TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
రెండు గిన్నెల్లో అన్నం పెట్టి వాటిని సెల్ కటకటాల తలుపుక్రింద నుండి లోపలికి తోశారు జైలు సేన్త్రీలు. చిన్నారావ్ గబగబా వెళ్ళి రెండు గిన్నెలు తీస్కుని రాంబాబు దగ్గరకొచ్చాడు.
“ఏంటీ? అదేమైనా మటన్ బిర్యానీయా అంత గబగబా వెళ్ళి తీస్కోచ్చావ్?’’ అన్నాడు రాంబాబు చికాకుగా.
చిన్నారావ్, రాంబాబు ముందుకు ఓ గిన్నేతోసి రెండో గిన్నె ఎత్తి ముక్కు దగ్గర పెట్టి వాసన చూసాడు. “సాంబారు అన్నంలా వుంది’’ అన్నాడు చిన్నారావ్.
“ఓహో! అలాగా? ఫరవాలేదే! ఈ అన్నాన్ని వాసనబట్టి అదేంటో కనిపెట్టావంటే గొప్పే’’ అన్నాడు రాంబాబు.
చిన్నారావ్ అన్నంలో వేలుపెట్టి కెలికి చూస్తూ, “అబ్బే ... ముక్కలేం లేవు, ములక్కాయలు అసలు లేవు ... కనీసం వెల్లుల్లి పాయలు కూడా లేవు! అదేంటి? కరివేపాకు కూడా లేదా? అసలు తాలింపు పెట్టారా అని?...’’ అన్నాడు.
రాంబాబు చిన్నారావ్ వంక సీరియస్ గా చూశాడు. “ఏం ...? నేనేమైనా తప్పుగా మాట్లాడానా?’’ అడిగాడు చిన్నారావ్.
“నువ్విప్పుడు జైలు సెల్ లో ఉన్నావ్! హోటల్ రూంలో కాదు. నోర్మూస్కుని తిను!’’ అన్నాడు రాంబాబు.
ఇద్దరూ అన్నం ముద్దలు నోట్లో పెట్టారు. “ఓ ...క్’’ అన్నారు ఇద్దరూ కోరస్ గా కడుపులో తిప్పుతుండగా. “ఒరేయ్ రాంబాబూ ..... ఎన్నాళ్ళురా మనకీ అవస్థ? మనం దీని నుండి ఎప్పుడు బయటపడ్తాం?’’ బాధగా అన్నాడు చిన్నారావ్.
“దేనికైనా టైం వస్తుంది! చూద్దాం మనం ఎప్పుడు, ఎలా ఇక్కడినుండి బయటపడ్తామో! ...’’ అన్నాడు రాంబాబు ఆలోచనగా ....
*****
“ఆ ... హహహ ... ఆ ... హహహ ....’’ బాధగా ఏడుస్తున్నాడు గజదొంగ మంగులు మంచంమీద పడుకుని.
డేవిడ్ పరుగున గదిలోకి వచ్చాడు. “ఏంటి బాస్? ఎందుకలా ఏడుస్తున్నారు?’’ కంగారుగా అడిగాడు డేవిడ్.
“ఆ ... హహహ ...” ఏడుస్తూనే గది మూలకి చేతితో చూపించాడు మంగులు.
మంగులు చూపించిన వైపుకి చూశాడు డేవిడ్. గదిమూల కూర్చుని ప్లేటునిండా చేగోడీలు పెట్టుకుని తింటూ వుంది దీప.
“ఏంటి బాస్ ... ఆఫ్టరాల్ చేగోడీల కోసం అలా ఏడుస్తున్నారా?’’ అని దీప వైపు తిరిగి “ఏయ్ పాపా ... సగం చేగోడీలు మా బస్ కి ఇవ్వు!’’ అన్నాడు డేవిడ్.
గజదొంగ మంగులు చాచిపెట్టి డేవిడ్ నడ్డిమీద ఓ తాపు తన్నాడు ఆ దెబ్బకి డేవిడ్ దూరంగా బోర్లాపడ్డాడు.
మెల్లగా నేలమీంచి లేచి “ఏంటి బాస్ ... నేనేమైనా తప్పుగా మాట్లాడానా?’’ అడిగాడు డేవిడ్.
“లేకపోతే నేను చేగోడీల కోసం ఏడవడం ఏంట్రా నీయబ్బ!’’ అన్నాడు చొక్కా ఎత్తి కళ్ళు తుడుచుకుంటూ మంగులు.
“మరి చేగోడీలు చూపించారు కదా బాస్?’’
“చేగోడీలను కాదురా ... ఆ పిల్ల పిశాచిని చూపించా’’ అన్నాడు దీపని చూపిస్తూ మంగులు.
“నా కర్థం కాలేదు బాస్ ...!’’ బుర్ర గోక్కుంటూ అన్నాడు డేవిడ్.
“అది ... అది ... అది నా ప్రాణాలు తోడేస్తుందిరా డేవిడ్. గంటనుండి నా నడ్డిమీదెక్కి గుఱ్ఱం ఆట ఆడింది. ఇదిలానే రోజూ గుఱ్ఱం ఆట ఆడితే నేను ఒకవేళ పెళ్ళి చేస్తుంటే సంసారానికి పనికిరానురా’’ ఏడుస్తూ అన్నాడు గజదొంగ మంగులు.
“పోనీ మన డెన్ లో ఎవరిమీదైనా ఎక్కి ఆడమని చెప్పొచ్చుకద బాస్?’’ సలహా ఇచ్చాడు డేవిడ్.
“అది నాతో తప్ప ఎవరితోనూ ఆడదటరా. నేను దాన్ని ఆడించాలట! ఇందాకటినుండీ గుఱ్ఱం ఆట ఆడి ఆడి ఆడే నా మోకాలు చిప్పలు కొట్టుకుపోయాయ్, ఒరేయ్! నా కాళ్ళు కాస్త పట్రోయ్!’’ డేవిడ్ మంగులు కాళ్ళు పట్టసాగాడు.
అయిదు నిమిషాల్లో దీప చెగోడీల ప్లేటు ఖాళీ చేసి దూరంగా విసిరేసింది. “ఒరేయ్! నువ్వు పిచ్చంకుల్ కాళ్ళు పట్టడం ఆపరా’’ అంది దీప.
“ఏం? నేను కాళ్ళు పడ్తే నీకేం బాధ?’’ అడిగాడు డేవిడ్.
“నేను అంకుల్ తో ఉయ్యాలాట ఆడాలి!’’ అంది దీప.
“బాస్! గుఱ్ఱం ఆటకంటే ఉయ్యాలాట నయంకదా! దీన్ని ఉయ్యాల్లో పెట్టి ఊపడమే! మీకు మోకాళ్ళు కొట్టుకుపోవు! మీరు పెళ్ళి కూడా హాయిగా చేస్కోవచ్చు బాస్ ,,,’’ అన్నాడు డేవిడ్.
“ఒరేయ్! దాని సంగతి నీకు తెలియదు బాబూ! అంత సింపుల్ ఆట అది ఆడదురా. అందులో ఏదో లిటిగేషన్ ఉండే వుంటుంది ...’’ అన్నాడు మంగులు దీపని అనుమానంగా చూస్తూ.
“ఉయ్యాలాటలో లిటిగేషన్ ఏం వుంటుంది బాస్ ... మీరు మరీనూ’’ అన్నాడు డేవిడ్ తేలికగా నవ్వేస్తూ.
“నువ్వే చూద్దువుగాని ...’’ అని దీపవైపు చూసి “దీపా ... ఉయ్యాలాట ఎలా ఆడాలి?’’ అడిగాడు గజదొంగ మంగులు.
“మొదట నువ్వు వొంగుని నిల్చోవాలి అంకుల్! తర్వాత నీ మెడకి తాడు కట్టుకోవాలి. ఆ తాడు పట్టుకుని నేను హండ్రెడ్ టైమ్స్ ఊగాలి! అదే ఉయ్యాలాట. అంతే!!’’ కళ్ళు తిప్పుతూ అంది దీప.
అది వినగానే గజదొంగ మంగులు పైప్రానాలు పైనే పోయాయి. “దీన్ని నేను భరించలేనురోయ్ ...’’ అంటూ మంచం మీదినుండి ఒక్క దూకు దూకి ఫోన్ దగ్గరికి పరుగుతీసాడు గజదొంగ మంగులు.
*****
|
|