అందరూ దొంగలే - 59

Listen Audio File :

గబగబా ఒ నెంబర్ డయల్ చేశాడు. 

“హలో! ...’’ అన్నాడు కమీషనర్ లింగారావ్ అవతలి నుండి. కమీషనర్ గొంతు వినగానే భోరుమని ఏడవడం మొదలుపెట్టాడు గజదొంగ మంగులు.

“ఎవరు? ఎవరయ్యా బాబూ ఏడుస్తున్నది?’’ కంగారుగా అడిగాడు లింగారావ్.

“నేను కమీషనర్ ... గజదొంగ మంగుల్ని! ...’’ అన్నాడు ఏడుపుగొంతుతో. అయితే ... ఆ మాట వినగానే అవతలినుండి కమీషనర్ లింగారావ్ వెక్కి వెక్కి ఏడవడం వినిపించింది గజదొంగ మంగులుకి.

కమీషనర్ ఏడవడం విన్న మంగులు బిత్తరపోయాడు.

“నువ్వెందుకయ్యా బాబూ ఏడుస్తున్నావ్?’’ ఆశ్చర్యంగా అడిగాడు మంగులు.

“నువ్వేడుస్తున్నావ్ గా?’’ అడిగాడు కమీషనర్.

“ఏడిస్తే ? ...’’ అడిగాడు మంగులు.

“దీపకి ఏమైనా అయ్యిందేమోననీ ...’’ నసిగాడు కమీషనర్ లింగారావ్.

“దీపకి ఏమౌతుంది బాబూ? ఏమైనా అయితే నాకే అవుతుంది ...’’ ఏడుస్తూ అన్నాడు గజదొంగ మంగులు.

“మా దీప ఎలా వుంది?’’

“దానికేం ... లడ్డు ముక్కలా వుంది. నేనే ....’’ బాధగా అన్నాడు మంగులు.

“నాకిప్పుడు ఎందుకు ఫోన్ చేశావ్?’’ అడిగాడు లింగారావ్. “ఏం లేదు ... నిన్ను పదిలక్షలు అడిగాను కదా ...’’

“ఏం ,,, నీ రేటు ఇంకా పెంచుతున్నావా?” భయంగా అడిగాడు కమీషనర్ లింగారావ్.

“కాదయ్యా బాబూ! ఒక లక్ష తగ్గిస్తానుగానీ .... ఆ తొమ్మిది లక్షలు ఎరేంజ్ చేస్కుని, దీపాని త్వరగా విడిపించుకు వెళ్ళవయ్యా బాబూ ...’’ భోరుమని ఏడ్చాడు గజదొంగ మంగులు.

*****

పోలీస్ కమీషనర్ ఆఫీస్ ... కమీషనర్ లింగారావ్ తన క్యాబిన్ లో కూర్చుని ఫైళ్ళు చూస్తున్నాడు. అప్పుడే లోపలికి వచ్చి సెల్యూట్ చేశాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“పిలిచారా సార్?’’ అడిగాడు అప్పారావ్.

కమీషనర్ లింగారావ్ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని చూస్తూనే ఇంతెత్తున లేచాడు. పావుగంట సేపు నాన్ స్టాప్ గా తిట్టాడు. తర్వాత తిట్టడం ఆపి ఆయసపడ్తూనే కూర్చున్నాడు.

“తిట్టడం అయిపొయింది కద్సార్? ఇప్పుడు చెప్పండి సార్ ... ఎందుకు తిట్టారో?!’’ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారాట్.

కమీషనర్ లింగారావ్ అప్పారావ్ వంక ఆశ్చర్యంగా చూశాడు. “నేనింత సేపటినుండీ గొంతు చించుకుని తిట్టాను. కానీ నీకు నేను ఎందుకు తిట్టానో కూడా అర్థంకాలేదా?’’ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అడ్డంగా తల ఊపాడు.

లింగారావ్ రెండు చేతుల్తో తల పట్టుకుని “అబ్బ ...!’’ అన్నాడు బాధగా.

“సార్! మీరు బాధపడకుండా అసలు నన్నెందుకు తిట్టారో చెప్పండి సార్!’’ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బ్రతిమిలాడ్తూ.

“అసలు మా దీప సంగతి ఏం చేశావయ్యా .... వారం అయినా కూడా మీరు దీప ఆచూకీ కనిపెట్టలేకపోయారు’’ అన్నాడు కమీషనర్ లింగారావ్ సీరియస్ గా.

“గజదొంగ మంగుల్ని డీల్ చెయ్యడం నా ఒక్కడివల్ల అవుతుందా సార్ ... మీరు మొత్తం పోలీసు బలగాల్ని రంగంలోకి దింపి, నాలుగువైపులా గాలించాలి సార్ .... అప్పుడు ప్రయోజనం వుంటుంది సార్!’’

“మనం వాడికోసం అంత తీవ్రంగా గాలిస్తున్నట్టు వాడికి తెలిస్తే అక్కడ వాడు దీపాని వెంటనే చంపేస్తాడు. మెల్లగానే వాడి ఆచూకీ కనిపెట్టాలి. ఆ విషయం వాడు పసిగాత్తకూడదు. ఎలా చేస్తావో, ఏం చేస్తావో చెయ్యి ....!’’ అన్నాడు కమీషనర్ లింగారావ్ తన ముందున్న ఫైళ్ళలో తల దూరుస్తూ.

“యస్సర్ ...’’ అని సెల్యూట్ చేసి అక్కడినుండి వెళ్ళిపోయాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

*****