TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
గజదొంగ మంగులు డెన్. మంగులు కాళ్ళమీదపడి భోరున విలపిస్తున్నారు డేవిడ్, జాకబ్ లు. వాళ్ళ వ్యవహారం చూస్తే మంగులుకి ఒళ్ళు మండిపోయింది. తన రెండు కాళ్ళనూ వదిలించి కొట్టాడు. వాళ్ళిద్దరూ ఎగిరి వెల్లకితలా పడ్డారు.
“ఏరా.... అసలు మిమ్మల్ని డిప్పల్లో నర్సింగ్ హోమ్ కి ఎందుకు పంపించాను? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకురావడానికా?” కోపంగా అరిచాడు మంగులు.
“మాకసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే ఉద్దేశమే లేదు బాస్..... వాళ్ళే చేసేశారు.....” నెత్తి కొట్టుకుంటూ అన్నాడు డేవిడ్.
“కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మాకెందుకూ..... వద్దని చెప్పలేరా? మీరేమైనా మూగ మొద్దులా?”
“వద్దని చెప్పడానికి ఆపరేషన్ ముందు మాకు చేస్తున్నట్టు చెప్తే కదా బాస్......” అన్నాడు డేవిడ్.
“అంటే ఆపరేషన్ చేస్కోండని హాయిగా చెప్పేశారన్న మాట” చికాకుగా అన్నాడు మంగులు.
“కాదు బాస్.... ఆపరేషన్ చేసినట్టే మాకు తెలీదు బాస్.... మా ఇద్దరికీ మత్తు మందు ఇచ్చి చేసేశారు బాస్” ఘేల్లుమన్నాడు జాకబ్.
“ఆ....!! అంత పని చేశారా?!”
“అవును బాస్.... ఈ విషయం తెలిస్తే మా ఆవిడ తంతుంది బాస్......” ఏడుపు గొంతుతో ఆన్నాడు డేవిడ్.
“వాడికయినా పెళ్ళాం వుంది... ఈ విషయం తెలిస్తే నాకు పిల్లనెవరిస్తారు బాస్” ఘోల్లుమన్నాడు జాకబ్.
మంగులు కూడా జుట్టు పీక్కుంటూ “ఆ............హాహాహా.... హయ్యో” అంటూ బాధపడ్డాడు. డేవిడ్, జాకబ్ లిద్దరూ ఆశ్చర్యంగా చూశారు.
“మీరేంటి బాస్ మాకంటే ఎక్కువ బాధపడుతున్నారు?” అడిగాడు డేవిడ్.
“మీరిప్పుడు నాకు పెద్దపని పెట్టారుకదరా.....హయ్యో...ఆహాహాహా....” బాధపడ్తూ అన్నాడు మంగులు.
“పనా....! ఏంటి బాస్ అది?” ఆశ్చర్యపోతూ అడిగాడు జాకబ్.
“మీకు ప్యామిలీ ప్లానింగ్ చేసి పంపించిన ఆ డాక్టర్ గాడిని చంపుతానని నా చేతులు కాల్చుకుని శపథం చెయ్యాలి కదరా దరిద్రులారా..... హబ్బా......” బాధగా అన్నాడు మంగులు జుట్టు పీక్కుంటూ.
రాంబాబుకీ, లింగారావ్ కీ డిప్పల్లో నర్సింగ్ హోంలో హాయిగా గడిచిపోతుంది. ముందు ఎప్పుడెప్పుడు అక్కడినుండి బయటపడదామా అని ఆలోచించిన వాళ్ళిద్దరూ ఇప్పుడు అక్కడే సెటిలయిపోతే బాగుణ్ను అన్న స్టేజీకి వచ్చారు. దానికి కారణం.............? సరోజ............... సునీత!
“సరోజ నాకు ఇంజక్షన్ చేస్తుంటే నా చెయ్యంతా లాగేస్తుందిరా చిన్నా!” పరవశంగా అన్నాడు రాంబాబు.
“అవునుమరి........... ఇంజక్షన్ చేస్తే నొప్పితో చెయ్యట్టాగే లాగేస్తుంది” అన్నాడు చిన్నారావ్ బత్తాయ్ పండు వొలుస్తూ. రాంబాబు చికాకుగా చిన్నారావ్ ని చూశాడు.
“చెయ్యి జివ్వున లాగేది సరోజ టచ్ తో ............. ఇంజక్షన్ నొప్పితో కాదు.”
చిన్నారావ్ నాలుక కర్చుకున్నాడు. “బత్తాయ్ పండు వొలవడంలో పడి నీ భావం గ్రహించలేదు.... హిహిహి.......” ఇబ్బందిగా నవ్వాడు.
“నీకెప్పుడూ తిండిగోలే.... నేను చెప్పే తియ్యటి కబుర్లు నీకేందుకులే....... ఆ బత్తాయ్ పండు మింగుతూ కూర్చో......” విసుగ్గా అన్నాడు రాంబాబు.
“విసుక్కోకురాబాబూ... నీకంటే ఎక్కువ ఫీలింగ్స్ వున్నాయ్ నాకు....... సరోజ ఇంజక్షన్ చేస్తే నీకు చెయ్యి మాత్రమే జివ్వుమంటుంది. సునీత ఇంజక్షన్ చేస్తే నాకు ఒళ్ళంతా జివ్వుమంటుంది” అన్నాడు చిన్నారావ్ పరవశంగా.
“బహుశా నీకు తిమ్మిర్ల రోగం అయి వుంటుంది........ అందుకే ఒళ్ళంతా జివ్వున లాగుతోంది” కోరగా చూస్తూ అన్నాడు రాంబాబు.
“కుళ్ళు... కుళ్ళు...! నీకు చెయ్యొక్కటే జివ్వంటుందనీ నాకు ఒళ్ళంతా జివ్వుమంటుందనీ నీకు జెలసీ........” పళ్ళు కొరుకుతూ అన్నాడు చిన్నారావ్.
“చూడూ... నిన్ను చూసి జెలసీ పడాల్సిన అవసరం నాకులేదు......... నాకు సరోజ వుంది.....” అన్నాడు చరాంబాబు.
“నాకూ నిన్నుచూసి జెలసీ పడాల్సిన అవసరం నాకులేదు........ నాకూ సునీత వుంది” గర్వంగా అన్నాడు చిన్నారావ్. రాంబాబు ఆలోచనలోపడ్డాడు.
“ఒరేయ్ చిన్నా.... నాకు సరోజ వుంది... నీకు సునీత వుందని అనేస్కుంటున్నాంగానీ మనం వాళ్ళకి వున్నాం అని వాళ్ళు అనుకోవాలి కదా?” అన్నాడు మెల్లగా.
“అదీ నిజమే....!” బుర్ర గోక్కున్నాడు చిన్నారావ్.
“ఒకవేళ వాళ్ళు మనలా అనుకున్నా కూడా అందులో మరో ప్రమాదం పొంచి వుంది.”
“ఏంటది?” కుతూహలంగా అడిగాడు చిన్నారావ్.
“ఏంలేదు న్యాయంగా నాకూ రాంబాబు వున్నాడు అని సరోజ అనుకోవాలి.... అలా కాకుండా నాకూ చిన్నారావ్ వున్నాడని అనుకుందనుకో.....”
“హి హి హి.............” సంబరంగా నవ్వాడు చిన్నారావ్.
“ఇలా ఇకిలించొద్దు..... నేను చెప్పాల్సింది ఇంకా పూర్తికాలేదు...... సునీత కూడా చిన్నారావ్ వున్నాడు అని కాకుండా నాకు రాంబాబు ఉన్నాడు అనుకుందనుకో...!” కొంటెగా చూస్తూ అన్నాడు రాంబాబు.
“వామ్మో....” గుండెల మీద చేయ్యేస్కుంటూ అరిచాడు చిన్నారావ్.
“కాబట్టి మనం ఓ పని చెయ్యాలి.”
“ఏంటది?”
“వీలైనంత త్వరగా మన మనసులోని మాట వాళ్ళకి తెలియజేయ్యాలి.”
“కానీ మనల్ని రేపు డిశ్చార్జి చేసేస్తాం అని డాక్టర్ యిందాక చెప్పాడు కదా?” గుర్తు చేశాడు చిన్నారావ్.
రాంబాబు క్షణంపాటు ఆలోచించి “ఆ... ఐడియా.” అన్నాడు సంతోషంగా.
“ఏంటది?”
“ప్రక్క వార్డులో ఎవరికైనా బ్లడ్ ఎక్కిస్తుంటారు కదా..... ఇప్పుడు అందరూ నిద్రపోతూ వుంటారు.... మనం ఎవరికీ తెలియకుండా రెండు బ్లడ్ బాటిల్స్ కొట్టేయ్యాలి.”
“ఎందుకూ?”
“వాటితో మనం మన బుర్రమీద గట్టిగా కొట్టుకోవాలి...... ఆ బ్లడ్ బాటిల్స్ పగిలేలా” చెప్పాడు రాంబాబు.
|
|