TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
“ఏంటీ.... ఎందుకలా నవ్వుతున్నారు?” అని అడిగాడు అప్పారావ్ మెల్లగా తేరుకుని.
“మీరు శుద్ధ గ్యాస్ కొడ్తున్నారని మాకు తెల్సు సార్” అన్నాడు చిన్నారావ్.
“మీ కిడ్నీని చెట్టుకున్న జామకాయని తెంపినట్టు తెంపేసి మీకు ఎలక కిడ్నీని అమర్చారటకదా?!” వస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు రాంబాబు.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఉలిక్కిపడ్డాడు. ‘ఎలక కిడ్నీనా? ఇంకా నయం. బల్లి కిడ్నీని అమర్చారని అన్లేదు. అయినా నా పర్సనాల్టీకి ఎలక కిడ్నీ ఎలా సరిపోతుందయ్యా!?” అన్నాడు.
“లేకపోతే కుక్క కిడ్నీ సరిపోతుందా?” అన్నాడు రాంబాబు.
“సరిపోతుంది... మరి నాకిప్పుడు అమర్చింది అదేకదా మరి” గబుక్కున అరిచేశాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. అంతలోనే తను చేసిన పొరపాటు గ్రహించినాలుక కర్చుకున్నాడు.
“మీతో నిజం చెప్పించాలనే ఎలకకిడ్నీ అని అబద్దం ఆడాం సార్!” అన్నాడు రాంబాబు.
“ఏంటి సార్! ఒక మనిషి కిడ్నీతో ఓ గజ్జి కుక్క కిడ్నీతో మీ బతుకు ప్యూచర్ లో ఎలా వుంటుందో సార్!” జాలిగా అన్నాడు చిన్నారావ్.
“గజ్జికుక్కా... అలా అని ఎవరన్నారు?” భయంగా చూస్తూ అడిగాడు అప్పారావ్.
“ఈ నర్సింగ్ హోం వాళ్ళు అంతకంటే మంచి కుక్క కిడ్నీని ఎక్కడ పట్టుకొస్తారు సార్?” అన్నాడు రాంబాబు.
“హబ్బా!...” బాధగా జుట్టు పీక్కున్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“ఆ డాక్టర్ మీద రివెంజ్ తీర్చుకోవాల్సిందే!” అన్నాడు. అదే సమయంలో అంత దూరంలో అప్పారావ్ భార్య మదన మనోహరి హడావిడిగా రావడం వాళ్ళకి కనిపించింది.
“సార్... డాక్టర్ మీద మీరు రివెంజ్ తీర్చుకోనక్కర్లేదు సార్.... మీ మిసెస్ వస్తున్నారు!” అన్నాడు రాంబాబు...
మదనమనోహరి బెడ్ ని సమీపించింది. వస్తూనే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మీద విరుచుకుపడింది. “ఏంటీ?... నువ్విక్కడికి హడావిడిగా వచ్చి ప్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నావట!.... అంటే ఏంటీ?... నాకు పిల్లలు అక్కర్లేదనా నీ ఉద్దేశం?” అంటూ అప్పారావ్ పీక మీద కూర్చుంది.
“అబ్బ!... వదలవే. ఊపిరాడక చస్తాను!” తల అటూ ఇటూ ఊపాడు ఆమె చేతుల పట్టునుండి విడిపించుకోవడానికి.
ఆమె అతని మెడని వదిలేసింది. “ఇలాగైతే నిన్ను వదిలిపెట్టి పోతానంతే!” అంది.
“అందమైన అది నన్నోదిలిపెట్టిపోయి, నువ్వూ వదిలిపెట్టిపోతే ఇహ అయినట్టే!” అన్నాడు అప్పారావ్ నెత్తికోట్టుకుంటూ.
“మరేం...! నాకు నాలాంటి అందమైన పిల్లలు పుట్టోద్దుగా?” మరిచింది మదన మనోహరి బొంగురు గొంతుతో.
రాంబాబు, చిన్నారావ్ లు కిసుక్కున నవ్వారు.
“అయినా మా మొగుడూ పెళ్ళాల మధ్య మీరెంటయ్యా?”.... వెళ్ళండి!” అంటూ ఇద్దరిమీదా చిరాకుపడ్డాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ నవ్వాపుకుంటూ అక్కడికి వెళ్ళారు.
“ఊ... ఇప్పుడు చెప్పు!....” గుడ్డురిమి చూస్తూ అంది. మదన మనోహరి.
"నేను ప్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోలేదే బాబూ....” బాధగా అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“మరే ఆపరేషన్ చేయించుకున్నావ్?”
“నేను చేయించుకోలేదు.... వాళ్ళే బలవంతంగా ఆపరేషన్ చేసి కిడ్నీని తీసేశారు.”
“ఎందుకని?”
“వాళ్ళు కావాలని చెయ్యలేదట! నన్ను ఇంకెవరిగానో భ్రమపడి పొరపాటున ఆపరేషన్ చేసేశారు. అంతేకాదు... మరో ఘోరమైన పని కూడా చేసారు."
“ఏంటది?”
“తీసేసిన నా కిడ్నీ బదులుగా నాకు ఓ కుక్క కిడ్నీని అమర్చారు!” అంటూ ఘోల్లుమన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“ఇంతకీ ఈ పనిచేసిన డాక్టరెవడు?” అడిగింది మదన మనోహరి.
“డాక్టర్ శ్రీనివాస్ అనీ...” కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.
“ఎక్కడుంటాడు వాడు?”
“ఇదిగో... ఈ ప్రక్క నుండి తిన్నగా వెళ్ళి ఎడమ ప్రక్కకి తిరిగితే అక్కడ డాక్టర్స్ రూంలో వుంటాడు.”
మదనమనోహరి పెద్ద పెద్ద గంతులేస్కుంటూ ఆ వైపుకి వెళ్ళింది. ఒక పావుగంట గడిచింది. బాధతో కేకలు పెడ్తున్న ఒక వ్యక్తిని స్ట్రెచర్ మోసుకొచ్చి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బెడ్ ప్రక్కన వేశారు. అతని మొహం కమిలిపోయి ఉంది. మనిషి భోరున ఏడుస్తున్నాడు. ఎవరబ్బా ఈ శాల్తీ అని తల పక్కకి తిప్పి చూసిన అప్పారావ్ ఖంగుతిన్నాడు.
ఆ ఏడుస్తున్నది ఎవరో కాదు.
డాక్టర్ శ్రీనివాస్.
|
|