అందరూ దొంగలే - 42

Listen Audio File :

చిన్నారావ్, రాంబాబు, శ్రీలక్ష్మి ముగ్గురూ ప్రయాసపడి దీపకి స్కూల్ డ్రెస్ వేసారు. ఎక్కడికో బయటికి వెళ్లిన కమీషనర్ లింగారావ్ ఇంటికొచ్చాడు.

రాంబాబు, చిన్నారావ్ లు అతనికి సెల్యూట్ చేశారు.

“ఓ... మీరు వచ్చేశారా? వెరీగుడ్. నేనిప్పుడు వచ్చిన జీపులోనే మీరు దీపని స్కూలు కి తీసుకెళ్ళండి. మీతోపాటు నలుగురు కానిస్టేబుల్స్ కూడా వుంటారు. ఉండండి...” అంటూ లోపలికివెళ్ళి రెండు రివాల్వర్స్ తెచ్చి వాళ్ళిద్దరి చేతుల్లో పెట్టాడు కమీషనర్ లింగారావ్.

“ఇవెందుకు సార్ ఇప్పుడిచ్చారు? దీపావళి ఇంకా చాలా దూరంలో వుందికదా!” అన్నాడు రాంబాబు.

“అవి దీపావళి తుపాకులు కావు. నిజమైన రివాల్వర్స్” అన్నాడు లింగారావ్ చికాకుని అణచు కుంటూ. రాంబాబు నాలుక కర్చుకున్నారు. రివాల్వర్స్ పట్టుకున్న ఇద్దరి చేతులు వణకడం మొదలుపెట్టాయ్.

"మళ్ళీ ప్రయత్నించొచ్చు. ఎవరు నా పాపకి ఆపద తలపెట్టాలని చూసినా రెండో ఆలోచన లేకుండా షూట్ చెయ్యండి” అన్నాడు లింగారావ్ గంభీరంగా.

“అప్పుడు మమ్మల్ని హత్యానేరం కింద ఉరితియ్యరుకదా...” భయంగా అడిగాడు రాంబాబు. కమీషనర్ లింగారావ్ రాంబాబు వంక సీరియస్ గా చూశాడు. రాంబాబు నోరు మూస్కున్నాడు.

“పాపకి స్కూల్ టైమైంది” అంది శ్రీలక్ష్మి దీప చేతిని పట్టుకుని అక్కడికి తీసుకొస్తూ.

చిన్నారావ్ శ్రీలక్ష్మి రెండో చేతిలో ఉన్న స్కూల్ బ్యాగ్ అందుకున్నాడు.

“ఇంక మీరు బయలుదేరండి...” అన్నాడు కమీషనర్ లింగారావ్.

దీపని తీస్కుని రాంబాబు, చిన్నారావ్ లు ఇంటి బయటికి వచ్చి అక్కడ రెడీగా వున్న జీపు ఎక్కారు. జీపు ముందుకు బయలుదేరింది.

*** *** **** **** ***

డిప్పల్లో నర్సింగ్ హోం... సమయం ఉదయం పదిగంటలు! హెడ్ నర్స్ సరోజ, నర్స్ సునీత వార్డుల రౌండ్స్ కి బయలుదేరారు. ఓ పేషెంట్ దగ్గర ఆగారు. “అసలు వీళ్ళకేం రోగం వచ్చిందీ...” అంది సరోజ విసుగ్గా.

“అదేంటండీ...... నాకు ఆస్థమా ఎటాక్ వస్తే కదా మీరు నన్నిక్కడ జాయిన్ చేస్కున్నారు. మళ్ళీ ఏం రోగం అంటారేం?” అన్నాడు రోగి ఆశ్చర్యంగా చూస్తూ.

“అబ్బ... నిన్ను కాదులేవయ్యా! నీ రోగం, దాని పుట్టుపూర్వోత్తరాలూ, నీ పుట్టుపూర్వోత్తరాలూ అన్నీ మాకు తెలుసు గానీ, ఏదీ.... నీ చెయ్యిలాతే...” సిరంజిలోకి మందు ఎక్కిస్తూ విసుగ్గా అంది సునీత. అ వ్యక్తి చంకెత్తాడు.

సునీత అతని జబ్బమీద ఇంజక్షన్ చేస్తూ “నాకు చెడ్డ కసిగా వుంది” అంది.

“వామ్మోవ్...” అంటూ బాధగా అరిచాడు ఆ వ్యక్తి.

సూది జబ్బలోంచి బయటకు లాగుతూ “ఏంటయ్యా... కత్తితీసి కడుపులో పొడిచినట్టు అలా అరుస్తావ్?” అంటూ చికాకుగా ప్రశ్నించింది సునీత.

“మీకెంత కసిగా ఉంటేమాత్రం ఇంజక్షన్ అంత గట్టిగా పొడవాలా? అయినా నామీద మీకెందుకమ్మా అంత కసి? మీరు చెప్పిన మందులన్నీ నేను టైం ప్రకారమే వాడ్తున్నాగా ...!?” అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ..

“అబ్బా.. కసి నీమీద కాదయ్యా బాబూ! ఇప్పుడు మేం ఏం అన్నది నిన్నని అనుకోకు. సరేనా?” అంది సునీత. ఆ వ్యక్తి బాధగా జబ్బ రుద్దుకుంటూ సరేనన్నట్టు తల ఊపాడు.

“ఈ వాల్టినుంచి కాస్త లైట్ గా తినొచ్చు. మాత్రలు నాలుగు పూటలు కాకుండా మూడుపూటలే వేస్కో” అంది సరోజ. ఆ వ్యక్తి ఎటో చూడసాగాడు.

“ఏయ్ నిన్నే... ఊ...ఉ... అనవేం? నేను చెబుతున్నది వినబడ్డం లేదా?” చికాకుగా అడిగింది సరోజ.

“అయ్యో తల్లీ... ఇప్పుడేకదా ఏం అన్నా నిన్నని అనుకోకు అని చెప్పారు. నన్ను కాదనుకుని ఊర్కున్న...” అన్నాడు అయోమయంగా చూస్తూ.

“అఘోరించావ్ లే. నేను చెప్పింది విన్నావ్ కదా?”

“ఆ... కాస్త లైట్ గా తినమన్నారు. మాత్రలు మూడుపూటలే వేస్కోమన్నారు...” అన్నాడు ఈసారేమంటారో అన్నట్టుగా భయం భయంగా చూస్తూ.

“రక్షించావ్” అంది సరోజ.

ఇద్దరూ అడుగులు ముందుకు వేశారు. “కనీసం ఇద్దర్లో ఒక్కరు కూడా ఫోన్ చెయ్యలేదు. రెండ్రోజుల్నుండి పత్తాలేరు. ఏమైపోయారు?” ఆలోచనగా అంది సునీత.

“ఈ మగాళ్ళంతా...ఇంతే... మనం ప్రేమించామని చెప్పకముందు అసలు మనం ప్రేమిస్తామో లేదోనని మన చుట్టూ చాలా టెన్షన్ గా తిరుగుతారు. ఒకసారి ప్రేమించామని చెప్పగానే రిలాక్స్ అయిపోతారు” అంది సరోజ మొహం చిట్లించి.