అందరూ దొంగలే - 27

Listen Audio File :

“ఇద్దరూ టేబుల్స్ మీద పడుకోండి” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

ఇద్దరూ ప్రక్క ప్రక్కనే వున్న రెండు టేబుల్స్ మీద పడుకున్నారు.

“ఇప్పుడు టెస్టులన్నీ చెయ్యాలా?” అడిగాడు డేవిడ్.

“టెస్టులెందుకూ? ఏ టేస్టూ అక్కర్లేదు....” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

“ఏ టేస్టూ చేయకుండానే మమ్మల్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్కుంటారా?” అడిగాడు జాకబ్.

“అడ్మిషనా? నిమిషాల్లో అయిపోయేదానికి అడ్మిట్ అవడం ఎందుకూ?” ఆశ్చర్యపోతూ అడిగాడు డాక్టర్ శ్రీనివాస్.

డేవిడ్, జాకబ్ ఇద్దరూ కంగారుపడ్డారు. తాము నర్శింగ్ హోం లో అడ్మిట్ కాకపొతే రాంబాబు, చిన్నారావ్ లను చంపడం కష్టం. “అదికాదండీ డాక్టర్ గారూ! మరేమో.... డేవిడ్ ఏదో చెప్పేంతలోనే డాక్టర్ శ్రీనివాస్ అతన్ని ప్రశ్నించాడు, “మీకు పిల్లలెంత మంది?”

“ఒక్కళ్ళుకూడా లేరు” చెప్పాడు డేవిడ్, మధ్యలో ఈ అనవసరమైన ప్రశ్నలెందుకా అని అనుకుంటూ.

“మరి మీకు?” జాకబ్ ని అడిగాడు డాక్టర్ శ్రీనివాస్.

“నాకసలు పెళ్ళేకాలేదు” కులాసాగా చెప్పాడు జాకాబ్.

“వెరీగుడ్! మీరు దేశ సంక్షేమం చాలా చాలా కోరే మనుషులన్న మాట! అంటే దేశ భక్తులన్న మాట!” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. డేవిడ్, జాకబ్ లకి ఏం అర్ధం కాలేదు. ఇద్దరూ మొహమొహాలు చుస్కున్నారు అయోమయంగా.

“అదేనయ్యా బాబూ! మీరు జనాభా పెరక్కుండా చూస్తున్నారు కదా...... అందుకని అలా అన్నాను” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

“అవును! నేను ఇప్పటికి ముప్పయ్ మందిని ఖతం చేశా!” గర్వంగా అన్నాడు జాకబ్.

“వాడి మొహం.... వాకలానే పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. మీరేం పట్టించుకోకండి డాక్టర్ గారూ.....” కంగారు పడుతూ అన్నాడు డేవిడ్.

డాక్టర్ శ్రీనివాస్ జాకబ్ వంక అయోమయంగా చూశాడు. “అవును డాక్టర్... నేనప్పుడప్పుడూ అలా పిచ్చి పిచ్చిగానే మాట్లాడతాను.......... హిహిహి...” నవ్వాడు జాకబ్.

“సరేగానీ డాక్టర్... మీరు మమ్మల్ని నర్సింగ్ హోంలో అడ్మిట్ చేసేస్కోండి డాక్టర్”అన్నాడు డేవిడ్.

“కానీ మిమ్మల్ని నర్సింగ్ హోంలో అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదయ్యా బాబూ” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

“కానీ మాకు అవసరం వుంది డాక్టర్” అన్నాడు డేవిడ్.

“అవును డాక్టర్.... ప్లీజ్ డాక్టర్..... మమ్మల్ని అడ్మిట్ చేస్కోండి డాక్టర్”

“కుదర్దయ్యా బాబూ....” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్

“మీరు తల్చుకుంటే కుదుర్తుంది డాక్టర్ గారూ....” అన్నాడు డేవిడ్.

“ప్లేజ్.... మా కోసం తల్చుకోండి డాక్టర్.....” అన్నాడు జాకబ్. డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ సింగినాధం అన్న మాటలు గుర్తుకు వచ్చాయ్. వాళ్ళిద్దరూ పరమ సోదిగాళ్ళనీ..... అతని బుర్రని తినేశారనీ సింగినాధం అన్నాడు. వీళ్ళతో ఇక లాభంలేదని అనుకున్నాడు డాక్టర్ శ్రీనివాస్.

“ఓక్కే... ఓక్కే.... ఒక్క క్షణం మీరు నిశ్శబ్దంగా వుండండి.....” అన్నాడు వాళ్ళిద్దర్తో. ఆపరేషన్ థియేటర్ మూలకి వెళ్ళి కాటన్ మీద క్లోరోఫాం వేస్కుని వాళ్ళిద్దరి మంచాల మధ్యకి వెళ్ళి ఇద్దరి ముక్కులమీదా రెండు చేతుల్తో క్లోరోఫాంతో తడిచిన కాటన్ ని పెట్టి వత్తాడు. డేవిడ్, జాకబ్ లు స్పృహ తప్పారు.

డేవిడ్, జాకబ్ మెల్లగా కళ్ళు తెరిచారు. ఎదురుగా వాళ్ళకి డాక్టర్ శ్రీనివాస్ మొహం మసక మసగ్గా కనిపించింది. ఇద్దరూ కాస్త గట్టిగా తల విదిలించి చూశారు. ఈసారి డాక్టర్ కాస్త స్పష్టంగా కన్పించింది. “ఏంటీ...? మాకేమైంది....?? మేం ఎక్కడున్నాం???....” అని అడిగాడు డేవిడ్.

“మీరు మా నర్సింగ్ హోంలో ఉన్నారు....... మీకేం కాలేదు” చిరునవ్వుతో అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

“అంటే మమ్మల్ని మీ నర్సింగ్ హోం లో అడ్మిట్ చేసేస్కున్నారా??” అడిగాడు జాకబ్.

“అడ్మిట్ చేస్కోడం ఏంటి? ఇప్పుడు కాస్సేప్పట్లో డిశ్చార్జి కూడా చేసేస్తున్నాం”

“అదేంటి డాక్టర్..... అప్పుడేనా?” జాకబ్ అడిగాడు.

“పనైపోయిందిగా... ఇంకెందుకూ? మీరు తీస్కోవల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలని వచ్చా.....

ఓ నాలుగైదురోజులు మెల్లగా నడవండి. కంగారు కంగారుగా నడవడం గానీ, పరిగెత్తడం గానీ, చెయ్యొద్దు”

“కానీ ఈ జాగ్రత్తలన్నీ మాకెందుకు చెపుతున్నారు?” బుర్రకాయ్ గోక్కుంటూ అడిగాడు డేవిడ్.

“ఎందుకేమిటి..... మీ ఇద్దరికీ ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ప్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేశాను కదా......” అన్నాడు డాక్టర్ శ్రీనివాస్.

“బాబోయ్.....” అంటూ ఒక్కసారిగా గావు కేక పెట్టారు డేవిడ్, జాకబ్ లు.