని సిక్కిపోతా వుంటే సూడ్లేక పోతున్నాను. నేను మద్దేన్నం అన్న మాటకి బాధపడమాక, అయినా నేనప్పుడూ ఇప్పుడూ అదే మాటంటాను. ఈ రోజుల్లో అవుటు సైడుకెళ్ళి అవుపోసన పట్టినా, పేపర్లో పడాలంటే నువ్వు మినిష్టరువి కాక తప్పదు. కనుక నువ్వు రేపెసెంబ్లీ ఎలక్షన్లో నిలబడు’’ అన్నాడు బామ్మర్ది. ఆసామి తలెత్తి బావమరది కేసి చూశాడు. బామ్మర్ది కల్లు స్నేహపూర్వకంగా భుజం తడుతున్నట్లున్నాయి. ఒక క్షణం ఆలోచించి “ఒద్దు బావా, ఎలక్షన్లలో నిలబడడవంటే మాటలుగాదు, ఎదుటోడు లక్ష ఖర్చెడితే మనం నాలుగు పెట్టాల, పెట్టలేకగాదు ... కీడెంచి మేలెంచమన్నారు. ఇన్ని లక్షలూ ఖర్చెట్టి ఏ ఎదవనాయాలో ఎగస్పార్టీ వోడికి ఏసిన ఒక్క ఓటు తేడా వస్తే కంపిలీటుగా అవుటవుతాంగదా! అంతకన్నా పిచ్చారు తీస్తే అది దెబ్బతిన్నామన్నా పిల్లలాడుకోవడానికి ఫిలిం ముక్కలున్నా మిగులుతాయి. అదీ గాక ...

బామ్మర్ది ఒక్కసారి నిటారుగా అయ్యాడు. “ఏంటి బావ? ఎవయింది?’’ అడిగాడు ఆసామి. “ఏంటన్నావ్? మళ్ళీ వొకసారనూ’’ అన్నాడు బామ్మర్ది శూన్యంలోకి చూస్తూ. మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు ఆసామి “ఒద్దు బావా, ఎలక్షన్లలో నిలబడటవంటే మాటలు గాదు. యెదుటోడు ...’’ “అదంతా అక్కర్లేదు బావా, సివరి డవిలాగు సెప్పు’’ కాస్త అసహనంగా అన్నాడు బామ్మర్ది. “ ... పిచ్చారు తీస్తే, అది దెబ్బ తిన్నా ...’’ “దెబ్బతినదు’’ అరిచాడు బామ్మర్ది. “పిచ్చరు తీద్దాం ... పిచ్చరు తీద్దాం. మామూలు పిచ్చరు కాదు. అవార్డు పిచ్చరు తీద్దాం. ఎవడో ఫారినోడు మన పిక్చర్ కొంటాడు. ఆడు కొనకపోతే ఆడికి డబ్బులిచ్చి మనవే కొనిపిద్దాం. వెంటనే ప్రింటుతో సహా మనమూ ... అదే నువ్వూ ఫారినెళ్ళొచ్చు. అపుడు సినిమా పత్రికలే కాదు. అన్ని పత్రికలూ నీ ఫోటో ఏసి ఘనంగా సన్మాయిస్తాయి. అప్పుడు నువ్వు గ్రేటు అవార్డు పిక్చర్ ప్రొడ్యూసర్ వి, నేను ప్రొడ్యూసర్ బామ్మర్దిని’’ అన్నాడు ఆనందోత్సాహాలతో.  ఆసామికి అప్పటికి విషయం అర్థమయింది. నిజవే పిక్చరు తీస్తే అటు డబ్బుకి డబ్బూ, పేరుకి పెరూ, ఇటు తన సరదా తీరుతుంది. ఫారినెళ్ళొచ్చు. అబ్బ! ఎంత మంచి ఆలోచన ...

*****

మద్రాసు మారిస్ మేనేజర్ హోటల్లో దిగారు ఆసామి, బామ్మర్ది. బామ్మర్ది తనకు తెలిసిన ప్రొడక్షన్ మేనేజర్ కి ఫోన్ చేసి హోటల్ కి పిలిపించాడు. ఫోనందిన వెంటనే వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ని కూర్చోపెట్టి ఇలా పిక్చర్ తీయాలని చెప్పారు. ప్రొడక్షన్ మేనేజరు ఉత్సాహంతో ఉబ్బితబ్బిబ్బై మిగతా విషయాలు నా కొదిలేయమన్నాడు. సాయంత్రానికి ఓ ఇద్దర్ని వెంటపెట్టుకోచ్చాడు. వాళ్ళలో ఒకడిని స్టోరీ ప్లాట్లు అమ్మేవాడు గానూ, రెండోవాడ్ని ఎవార్డు పిక్చర్ తీసే డైరెక్టరుగానూ పరిచయం చేశాడు. బెడ్డింగ్ లో చుట్టుకొని తీసుకొచ్చిన అరడజను ఫుల్లుల్లో ఓ ఫుల్లు బైటికి తీసి నలుగురూ కులాసాగా కూర్చున్నారు. వచ్చినప్పట్నించీ ప్లాట్లు అమ్మేవాడు యేదో వాగుతూనే వున్నాడు. బుగ్గిరాముడు ప్లాటు నాదేనన్నాడు. జీతాలు-జీవితాలు కూడా తనదేనన్నాడు.

నా ప్లాటు కొంటే మీకు డోకా లేదన్నాడు. ప్లాట్లు అమ్మటంలో తను అందరిలాంటివాడ్ని కాదన్నాడు. కావాలంటే బజార్లో ఎంక్వైరీ చేయమన్నాడు. మారెక్ట్ ధరల మీద వొక్క రూపాయి తను యెక్కువ చెప్తే చెప్పు మెడకి కట్టమన్నాడు. తన ప్లాట్లలో అన్ని రకాలవీ వున్నయనీ, ఏ ప్లాటు కావాల్సిన వాళ్ళకి ఆ ప్లేట్ చెప్తాననీ, మిగాతావన్నీ బయట పెడితే తన బిజినెస్సుకి దెబ్బ అనీ అన్నాడు. మీకేవేం ప్లాట్లు కావాలో ఆ ప్లాట్లకి సంబంధించిన వివరాలు పూర్తి చెయ్యండంటూ సైక్లో స్టైల్లో చేయించిన ఓ పది ప్లాట్ల ఫారాలు బల్లమీద పెట్టాడు. పౌరాణికాలు కావాలా అని అడిగి, మళ్ళీ తనే, అవి బాంబు పేలినట్లు బాక్సాఫీసులో పేలతాయని, అయితే అందరిలా రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, సావిత్రి వీళ్ళమీద తీస్తే లాభం లేదన్నాడు. ద్యుమక్త్సేనుడి వధ, ఆక్రూర అంగీరస సంవాదం, ‘భక్తవిదుర’ (అణు మహా భారత గాధ) తీయమన్నాడు.

ఆసామికి చిరాకేస్తోంది. ఎదవ ప్లాట్ల గొడవ ఆపడేం? ప్లాటుదేముంది? అవార్డు పిక్చరుకి కెమెరా ముఖ్యంగా వుండాల. డైలాగులు ఎంత వీలుంటే అంట తక్కువ పెట్టి దగ్గులూ, తుమ్ములూ పెట్టాలా. డైరెక్టరు గంభీరంగా పెగ్గు మీద పెగ్గు లాగిస్తున్నాడు. “ఆరికి ఎక్కువ పొయ్’’ అన్నాడు ఆసామి ప్లాటు ఫారాలిచ్చినవాడి గురించి, ఓ గ్లాసుడు పుచ్చుకుంటేనే గానీ వీడు వాగుడు ఆపాడని, ప్లాటు వాడు గ్లాసు ఖాళీ చేస్తున్న సమయంలో డైరెక్టరు గొంతు సవరించుకున్నాడు. అందరూ నిశ్శబ్దమైపోయారు. ఆయన యెటేపొ దీర్ఖంగా చూస్తుండటం గమనించి, వారు గొంతు విప్పేదాకా మందు గొంతులో పోసుకోకుండా వినయంగా చూస్తున్నారు. ఐదు నిముషాలయింది, పదినిముషాలయింది. అలా గోడ వైపే చూస్తాడేం? డోసు గానీ యెక్కువవలేదు గదా? మరీ కక్కుర్తిగా లాగించేసినట్లున్నాడు. ఇప్పుడు ఈడు మాట్లాడకపోతే యెలా? అవార్డు పిచ్చరెలా? ఫారినెల్లడం యెలా? బామ్మర్ది, డైరెక్టరు చూస్తున్న వైపే చూశాడు.

అక్కడో చీమల బారుంది. డైరెక్టరు నిట్టూర్చాడు దీర్ఘంగా “హు ... ఆ బారులో ఒక్క ఆడ చీమ కూడా లేదు’’ అన్నాడు. “మరి క్యాబరే డాన్సింగ్ లేదా? ఇందాక సర్వరు వచ్చి బారులో వుందీ రాత్రి తొమ్మిది గంటలకని చెప్పాడే?’’ ఆసామి సందేహంగా అడిగాడు. డైరెక్టరు అర్థం కానట్టు చూసి మళ్ళీ చీమల బారుకేసి తలతిప్పి “హు ... స్త్రీ ఎవార్డు పిక్చర్ కి ఈ రోజే నాంది పడింది చీర్స్!’’ అని వికృతంగా అరిచాడు. డైరెక్టరు తనకు అందలేకపోయిన మాటలు పూర్తికాకుండానే, తనని రక్షించినందుకు కృతజ్ఞతగా చూశాడు ప్లాటు వాడివైపు. ఆసామికి ఇంకా చిరాకెత్తింది. బామ్మర్ది కేసి తిరిగి “సూడు బావా! మనది అర్థం కాని బాసలూ అవి ఏవీ వోద్దుగానీ, అవార్డు పిక్చర్ కి ఎంతవుద్దో, ఈయనెంత పుచ్చుగుంటాడో అడుగు’’ అన్నాడు.

“నేనింక పుచ్చుకొను ... మళ్ళీ ఇంటికెళ్ళాలి. మా ఆవిడే తలుపు తీస్తుంది’’ మురిపెంగా అన్నాడు ప్లాట్ రైటరు. “అబ్బ! నీ మందు విషయం గాదు లేవయ్యా! ముందు పిక్చరు గురించి ఆలోచించరే?’’ పబ్లిగ్గా విసుక్కున్నాడు ఆసామి. అంతవరకూ మౌనంగా వున్న బామ్మర్ది ప్రొడక్షన్ మానేజర్ కి సైగ చేశాడు. “అయ్యా డైరెక్టర్ గారూ! మీరు మాక్కావాల్సిన వారు, పెద్దమనుషులు, మీరు దయచేసి మా పిక్చరు కాదనకండి. మీకెన్ని బిజీ పనులున్నా మాకు కాల్ షీటివ్వండని’’ బ్రతిమాలాడు ప్రొడక్షన్ మేనేజర్. డైరెక్టరు నింపాదిగా చూసి అన్నాడు “అందుకే గదా, ఓ ప్రక్క ఇంకో అవార్డు పిక్చర్ కి షూటింగ్ జరుగుతున్నా మధ్యలో వచ్చాను! ఈ పాటికి హీరో మజ్జిగలోకి వచ్చేసుంటాడు’’ అన్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అలవాటుగా తల వూపినా చివరి వాక్యం కొరుకుడు పడక ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు.

అప్పుడు ప్రొడక్షన్ మేనేజరు భాష్యం చెప్పాడు – “అవునండీ ఇప్పుడు మీరు తీస్తున్న షాటు హీరో కొండలమీంచి, మధ్యనించీ నడిచి నడిచి, ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కుని భోంచేస్తున్నాడు. హీరో అవుపోసన పట్టగానే మన డైరెక్టరు గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి ఇలా చక్కా వచ్చారు. ఈ పాటికి హీరో మజ్జిగ పోసుకొని వుంటాడని వారు అనుకుంటున్నారు’’ ఆసామి కాస్త తెల్లబోయినా అవార్డు సినిమాలు అలానే వుంటాయిగామోసునను కుని, తాను తెల్లబోయినట్లు బైటకు కనిపించడం ఇష్టం లేక “పిక్చర్ పేరెం పెట్టారు?’’ అన్నాడు యథాలాపంగా అడిగినట్లు. “నిత్యకృత్యాలు’’ డైరెక్టరు చివర గుటక వేసి లేచి నించున్నాడు. వెంటనే ఆసామి, బామ్మర్ది లేచారు. ప్లాటు రైటరు నిలబడటానికి శతవిధాలా ట్రై చేస్తున్నాడు. వాళ్ళని డోరుదాకా సాగనంపి, మళ్ళా రేపు రెండో సిటింగు అని ప్రొడక్షన్ మేనేజర్ అన్నదానికి తలూపి, ఉస్సూరుమంటూ మంచంమీద కూలబడ్డాడు ఆసామి ...

*****

మర్నాడు పదింటికి బావ, బామ్మర్దులిద్దరూ టిఫిన్, కాఫీ పూర్తి చేసుకునేసరికి, ప్రొడక్షన్ మేనేజరు లోపలికి వచ్చాడు. “గుడ్ మార్నింగ్’’ అంటూ స్వచ్చంగా నవ్వాడు. ఆసామి అతన్ని కూర్చోమని “చూడు ప్రొడక్షన్ మేనేజరూ ....’’ అని చెప్తూండగా ... “చిత్తం, నా పేరు తిరువేంగళం అండీ’’ అన్నాడు. “ష్ ... చూడు తిమింగళం! ఈ కథలో యెవరికీ పెర్లుండవు, వుండకూడదట అలాని రచయిత చెప్పాదులే. ఉదాహరణకి చూడు! నా పేరు ఆసామి, ఇతను నా బామ్మర్ది అలాగన్నమాట. పేర్లు పెట్టావనుకో! కిట్టనివాళ్ళు యింకో నాలుగు కల్పించి, మనం యెవరినో హేళన చేస్తున్నామని ప్రచారం చేసెయ్యగలరు. కాబట్టి తిమింగళం ...’’ “చిత్తం ... నాపేరు తిమింగళం కాదండి ... ప్రొడక్షన్ మేనేజర్’’ “అద్గదీ ... ఇప్పుడు చెప్పు ప్రొడక్షన్ మేనేజరూ, నిన్న నువ్వట్టుకొచ్చిన డైర్రెట్రు పని ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే ...’’

“అందుకే వచ్చానండీ ... ఫలానా స్టూడియోలో మన డైరెక్టరు గారి న్యూవేవ్ పిక్చర్ షూటింగ్ జరుగుతోంది. మిమ్మల్ని తీసుకుపోదామని ...’’ చెప్పాడు. “నేనిందాకన్న ముక్క మనసులో పెట్టుకోమాక, మన పేర్లుండవన్నాను గానీ, మరీ అలా ‘ఫలానా స్టూడియే’ అని చెప్పక్కర్లా ... పర్లా ... స్టూడియే పేర్జెప్పు ...’’ ప్రోత్సహించాడు. “పర్లేదండీ ... ఎందుకు? నే తీసుకెడుతున్నానుగా ...’’ ప్రొడక్షన్ మేనేహరు మొహమాటపడుతూ అన్నాడు. ఆసామి, బామ్మర్ది రూంకు తాళం వేసి ప్రొడక్షన్ మేనేజరుతో స్టూడియోకి బయల్దేరారు. గేటు లోపలికి టాక్సీ తిరగంగానే ఒక్కసారిగా బెల్లం, పంచదార పాకాల వాసన ముక్కుపుటాలకు కొట్టింది. “ఇదేమిటి ప్రొడక్షన్ మేనేజరూ! చెరుకు ఫ్యాక్టరీలోకి తిప్పావేంటీ?’’ అని అడిగాడు ఆసామి. ఎదురుగా ఆ పెద్ద పెద్ద రేకుల షెడ్లూ, ఆ వాసన అంతా చూస్తుంటే సీజన్ లో చెరుకును ఫ్యాక్టరీకి తోలించిన జ్ఞాపకాలు వచ్చాయి.

ప్రొడక్షన్ మేనేజర్ చిరునవ్వు నవ్వాడు. “చెరుకు ఫ్యాక్టరీ కాదు, స్టూడియోనే, కాస్సేపాగితే మీకే తెలుస్తుంది’’ అని నాలుగో నెంబరు ఫ్లోరు దగ్గర టాక్సీ ఆపించాడు. బామ్మర్ది టాక్సీ డబ్బులిచ్చేశాక ముగ్గుతూ లోపలికెళ్ళారు. పాకం వాసనతో ముక్కులు తియ్యగా బ్రద్దలవుతున్నాయి. లోపలికి అడుగుపెట్టగానే, ఎండాకాలం తారు రోడ్డు మీద నడుస్తుంటే కరిగిన తారులో చెప్పు కాలు పడి పైకి లేస్తుంటే కలిగే విచిత్రమైన అనుభూతి కలిగింది. లోపల ఓ పదిమంది అసిస్టెంటు కుర్రాళ్ళు భూతద్దాలు పెట్టుకుని వంగి వంగి నడుస్తున్నారు. వాతావరణం సీరియస్ గా వుంది. అందరూ నిక్కర్లేసుకుని వున్నారు. ప్రొడక్షన్ మేనేజరు ఆసామి చెవిలో హెచ్చరించాడు “మీరు పంచెలు పైకెగదోసి, గోచీలా కట్టుకోండి. లేకపోతే నేల మీద పడి పాడైపోతుంది పాకం’’

బావమరుదులిద్దరూ సర్ధుకున్నాక “ఇంతకీ కెమెరా యెక్కడా కనిపించదేం?’’ అని అడిగాడు ఆసామి. ఈ పిచ్చరుకి మ్యూజిక్కు, పాటలతో పాటు కెమెరా కూడా లేదా అని అనబోయి తెలివి తెచ్చుకుని మౌనం వహించాడు. ప్రొడక్షన్ మేనేజరుకి వాళ్ళ మీద జాలేసింది. మాట్లాడకుండా బొటనవేలు థమ్స్ అప్ డ్రింక్ లో లాగా పెట్టి కళ్ళెగరేశాడు. వాళ్ళు తల పైకెత్తి చూస్తే ... ఆశ్చర్యం! నలుగురు మనుషులు గబ్బిలాల్లా తలక్రిందులుగా వ్రేలాడుతున్నారు. అందులో ఒకడు వ్రేలాడుతున్న కెమెరాలో తలపెట్టి వున్నాడు. మిగతా ముగ్గురూ నిర్వికారంగా చూస్తున్నారు. వాళ్ళ కాళ్ళు పైన తాడుతో కట్టేసి వున్నై. ఆసామి రహస్యంగా అడిగాడు “మన డైరెక్టరు గారు కూడా వ్రేలాడుతున్న వాళ్ళలో వున్నాడా?’’ “లేడు’’అంటుండగానే వెనకాలనుంచి డైరెక్టరు అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే వినయంగా నమస్కారం పెట్టారు ముగ్గురూ. డైరెక్టరు చేతిలో చిన్న భరిణ ఉంది.

అందులో ఓ పెద్ద గండు చీమ ఉంది. దాన్ని చూసి “ఏమిటిది డైరెక్టరుగారూ’’ అని అడిగారు. డైరెక్టరు దీక్షగా భరిణ వంక చూస్తూ నిలుచున్నాడు. ప్రక్కనే వున్న అసిస్టెంటు డైరెక్టరు చెప్పాడు. “ఇదే మా చిత్రంలో ముఖ్య పాత్రధారి. ఇది యెన్నో చిత్రాల్లో నటించింది. ఈ రోజు పతాక సన్నివేశం, ఈ బూర్జువా చీమను కొన్ని వందల చీమలు తరిమి తరమి వేయటం చూపించాలి. పోద్దుట్నుంచీ ఎన్ని బెల్లం ముక్కలు నేలమీద వేసినా ఓ వంద చీమలు కూడా పోగవలేదు. ఇవ్వాళ గనక ఈ సీను పూర్తికాకపోతే ఈ గండు చీమగారి కాల్ షీట్లు నెలదాకా లేవు. అందుకని మేం ఏ మాత్రం ఖర్చుకు వెరవదల్చుకోలేదు. ఫ్లోరంతా బెల్లం పాకం పోయిన్చాం. ఆ పాకంమీదే చివరి విప్లవ సీను చూపిద్దావని డైరెక్టరు గారు ...’’ డైరెక్టరు చేత్తో సైగచేశాడు ఇక చెప్పొద్దని. అసిస్టెంటు వినయంగా తలూపాడు. ఆయన కాస్త దూరం వెళ్ళగానే

“వారు చేసి చూపిస్తారు. ముందు చెప్పటం ఇష్టం వుండదు’’ అని జేబులోంచి ఓ భూతద్దం తీసి వంగి, అడుగులో అడుగు వేసుకుంటూ చీమల వేటకై వెళ్ళిపోయాడు. ఆసామి తలపైకెత్తి చూశాడు. పైన జీవచ్చవాల్లా చీమచ్చవాల్లా తిరుగుతున్నారు. డైరెక్టరు కోసం చూస్తే ఫ్లోరు మధ్య బోర్లా పడుకుని వున్నాడు. చలనం లేడు. “ఏమిటి?’’ పతాక సన్నివేశం బాగా రావాలని దేవుడికి మొక్కుకుంటున్నాడా?’’ అడిగాడు ఆసామి. “కాదు భరిణలోని హీరో చీమకి యాక్షన్ నేర్పుతున్నారు’’ వివరించాడు ప్రొడక్షన్ మేనేజరు. వీటన్నింటికీ అతీతంగా సన్నగా, పొడుగ్గా బట్టతలతో వున్న వ్యక్తి అసింటా కుర్చీలో కూర్చుని, వేళ్ళు లెక్కపెట్టుకుంటూ శూన్యంలోకి చూస్తూ గొణుక్కుంటున్నాడు. కాస్త దగ్గరికి వెళ్ళి చేవిపెట్టి వింటే “చీమలు చీమలు చీమలు’’ అని అస్పష్టంగా వినపడుతోంది.

ప్రొడక్షన్ మేనేజర్ ని అడిగితే ఆయనే ప్రొడ్యూసర్ అని చెప్పాడు. తరువాత నాలుగైదు సిట్టింగులయినాక, కథ, స్క్రీన్ ప్లే సిద్ధమయింది. తర్వాత్తర్వాత హడావుడి పడకుండా ఏవేం కావాలో ముందరే చెప్తే కొనుగోళ్ళన్నీ చేసేద్దాం అన్న ఆసామితో ఏకీభవిస్తూ లిస్టు రాసిచ్చాడు. సినిమా తయారుచేయు విధానము – కావాల్సిన వస్తువులు : ఒక గేలము, ఓ పది వానపాములు, సెనగ పిండి, ఓ డబ్బా మంచి నూనె, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, కాస్త తినే సోడా, కొంచెం వాము పిండి. ఆసామి ఆశ్చర్యపోయాడు. సినిమా తీయడానికి కావాల్సిన వస్తువులివేనా? డైరెక్టరు నింపాదిగా అన్నాడు “మన సినిమా తీయడానికివే, నన్ను నమ్ముకున్న నా నిర్మాత నేను చెప్పిందానిమీద వొక్క రూపాయి ఖర్చు పెట్టినా నాకిష్టముండదు. సాధ్యమయినంత తక్కువ ఖర్చుతో పొదుపుగా తీయడమే నా పధ్ధతి’’

ఆసామికి డబ్బు పొదుపరితనం విషయంలో డైరెక్టరును చూస్తే ముచ్చటేసింది కానీ, మరీ బొత్తిగా శెనగపిండి, తినే సోడాతో ... “కనీసం దుస్తులయినా కొనక్కరలేదా?’’ అడిగాడు. “అవసరం లేదు. ఒకటో రెండో గోచీలు, ఓ నేత చీర చాలు’’ “మరి మేకప్?’’ “మన హీరో హీరోయిన్లు పక్క స్టూడియోలోంచి షూటింగయి వస్తారు గదా! వాళ్ళు వేసుకొచ్చిన మేకప్ తుడిచేస్తే చాలు’’ “మ్యూజిక్?’’ “సముద్ర కెరటాల ధ్వని, నూనె కాగే చురచుర చాలు’’ “సౌండు?’’ “ఫరవాలేదు’’ “మరి ఎడిటింగ్ అదీ?’’ “ఫరవాలేదు వుంది’’ ఆసామి తల గోక్కున్నాడు. “కనీసం ఫైల్మైనా కొనాలి గదా?’’ గంభీరంగా నవ్వాడు డైరెక్టరు “అది వుంటుందిలెండి ... వచ్చే వారమే షూటింగు మొదలు. ఈ పిక్చరుతో మిమ్మల్ని దేశాంతరం ... ఐ మీన్ అదే ... విదేశాలకి పంపకపోతే నా పేరు డైరెక్టర్ కాదు’’ అని శపథం చేశాడు.

తరువాత డైలాగు రైటర్ ని కాస్త వివరంగా కథ, స్క్రీన్ ప్లే మళ్ళీ చదవమని ఆదేశించి కళ్ళు మూసుకుని ఎకాగ్రతగా కూర్చున్నాడు. రైటరు స్క్రిప్టు ముందేసుకుని కాస్త బాధగా కణతలు నొక్కుకున్నాడు. “ఏమయింద’’న్నాడు బామ్మర్ది. “తలనొప్పిగానూ, కళ్ళు మంటలు గానూ వున్నై’’ చెప్పాడు రైటరు. “దీనికోకటే మందు’’ డైరెక్టరు కళ్ళు తెరచి అన్నాడు. ఏమిటని అడిగాడు బామ్మర్ది. “మందు’’ అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. వెంటనే మందు వచ్చింది. అంతా తలొక గుక్కా తాగాక, రైటర్ ఉత్సాహం పుంజుకుని చదవటం మొదలెట్టాడు. “హీరో బెస్తవాడు ... మొదటి షాటులో అనంతమైన సముద్రపుటంచుల్నిచూపిస్తాం. దూరంనుంచి వచ్చే ఓడ – మొదట జెండా, తరువాత తెరచాప పైభాగం, ఆ తర్వాత ఓడ మొత్తం కనబడే దాకా కెమెరా స్టిల్ గా వుంటుంది. అది భూమి గుండ్రంగా వుందని చెప్పటానికి సింబాలిజం. మొదటి షాట్ లోనే దర్శకుల వారి ప్రతిభ కనపడుతుంది. ఇక తరువాత షాటు ...

ఒడ్డున ఎత్తైన బండమీద కూర్చుని వుంటాడు హీరో. ఓ గోచీ, నల్ల టోపీ అంటే. సన్నటి పొడుగాటి గెలానికి వానపాములు గుచ్చి నీటిలోకి గేలం వేస్తుంటాడు. ఓ అరడజను చేపలు పడేదాకా నాచురల్ గా చూపించాలని నిర్ణయించుకున్నారు డైరెక్టరు గారు. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ పడదల్చుకోలేదు. తరువాత, పెట్టిన చేపలు తీసుకుని ఆనందంగా ఇంతకి వెళ్ళి భార్య చేతికిస్తాడు. చేపలు చూడగానే భార్య కళ్ళు మిలమిలా మెరుస్తాయి. ఇద్దరూ ఓ ఐదు నిముషాలు అలా చోస్తుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో గోడకి తగిలించిన గేలం, అంటే వాళ్ళిద్దరి జీవితాలూ గేలం వేసినట్టు ముడిపడ్డాయని సింబాలిజం. ఇక్కడ రెండే రెండు డైలాగులు.

భార్య అడుగుతుంది “ఇగురా ... ? పులుసా ...?’’ భర్త చెప్తాడు “ఉహు. ఈ రోజు బజ్జీలు’’ అంతే హీరోయిన్ కిలకిలా నవ్వుతుంది. అలా ఓ అయిదు నిమిషాలు నవ్వుతూనే వుంటుంది. మధ్యలో ఆసామి అడిగాడు “పెళ్ళాం పిచ్చిదేంటి?’’ “కాదు ఆ నవ్వు ఆమె ఆనందానికి, మానసికోల్లాసానికి, విశృంఖల ప్రశాంత జీవనానికి ప్రతీక’’ “సరే ఏదోలే కానీ, పిచ్చిది కాకపొతే చాలు’’ రైటరు మళ్ళీ ఓ గుతకేసి కంటిన్యూ చేశాడు. “ఈ నవ్వుకి సింబాలిక్ షాటు కొండలు ప్రతిధ్వనించటం, కొంగలు చెరువులోంచి ఒక్కసారిగా రెక్కలు టపటపా కొట్టుకుని లేవటం’’ “ఇదంతా ‘బజ్జీలు’ అన్నందుకేనా?’’ బామ్మర్ది గొణిగాడు ఆవులిస్తూ. డైలాగు రైటర్ వినిపించుకోలేదు. “ఇక్కడ ఇంటర్వెల్ ... తర్వాత సెకెండ్ హాఫ్ చాలా కేర్ ఫుల్ గా ఫాలో అవ్వండి. పిక్చర్ మొత్తానికి ఇదే ప్రాణం’’

“బాండిలో నూనె చిటపటమంటూంటుంది. హీరోయిన్ చేపల్ని నిలువునా కోసి, మసాలా కూరుతూంటుంది. కాస్త వాముపొడి, ఒక అర చెంచాడు తినే సోడా, తగినంత వుప్పు, కారమూ వేసి బెస్తవాని మరదలు – ఓ పదహారేళ్ళ అమ్మాయ్ శనగపిండి కలుపుతూ వుంటుంది. కలుపుతూ కొంచెం పిండి, వుప్పు సరిపోయిందో లేదోనని నాలికమీద వేసుకుంటుంది. అదే సమయంలో హీరో, పడక గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తుంటాడు. ఆ మసాలా వాసన అతనికి పిచ్చేక్కిస్తూంటుంది. మూడు షాట్లు చకచకా వోకదాని వెంట వొకటి మారిపోతాయి. పిండి కలపటం, మసాలా కూరటం, హీరో కాలుగాలిన పిల్లిలా తిరగటం, అలా కాస్సేపయ్యాక హీరో కిటికీలోంచి పిలుస్తాడు. హీరోయిన్ కాస్త బెట్టు చేసి, మసాలా కూరిన చేపలు చెల్లెలికిచ్చి గదిలో కెడుతుంది.

ఇక్కడ కెమెరామాన్ ప్రతిభ చూడాలి, హీరో హీరోయిన్ ల సెక్స్ యాక్ట్, వెనువెంటనే అక్కడ ఒక్కో చెప్పాను శనగపిండిలో ముంచి, సుయ్ సుయ్ మంటూ కాగుతున్న నూనెలో బజ్జీలు వండటం, మార్చి మార్చి చూపించాలి. ఒక్క పావుగంట అలా ప్రేక్షకులు స్తంభించిపోవాలి. సిబాలిజం, నియోరియలిజం, ఎట్సెట్రా ఎట్సెట్రా. అంతే ... అంతా అయిపోయాక ఆ అమ్మాయ్ స్టవ్ ని ఉఫ్ మని ఆర్పేస్తుంది. పిక్చరు చివరకు ఆరు బజ్జీలు తయారువుతై (క్లోజప్ లో) వాటిని మరదలు వద్దిస్తుంటే, హీరో తన భార్యతో కలిసి సంతృప్తిగా బజ్జీలని తింటాడు. తర్వాత మళ్ళీ ఉషోదయం చూపిస్తాం ... హీరో గేలం తీసుకుని బయల్దేరతాడు ... మళ్ళీ ఓడ, భూమి గుండ్రంగా వుంది అనే సందేశం ... సింబాలిజం ... రైటరు చెప్పడం ఆపాడు.

ఆసామి ఆవులించి పక్కకి చూశాడు. బామ్మర్ది నిద్దరోతున్నాడు. డైరెక్టరు వంక చూస్తే ఇందాక కళ్ళు మూసుకుని వినే వాడిలా ఏ పొజీషన్ లో వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు. ప్రొడక్షన్ మేనేజర్ డైరెక్టర్ని కదిపాడు. ఆయన సర్ధుకుని ఓ చిరునవ్వు నవ్వాడు. “పేరేం పెడదాం?’’ అడిగాడు ఆసామి. “పేరు ఆర్డనరీగా వుండకూడదు. మళయాళప్పేరులా అమ్భీరంగా వుండాలి’’ “మత్స్యనిగ్రహం’’ అని పెడితే?’’ అన్నాడు రైటర్. “అంటే?’’ అన్నట్టు చూశాడు డైరెక్టరు. “చేపలు పట్టి ఇంటికి పట్టుకొచ్చి, భార్య మసాలా కూరి వండటం మొదలెట్టే వరకు నిగ్రహంతో వ్యవహరించాడు గదా హీరో!’’ రైటరు చెప్పాడు. “నా బొంద. మన కథలో నిగ్రహం ఎక్కడ చూపించి చచ్చాడు? మొదటి వాయి కూడా వెయ్యకుండానే మొగుడి గదిలోకి పరిగేట్టిందని చెప్పావు గదయ్యా!’’ ఆసామి విసుక్కున్నాడు.

పోనీ కన్నడ టైటిల్లా పెడితే? అసలు కన్నడం-మలయాళం టైటిల్స్ లా గంభీరంగా వుంటేనే అవార్డు వస్తుంది. భూమి గుండ్రంగా వుందని సిబలైజ్ చేశాం కాబట్టి ‘మత్స్య గుండ్ర భూమి’ ఎలా వుంది?’’ అన్నాడు రైటరు. “ఆ ‘మత్స్య’అనేది తప్పనిసరిగా వుండాలా? అది తీసేస్తే శుభ్రంగా ‘గుండ్రభూమి’, లేక ‘భూమిగుండ్ర’ అని పెట్టొచ్చుగా మామిడి తాండ్రలాగా?’’ చిరాగ్గా అన్నాడు ఆసామి. “లేదు ... లేదు మత్స్య అనేది వుండాలి’’ చెప్పాడు డైరెక్టరు. “పోనీ ‘మత్స్య మాయ’ అని పెడితే?’’ అన్నాడు రైటరు. “నీ మచ్చమాయ కాస్త ఆలోచించుకుని టైం తీసుకుని చెప్పవయ్యా! అయినా ఇప్పటికే లేటయింది. ఇక పడుకుందాం. టైటిలుదేముంది? దొరక్కపోదు’’ అని ఆసామి అనే సరికి ఆ రోజుకి అంతా విశ్రాంతి తీసుకున్నారు.

*****

వారం రోజుల రికార్డ్ టైంలో పిక్చరు పూర్తి చేశాడు దర్శకుడు. బాగా ఆలోచించి, టైటిల్ ఈజీగా అర్థమయితే పస వుండదని, కాస్త క్రిటికల్ గా “భూమత్స్య గుండ్ర’’ అని పెట్టారు. ఈ టైటిలుతో ఓ తెలుగు పిక్చరు తయారయిందని న్యూసందగానే అవార్డు కమిటీలో మెంబర్లు అంతా ఆత్రంగా దాని గురించి చర్చించుకోసాగారు. సర్టిఫికేట్ సంపాయించడంలో పెద్దగా కష్టపడలేదుగానీ, కాస్త చికాకులే ఎదురయ్యాయి. సెన్సారువారు పిక్చర్లో విశృంఖలంగా చూపించిన సెక్స్ యాక్ట్ కి ఏమీ అభ్యంతరం పెట్టలేదుగానీ, కెమెరా బెడ్ రూమ్ కి, నూనె కాగుతున్న భాండీకీ మధ్య ఊగిసలాడుతున్నప్పుడు మరదలు పిల్ల బజ్జీలు వేస్తూంటే వచ్చే సుయ్ .. సుయ్ ... అనే చప్పుడు మాత్రం అశ్లీలంగానూ, ఉద్రేకాలను రెచ్చగోట్టేదిగానూ వుందని అభ్యంతర పెట్టారు. ఎలాగో సెన్సారువాళ్ళని బ్రతిమాలి వాళ్ళు పాయింటవుట్ చసిన పడి సుయ్ సుయ్ లలోనూ నాలుగు సుయ్ సుయ్ లు తగ్గించి, ఆ రకంగా కాస్త అశ్లీలతను తగ్గించినట్టు వాళ్ళ ఆమోదం పొంది, సర్టిఫికేటు సంపాదించారు.

ప్రివ్యూనాడు బామ్మర్ది, ఆసామి తమ కుటుంబంతో థియేటర్ దగ్గర టాక్సీలో దిగారు. ఆ రోజు పరిశ్రమలో ముఖ్యులేకాక నలుగురైదుగురు ఫారిన్ డిస్ట్రిబ్యూటర్లు కూడా వచ్చారు. ఆసామి కలలు పండే తరుణం వచ్చింది. షో జరుగుతునంతసేపూ యెవరినీ పట్టించుకోలేదు.ఆసామి. కేవలం ఆ ఫారినర్స్ నే గమనిస్తూ కూర్చున్నాడు. ఇంటర్వెల్ లో బావమరిది చేయించిన యేరేంజ్ మెంట్స్ ప్రకారం సినిమాలో చూసినట్టుగానే ఘుమఘుమలాడుతూ తయారీ చేయించిన బజ్జీలు సర్వ చేశారు. ఆసామి స్వయంగా ప్లేట్ లో పెట్టి ఫారినర్స్ కి అందించాడు. వాళ్ళలో వొకాయన ఆసామితో మాట్లాడుతూ బజ్జీ తుంచాడు. లోపల నిండు చేప బయటపడింది. అతను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు.

ఆసామి పక్కకు తీసికెళ్ళి ఓ మీడియేటర్ సహాయంతో వీటి పేరేమిటన్నాడు నోట్లో పెట్టుకుని తన్మయత్వంతో. “ఫిష్ బజ్జీ’’ అన్నాడు ఆసామి. బజ్జీల సీను మొదలయింది. పిక్చరంతా చూసి అందరూ నిర్మాతనీ, డైరెక్టరునీ అభినందించారు. ఉత్తమాభిరుచులుగల నిర్మాత అని ఆసామిని మెచ్చుకున్నారు. అందరూ వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాక ఆ ఫారినర్ ఆసామి దగ్గరకొచ్చి “ఐవాంటూ బై ది పిక్చర్ .. ఇటీజ్ వండర్ ఫుల్’’ అన్నాడు. ప్రక్కనే వున్న బామ్మర్ది ఎగిరి గంతేసి బావని వాటేసుకుని చెప్పాడు. ఆయనకి మన పిక్చర్ కావాలట అని. ఆసామి కళ్ళముందు టెక్నికల(ర్) మెరిసింది, అయినా సంతోషాన్ని బయటపడనీయక నేట్టిగా “ఎంతట?’’ అని అడిగాడు. “హౌ మచ్?’’ అని బామ్మర్ది పెద్దగా ఇంగ్లీషులో అడిగాడు

ఫారినర్ ని. “ఫైవ్ లాక్స్’’ అన్నాడు ఫారినర్. “అయిదు లక్షలా! లక్షకు మించి ఒక్కపైసా కూడా ఇవ్వను. కావాలంటే కొనుక్కోమను. లేకపోతే లేదు’’ అని ఆసామి ఖండితంగా అంటూంటే బామ్మర్ది అతని చెయ్యి పట్టుకుని లాక్కుపోయి “నీకేమన్నా పిచ్చా? జడ్డా? మనకి అయిదు లక్షలిచ్చి ఆయన కొనుక్కుంటానంటూంటే’’ అన్నాడు. కాస్సేపు నిలువు గుడ్లేసుకుని చూశాడు ఆసామి. తరువాత బామ్మర్దిని కావలించుకున్నాడు ఆనందంతో. “మరి మన దేశంలో రిలీజెపుడు బావా?’’ అడిగాడు ఆసామి. “భలేవాడివే! ముందు మనం విదేశాల కెళ్ళాలి. అక్కడ మన బొమ్మ దేశం దేశం తిరిగి శతదినోత్సవాలు చేసుకోవాలి. అవన్నీ చూశాక మన ప్రభుత్వం బంగారు పువ్వో, జంతువో అవార్డ్ ఇవ్వాలి. తరువాతెప్పుడో మనాళ్ళు చూసే భాగ్యం కలిగించాల, మనం తీసింది మంగినపూడిలోనైనా, మాంట్రియల్ యెళ్ళొస్తే గానీ బొమ్మకి యిలువ రాదు బావా!’’ అని హితబోధ చేశాడు బామ్మర్ది.

బామ్మర్ది, బావ, డైరెక్టర్, ఫారినరూ నలుగుతూ బయల్దేరారు. ఫారిన్లో సేన్సారువారు ఈ చిత్రం చూసి ప్రోస్యూసర్ అభిరుచి గమనించి, అంత లెంగ్తీ పిక్చరు వుండకూడదని – సముద్రపు షాటు, చేపలు పట్టడం మరియు సెక్స్ సీను కట్ చేసి జాగ్రత్తగా ఎడిట్ చేసి, మసాలా కూరి బజ్జీలు వండడం దగ్గర్నుంచీ హీరో హీరోయిన్లు భోంచెయ్యడం వరకూ చూపించారు. దానికి టైటిల్ “ది బజ్జీ’’ అని పెట్టారు. ఆ చిత్రం విదేశాలలో గొప్ప సంచలనం సృష్టించింది. పూర్తి నిండు చెప్పాను సూది మొనంత బెజ్జం కూడా లేని షెల్ తో సహా మసాలా కూరి ఎలా వందారో ఈ ఇండియన్లు అన్నదానికి ప్రాధాన్యం ఇవ్వబడింది. పబ్లిసిటీ కోసం థియేటర్ ఆవరణలో ఆసామి, బామ్మర్ది బండీ, పొయ్యి పెట్టుకుని హాట్ హాట్ గా ఫిష్ బజ్జీ వేసి సేల్ చేసేవారు. అలా ఏ పట్టణంలో ప్రదర్శించినా మీరు బజ్జీలు వేస్తానంటేనే మా థియేటర్లో ఆడిస్తాం’’ అని షరతు పెట్ట్టేవారు థియేటర్ యజమానులు.

వెంటనే మసాలా దినుసులు, భాండీ తయారు. ఇలా బజ్జీల ద్వారా కూడా బోలెడు డబ్బు సంపాయించి, తిరుగు ప్రయాణంలో జ్ఞాపకార్థం రెండు గరిటెలు పట్టుకుని బంధుమిత్రుల హర్షధ్వానాల మధ్య విమానంనుంచి దిగారు ఆసామి, బామ్మర్ది. అఖండ స్వాగతం లభించింది. ఆ రోజే ప్రభుత్వం ఈ పిక్చరుకి అవార్డు ప్రకటించింది.

ఆ త