TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
వీళ్ళు ఇలా మాట్లాడ్తుంటే అక్కడ స్కూలు గ్రౌండ్ లో వేపచెట్టు దిమ్మమీద కూర్చుని రాంబాబు, చిన్నారావ్ లు దీపకోసం పడిగాపులు కాయసాగారు.
ఇంకో పది నిమిషాల్లో స్కూలు వదిలేస్తారు. “మనకి మంచి డ్యూటీనే తగిలింది!” అన్నాడు చిన్నారావ్ తల పట్టుకుని.
“ఏం? డ్యూటీ కేమైందనీ... మనం ఆ నేరస్థుల మధ్య చేసే డ్యూటీ కన్నా... ఈ పసిపాపల మధ్య చేసే డ్యూటీ నయంకాదా?” అన్నాడు రాంబాబు.
“అదీ నిజమేననుకో...” అన్నాడు చిన్నారావ్.
“ఏంటో.. నా గురించి సరోజ ఏమనుకుంటుందో? అనుకోని ఈ ఎసైన్ మెంట్ తో రెండు రోజులుగా నేను సరోజని కలవలేకపోయాను!” అన్నాడు రాంబాబు.
“నేనూ అంతేగా...! మనిద్దర్నీ వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా తిట్టుకుంటూ వుంటారు” అన్నాడు చిన్నారావ్.
“దీపనిప్పుడు ఇంటి దగ్గర దింపేసి మనం వాళ్ళ రూమ్ కి వెళ్ళాలి” అన్నాడు రాంబాబు.
“అవును” తలాడించాడు చిన్నారావ్.
స్కూల్ బెల మోగింది. మరుక్షణం దీప స్కూలు బయటకు బుల్లెట్ లా దూసుకొచ్చి వీళ్ళ వైపు పరుగులు పెడ్తూ రావడం కనిపించింది. దీప రాంబాబు, చిన్నారావ్ లని సమీపిస్తూనే, చిన్నారావ్ మీదికి స్కూలు సంచిని విసిరేసింది. అది తన మొహం బద్దలుకొట్టకుండా అతి లాఘవంగా క్యాచ్ పట్టి తన భుజానికి తగిలించుకున్నాడు చిన్నారావ్.
తర్వాత ఒక్కగెంతు గెంతి రాంబాబు చంకలోకి దూకి, అతని మెడచుట్టూ చేతులు వేసింది దీప. రాంబాబుకి నడ్డిలో ఎక్కడో కలుక్కుమంది. “ఊ...” అని బాధగా మూలిగి “ఇదే టైపులో ఇది రోజూ నా మీద దూకితె, నేను సరోజని పెళ్ళి చేస్కోడం దంగడా...!” అన్నాడు రాంబాబు.
“ఏం... ఎందుకని?” ఆ రెండింటికి కనేక్షనేంటో అర్థంకాక ఆశ్చర్యంగా అడిగాడు చిన్నారావ్.
“ఎందుకంటే.... నేను సంసారానికి పనికిరాను గనుకు...!” పళ్ళు నూర్తూ అన్నాడు రాంబాబు.
చిన్నారావ్ గిలగిలలాడిపోతూ నవ్వాడు. ఇద్దరూ దీపని జీపులో వేస్కుని ఇంటికి బయలుదేరారు. జీపు ముందు సీట్లో డ్రైవరు, రాంబాబు, చిన్నారావ్, దీపలు వుంటే, వెనకసీట్లో నలుగురు కానిస్టేబుల్స్ గన్స్ పట్టుకుని కూర్చున్నారు. జీపు యింటిముందు ఆగింది.దీప చెంగున కిందకి దూకి ఇంట్లోకి పరుగుతీసింది. ఆ పాపతో బాటే రాంబాబు, చిన్నారావ్ లోపలికి వెళ్ళారు.
చిన్నారావ్ చేతిలోని స్కూలు బ్యాగ్ సోఫాలో పెట్టాడు. లోపలినుండి కమీషనర్ లింగారావ్ వచ్చాడు. రాంబాబు, చిన్నారావ్ లు సెల్యూట్ చేశారు. “ఏంటోయ్... ఈ కొత్త డ్యూటీని మీరెలా ఫీలవుతున్నారు?” చిరునవ్వుతో ప్రశ్నించాడు కమీషనర్ లింగారావ్.
“మాకు బాగా నచ్చింది సార్!” అన్నాడు రాంబాబు నడ్డి దగ్గర నొక్కుకుంటూ.
“డాడీ... లంచ్ టైంలో నన్ను తినమని బిస్కెట్ పాకెట్ ఇచ్చారు కదా! దాంట్లో సగం పైగా ఈయనే తినేశాడు” చిన్నారావ్ ని చూపిస్తూ అంది దీప.
చిన్నారావ్ కంగారుపడిపోయాడు. “అయ్యో లేద్సార్... అన్నీ అమ్మాయిగారే తిన్నారు. అమ్మాయి గారు చాలా చిలిపి. అందుకే నన్నేడిపించడానికి అలా చెప్తున్నారు... హిహిహి..” అన్నాడు బలవంతంగా నవ్వుతూ. నేను వద్దని చెప్తే విన్నావా? అన్నట్టు చిన్నారావ్ వంక ఓ సీరియస్ లుక్కేసి
“సార్! మేం ఇంక వెళతాం సార్!” అన్నాడు కమీషనర్ తో రాంబాబు.
“ఊ... మీరప్పుడే వెళ్ళడానికి వీల్లేదు. నన్ను కాస్సేపు ఆడించి వెళ్ళాలి” గారాలు పోతూ అంది దీప.
“విన్నారుగా... కాస్సేపు దాన్ని ఆడించండోయ్!” అన్నాడు కమీషనర్ లింగారావ్.
‘గోవిందా... ఈవేళ కూడా సరోజని కలిసేయోగం లేదేమో!’ అనుకున్నాడు రాంబాబు.
రాంబాబు, చిన్నారావ్, దీపలు పెరట్లోకి వెళ్ళారు.
“ఇప్పుడు గుర్రం ఆటా.. ఉయ్యాల ఆటా రెండూ ఆడదాం.... సరేనా?” అంది దీప కళ్ళు తిప్పుతూ. ఉయ్యాల ఆట అంటే మెడలో తాడు కట్టి వూగుతుందని రాంబాబుకి గుర్తొచ్చింది.
అందుకే వెంటనే “ముందు గుర్రం ఆట నేనాడిస్తా. ఉయ్యాల ఆట చిన్నారావ్ అంకుల్ ఆడిస్తాడు... ఏం? అన్నాడు రాంబాబు.
దీప సంతోషంగా “ఓ... అలాగే” అంది గంతులేస్తూ.
చిన్నారావ్ మాత్రం చిద్విలాసంగా నవ్వాడు.
‘నవ్వరా నవ్వు... అది మెడలో తాడు కట్టి ఊగుతుందిగా. అప్పుడు నవ్వు!’ అని మనసులో అనుకున్నాడు రాంబాబు.
|
|