అందరూ దొంగలే - 46

Listen Audio File :

రాంబాబు, చిన్నారావ్, ఇన్స్ పెక్టర్ అప్పారావ్ జీపులో అప్పారావ్ యింటికి బయలుదేరారు. అప్పారావ్ జీపు డ్రైవ్ చేస్తుంటే రాంబాబు, చిన్నారావ్ పక్కన కూర్చున్నారు.

అప్పారావ్ కి క్షణక్షణం టెన్షన్ ఎక్కువ కాసాగింది. ఇంట్లో రాంబాబు, చిన్నారావ్ లు ఏం అల్లరి చేస్తారోనని. జీపు డ్రైవ్ చేస్తున్న అప్పారావ్ వంక చూసి రాంబాబు, చిన్నారావ్ ఘోల్లుమని నవ్వారు.

“ఏం.... ఎందుకలా నవ్వారు? నా డ్రయివింగ్ బాలేదా అడిగాడు అప్పారావ్ విసుగుని అణచుకుంటూ.

“ఏం లేదు.... నువ్వు కుక్కలా నాలిక బయటపెట్టి డ్రయివ్ చేస్తుంటే దార్లో అందరూ నిన్నే చూస్తున్నారు వింతగా” అన్నాడు రాంబాబు..

“హబ్బా!” అప్పారావ్ స్టీరింగ్ వదిలేసి బాధగా మొట్టుకోసాగాడు.

“ఏయ్... స్టీరింగ్ వదిలేశావేంటి... యాక్సిడెంట్ అవుతుంది..... స్టీరింగ్ పట్టుకో... కావాలంటే నీకు మేం హెల్ప్ చేస్తాంగా” అన్నాడు కంగారుగా చిన్నారావ్.

అప్పారావ్ గబుక్కున స్టీరింగ్ పట్టుకున్నాడు.

“అయితే నా నాలుక ఇలా బయటికి రాకుండా ఏదైనా మార్గం చెప్పి నాకు హెల్ప్ చేస్తారా?” ఆశగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

రాంబాబు, చిన్నారావ్ లు హఠాత్తుగా ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మీద పది ఠకా ఠకా డజను మొట్టికాయలు మొట్టేశారు.

ఈ హఠాత్ సంఘటనకి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బిత్తరపోయాడు.

“మేం హెల్ప్ చేస్తామన్నది ఈ మొట్టికాయల విషయంలో... పాపం... నువ్వు రిస్కు తీస్కుని స్టీరింగ్ వదిలి మొట్టికాయలేస్కుంటున్నావ్ కదా” అన్నాడు రాంబాబు. అది విన్న ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కుమిలిపోయాడు. ఇదిలానే కంటిన్యూ అయితే తనకి పిచ్చెక్కడం ఖాయం అని అనుకున్నాడు. మరో అయిదు నిమిషాల్లో జీపు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఇంటి ముందు ఆగింది.

ముగ్గురూ జీపు దిగి లోపలికి వెళ్ళారు. అప్పారావ్ భార్య మదన మనోహరి రాంబాబు, చిన్నారావ్ లని చూసి ఇంతెత్తున లేచి మండిపడింది. “ఏంటి.... ఇన్నాళ్ళూ ఏమయ్యారు? ఉతకాల్సిన బట్టలు బండెడు తయారయ్యాయ్” అంటూ రంకెలు వేసింది.

“అందుకే కదా మరి మేం వచ్చింది?” అన్నాడు రాంబాబు చిరునవ్వు నవ్వుతూ.

“ఇంట్లో వస్తువుల మీద కూడా బాగా దుమ్ము పడింది... దుమ్ము బాగా దులపాలి” అన్నాడు.

“బూజులు కూడా దులపాలి!” అంది మదనమనోహరి.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కంగారు పడిపోసాగాడు. భార్య మాటలకి వాళ్ళిద్దరూ ఎలా రియాక్టు అవుతారోనని! “మనోహరీ! నువ్వొకసారి ఇలారా.... నీతో మాట్లాడాలి” అని ఆమె జబ్బ పట్టుకుని లోపలికి లాక్కెళ్ళాడు.

“మనం మనవాళ్ళకి ఫోన్ చేద్దామా?” అని అడిగాడు రాంబాబు.

“ఓ....” అన్నాడు చిన్నారావ్ హుషారుగా. రాంబాబు అక్కడే వున్న ఫోన్ రిసీవర్ తీసి సర్సింగ్ హోం నెంబర్ డయల్ చేశాడు.

ఫోన్ సరోజ లిఫ్ట్ చేసింది. “ఓ... నువ్వేనా... సాయంత్రం పార్కులో కలుద్దాం... నువ్వేం భయపడకు, ఈసారి బాగానే మాట్లాడుతాను లే....” అన్నాడు రాంబాబు.

“ఈవేళ కుదర్దు... సాయంత్రం రెండు ఆపరేషన్ కేసులున్నాయ్. రేపు తప్పకుండ కలుద్దాం. ఇప్పుడు కూడా బిజీగానే వున్నాం నేను సునీతా! రేపు డైరెక్టుగా పార్కులోనే కలుద్దాం” అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ.

రాంబాబు, చిన్నారావ్ లు కమీషనర్ క్యాండిడేట్ లనీ, వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనీ, వాళ్ళు తలుచుకుంటే ప్రమోషన్ ఇప్పించగలరనీ, లేదంటే సస్పెండ్ కూడా చేయించగలరని మదన మనోహరికి గదిలో నచ్చజెప్పి బయటికి తీస్కోచ్చాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“మరిక పని స్టార్ట్ చేద్దామా?” అని అడిగాడు రాంబాబు మదన మనోహరిని.

“వద్దులెండి.... నేనే చేస్కుంటా!” అంది ఆమె.

“సరే... మేమిద్దరం కాఫీతాగి వెళ్ళాక చేస్కుందువుగాని!” అన్నాడు రాంబాబు.

“కాఫీ చాలా స్ట్రాంగా వుండాలి!” అన్నాడు చిన్నారావ్.

మదనమనోహరి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి సైగచేసింది.

అప్పారావ్ లోపలికి వెళ్ళబోతే

“కాదు... కాఫీ నువ్వే కాచి తేవాలి!” అన్నాడు రాంబాబు.

ఆమె ఇద్దర్నీ మనసులో బాగా తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది.