TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
రాంబాబు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వంక సీరియస్ గ చూశాడు. “ఒరేయ్ కుక్క కిడ్నీలోడా! నువ్వూ మంగులు మనిషన్నమాట! నీలాంటి వాళ్ళు మన డిపార్ట్ మెంట్ కే చీడపురుగులు... వుండు... నీపని కమీషనర్ గారితో చెప్తా!” అన్నాడు.
“కమీషనర్ తో చెప్పడానికి మీరు మళ్ళీ వెనక్కి వెళితే కదా...?” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“ఇంక మీ ఇష్టదైవాన్ని తల్చుకోండి?” అన్నాడు మంగులు రివాల్వర్ కోసం జేబులో చెయ్యి పెడుతూ.
మంగులు మొహంలో అయోమయం...! కుడిజేబూ ఎడమ జేబూ రెండూ వెతికాడు. రివల్వార్ లేదు! “నా రివాల్వర్ ఎక్కడా?” ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని అడిగాడు.
“ఇది మరీబాగుంది. నన్నడిగితే నేనేం చెప్పను?” అన్నాడు అప్పారావ్.
“నీ రివాల్వర్ నేను తీశాను పిచ్చంకుల్” అంది దీప.
“నువ్వూ తీశావా? ఎక్కడ పెట్టావ్?” అడిగాడు మంగులు.
“నేను చెప్పనుగా... ఎక్కడో దాచేశాను!”
“ఆ!... “ బాధగా అరుస్తూ జుట్టు పీక్కున్నాడు మంగులు.
“నీ సర్వీస్ రివాల్వర్ ఇలా ఇవ్వు... వీళ్ళందర్నీ ఖతం చేస్తా” అని ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని అడిగాడు. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఓ వెర్రినవ్వు నవ్వాడు.
“నా దగ్గర రివాల్వర్ లేదుగా...!” అన్నాడు.
“ఏంటీ?... ఇన్స్ పెక్టర్ వి, నీ దగ్గర రివాల్వర్ లేదా?!” ఆశ్చర్యంగా అడిగాడు మంగులు.
“ఉందిగానీ, దగ్గరుంటే ఎప్పుడైనా పొరబాట్న పేల్తే చాలా డేంజరని స్టేషన్ లోనే వదిలోచ్చా!” సిగ్గుపడ్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. రాకా, రాంబాబు, చిన్నారావ్ లు ఘొల్లుమని నవ్వారు. గజదొంగ మంగులు మళ్ళీ బాధగా జుట్టు పీక్కున్నాడు. రాంబాబు, చిన్నారావ్, రాకాలు ఊహించని విధంగా ఒక్కసారిగా మంగులు, అప్పారావ్ ల మీదపడి చితక తన్నేశారు.
అసలు వాళ్ళిద్దర్నీ తన్నడానికి రాకా ఒక్కడు చాలు. మంగులు, అప్పారావ్ లు రాకా తన్నిన తన్నులకి నేలమీద వెల్లకితలా, నిస్సత్తువగా పడిపోయారు. తర్వాత వాళ్ళు ముగ్గురూ దీపని తీసుకుని డెన్ బయటకి పరుగు తీశారు. దాదాపు ఓ గంట తర్వాత రౌడీలంతా డెన్ లోకి వచ్చి నేలమీద మూలుగుతూ పడివున్న మంగులు, అప్పారావ్ లని చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు గబగబా ఇద్దర్నీ లేవనెత్తి కూర్చోబెట్టారు.
“ఏమైంది బాస్?” అని ఒకడు అడిగాడు.
“ఏమైందా....? ఆ రాకా, రాంబాబు, చిన్నారావ్ లు వచ్చి మమ్మల్ని వీర ఉతుకుడు ఉతికి ఆ దీపని తీస్కెళ్ళి పోయారు. ఇంతసేపూ మీరంతా ఎక్కడ చచ్చార్రా!” చికాకు పడుతూ అన్నాడు మంగులు.
"మీరేకదా బాసు మమ్మల్ని బయటికెళ్ళిపొమ్మన్నారు... మేము వెనకవైపు వెళ్ళి బారాకట్టా... పులీమేకా ఆడుకున్నాం.” చెప్పాడు ఇంకో రౌడీ.
“లోపల ఇంత గొడవ జరుగుతుంటే మీకు తెలీలేదా?...” మండిపడ్డాడు మంగులు.
లోపలి నుండి గుభీ గుభీమని సౌండ్స్ రావడం విన్నాం! కానీ అదేంటో మాకు అర్ధంకాలేదు.... పోనీ లోపలికొచ్చి చూద్దామంటే పిలిచే దాకా రావొద్దని మీరు చెప్పారు కదా బాస్.... అందుకే తాలేదు” అన్నాడు ఇంకో రౌడీ.
“మరి ఇప్పుడు కూడా పిలవలేదుగా... ఇప్పుడెందుకు వచ్చార్రా వెధవల్లారా!” అరిచాడు మంగులు.
“బయట మేం ఆడ్తున్న గేమ్స్ అయిపోయాయీ బాస్..... అందుకే వచ్చాం.” ఆ మాట వినగానే గజదొంగ మంగులు ఘొల్లుమని ఏడ్చాడు. ఓ రెండు గంటలపాటు రౌడీలతో సేవలు చేయించుకుని కాస్త తేరుకున్నాక అప్పుడు మండుతున్న కొవ్వొత్తిని ఆర్పి రాకాని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు గజదొంగ మంగులు.
|
|