అందరూ దొంగలే - 41

Listen Audio File :

కమీషనర్ రాంబాబు, చిన్నారావ్ లని చూస్తూ “మా పాప దీప విషయంలో మాట్లాడాలని మిమ్మల్నిప్పుడు యిక్కడికి పిలిపించాం...” అన్నాడు.

“చెప్పండి సార్...!” అన్నారు రాంబాబు, చిన్నారావ్ లిద్దరూ కోరస్ గా. స

రిగ్గా ఆ సమయంలోనే దీప బయటినుండి ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చి”డాడీ...” అంటూ కమీషనర్ లింగారావ్ ఒళ్ళోకి ఎగిరి గంతేసి కూర్చుని అతని మెడచుట్టూ చేతులు వేసింది.

లింగారావ్ పాప బుగ్గలమీద ముద్దులు పెట్టి “ఇక్కడికెళ్ళావు చిట్టి తల్లీ?” అని అడిగాడు.

“బోరుకొట్టి పక్కింటికెళ్ళా డాడీ... అక్కడ చక్కగా ఇల్లంతా పరుగులు తీస్తూ, సోఫా ఎక్కి దూకుతూ కాస్సేపు ఆడుకున్నా.... అప్పుడు ఆంటీ ఏమో నాకు తలనొప్పిగా వుంది... ఇంక మీ ఇంటికెళ్ళి ఆడుకోమ్మా అని పంపించేసింది....”అంది దీప కళ్ళు తిప్పుతూ.

“రేపట్నుండి నీకేం బోరు కొట్టదులే... ఈ అంకుల్స్ ఉన్నారుగా...” అని రాంబాబు, చిన్నారావ్ లని చూపించాడు కమీషనర్ లింగారావ్. వాళ్ళని ఎగాదిగా చూసింది దీప.

“అంకుల్స్ కి హలో చెప్పు” అన్నాడు కమీషనర్ లింగారావ్.

“నేను చెప్పను పో...” అని లింగారావ్ ఒళ్లోంచి కిందకి దూకి లోపలికి పరుగుతీసింది దీప.

“మా పాప చాలా చిలిపి” అన్నాడు లింగారావ్ నవ్వుతూ.

“అవును... నేను కూడా అదే అనుకుంటున్నా సార్” అన్నాడు రాంబాబు.

“నేను కూడా సార్” అన్నాడు చిన్నారావ్.

శ్రీలక్ష్మి ట్రేతో కాఫీలు పట్టుకు వచ్చింది. “నువ్వు తెచ్చావేంటీ...? అప్పారావ్ ఏడీ?” చిరాకుగా అడిగాడు పనివాడు ఏడీ అని అడిగినట్టు.

“దీప అతనితో గుర్రం ఆట ఆడుతుంది!” అని సమాధానం చెప్ప ముగ్గురికి కాఫీలు అందించింది.

అప్పుడే లోపలినుండి దీపని వీపుమీద ఎక్కించుకుని, నేలమీద మోకాళ్ళతో దేకుతూ బైటికి వచ్చాడు అప్పారావ్. దీప చేతిలోని బెత్తంతో చల్ చల్ గుర్రం అంటూ అతని వీపుమీద చెల్ చెల్ అని కొట్టసాగింది. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బాధతో మూలుగుతూ కమీషనర్ వంక చూసి ఇబ్బందిగా నవ్వాడు.

“అంకుల్ ని కాఫీ తాగనివ్వు పాపా... తర్వాత కావాలంటే గుర్రం ఆట ఆడుకుందువుగాని” అన్నాడు రాంబాబు. దీప ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని వదిలిపెట్టేసింది. ఆ రోజే రాంబాబు, చిన్నారావ్ లకి దీప డ్యూటీ మొదటిరోజు.

ఇద్దరూ ఉదయం అయిదు గంటలకే కంగారుగా నిద్రలేచి గబగబా కాలకృత్యాలన్నీ తీర్చుకుని ఏడుకల్లా రెడీ అయిపోయారు. ఇద్దరూ మోపెడ్ మీద కమీషనర్ లింగారావ్ ఇంటికి బయలుదేరారు. “కొంపదీసి మనతో కూడా దీప గుర్రం ఆటో, ఉయ్యాల ఆటో ఆడాడు కదూ?” భయంగా అడిగాడు చిన్నారావ్.

”అడ్తానంటే నోర్మూస్కుని ఆడించాల్సిందే! మరి ఆడ్తానంటుంది కమీషనర్ పాప కదా?” అన్నాడు రాంబాబు.

“అయితే నేను గుర్రం ఆట ఆడిస్తా, నువ్వేమో ఉయ్యాల ఆటాడించు” అన్నాడు చిన్నారావ్.

“నోర్మూస్కో... హెడ్ ని నేనా నువ్వా? నేనేది చెప్తే అదే ఫైనల్... నేనే గుర్రం ఆటాడిస్తా.. నువ్వు ఉయ్యాలాట ఆడించు...” అన్నాడు రాంబాబు. పది నిమిషాల్లో వాళ్ళు కమీషనర్ లింగారావ్ యింటిని సమీపించారు. దీప అప్పటికే స్నానం చేసి, టిఫిన్ చేసి రెడీగా వుంది. స్కూల్ డ్రెస్ వేస్కోడానికి వాళ్ళమ్మని అటూ ఇటూ పరిగేట్టిస్తుంది.

రాంబాబు, చిన్నారావ్ ని చూడగానే శ్రీలక్ష్మి సాదరంగా ఆహ్వానించింది. “చూడండి... దీనికి స్కూల్ డ్రెస్ లేద్దామంటే ఓ పట్టాన దొరకడం లేదు... దీన్ని పట్టుకోండి... నేను డ్రెస్ వేస్తా” అంది శ్రీలక్ష్మి.

ఆ మాట వినగానే దీప ఒక్కసారిగా పెరట్లోకి పరుగు లఘించుకుంది. రాంబాబు, చిన్నారావ్ లు కూడా ఆ అమ్మాయి వెనకాల పరుగుతీశారు. దాదాపు ఓ పావుగంట సేపు పెరట్లోనూ, ఇంటి చుట్టూరా ఇద్దర్నీ పరుగులు తీయించి ఆ తర్వాత వారి చేతికి దొరికింది దీప.

“ఈ టైపు పాపని స్కూలు కి తీస్కెళ్ళాలంటే మనకి రోజూ మంచి ఎక్సర్ సైజే..” దీపని రెండు చేతుల్తో ఎత్తుకుని హాల్లోకి వస్తూ అన్నాడు రాంబాబు.

“అవును...” అన్నాడు చిన్నారావ్.