అందరూ దొంగలే - 32

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మెల్లిగా కళ్ళు తెరిచాడు. అతని మొహం మీద నాలుగు మొహాలు ఆత్రంగా అతని మొహంలోకి ఎదురుచూస్తున్నాయి. కాస్త మాసకగా కనిపించడంతో ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రెప్పలు టపటపా అల్లాడించి చూశాడు.

ఈసారి ఆ మొహాలు కాస్త క్లియర్ గా కనిపించాయి. వాళ్ళు డిప్పల్లో నర్సింగ్ హోం లో సెక్యూరిటీకి నియమింపబడ్డ కానిస్టేబుల్స్, వాళ్ళ చూపుల్లో అత్యంత జాలి కనిపించింది అప్పారావ్ కి. “ఏంటి? నాకేమైంది?? నేనెక్కడ వున్నాను???” నీర్సంగా అడిగాడు అప్పారావ్.

“మీరు డిప్పల్లో నర్సింగ్ హోంలో వున్నారు సార్!” మొదటి కానిస్టేబుల్ చెప్పాడు.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ తల ప్రక్కకి తిప్పి చూశాడు. అది నర్సింగ్ హోం జనరల్ వార్డ్. ఆ వార్డులో తను ఒక మంచంమీద పడుకుని ఉన్నాడు. “నాకేమైంది?” మళ్ళీ కానిస్టేబుల్స్ ని అడిగాడు అప్పారావ్.

నలుగురు కానిస్టేబుల్స్ గుడ్లు నీరు కక్కుకున్నారు తప్ప ఏ సమాధానం చెప్పలేదు. వాళ్ళని చూస్తే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి భయమేసింది. కొన్ని క్షణాలు గడిచాక వాళ్ళలో కాస్త సెన్సిటివ్ అయిన కానిస్టేబుల్ అప్పారావుమీద పడి ఘొల్లుమని ఏడ్చాడు.

“అసలు నాకేమైందంటే నేను చచ్చిపోయినట్టు ఏడుస్తారేం? నన్ను సస్పెస్స్ తో చంపక త్వరగా చెప్పి తగలడండి” అంటూ ఓపిక తెచ్చుకుని అరిచాడు.

అలా అరవడంలో అతనికి నొప్పి తెలిసొచ్చింది. పొత్తికడుపు దగ్గర! “అమ్మా.....!” అని బాధగా మూలిగి చేత్తో అక్కడ తడుముకున్నాడు. అతని చేతికి బ్యాండేజ్ తగిలింది. లీలగా అప్పారావ్ కి అన్నివిషయాలూ గుర్తుకు రాసాగాయ్. రాంబాబు, చిన్నారావ్ ల సెక్యూరిటీని పరిశీలించడానికి నర్సింగ్ హోం కి రావడం, కారిడాల్లో డాక్టర్ శ్రీనివాస్ కి డ్యాష్ ఇవ్వడం.

శ్రీనివాస్ తనకి ఆపరేషన్ చేస్తానని అనడం, తను పెనుగులాడడం, డాక్టర్ శ్రీనివాస్ తన ముక్కుకి క్లోరోఫాంలో ముంచి, కర్చీఫ్ ని అడిమిపట్టడం, అన్ని గుర్తుకు వచ్చాయ్. “ఏంటి! కొంపదీసి నాకు ఆపరేషన్ గానీ చేసేశారా?” కంగారుగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

నలుగురు కానిస్టేబుల్స్ అవునన్నట్టు తలలు ఊగించారు.

“ఏ ఆపరేషన్?” భయంగా అడిగాడు ఇన్స్ పెక్టర్. ఆ ప్రశ్న వినగానే మళ్ళీ ఆ సేన్స్ టివ్ కానిస్టేబుల్ దభేల్ మని ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మీద పడి రోధించాడు.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బాధగా మూలిగాడు. “ఏంట్రా బాబూ నువ్వు? అసలే ఆపరేషన్ నొప్పితో నేను బాధపడ్తుంటే, నువ్వు దభేల్ ధభేల్ మని నా మీద పడిపోతున్నావ్. లే..................” విసుక్కుంటూ అన్నాడు.

కానిస్టేబుల్ లేచి కళ్ళు తుడ్చుకున్నాడు.

“ఇప్పటికయినా చెప్పేడుస్తావా నాకసలు ఏం ఆపరేషనైందో?”

ఇంతలో దూరంగా డాక్టర్ శ్రీనివాస్ రావడంతో ఓ కానిస్టేబుల్ కంటబడింది. “అదిగోండి సార్.............! మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారేవస్తున్నారు. మీరు ఆయన్ని అడిగి తెల్సుకుంటేనే మంచిది. మా నోటితో మేం చెప్పలేం సార్” అన్నాడా కానిస్టేబుల్.

డాక్టర్ శ్రీనివాస్ అప్పారావ్ బెడ్ ని సమీపించాడు. “హౌ ఆర్ యూ ఫీలింగ్ నవ్ అప్పారావ్?” చిరునవ్వుతో డాక్టర్ శ్రీనివాస్.

“నేనెలా ఫీలవుతున్నానో ఆ సంగతులన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అసలు నాకే ఆపరేషన్ చేశావో చెప్పూ” గట్టిగా అరిచి, మళ్ళీ కుట్ల దగ్గర నెప్పెట్టి బాధగా “హమ్మా” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“చెప్తానుగానీ, మరి నువ్వేమీ ఫీలవకూడదు!” సిగ్గుపడుతూ డాక్టర్ శ్రీనివాస్

“ఫీలవను! త్వరగా చెప్పు!” పళ్ళు కొరుకుతూ అన్నాడు అప్పారావ్.

“పొరబాట్లు జరగడం మానవ సహజం కదా- మీరు కూడా ఒక్కొక్కప్పుడు నిర్దోషిని దోషి అనుకుని అరెస్టు చేస్తుంటారు. అవునా?” కులాసాగా అడిగాడు డాక్టర్ శ్రీనివాస్.

“నాకూ ఏం ఆపరేషన్ చేశారో చెప్పకుండా ఈ సోదేంటిరా నాయనో...........” జుట్టు పీక్కుంటూ బాధపడ్డాడు అప్పారావ్.

“ఓక్కే.... ఓక్కే.... చెప్తాను!” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

రెండు క్షణాలాగి గొంతు సవరించుకొని అప్పారావ్ కి చెప్పాడు తను ఏం ఆపరేషన్ చేశాడో.

అది విన్న అప్పారావ్ కొన్ని క్షణాలపాటు కొయ్యబారిపోయి తర్వాత ఘోల్లుమని ఏడ్చాడు.