‘భారతరత్న’ బావురుమంది...

 

భారతరత్న బావురుమంది...

-పద్మశ్రీ

మనిషిలోని ప్రతిభకి పట్టంకట్టే పురస్కారం అవార్డు.

చిన్నపిల్లలకి స్కూళ్ళలో ఆటలపోటీలు, డాన్స్ పోటీలు గట్రా నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి ఓ మొమెంటో ఇస్తారు.

అదొక అవార్డు. నిజాయితీగా కష్టపడి సంపాదించుకున్న అవార్డు. అలాంటి అవార్డు అందుకున్న ఆ పిల్లలు ఎంత సంతోషిస్తారో మాటలలో చెప్పలేనిది.

ఇదిలా వుండనిస్తే...

ఆయా రంగాలలో విశేష సేవలందించి, సమాజానికి మేలు కలిగించే విధంగా కార్యక్రమాలని రూపొందించి, భావితరాలకు స్పూర్తిని కలిగించే విశిష్టమైన వ్యక్తులను గుర్తించి ప్రభుత్వం వారిని అవార్డులతో సత్కరిస్తుంది.

ఆ అవార్డు పొందిన వ్యక్తికి సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి.

మనిషిని ఉన్నతంగా మార్చే ఈ అవార్డులని అందుకున్న వ్యక్తులని స్పూర్తిగా తీసుకుని, తాము కూడా అలాంటి అవార్డుని పొందాలనే పట్టుదలతో, నిజాయితీగా కృషి చేసేవారు ఎంతోమంది ఉంటారని అనడంలో సందేహం లేదు.

కానీ ఇప్పుడు అలాంటి రోజులు పోయాయి. ప్రతిభకి పట్టం కడుతూ ఇచ్చే అవార్డులు అనేక సమస్యలని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు అవార్డుని అందుకోవాలంటే కావాల్సింది ప్రతిభ కాదు పైకం..

డబ్బులతో ఎలాంటి అవార్డునైనా ఇట్టే సంపాదించొచ్చు. రాజకీయనాయకుల అండుంటే ఇంక చెప్పాల్సిన పనేలేదు.. ఎన్నో అవార్డులు ఒళ్లోకి వచ్చిపడతాయి.

ఈ రోజుల్లో ప్రభుత్వం తరపున అందించే ఏ అవార్డు విషయంలోనైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులు ప్రతిభావంతులకి చేరుతున్నాయా అంటే సందేహమే..!

ఎంతో కొంత ప్రతిభ కనబర్చి మరికొంత పైరసీలు చేస్తే చాలు బోలెడు అవార్డులు చేతిలో వచ్చి పడుతున్నాయి. మామూలు అవార్డుల విషయం గురించి పక్కన పెడితే. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు విషయంలో కూడా ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు భారతరత్న ఈ అవార్డుని ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక భారత ప్రభుత్వం తల పట్టుకుంది. ఈ అవార్డు తమ నాయకుడికే ఇవ్వాలంటే కాదు తమ నాయకుడికే ఇవ్వాలని రాజకీయ నాయకులు కొట్టుకుంటున్నారు. వారి వారి నాయకులు వారికి మాత్రమే గొప్పకానీ భారతదేశ ప్రజలకి కాదు కదా!

పైగా వీరిలో అక్రమ మార్గంలో ఆస్థులను పెంచుకున్నవారూ, పదవికోసం కండబలాన్ని ఉపయోగించే నాయకులు కూడా ఉన్నారు...

హవ్వ! ఎంత సిగ్గు చేటు..? ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో వీధి గూండాలకి కూడా(పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న)

ఆ అవార్డుని ఇవ్వాలని డిమాండ్ చేస్తారేమో...! అయినప్పటికీ ఆ అవార్డుని పొందడం కోసం ఇలా డిమాండ్ చేయడం ఏమన్నా బావుందా....?

ఇలా చేస్తే ఆ అవార్డుకి ఉన్న గౌరవం తగ్గిపోతుందన్న ఆలోచన కూడా లేకుండా పోయింది అవార్డుని రికమెండ్ చేసే వారికి.

ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులకి రాజకీయ రంగు పూయకుండా స్వచ్చందంగా ప్రజానిర్ణయం తీసుకుని మెజారిటీ లభించిన వారికే ఆ అవార్డు దక్కేలా చేస్తే బాగుంటుంది. లేదంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇన్నాళ్ళూ గౌరవాన్ని పొందిన నా పరిస్థితి ఇంత ఘోరంగా అయిందేమిట్రా భగవంతుండా అని భారతరత్న బావురుమంటుంది.