ఇండియన్ సినిమాలు ఎప్పుడూ బ్రైట్‌గానే ఉంటాయి. అంతేకాదు.. హీరో, హీరోయిన్‌తోపాటు మిగతా ఆర్టిస్టులు కూడా ఎంతో బ్రైట్‌గా కనిపిస్తుంటారు. అయితే రాను రాను డైరెక్టర్ల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. కొంతకాలం నేచురల్‌గా ఉండేందుకు లైటింగ్ ఎఫెక్ట్‌ను తగ్గించి నటీనటులు సహజంగా కనిపించాలని ప్రయత్నించారు. ఈమధ్యకాలంలో మరి కాస్త ముందుకు వెళ్లి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ రగ్‌డ్‌గా కనిపించాలని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఏదైనా కొత్తలో అంతా బాగానే అనిపిస్తుంది. ప్రతి సినిమాలోనూ అదే పద్ధతి అవలంబించడం వల్ల మొనాటనీ వచ్చేస్తుంది. ఆడియన్స్ కూడా రొటీన్ ఫీల్ అవుతారు. ప్రస్తుతం మన సినిమాల పరిస్థితి అదే.
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ వచ్చినప్పుడు ఆ ప్రపంచం ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. బానిసలుగా బతికే ప్రజలు.. వాళ్లపై పెత్తనం చేసే ఓ శక్తివంతమైన వ్యవస్థ.. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టి క్రమంగా ఎదిగే హీరో.. మధ్యలో తల్లి సెంటిమెంట్.. వీటన్నింటినీ దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ మాస్ ఎలివేషన్స్‌తో చూపించారు. ఈ ఫార్ములా ‘కేజీఎఫ్’కి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత ఇదే తరహా టెంప్లేట్‌తో చాలా సినిమాలు రావడంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆ పోలికలు కనిపిస్తున్నాయనే చర్చ మొదలైంది.
తాజాగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది. సినిమాలో ఓ పేద కమ్యూనిటీ ఉంటుంది. వాళ్లపై శికంజా మాలిక్ ఆధిపత్యం కొనసాగుతుంటుంది. అతడి కొడుకు కూడా అక్కడి ప్రజలపై తన పెత్తనం చూపిస్తుంటాడు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రపంచం నుంచి జడల్ అనే యువకుడు ఎలా ఎదిగాడు? తన తల్లి సమ్మక్కతో అతడికి ఉన్న బంధం ఏంటి? అనే అంశాలతో కథ సాగుతుంది. ఈ బేసిక్ సెటప్‌ను చూస్తే ‘కేజీఎఫ్’ ఛాయలు కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దానికి డార్క్ విజువల్స్, భారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ ఎలివేషన్స్, యాక్షన్, వయలెన్స్ కూడా తోడవడంతో ఆ పోలిక మరింత బలపడుతోందనే టాక్ ఉంది.
అయితే ‘ది ప్యారడైజ్’ ఒక్కటే ఈ తరహా పోలికలు ఎదుర్కొంటున్న సినిమా కాదు. ‘కబ్జా’ విడుదలైన సమయంలోనూ ‘కేజీఎఫ్’తో పోలికలు వచ్చాయి. డార్క్ కలర్ టోన్, అండర్‌వరల్డ్ నేపథ్యం, హీరో ఎదుగుదల, మదర్ సెంటిమెంట్ వంటి అంశాలు అక్కడ కూడా చర్చకు వచ్చాయి. ‘సలార్’ కథ వేరే అయినప్పటికీ.. పవర్‌ఫుల్ గ్రూపులు, భారీ విలన్లు, హీరో చుట్టూ భారీ ఎలివేషన్స్‌తో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించడం వంటి అంశాలు ‘కేజీఎఫ్’ తర్వాతి మాస్ సినిమాల ప్రభావాన్ని గుర్తు చేశాయి.
ఇక ‘కింగ్‌డమ్’ విషయంలోనూ కొన్ని పోలికలు కనిపించాయి. అక్కడ ఓ దీవిలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలు, వాళ్లను నియంత్రించే శక్తివంతమైన వర్గం, చివరికి ఆ ప్రజల కోసం హీరో నిలబడటం వంటి అంశాలు ఉన్నాయి. అక్కడ తల్లి సెంటిమెంట్ స్థానంలో అన్నదమ్ముల అనుబంధం కనిపిస్తుంది. ‘దేవర’లోనూ సముద్రం, గ్రామీణ నేపథ్యం, భయం, అధికారం, హీరో చుట్టూ నిర్మించిన భారీ మాస్ సెటప్ వంటి అంశాలు ప్రేక్షకులకు ఇలాంటి అనుభూతినే కలిగించాయి.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక సినిమా మరో సినిమాను కాపీ చేసిందని చెప్పడం కంటే.. భారీ మాస్ సినిమాల కథనంలో ఒకే తరహా ఫార్ములా ఎక్కువగా కనిపిస్తోందన్నది అసలు చర్చ. డార్క్ ప్రపంచం.. అక్కడ కష్టాల్లో ఉన్న ప్రజలు.. వాళ్లపై పెత్తనం చేసే విలన్.. చివరికి వాళ్లకు అండగా నిలిచే హీరో.. మధ్యలో తల్లి లేదా అన్నదమ్ముల సెంటిమెంట్.. భారీ బీజీఎం.. స్లో మోషన్ ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్.. ఇలా కొన్ని అంశాలు వరుసగా సినిమాల్లో కనిపిస్తున్నాయి. దీంతో కథలు వేరైనా చూసే అనుభూతి మాత్రం ఒకేలా అనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం శ్రీకాంత్ ఓదెల తనదైన తెలంగాణ నేపథ్యాన్ని, జడల్ పాత్రను, కొన్ని ప్రత్యేకమైన పాత్రలను చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సినిమా మొదటి 30 నిమిషాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్, జడల్ చిన్ననాటి సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ద్వితీయార్థంలో వయలెన్స్, మాస్ ఎలివేషన్స్ ఎక్కువ కావడంతో కథ కాస్త వెనక్కి వెళ్లిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
మొత్తానికి ‘కేజీఎఫ్’ తర్వాత వచ్చిన మాస్ సినిమాలు ప్రేక్షకులకు భారీ అనుభూతిని ఇవ్వడానికి ఒకే తరహా అంశాల వైపు ఎక్కువగా వెళ్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇకపై రాబోయే భారీ చిత్రాలు ఈ ఫార్ములాకు మరో రూపం ఇస్తాయా? లేక పూర్తిగా కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తాయా? అనేది చూడాలి.
[The Paradise, Nani The Paradise, The Paradise Movie, Nani, Srikanth Odela, KGF, KGF Template, The Paradise KGF Comparison, Telugu Cinema, Nani Movies, Srikanth Odela Movies, The Paradise Review, Anirudh Ravichander, Mohan Babu, Telugu Mass Movies, KGF Effect, The Paradise Mass Movie]