అందరూ దొంగలే - 18

Listen Audio File :

అది డిప్పల్లో నర్సింగ్ హోమ్.

ఆ నర్శింగ్ హోం లోంచి ఓ ఊరకుక్క బులెట్ లా బయటికి పరిగెత్తుకు వచ్చింది. దాని నోట్లో ఓ ఎముక ఉంది. ఆ కుక్క వెనకాలే ఓ డాక్టర్ వేగంగా పరిగెత్తుకొచ్చాడు.

అతని మొహంలో చెప్పలేనంత కంగారు. “ఏయ్ ఆగవే, ఆగు దరిద్రం ముండ......” ఆ ఎముక రోగి ఎముక్కి అతికించి చర్మం కలిపి కుట్టాలే.... రా....” కోపంగా అరిచాడు డాక్టర్ దాని వెనకాలే పరుగుతీస్తూ.

కానీ పాపం ఆ కుక్కకి డాక్టర్ ఆపరేషన్ గురించి తెలీదూ.... ఆయనిప్పుడెం అంటున్నాడో కూడా అర్ధం కాలేదు.... దానికి తెలిసిందల్లా దానికి గొప్ప పెన్నిధి దొరికింది.... అంతే! కుక్క ఇంకాస్త స్పీడ్ అందుకొని పక్క సందులోకి పరుగు తీసింది. డాక్టర్ కూడా లబలబలాడుతూ ఆ సందులోంచి పరుగు తీశాడు. సరిగ్గా అదే సమయంలో డిప్పల్లో నర్సింగ్ హోం ముందు పోలీస్ జీపు ఆగింది.

జీపు వెనక నుండి రాంబాబు, చిన్నారావ్ లను నలుగురు కానిస్టేబుల్స్ మోసుకుని క్రిందకి దింపి మళ్ళీ నలుగురూ వాళ్ళని మోస్కుని నర్సింగ్ హోం లోపలికి తీస్కేళ్ళారు. వాళ్ళని కమీషనర్ లింగారావ్ అనుసరించాడు. గంట తర్వాత....

ఆపరేషన్ ధియేటర్ లో రాంబాబు, చిన్నారావ్ లు రెండు ఆపరేషన్ టేబుల్స్ మీద పడుకున్నారు. వాళ్ళకి ఆపరేషన్ చేసి బుల్లెట్స్ తియ్యాలి. డాక్టర్ సింగినాధం ఆపరేషన్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. ఆపరేషన్ సరంజామాలో ఓ రంపం, సుత్తె, ఉలి, కొడవలి, మాంసం కొట్టే కత్తి ఇవన్నీ ఉన్నాయ్. “ఏంటే?..... వీటితో ఆపరేషన్ చేస్తారా?... “భయం భయంగా అడిగాడు రాంబాబు.

“అవును అన్నాడు డాక్టర్ సింగినాదం గంభీరంగా.

“అయినా ఆ ఉలీ, సుత్తీ ఎందుకూ?” ఈసారి చిన్నారావ్ ప్రశ్నంచాడు.

“ఎందుకా?.... చక్కని ఈ నల్లని రాలలో.... ఏ కన్నులు దాగెనో అని పాడుకుంటూ ఆ ఉలిపెట్టి అమరశిల్పి జక్కన్నలా సుత్తితో కొడ్తూ మీ ఒంట్లోని బుల్లెట్స్ బయటికి తీస్తా!”

“కెవ్ వ్ వ్....” అని అరిచారు ఇద్దరూ.

“బాధపడకండి... మీకు ఆపరేషన్ చేశాక ఏ నొప్పీ లేకుండా హాయిగా ఉంటారు” అన్నాడు డాక్టర్ సింగినాధం.

ఇంతలో ఆపరేషన్ ధియేటర్ లోకి ఓ నర్స్ వచ్చింది. ఆమె వచ్చీ రాగానే డాక్టర్ సింగినాధం గుండెల మీద వాలిపోయింది.

“అదేంటీ! ఆమె డాక్టర్ గుండెల మీద అలా వాలిపోయింది?” ఆశ్చర్యంగా అడిగాడు చిన్నారావ్.

“ఆపరేషన్ ముందు డాక్టరూ, నర్సూ అలా చెయ్యడం ప్రోసిజరనుకుంటా.... నువ్వు మరీ పల్లెటూరి గబ్బిలాయ్ లా పిచ్చి ప్రశ్నలేయకు” అంటూ రాంబాబు చిన్నారావ్ ని మందలించాడు.

డాక్టర్, నర్స్ ఇద్దరూ కళ్ళు మూస్కుని పరవశంగా ఒకరినొకరు పట్టుకున్నారు.

“మీ ప్రొసీజర్ ప్రకారం అలా ఎంతసేపు పట్టుకునుండాలి డాక్టర్” కుతూహలంగా అడిగాడు రాంబాబు.

ఇద్దరూ కళ్ళు తెరిచి రాంబాబు వంక మిర్రిమిర్రి చూశారు. అదేం గమనించకుండా చిన్నారావ్ అమాయకంగా ఇలా ప్రశ్నించాడు.

“ఇందాక ఉలీ, సుత్తి గురించి చెప్పారు. మరి ఆ రంపం, మటన్ కొట్టే కత్తీ ఎందుకు డాక్టర్?” డాక్టర్ సింగినాధం

“ఆ....” అంటూ బాధగా అరిచి జుట్టు పీకున్నాడు. తర్వాత నర్స్ తో ఇలా అన్నాడు – “నువ్వు వెంటనే అనె స్తీషి యన్ ని పిలువ్...... వీళ్ళకి మత్తిచ్చి ఆపరేషన్ చేసి పారెయ్యాలి.... లేకపోతే ఇలాంటి పిచ్చి ప్రశ్నలే వేస్తూ వుంటారు.”

నర్స్ “ఓక్కే సార్!” అంటూ బయటికి వెళ్ళిపోయింది. డాక్టర్ మటన్ కత్తిని తీసి దానికి పదునుపెట్టడం మొదలుపెట్టాడు.

రాంబాబు, చిన్నారావ్ లు అతని వంక భయంభయంగా చూశారు. ఆపరేషన్ ధియేటర్ బయట పోలీస్ కమీషనర్ కాలుకాలిన పిల్లిలాగా అటూ ఇటూ టెన్షన్ గా తిరుగుతున్నాడు. కానిస్టేబుల్స్ మాత్రం సంప్రదాయబద్ధంగా కాలుగాలిన పిల్లుల్లాగా తిరుగుతున్నారు. రాంబాబు, చిన్నారావ్ లకి ఆపరేషన్ మొదలుబెట్టి అప్పటికే గంటపైనే అయ్యింది.

“సార్..... మనం తలుపులు బద్దలుకొట్టుకుని లోపలికెల్దామా సార్?” ఉత్సాహంగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“షటప్.... మనమేం నక్సలైట్లని ఏన్ కౌంటర్ చెయ్యడానికి రాలేదు.... లోపల ఆపరేషన్ జరుగుతుంది” విసుగ్గా అన్నాడు కమీషనర్ లింగారావ్. అతనా మాట అంటుండగానే డాక్టర్ సింగినాధం ఆపరేషన్ ధియేటర్ తలుపులు తెర్చుకుని బయటికొచ్చి “ఆపరేషన్ సక్సెస్” అన్నాడు కమీషనర్ లింగారావ్ వంక చిరునవ్వుతో చూస్తూ.

కమీషనర్ లింగారావ్ సహా అక్కడున్న అందరూ సింగినాధాన్ని చూసి కెవ్వుమని అరిచారు.

“ఎందుకలా అరిచారు?!” ఉలిక్కిపడి అడిగాడు డాక్టర్ సింగినాధం.

“మీ మెడలో పెగులున్నాయ్ డాక్టర్!” చెప్పాడు కమీషనర్ లింగారావ్ భయం భయంగా.

డాక్టర్ సింగినాధం నాలుక కర్చుకుని ఆపరేషన్ ధియేటర్ లోపలికి పరిగెత్తి తలుపులు మూస్కున్నాడు. మళ్ళీ ఓ అరగంట తర్వాత తలుపులు తెరిచి “ఆపరేషన్ సక్సెస్” అన్నాడు డాక్టర్ సింగినాధం అందరివైపు చూస్తూ.

అందరూ ఆనందభాష్పాలు రాల్చారు.