అందరూ దొంగలే - 75

Listen Audio File :

 రాంబాబు చెప్పింది విని సరోజ, సునీత లు ఉలిక్కిపడ్డారు.

“అబ్బ!” బాధగా అరిచాడు పేషంట్.

“ఏంటయ్యా బాబూ.. అసలు అలా అరవాల్సింది మేము. నువ్వెందుకు అరిచావ్?” పేషంట్ మీద విసుక్కుంది సరోజ.

“మీరు జబ్బలో సూదిని గట్టిగా గుచ్చేశారు సిస్టర్!” బేర్ మంటూ అన్నాడు పేషంట్.

“చూశావా.. అందుకే అలాంటి విషయాలు నేను ఇంజక్షన్ చేసేప్పుడు చెప్పొద్దు రాంబాబూ" అంది సరోజ.

రాంబాబు బుర్ర గోక్కున్నాడు,

పేషంట్ ఇంకా గోలెడ్తూనే వున్నాడు.

“అబ్బ... ఆపవయ్యా బాబూ.... నీకిచ్చింది ఎలాగూ మత్తు ఇంజక్షనేగా.... ఏ నొప్పి లేకుండా హాయిగా పడుకుంటావులే.” సరోజ ఇలా అంటూండగానే ఆ పేషంట్ నిద్రలోకి జారుకున్నాడు.

“అబ్బా... వెంటనే నిద్రలోకి జారుకున్నాడే!” అన్నాడు చిన్నారావ్ ఆశ్చర్యంగా చూస్తూ.

ఇంకా మందు వున్నా సిరంజీని టేబులు మీద పెడ్తూ రాంబాబుని అడిగింది సరోజ. “మరి మీరు జైల్లోంచి పారిపోయి వస్తే ఇంకా ప్రమాదం కదా?” “పోలీసులు ఈపాటికే మీ కోసం వేట ప్రారంభించి వుంటారు..... ఆ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి మీరు దొరికారంటే మీ మీద ఇంతకు ఇంత పగ తీర్చుకుంటాడు" అంది సునీత.

“వాడి మొహం. వాడికి మేము దొరికితే కదా!” అన్నాడు రాంబాబు తేలిగ్గా నవ్వేస్తూ.

“అవును..... నా మొహం...... నాకు మీరు దొరికితే కదా! ఎందుకంటే నేనొట్టి సన్నాసిని కదా?!” వెనుకనుండి ఓ గొంతు వినిపించింది.

నలుగురూ తలలు త్రిప్పి చూశారు. గుమ్మంలో ఇన్స్ పెక్టర్ అప్పారావ్..... అతని వెనకాల నలుగురు కానిస్టేబుల్స్.!”

“రాంబాబూ... అండ్ చిన్నారావ్! యూ ఆర అండర్ అరెస్ట్!” ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రివాల్వర్ గురిపెట్టాడు.

రాంబాబు, చిన్నారావ్ లు వెర్రిమొహాలు వేశారు. అప్పారావ్ పకపకా నవ్వాడు.

“నేనిలా వస్తానని మీరు ఊహించలేదుకదూ?” అప్పారావ్ రాంబాబుని సమీపించాడు.

“నేనెప్పుడూ అంతే.... హఠాత్తుగా ఎవరూ ఊహించని పన్లు చేస్తా....” రాంబాబు చట్టుక్కున టేబుల్ మీది ఇంజక్షన్ తీసి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ జబ్బలోకి కసుక్కున గుచ్చాడు.

ఇన్స్ పెక్టర్ "ఆ....” అని అరిచి తర్వాత రివాల్వర్ ని రాంబాబుకి గురిపెట్టాడు.

“ఈ రోజుతో నీ పని సరి!” అన్నాడు.

రాంబాబు రెండు చేతులూ పైకెత్తాడు, అయోమయంగా సరోజ వంక చూస్తూ.

అంతలోనే నేలమీద దబ్బుమని పడిన శబ్దం!

రాంబాబు తలతిప్పి చూస్తె నేలమీద ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అచేతనంగా పడి వున్నాడు. రాంబాబు క్షణం ఆలస్యం చెయ్యకుండా కిందికి వంగి రివాల్వర్ అందుకుని ముందుకి వస్తున్న పోలీసులకు గురిపెట్టాడు. “అక్కడే ఆగండి!”

నలుగురు పోలీసులూ ఠక్కున ఆగిపోయారు.

“నలుగురూ ఆ గోడ దగ్గరికెళ్ళి, గోడకి మొహాలు ఆనించి నిలుచోండి. ఊ...” సీరియస్ గా అన్నాడు రాంబాబు.

నలుగురు పోలీసులూ అతను చెప్పినట్టు చేశారు.

“మేము ఇక్కడినుండి వెళ్ళేదాకా అలాగే నిల్చోండి. ఏమాత్రం పిచ్చి వేషాలేసినా ఈ రివాల్వర్ తో మీ బుర్రకాయ్ లు "ఢాం.......ఢాం.....” అంటూ పేల్చేస్తా" అంటూ వార్నింగ్ ఇచ్చాడు రాంబాబు.

పోలీసులు అలాగే అన్నట్టు బుర్రకాయలు ఊపారు. రాంబాబు, చిన్నారావ్ లు సరోజ, సునీతలకి టాటా చెప్పి నర్శింగ్ హోంలోంచి బయటికి పరుగుతీశారు.