TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
రాంబాబు మోకాళ్ళమీదా, అరచేతుల మీద వంగి కూర్చున్నాడు. దీప ఒక్క గెంతు గెంతి రాంబాబు వీపుమీద కూర్చుంది. ఆ దెబ్బకి రాంబాబు వెన్నుపూసలు రెండో మూడో కిర్రుకిర్రుమని శబ్ధం చేశాయ్. రాంబాబు బాధగా మూలిగాడు.
సరోజా! నేను నిన్ను పెళ్ళి చేస్కోడానికి ఎల్లప్పుడూ అర్హుడిగా వుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకో! మనసులో అనుకున్నాడు. పావుగంట సేపు గుర్రం ఆట అని చెప్పి రాంబాబు మోకాలి మీద దేకించింది. తర్వాత చిన్నారావ్ వంతు వచ్చింది.
చిన్నారావ్ ఓ లావుపాటు తాడుని జామచెట్టుకి ఉయ్యాలలా కట్టి దీప కూర్చోడానికి దుప్పటిని మడిచి ఎరేంజ్ చేశాడు. “అదేంటీ.... ఉయ్యాల ఆటంటే తాడుని మెడకి కట్టి ఊగాలికదా?” అడిగాడు రాంబాబు ఆశ్చర్యంగా, డొక్కలు ఎగరేస్తూ.
"స్కూల్లో లంచ్ టైంలో ఉయ్యాల ఇలా ఊగితే ఇంకా బాగుంటుందని దీపని కన్వీన్స్ చేశా!” అన్నాడు చిన్నారావ్ గర్వంగా. ఇందాక చిన్నారావ్ ఎందుకలా నవ్వాడో ఇప్పుడు రాంబాబుకి అర్థం అయ్యింది. తను పావుగంట సేపు అనవసరంగా మోకాళ్ళు దేకిచ్చుకున్నాడు. “హబ్బా!” అన్నాడు జుట్టు పీక్కుంటూ. చిన్నారావ్ దీపని మరో పావుగంట సేపు ఉయ్యాల ఊపాడు.
ఈలోగా శ్రీలక్ష్మి అక్కడికి వచ్చింది. “స్కూలు డ్రెస్సు మార్చకుండా ఆ ఆటలేంటే... పద.... మొహం కడుక్కుని టిఫిన్ తిందువుగాని” దీపతో అని “మీరు కూడా టిఫిన్ తినడానికి రండి” అంది ఆ ఇద్దరితో.
"ఫరవాలేదు మేడం.... మేం వెళతాం'' అని ఆమెతో చెప్పి కమీషనర్ లింగారావ్ దగ్గర కూడా శలవు తీస్కుని బయటికొచ్చారు.
“ఇప్పుడు వాళ్ళ రూమ్ కి వెళదామంటావా?” అని అడిగాడు రాంబాబు.
“ఇంక ఈ వేళ కూడా వెళ్ళకపోతే వాళ్ళిద్దరూ మనల్ని ఆపరేషన్ చేసే కత్తుల్తో పొడుస్తారు” అన్నాడు చిన్నారావ్. ఇద్దరూ మోపెడ్ మీద కాస్త దూరంలో వెళ్ళారో లేదో వాళ్ళకి వేరే మోపెడ్ మీద సరోజ, సునీతలు ఎదురయ్యారు. ఆ మోపెడ్ ని సరోజ నడుపుతోంది. రెండు మోపెడ్ లూ ఎదురెదురుగా ఆగాయ్.
“ఏంటి మీరు బతికే వున్నారా?” చాలా కోపంగా చూస్తూ అడిగింది సరోజ.
“దెయ్యాలెక్కడైనా మోపెడ్ తోల్తాయా? కాబట్టి మేం బతికే వున్నాం... హహహ....” నవ్వుతూ అన్నాడు రాంబాబు.
“నీ జోకు మూసీ నదికంటే కుళ్ళు కంపు కొడ్తుంది తెల్సా?” అంది సరోజ.
“మేం కావాలని చెయ్యలేదు.. అసలు ఇప్పుడు మీ రూంకే బయలుదేరాం జరిగిందంతా మీకు చెప్పాలని” అన్నాడు చిన్నారావ్.
“హర్రే.. మేం మీ రూమ్ కి బయలుదేరాం” అంది సునీత.
“ఎవరూ ఎవరి రూమ్ కి వెళ్ళక్కర్లేదు గాని మనం చక్కగా పార్కుకి వెళదాం” అన్నాడు రాంబాబు హుషారుగా.
“వద్దులే.. అక్కడ నువ్వు పల్లీలమ్మే వాడినీ, మిక్సర్ లమ్మేవాడినీ చూస్తూ కూర్చుంటావ్” అంది సరోజ కోరగా చూస్తూ.
“మరేం చేద్దాం?” సిగ్గుపడుతూ అడిగాడు రాంబాబు.
“మేము చెప్తాంగా... మాతో పదండి” అంది సరోజ.
సరోజ రాంబాబుని తన వెనకాల కూర్చోమంది. సునీత రాంబాబు ప్లేస్ లో కూర్చుంది. రెండు మెపెడ్ లూ బయలుదేరాయి. ఇద్దరూ ఆడవాళ్ళు నడుపుతుంటే వెనకాల మరో ఇద్దరూ మగాళ్ళు కూర్చుని వుండడంతో దారి పొడుగున జనాలంతా వీళ్ళనే చూడసాగారు.
“అసలు నేను ముందు కూర్చుని నువ్వు వెనకాల కూర్చుని వుండాల్సింది” ఇబ్బందిగా అన్నాడు రాంబాబు, సరోజతో.
“ఏం.. మీరు డ్రయివింగ్ చేస్తే ఆడవాళ్ళు వెనకాల సంబరంగా కూర్చోవాలిగానీ మేం డ్రయివింగ్ చేస్తే వెనకాల కూర్చోడానికి మీకు ఇబ్బందా?” అంది సరోజ నవ్వుతూ. ial
|
|