TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
ఆ చీకట్లో ....... గజదొంగ మంగులు చాలా ఆయాసపడుతూ పరిగెత్తుతున్నాడు....
అప్పటికే చాలా సేపటి నుండీ చాలా దూరం పరిగెత్తడం వల్ల అతనింక పరిగెత్తలేకపోతున్నాడు. పైగా భుజం మీద పాప బరువు!....
గజదొంగ మంగులుకి తన వెనకాల దూరంగా పరిగెత్తుకు వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది.
వెనక్కి తిరిగి చూశాడు! ఇద్దరు వ్యక్తులు పోలీసు యూనిఫారంలో తమవైపే పరిగెత్తుకు రావడం మంగులుకి కనిపించింది. వాళ్ళెవరో కాదు. హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, కానిస్టేబుల్ చిన్నారావ్. మంగులు పరుగు స్పీడ్ పెంచాలని ప్రయత్నించాడు. అతని వల్ల కాలేదు....
అతను పూర్తిగా అలిసిపోయాడు. మంగులు మోటార్ బైక్ మీద వచ్చాడు గానీ ఆఖరు నిముషాన గూర్ఖా తనని చూడటం... దొంగ దొంగ అని అరవడం... తను కంగారుగా వేరే డైరెక్షన్ లో పరుగు తియ్యడం... అలా మోటార్ బైక్ మిస్ అయి దెబ్బ తిన్నాడు. లేకపోతే ఈ పాటికి దీపతో సహా తన డెన్ లో వుండి వుండేవాడు.
తమకి అతి సమీపంలోనే భుజాన గోనెసంచీతో పరుగు పెడ్తున్న మనిషి కనిపించేసరికి రాంబాబు, చిన్నారావ్ లకు ఉత్సాహం వచ్చింది. వాళ్ళు పరుగులో మరింత వేగం పెంచారు. రాంబాబు, చిన్నారావ్ లు మెల్లమెల్లగా..... ఒక్కొక్క అడుగే అతన్ని సమీపించసాగారు. తాము వెంబడిస్తున్నది ఒక జేబుదొంగని అనే అభిప్రాయంలోనే వాళ్ళున్నారు గానీ అతనో భయంకరమైన గజదొంగ అని వాళ్ళకి తెలీదు.
మంగులుకి అర్ధమైపోయింది... తను వాళ్ళకి దొరికిపోబోతున్నాడని. ఆ ఆలోచన అతనికి వచ్చి రెండు క్షణాలైనా కాలేదు ఒక్క ఉదుటున రాంబాబు, చిన్నారావ్ లు మంగులు మీద పడి చెరో జబ్బా పట్టుకున్నారు.
మంగులు బలంగా యిద్దర్నీ విదిలించి కొట్టాడు. రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ అరుగజాల దూరంలో ఎగిరి పడ్డారు వెల్లకితలా. మంగులు క్షణం ఆలస్యం చెయ్యకుండా తన భుజం మీద గోనె సంచి మూటని నేలమీద పెట్టి తన షర్టు లోపల బనీనుకి ఉన్న జేబులోంచి రివాల్వర్ తీసి ఢామ్... ఢామ్ అని కాల్చాడు.
ఒక తూటా రాంబాబు తొడలోంచి దూసుకుపోయింది. మరో తూటా చిన్నారావ్ జబ్బలోంచి దూసుకుపోయింది. ఇద్దరూ బాధగా ఆర్త నాదాలు చేశారు. గజదొంగ మంగులు మళ్ళీ రివాల్వర్ శబ్ధం విని అక్కడ దగ్గర్లోనే మంగులు కోసం వేటాడుతున్న పోలీసులు పేల్చిన తుపాకుల శబ్దాలు అవి. కీడు శంకించిన మంగులు తన రివాల్వర్ ని జేబులోకి తోసేసి నేలమీది మూటని ఎత్తి భుజాన వేస్కుని రెండడుగులు వేశాడో లేదో పోలీసు జీపులు, ఒక మోటారు సైకిల్ అతన్ని చుట్టుముట్టాయ్.
గజదొంగ మంగులు క్షణం ఆలస్యం చెయ్యలేదు. ఇప్పుడు ఆ మూటతో తను తప్పించుకోలేడు. గభాలున మూటని నేలమీద పడేసి తనకి రెండు గజాల దూరంలో మోటార్ బైక్ ఎక్కి రాకెట్ వేగంలో చీకటిలో కలిసిపోయాడు.
ఊహించని ఈ పరిణామానికి పోలీసులంతా అవాక్కయిపోయారు. ఇంతకీ గజదొంగ మంగులు చేతిలో మొహం మీద పిడి గుద్దులు తిన్నది ఎవరో కాదు ఇన్స్ పెక్టర్ అప్పారావ్!
“అలా దిష్టిబొమ్మలా చూస్తారేం....? ఫైర్!!...” అంటూ అరిచాడు పోలీస్ కమీషనర్ లింగారావ్ జీపులోంచి దిగుతూ. పోలీసులు చీకట్లో తుపాకులు పేల్చారుగానీ అప్పటికే మంగులు తుపాకీ గుండుకి అందనంత దూరానికి వెళ్ళిపోయాడు. కమీషనర్ లింగారావ్ గబగబా గోనెసంచి మూటని సమీపించాడు. ఇద్దరూ కానిస్టేబుల్స్ గోనెసంచి మూటని విప్పారు. అందులోంచి దీపని బయటికి తీశారు.
దీపలో స్పృహలేదు. “అమ్మా దీపా...” భోరుమన్నాడు లింగారావ్.
“సార్... దీపగార్కి ఏం కాలేదు సార్. ఊపిరి ఆడుతూనే వుంది!” అన్నాడో కానిస్టేబుల్ సంతోషంగా.
మరో కానిస్టేబుల్ జీపులోంచి వాటర్ బాటిల్ తెచ్చి దీప మొహం మీద నీళ్ళు చల్లాడు.
దీప మెల్లిగా కళ్ళు తెరచి లింగారావ్ మొహంలోకి చూసి “డాడీ...” అంది నీర్సంగా.
“అమ్మా దీపా...” అంటూ దీపని ఆనందంగా కౌగిలించుకున్నాడు కమీషనర్ లింగారావ్,
జేబులోంచి సెల్ ఫోన్ తీసి యింటి నెంబర్ ప్రెస్ చేసి “హలో” అన్నాడు.
“హలో!” అంది అవతలి నుండి శ్రీలక్ష్మి.
“ఇదిగో... నువ్వు నా కాలూ, చెయ్యీ ఇచ్చేస్తానని మొక్కకపోతే నీకో శుభవార్త చెప్తా... ఆ దీపని మంగులు బారినుండి రక్షించాం” అన్నాడు లింగారావ్.
అవతల నుండి శ్రీలక్ష్మి ఇంకేదో అనబోతుండగా “వివరాలన్నీ యింటికొచ్చి చెప్తాగా!” అని సెల్ ఆఫ్ చేశాడు.
అప్పుడు అతని కంటికి గాయపడిన రాంబాబు, చిన్నారావ్ లు కనిపించారు. వాళ్ళిద్దరూ అప్పుడే నేల మీంచి లేచి బాధతో మూలుగుతున్నారు.
కమీషనర్ లింగారావ్ ఇద్దర్నీ గాఢంగా కౌగిలించుకున్నాడు. “మీ ఇద్దరూ చాలా ధైర్యవంతులు........ గజదొంగ మంగులు లాంటి వాడిని ఢీ కొనడం అంటే సామాన్యం కాదు... మా పాపని కాపాడినందుకు మీకు జీవితాంతం ఋణపడి ఉంటా......” అన్నాడు కమీషనర్.
తాము ఎదుర్కొన్నది గజదొంగ మంగులుని అని తెల్సుకున్న ఇద్దరూ భయంతో కెవ్వుమని అరిచారు.
ఆ అరుపుకి కమీషనర్ ఉలిక్కి పడ్డాడు. “అదేం?..... అంత గట్టిగా అరిచారు??” అడిగాడు కమీషనర్.
“బుల్లెట్ గాయలయ్యాయ్ కద్సార్.... అందుకే బాధతో అలా అరిచాం... అంతే” అన్నాడు రాంబాబు.
“వీళ్ళిద్దర్నీ వెంటనే నర్సింగ్ హోంకి తీస్కేళ్ళండి!” అంటూ పోలీసులకి ఆదేశాలిచ్చాడు కమీషనర్.
|
|