అందరూ దొంగలే - 70

Listen Audio File :

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని చూడగానే గజదొంగ మంగులు భోరున ఏడ్చాడు. “చూశావా నా గతి.. ఎప్పుడూ మూడు దొంగతనాలూ, ఆరు దోపిడీలతో హాయిగా గడిపేవాడిని. ఇప్పుడు ఇలా దీనిని గుర్రం ఆట ఆడిస్తూ, అయ్యాలాట ఆడిస్తూ కాలక్షేపం చేస్తున్నాను...” అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ

 ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని చూసిన దీప గజదొంగ మంగులు వీపుమీది నుండి చెంగున కిందకి దూకింది. “కుక్కంకుల్.... కుక్కంకుల్... ఇప్పుడు నన్ను ఉయ్యలాట ఆడించవా?” అంటూ అప్పారావ్ దగ్గరికి వచ్చింది. అప్పారావ్ ఉలిక్కిపడ్డాడు.

“కుక్కంకులా...? అయితే నా విషయం నీక్కూడా తెలిసిందా?” అంటూ ఘొల్లుమన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“అతని మోకాళ్ళ దగ్గర పట్టి ఊపుతూ ‘నన్ను ఉయ్యాలాట ఆడించు అంకుల్” అంది దీప.

“దీన్ని ఓ అయిదు నిమిషాలు ఉయ్యాలాట ఆడించిన తర్వాత మనం మాట్లాడుకుందాం.. లేకపోతే మనల్ని స్థిమితంగా మాట్లాడుకోనివ్వదు!” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మంగులుతో.

“వద్దు. అసలే బక్కపీనుగవి! చస్తావ్?! ఉయ్యాలాటంటే ఏంటానుకున్నావు?” అన్నాడు మంగులు.

“ఏంటి?” అమాయకంగా చూస్తూ అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“నీ పీకకి తాడుకటి ఊగుతుంది.... అది ఉయ్యాలాట అంటే....”

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ భయం భయంగా దీప వంక చూశాడు. “వద్దమ్మా. ఇప్పుడు ఉయ్యాలాట వద్దు. తర్వాత ఆడుకుందాం.... ఏం...” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“ఊ.... ఊ... ఇప్పుడే ఆడుకుందాం!” అంటూ మారాం చేసింది దీప. సడెన్ గా ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి తను ఇక్కడికొస్తూ దీప కోసం తెచ్చిన చాక్లెట్ల విషయం గుర్తుకువచ్చింది. జేబులోంచి నాలుగు చాక్లెట్లు తీసి దీపకి ఇచ్చి “ఇవి తింటుండు. నేనూ ఈ అంకుల్ మాట్లాడుకుంటాం” అన్నాడు అప్పారావ్.

“కుక్కంకుల్! నువ్వూ ఈ పిచ్చంకుల్ మాట్లాడుకున్నాక నన్ను మా ఇంటికి తీస్కెళ్ళు..... ఏం?” అంది దీప.

“ఓ... అలాగే” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ దీప తనని కుక్కంకుల్ అన్నందుకు నెత్తి కొట్టుకుంటూ. దీప ఓ మూల బుద్దిగా కూర్చుని చాక్లెట్స్ రేపర్లు విప్పసాగింది.

“ఒరేయ్ సన్నాసుల్లారా! మేం కాస్త పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరంతా ఇక్కడనుండి వెళ్ళిపోండి” అక్కడున్న రౌడీలతో అన్నాడు గజదొంగ మంగులు. రౌడీలంతా వెళ్ళిపోతుంటే.... మళ్ళీ నేను పిలిచేదాకా రాకండి. లేకపోతే తొక్క తీస్తా...” అన్నాడు.

“అలాగే బాస్!” అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు.

“ఈ దీప విషయం ఎన్నాళ్ళిలా తేల్చకుండా వుంటావ్! త్వరగా తేల్చు” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“ఏం? లేకపోతే మీ కమీషనర్ లింగారావ్ నామీద ఎటాక్ చేస్తాడా?!” అడిగాడు మంగులు.

“ఎటాక్ చెయ్యడానికి నీ డెన్ అడ్రస్ మా పోలీస్ డిపార్ట్ మెంట్ లో నాకు తప్ప ఇంకెవరికి తెలీదుగా! నువ్వూ దీప విషయం త్వరగా తేల్చకపోతే ఆ కమీషనర్ గాడు నా ఉద్యోగం వూడబీకేలా వున్నాడు... పది లక్షలు కాకపొతే ఎనిమిది... లేకపోతే ఆరు.. ఎంతకో అంతకు బేరం సెటిల్ చేస్కో” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“ఇన్నాళ్ళు ఇది నన్ను చాలా హింస పెట్టింది. ఆ కమీషనర్ నాకు డబ్బులిచ్చినా దీన్ని చంపుతా!” అన్నాడు గజదొంగ మంగులు పళ్ళు నూరుతూ.

“ఆ పాపని చంపడం సంగతి తర్వాత... ముందు నీ సంగతి చూస్కో” ఖంగుమనివినిపించిందో కంఠం.

ఉలిక్కిపడన ఇన్స్ పెక్టర్ అప్పారావ్, గజదొంగ మంగులు తలలు త్రిప్పు చూశారు. గుమ్మంలో రాకా, రాంబాబు, చిన్నారావ్ లు కన్పించారు.

వాళ్ళకి, వాళ్ళని చూడగానే గజదొంగ మంగులు పకపకా నవ్వాడు. అలా నవ్వడంతో పోలిమారి దగ్గోచ్చేసింది. మంగులు ఖల్ ఖల్ మని దగ్గుతుంటే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ప్రక్కనే వున్న వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు. మంగులు బాటిల్ ఎత్తి నీళ్ళు తాగుతుండగా దీప, రాంబాబు, చిన్నారావు ల దగ్గరికి “అంకుల్!” అంటూ పరుగున వెళ్ళింది.

రాంబాబు దీపని పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. నీళ్ళబాటిల్ ప్రక్కనే పెట్టి గజదొంగ మంగులు మళ్ళీ భయంకరంగా నవ్వాలని ప్రయత్నించబోతే... “వద్దు మంగులూ! నువ్వు మళ్ళీ నవ్వాలని చూస్తే మళ్ళీ దగ్గొస్తుంది. నువ్వు ఏం చెప్పదలచుకున్నావో నవ్వకుండా చెప్పు” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. మంగులు నాలుక కర్చుకుని

“నువ్వు చెప్పింది నిజమే” అని వాళ్ళ ముగ్గురివైపు తిరిగాడు.

“రాకా... పోలీసులు అరెస్టు చేసి నిన్ను జైల్లో పట్టడం వల్ల నా నుండి ప్రాణాలతో తప్పించుకున్నావు. ఇప్పుడు నీకు మూడింది. అందుకే నీ అంతట నువ్వే ఇక్కడికొచ్చావ్. ఒరేయ్ రాంబాబూ, చిన్నారావ్.... మిమ్మల్ని కూడా చంపాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. మీరే నా దగ్గరికొచ్చి నా పని చాలా సులువు చేశారు” అన్నాడు గజదొంగ మంగులు.