TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
హాల్లోకి కాఫీ తీస్కొచ్చిన శ్రీలక్ష్మి నేలమీద బోర్లాపడుకుని వున్న భర్త లింగారావ్ ని చూసి ఆశ్చర్యపోయింది. “అదేంటి?” పొర్లుదండాలు ఎవరైనా ఇక్కడ పెడ్తారా? పదండి గుడికెళ్దాం” అంది.
కమీషనర్ లింగారావ్ ఏడుపుమొహం పెట్టు నేలమీంచి లేచి సోఫాలో కూర్చున్నాడు. “ఓసి నీయమ్మా కడుపు మాడా.... నీకెప్పుడు చూసినా పొర్లు దండాలూ, వ్రతాలూ, పూజలూ, మొక్కులూ ఈ గొడవలేనా?”
“మరి నేలమీద బోర్లా ఎందుకు పడుకున్నారు?” ఆశ్చర్యంగా అడిగింది శ్రీలక్ష్మి.
“పడుకోడం ఏంటా తింగరిదానా? ఎగిరి నేలమీద పడ్డా!” విసుక్కుంటూ అన్నాడు కమీషనర్ లింగారావ్.
“ఏం? ఆ గజదొంగ మంగులుగాడు మళ్లీ ఫోన్ చేశాడా....?” అడిగింది శ్రీలక్ష్మి.
“ముందా వేడివేడి కాఫీ ఇటు తగలెయ్. నా బుర్ర హీటేక్కింది. అది తాగాక నీ ప్రశ్నలకి సమాధానం చెప్తా!” అని శ్రీలక్ష్మి చేతిలోని కాఫీ కప్పు లాక్కుని గబగబా కాఫీని చప్పరించేశాడు కమీషనర్ లింగారావ్.
“ఇప్పుడు చెప్పండి....” అంది శ్రీలక్ష్మి అతని ప్రక్కన కూర్చుంటూ.
“ఇదిగో ... న్యూస్ పేపర్ లో ఈ దరిద్రంగొట్టు వార్త చదివి ఉలిక్కిపడి, అలా ఎగిరిపడ్డా నేలమీద..” అన్నాడు న్యూస్ పేపర్ శ్రీలక్ష్మి చేతికిస్తూ.
“ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇదంతా నేనెక్కడ చదవగలను? మీరే చెప్పండి ఆ దిక్కుమాలిన వార్తేంటో?” అంది శ్రీలక్ష్మి కంగారుగా.
“రాంబాబు, చిన్నరావులు జైలునుండి తప్పించుకునిపోయారు..... పేపర్లో హెడ్లైన్స్ లో వేశారు. అసలు వాళ్ళిద్దర్నీ విగరస్ గా ఇంటారా గేట్ చేసి దీప జాడ ఎలాగైనా కనిపెడ్డాం అనుకున్నాను....” అన్నాడు బాధగా.
“అమ్మో! ఇప్పుడెలా...? మనం జైల్లో వేయించాం అనే కక్షతో ఇప్పుడు దీపకేం అపకారం తలపెట్టరుకదా?”
“అబ్బా! నాకురాని బ్రిలియంట్ ఆలోచనలు కూడా నీకు వచ్చేస్తుంటే నాకు యమ టెన్షన్ గా వుంది” నెత్తిమీద మొట్టుకుంటూ అన్నాడు కమీషనర్ లింగారావ్.
“స్వామి వెంకటేశ్వరా! మా దీప క్షేమంగా ఇంటికి వస్తే, నీకు ఆయన రెండు కళ్ళు సమర్పించుకుంటా స్వామీ!” భక్తిగా మొక్కుకుంది శ్రీలక్ష్మి.
అది విన్న వెంటనే కమీషనర్ లింగారావ్ ఇమేజినేషన్ లోకి వెళ్ళిపోయాడు, తను గుడ్డి బిచ్చగాడిలా బస్ స్టాండులో అడుక్కుంటున్నట్టు! “అబ్బా! నువ్వు కాసేపు నోరు మూస్కుంటావా, నా బుర్రకాయ్ పాడయిపోతుంది!!” అన్నాడు కమీషనర్ లింగారావ్ విసుక్కుంటూ.
“ఏంటీ.. చాలా ఎక్కువగా విసుక్కుంటున్నారు? మర్యాదగా వుండండి. లేకపోతే మీ తల స్వామివారికి సమర్పించుకుంటానని మొక్కుకోవాల్సి వస్తుంది!” అంది శ్రీలక్ష్మి చికాకుగా చూస్తూ.
ఆ మాటకి లింగారావ్ కి పిచ్చెక్కిపోయి నెత్తిమీద ఠపఠపా మొట్టుకుని శ్రీలక్ష్మికి దణ్ణం పెట్టి “నిన్నిక ఏమీ అనను... ఓక్కే?” అని ఫోన్ తీసి ఓ నెంబర్ డయల్ చేశాడు. “హలో...” అన్నాడు అవతలినుండి ఇన్స్పెక్టర్ అప్పారావ్.
“చూడు అప్పారావ్! నువ్వు నాలుగు రోజుల్లోగా దేప జాడ ఎలాగయినా కనిపెట్టాలి. జైలునుండి తప్పించుకున్న ఆ రాంబాబూ, చిన్నారావ్ లను కూడా పట్టుకోవాలి. లేకపోతే నిన్ను నేనే రివాల్వర్ తో కాల్చిపారేసి, నువ్వు నక్సల్స్ ఎన్కౌంటర్ లో మరణించావని న్యూస్ పేపర్ స్టేట్ మెంటిస్తా..” అరుస్తూ అన్నాడు కమీషనర్ లింగారావ్.
“ఏంటీ? రాంబాబు, చిన్నారావ్ లు జైలునుండి తప్పించుకున్నారా? ఎప్పుడు సార్?” ఆశ్చర్యంగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“ఎప్పుడు, ఎలా తప్పించుకున్నారో ఈ వేళ న్యూస్ పేపర్లో వేశాడు. చదివి తగలడు!” సీరియస్ గా రిసీవర్ క్రేడిల్ చేశాడు కమీషనర్ లింగారావ్.
గజదొంగ మంగులు డెన్....
హాల్లో అందరు రౌడీలముందు మంగులు దీపని గుర్రం ఆట ఆడిస్తున్నాడు. దీప అతని నడ్డిమీదకూర్చుని “ఛల్ ఛల్ గుర్రం.. చలాకిగుర్రం” అంటూ బెల్టుతో అతన్ని బాదుతుంది.
దీప బెల్టుతో కొట్టినప్పుడల్లా బాధతో “అమ్మా.... అబ్బా....” అంటున్నాడు గజదొంగ మంగులు.
చిన్న పిల్లల్ని గుర్రం ఆట ఆడించడం ఎంత బాధాకరమైన విషయమో అనుకున్నారు. అక్కడున్న రౌదీలందరూ తమ బాస్ వంక జాలిగా చూస్తూ. ఆ సమయంలో డెన్ లోకి ఎంతర్ అయ్యాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
|
|