TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
పోలీస్ స్టేషన్ లో ఫోన్ మోగింది. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ తను చదువుతున్న డిటెక్టివ్ నవల విసుగ్గా ప్రక్కన పెట్టి రిసీవర్ తీశాడు.
“ఒరేయ్..... ఎవడ్రా నేను డిటెక్టివ్ నవల చదువుతుంటే డిస్టర్బ్ చేసిందీ?” అంటూ అడిచాడు అప్పారావ్.
“నేనే.... పోలీస్ కమీషనర్ ని” అంది అవతలి గొంతు. ఇన్స్ పెక్టర్ అప్పారావు వెంటనే కంగారుగా లేచినిలబడి సెల్యూట్ కొట్టాడు.
“సారీ సార్.... ఎవడో బేకార్ నాయాలు ఫోన్ చేశాడేమో అనుకున్నాను.”
“ఊ.... అయితే డ్యూటీ టైంలో డిటెక్టివ్ నవలలు చదువుతున్నావన్న మాట” అడిగాడు కమీషనర్ లింగారావ్.
“అంటే ఆ పుస్తకాలు చదివితే నా పెర్ ఫార్మేన్స్ ఇంప్రూవ్ చేస్కోవచ్చనీ....” అంటూ గొణిగాడు.
“ఊ.... సరే..... సరే.... నువ్వు వెంటనే ఓసారి రాంబాబు, చిన్నారావ్ లు వున్న నర్సింగ్ హోం కి వెళ్ళి, అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఎలా వుందో సూపర్ వైజ్ చెయ్యి."
“అలాగే సార్!” అంటూ సెల్యూట్ కొట్టాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
జీపు డిప్పల్లో నర్సింగ్ హోం ముందు ఆగింది. అందులోంచి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ దిగాడు. అప్పారావ్ యూనిఫాంలో లో లేడు. మఫ్టీలో ఉన్నాడు. బ్లాక్ ప్యాంట్ మీద స్కై బ్లూ షర్టు వేస్కున్నాడు. అతన్ని చూడగానే నర్సింగ్ హోం ముందు వున్న కానిస్టేబుల్స్ సెల్యూట్ చేశారు. “సెక్యూరిటీ ఎలా ఉంది?” ఇద్దర్నీ అడిగాడు అప్పారావ్.
“బాగుంది సార్! నర్శింగ్ హోం వెనకాల కూడా మరో ఇద్దరు కాపలా వున్నారు. ప్రతి పడి నిముషాలకి మేం నర్శింగ్ హోమ్ కారిడాల్లో తిరుగుతూ చెక్ చేస్తున్నాం కూడా” ఇద్దర్లో ఒక కానిస్టేబుల్ చెప్పాడు.
వెరీగుడ్! కేర్ ఫుల్ గా వుండండి. రాంబాబు వాళ్ళకి ఏ చిన్న చెడు జరిగినా కమీషనర్ ఊర్కోరు..........”
“అలాగే సార్!” అన్నారు కానిస్టేబుల్స్.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ డిప్పల్లో నర్సింగ్ హోంలో ఠీవిగా అడగు పెట్టాడు.
**** ***** **** ****
అది డాక్టర్ సింగినాధం రూమ్. అతని ఎదురుగా డాక్టర్ శ్రీనివాస్. “పేషంట్ ఆపరేషన్ అంటే చాలా భయపడ్తున్నాడు. ఆపరేషన్ చెయ్యకపోతే నువ్వు చస్తావయ్యా అన్నా వినడే. నాకు మరో సీరియస్ కేస్ వచ్చింది. క్యాన్సర్! చాలా అడ్వాన్ స్ట్ కండిషన్! నేను ఆ ఆపరేషన్ అటెండ్ అవుతాను. నువ్వు ఈ కేస్ అటెండ్ అవ్వు......” శ్రీనివాస్ తో అన్నాడు డాక్టర్ సింగినాధం.
“పేషంట్ వివరాలు?” అడిగాడు డాక్టర్ శ్రీనివాస్.
“పేరు అప్పల్రాజు... బెడ్ నెంబర్ పదకొండు....... బ్లూ షర్ట్ వేస్కుని వుంటాడు. ఆపరేషన్ థియేటర్ ని సిద్దం చేశాం. వెంటనే ఆపరేషన్ చేసెయ్. గోలచేసినా వినొద్దు. అసలే వాడికి ప్రాణం మీదికొచ్చింది. ఇదిగో కేస్ ఫైలు....!” అని టేబులు మీది ఫైలు తీసి డాక్టర్ శ్రీనివాస్ కిచ్చాడు సింగినాధం.
శ్రీనివాస్ ఫైలు ఓసారి తిరిగేసి బయటికి నడిచాడు. వార్డ్ లో పదకొండో నెంబర్ బెడ్ దగ్గరికేళ్ళాడు. బెడ్ ఖాళీగా వుంది. ‘ఎక్కడ దాక్కున్నాడో ఏంటో....? వెతికి పట్టుకుని ఆపరేషన్ చెయ్యనూ!’ అనుకున్నాడు.
వార్డ్ లోంచి బయటికొచ్చి కారిడార్ లోనడవసాగాడు డాక్టర్ శ్రీనివాస్. పరధ్యానంగా నడుస్తున్న శ్రీనివాస్ ని ఎవరో డ్యాష్ కొట్టారు. తలెత్తి చూస్తే ఎదురుగా బ్లూ షర్ట్ లోఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“ఓహ్.... బ్లూ షర్ట్! వీడే అయివుంటాడు” అనుకున్నాడు ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్.
“ఐయామ్ సారీ.....” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“ఓ.... ఇట్స్ ప్లజర్... పద ఆపరేషన్ థియేటర్ కి!” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.
“ఆపరేషన్ థియేటర్ కా-----! ఎందుకూ?” ఆశ్చర్యంగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“క్యారమ్స్ అడ్డానికి!”
“క్యారమ్స్ ఆడ్డం నాకూ సరిగారాదు."
"అయినా నాతో మీరు క్యారమ్స్ అడ్డం ఏమిటీ?” మరింత ఆశ్చర్యపడిపోతూ అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“అయినా ఆపరేషన్ థియేటర్లో క్యారమ్స్ అడ్డం ఏంటయ్యా బాబూ!"
"ఆపరేషన్ థియేటర్లో ఏం చేస్తారు?” అడిగాడు శ్రీనివాస్.
“ఆపరేషన్ చేస్తారు!” చెప్పాడు అప్పారావ్.
“మరి అది చేద్దామనే రమ్మంటున్నా!”
“ఆపరేషనా? నాకా....?”
“నీకే... నీ గురించి సింగినాధంగారూ అంతా చెప్పారు!”
“సింగినాధమా? వాడెవడు?” కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“అబ్బ! పెద్ద చిలిపి....” అప్పారావ్ బుగ్గమీద చిదిమాడు డాక్టర్ శ్రీనివాస్.
“ఆపరేషన్ గురించి నువ్వేం భయపడనక్కర్లేదు. నీ ప్రాణానికి నా కత్తి అడ్డు.”
“మీరు నన్ను ఎవరుగా పొరబాటు పడ్తున్నారో నేను అప్పారావ్ ని” అయోమయంగా చూస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
“నిజమే! అప్పలరాజు అంటే మరీ మోటుగా ఉందని అప్పారావ్ అని చెప్పుకుంటున్నావు. నేను ఒప్పుకుంటాగానీ పద” అని జబ్బపట్టుకుని లాగాడు డాక్టర్ శ్రీనివాస్.
ఇన్స్ పెక్టర్ అప్పారావ్ పెనుగులాడాడు.
ఇక లాభంలేదని డాక్టర్ శ్రీనివాస్ ముందుగానే క్లోరోఫామ్ తో తడిపి జేబులో వుంచుకున్న కర్చీప్ ని తీసి అప్పారావు ముక్కుకి అదిమిపెట్టి వుంచాడు.
అప్పారావ్ స్పృహ తప్పాడు.
|
|