LATEST NEWS
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒకే రోజున గంటల వ్యవధిలో భేటీ కావడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి వరుస భేటీల వెనక కారణాలు తెలియనప్పటికీ గంటల వ్యవధిలోనే ఇరువురు కీలక నేతలు రాష్ట్రపతితో సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి..  ప్రధాని నరేంద్ర మోదీ వరసగా రెండు రోజులు అంటే శని, ఆది(ఆగష్టు 2, 3) వారాలలో రాష్ట్రపతితో భేటీ అయ్యారు.   అలాగే..   ఆదివారం (ఆగష్టు 3) ప్రధాని, హోం మంత్రి అమిత్ షా వెంట ఒకరు రాష్ట్రపతితో సమావేశమైన తర్వాత కాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ  కూడా రాష్రపతితో  భేటీ అయ్యారు.  అలాగే..  ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గత రెండు రోజులో ఎన్డీఏ భాస్వామ్య పక్షాల నాయకులతో, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం  అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినాయకుడు నితీష్ కుమార్  తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరో వంక జులై 21న మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల  12 వరకు జరగనున్నాయి. ఇటీవలే ఆపరేషన్‌ సిందూర్‌పై ఉభయ సభల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది.  ఈ నేపథ్యంలో  కేంద్ర  ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం ఏదో తీసుకోనుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్త మవుతున్నాయి. ప్రధాని, హోంమంత్రిులు గంట వ్యవధిలో ఒకే రోజు వేర్వేరుగా రాష్ట్రపతితో భేటీ ఆ అనుమానాలకు మరింత బలం చేకూరేలా చేసింది. అయితే..  రాష్ట్రపతితో ప్రధానమంత్రి, హోంమంత్రి సమావేశాల వెనుక గల కారణాలు ఏమిటన్నది తెలియక పోయినా,  ఉమ్మడి పౌర  స్మృతి (యుసీసీ) వంటి కీలక నిర్ణయం తీసుకోవచ్చనీ అందుకే  ప్రధాని, హోం మంత్రితో పాటుగా ఉన్నతాధికారులు రాష్ట్రపతితో భేటీ అయ్యుండవచ్చనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే..  ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవుల పర్యటనల అనంతరం ప్రధాని లాంఛనంగా మాత్రమే  రాష్ట్రపతితో ప్రధాని సమావేశం అయ్యారనీ,  అదే విధంగా  ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా నేపధ్యంలో సెప్టెంబర్ 9న  ఉప రాష్ట్ర పతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ రాష్టపతిని స్వయంగా కలిసి ఆ వివరాలను తెలియచేసి ఉండవచ్చని అంటున్నారు. కాగా..  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఉప రాష్ట్రపతి పదవికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్  పేరు ఇంచు మించుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే రాష్ట్రపతి  ద్రౌపతి ముర్మతో సమావేశం అయి ఉంటే ,ఆది సాధారణ సమావేశం అనుకోవచ్చును కానీ..  ప్రధాని ఆ వెంటనే హోమ్ మంత్రి .. ఆతర్వాత కాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీలు కూడా రాష్ట్రపతితో సమావేశం కావడంతో ఏదో జరగబోతోందన్న వ్యుహాగానాలు వినిపిస్తున్నాయి.  
బీహార్ లో 65 ల‌క్ష‌ల ఓట్లు గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదంలో  ఉంటే..  త‌మిళ‌నాడులో ఆరున్న‌ర ల‌క్ష‌ల ఓట్లు కొత్త‌గా వ‌చ్చి చేరాయ‌ట‌. ఈ ఓట్లు ఎక్క‌డివాని చూస్తే ఇవి వ‌ల‌స వ‌చ్చిన వారివిగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యం అని ప్ర‌శ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎంపీ, మాజీ మంత్రి చిదంబ‌రం. ఎందుకంటే వ‌ల‌స వ‌చ్చిన‌ వాళ్ల‌కు ఇక్క‌డేం జ‌రుగుతుందో తెలీదు. ఇక్క‌డి రాజ‌కీయాలు అస‌లే ప‌ట్ట‌వు. వారిది త‌మ‌దీ వేరు వేరు భావ‌జాలాలు. అలాంటి భావ‌జాలం సూటు కాని వారు ఇక్క‌డ క‌నీసం ఇల్లూ వాకిలీ కూడా లేకుండా... ఓటు హ‌క్కు పొంద‌డం అంటే అది ఇక్క‌డి రాజ‌కీయాల‌ను తీవ్ర ప్ర‌భావితం చేయ‌డ‌మేనంటున్నారు చిదంబరం.  ఇప్పుడు కొత్త‌గా న‌మోదు చేసిన ఈ ఓట‌ర్ల‌కు బీహార్ రాజ‌స్థాన్ వంటి ప్రాంతాల్లో ఖ‌చ్చితంగా సొంతిల్లు ఉంటుంది. ఎక్క‌డ సొంతిల్లుంటే అక్క‌డ వారికి ఓటు హ‌క్కు ఉన్న‌ట్టు లెక్క‌. అలాంటి హ‌క్కును వాడుకోవ‌ల్సింది పోయి.. ఇలా ఇక్క‌డే ఉన్నారు క‌దాని వారికి ఓటు హ‌క్కు క‌ల్పించ‌డమేంటి? అన్న‌ది చిదంబ‌రం ప్రశ్న.  ఈ విష‌యంపై ఆయ‌న సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్  చేశారు. ఈసీపై మ‌నం రాజ‌కీయంగానే కాదు, చ‌ట్ట ప‌రంగానూ పోరాడాల్సి ఉంద‌ని అన్నారు. ఇక డీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఒక‌రు.. అవును ఇది స‌మంజ‌సం కాదు. ఈ ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.  ఇక బీహార్ ప‌రిస్థితి చూస్తే తమిళనాడుకు పూర్తి భిన్నంగా ఉంది.  ఇక్క‌డ చివ‌రి ఓట‌రు జాబితా ప‌రిశీల‌న జ‌రిగింది 2003లో. ఆ త‌ర్వాత జ‌ర‌గ‌నే లేదు. అందువ‌ల్ల అప్ప‌టి ఓట‌ర్లు ఇప్పుడెవ‌రున్నారో తెలీద‌ని చెబుతోంది ఈసీ. కొంద‌రు వీరిలో చ‌నిపోయిన వారు కూడా ఉన్నార‌ని.. దీంతో వీరంద‌రినీ తొల‌గించాల్సి ఉంద‌నీ చెబుతోంది. అలాగే బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన వారు కూడా ఇక్క‌డి ఓట‌ర్ల‌లో క‌ల‌గ‌ల‌సి పోయార‌నీ..  8 కోట్ల ప్ర‌జ‌లున్న బీహార్ అంటే జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే రాష్ట్రం. కాబ‌ట్టి తామీ విష‌యం ఒక సవాలుగా తీసుకుని ప‌ని చేస్తున్న‌ట్టు ఈసీ చెబుతోంది.  అయితే ఈ విష‌యం మీద ఇటు ఆర్జేడీ వంటి పార్టీల‌తో పాటు పౌర సంఘాలు కూడా కోర్టుల‌కెక్కాయి. అయితే సుప్రీం కోర్టు స‌ర్ గా పిలిచే ఈ స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ కి సుప్రీం అనుమ‌తించింది. అంతే కాదు.. డాక్యుమెంటేష‌న్ విధానం స‌రిగా అమ‌లు చేయాల‌ని సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మీ ఐడీ కార్డుల‌ను చూపించి ఓటర్ల జాబితాలో చోటు ద‌క్కించుకోవాల‌ని అంటోంది. అది సాధ్యం కాని ప‌ని. గ్రామీణ బీహార్ లో చాలా వ‌ర‌కూ స‌రైన ధృవీక‌ర‌ణ ప‌త్రాలు లేని వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీరి ఓటు హ‌క్కు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇలా జ‌రుగుతుంద‌ని తాము అస్స‌లు ఊహించ‌లేద‌ని మండి ప‌డుతున్నాయి ప్ర‌జా సంఘాలు. కార‌ణం ఇలా నిరూపించుకోవాలంటే కొంద‌రికి సాధ్య‌మ‌య్యే పనే కాదు. ఎందుకంటే ఇప్ప‌టికీ కుల, ఆదాయ వంటి సాధార‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాలే స‌రిగా ఇవ్వ‌డం లేదు. వారొక ప‌క్క ఇవ్వ‌క- వీరొక ప‌క్క తీసుకోలేక మీ పౌర‌స‌త్వం నిరూపించుకున్నాకే మీకు ఓటు అంటారు. త‌ర్వాత దేశ బ‌హిష్క‌ర‌ణ చేస్తారంటూ తీవ్ర స్థాయిలో మండి పుడుతున్నారు పౌర సంఘాల నేత‌లు.  తాజా ప‌రిస్థితులేంట‌ని చూస్తే ఆర్జేడీ యువ‌నేత తేజ‌స్వీయాద‌వ్ కి ఈసీ నోటీసులు జారీ చేసింది. మీరు ఓట‌రు జాబితాలోంచి తొల‌గించామ‌ని చెబుతున్న కార్డు ఈసీ జారీ చేసిందికాదంటూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆయ‌న‌కే రివ‌ర్స్ లో కౌంట‌ర్ వేసింది. దీంతో ఈ నెల 8న ఇండియా కూట‌మి ఈసీ వ‌ద్ద‌కు ర్యాలీ తీయ‌నుంది.  ఇక రాహుల్ గాంధీ సైతం శ‌నివారం పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 70 నుంచి వంద స్థానాల వ‌ర‌కూ ఎన్డీయే గెలిచే ఛాన్సే లేద‌ని అన్నారాయ‌న‌. మోడీ కూడా స‌రైన మెజార్టీతో గెల‌వ‌లేదు. 15 సీట్ల తేడాతో అస‌లు ఎన్డీయే తిరిగి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని బాంబు పేల్చారు రాహుల్. మ‌రి చూడాలి ఈ ఓట్ల గొడ‌వ ఎక్క‌డ తేలుతుందో .
ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం టేకాఫ్ కు దాదాపు మూడు గంటలు ఆలస్యం అయ్యింది. సరిగ్గా టేకాఫ్ కు ముందు ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా టేకాఫ్ కు ముందు సాంకేతిక లోపం బయటపడింది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి భట్టు దేవానంద్ వంటి ప్రముఖులు ఉన్నారు. విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. విమాన ప్రయాణం అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సినట్లుగా పరిస్థితి తయారైందం
గురూజీ అని అంద‌రి చేత ప్రేమగా పిలిపించుకునే జార్ఖండ్ ముక్తి మోర్చా వ్య‌వ‌స్థాప‌కుడు శిబూసోరెన్ ఇక లేరు. 81 ఏళ్ల వ‌య‌సులో వృద్దాప్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.  ఈ విష‌యాన్ని జార్ఖండ్ సీఎం, శిబుసొరేన్ త‌న‌యుడు, హేమంత్ సొరేన్ త‌న‌ ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియ చేశారు.  దిశోమ్ గురూజీ మ‌న‌ల్ని విడిచి వెళ్లిపోయారు. ఇవాళ త‌న‌కంతా శూన్యంగా క‌నిపిస్తోంద‌ని త‌న పోస్టు లో తీవ్ర విషాదం వ్య‌క్తం చేశారాయ‌న‌. జార్ఖండ్ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో, గిరిజ‌న స‌మ‌స్య‌ల పోరాటంలో, మ‌డ‌మ తిప్ప‌ని పోరాట యోధుడిగా.. శిబుసోరెన్ కి పేరుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న 8 సార్లు లోక్ స‌భ కు, రెండు సార్లు రాజ్య స‌భకు ఎన్నికైన శిబుసొరేన్ ,  జార్ఖండ్ సీఎంగా ఎన‌లేని సేవ‌లందించారు.  చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున మ‌ద్ధ‌తునిచ్చిన శిబుసొరేన్ తెలంగాణ‌కు సైతం ఆత్మీయులే. ఈ విష‌యం ప్ర‌స్తావిస్తూ త‌న నివాళి తెలియ చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. వ‌డ్డీ  వ్యాపారుల ఆగ‌డాలను అరిక‌ట్ట‌డంలో, మాద‌క ద్ర‌వ్యాల వ్యాపారుల‌పై పోరు స‌ల‌ప‌డంలో శిబుసోరెన్ త‌న‌దైన ముద్ర‌వేశార‌ని అన్నారు సీఎం రేవంత్. ఆదివాసీ స‌మాజానికి శిబు సోరెన్ చేసిన మేలు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేమని పేర్కొన్నారు. జార్ఞండ్ సీఎం హేమంత్ సోరెన్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రేవంత్ రెడ్డి త‌న ప్ర‌గాఢ‌ సానుభూతి తెలిపారు. జార్ఖండ్ లోని గొడ్డలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ, తాను ఎంపీగా ఉన్న ప్రాంతం గురూజీ ప్రాంతమే. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన ఆలోచనలతో ఎవరికైనా ఇబ్బంది కలిగిన సందర్భం లేదు. శిబు సోరెన్‌తో కలిసి ఎంపీగా పనిచేసే అవకాశం చాలా ఏళ్లు లభించింది. ఆయన ఎల్లప్పుడూ మాకు మార్గదర్శనం చేశారు. గొప్ప నేతను కోల్పోయామ‌ని అన్నారు. 2020లో రాజ్యసభకు ఎన్నికైన తర్వాత శిబు సోరెన్ రాజకీయాల్లో అంత యాక్టివ్ గా కనిపించలేదు. అయితే, ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి నిరంతరం మార్గదర్శనం చేస్తూ వ‌చ్చారు. శిబు సోరెన్ వయసురీత్యా వచ్చే సమస్యలతో బాధపడటమే కాకుండా, కిడ్నీ సంబంధిత సమస్యల కూడా ఆయనను వేధించాయి.  గత కొన్నాళ్లుగా శిబు సోరెన్ వీల్ చైర్ కే పరిమితమయ్యారు. జెఎంఎం జాతీయ సమావేశంలో కూడా ఆయన వీల్ చైర్లోనే వచ్చారు. శిబుసొరేన్ లోటు పూడ్చ‌లేనిదనీ, శిబు సొరేన్ లాంటి  మార్గ‌ద‌ర్శి గురువు త‌మ‌ను విడిచి వెళ్ల‌డం  పూడ్చలేని లోటని సాధార‌ణ ప్ర‌జ‌లు అభిప్రాయ ప‌డుతున్నారు. ఆయ‌న‌కు  ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు సైకిల్ పై ప్రయాణించారు. జిల్లా కేంద్రమైన మెదక్ నుంచి అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని రామాయంపేట వరకూ సైకిళ్లపై ప్రయాణించి వచ్చారు.  రామాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులను పరామర్శించారు. అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు.  కలెక్టర్ దంపతులు మెదక్ నుంచి రామాయంపేట  వరకూ సైకిళ్లపై రావడాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సైకిల్ తొక్కడం ఆరోగ్యకరం అన్న సందేశం చాటేందుకే వారు సైకిల్ పై 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చారని తెలుస్తోంది.  
ALSO ON TELUGUONE N E W S
స్టార్ హీరో 'అజిత్'(Ajith Kumar)కి తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అజిత్ నటించిన కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు తమిళ నాట మొత్తం పండగ వాతావరణం కనపడుతుంది. అంతలా కోట్లాది మంది అభిమానులని సంపాదించాడు. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన అజిత్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రీవియస్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తో తన స్టామినా ఏంటో మరోసారి చాటి చెప్పాడు. రీసెంట్ గా  అజిత్  సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ ని పోస్ట్ చేసాడు . సదరు నోట్ లో 'సినిమా అనే కష్టమైన ఇండస్ట్రీలో ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఎలాంటి సినీ నేపధ్య కుటుంబం నుంచి నేను రాలేదు. బయట వ్యక్తిగా వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. ఈ ప్రయాణంలో ఎన్నో మానసిక ఒత్తిడులు, వైఫల్యాలు, ఎదురుదెబ్బలు నిరంతరం నన్ను పరీక్షించాయి. నేను నమ్ముకున్న పట్టుదల అనే సూత్రంతో వాటన్నింటిని అధిగమించాను. సినిమాల పరంగా ఎన్నో పరాజయాలు ఎదురైనా నా భార్య, అభిమానులు  తోడుగా ఉన్నారు. వారి అభిమానమే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామనుకున్న ప్రతిసారి నన్ను ఆపింది. వాళ్ళ ప్రేమని మాటల్లో వర్ణించలేను. ఆ అభిమానాన్ని ఎప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించలేదు. మోటార్ రేసింగ్ లోను నన్ను ఎదగనీయకుండా చేసేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. కానీ పతకాలు సాధించే స్థాయికి ఎదిగానని సదరు నోట్ లో రాసుకొచ్చాడు. 1990 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎన్ వీడు ఎన్ కనావర్' అనే చిత్రంలో ఒక చిన్న క్యారక్టర్ తో సినీ రంగ ప్రవేశం చేసిన అజిత్ ,1993 లో విడుదలైన  'అమరావతి' అనే చిత్రంతో సోలో హీరోగా మారాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషించి నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. మాజీ హీరోయిన్ షాలిని(Shalini)ని వివాహమాడిన అజిత్ కారు రేసింగ్ లోను నిష్ణాతుడు. ఇటీవల దుబాయ్(Dubai)లో జరిగిన  24H రేసులో పాల్గొనగా  అజిత్ జట్టు మూడవ స్థానంలో నిలిచింది. ఈ పోటిల్లోనే అజిత్  తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. "స్పిరిట్ ఆఫ్ రేస్" అవార్డుని సైతం అందుకున్న అజిత్  ప్రెజంట్ ఎలాంటి కొత్త చిత్రానికి ఒప్పుకోలేదు.   
  పాన్ ఇండియా స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ లైనప్ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. ఇతర భాషల దర్శకులతో చేతులు కలుపుతున్నాడు. ఇప్పటికే 'వార్-2' అనే హిందీ ఫిల్మ్ చేశాడు. ఇది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు నెల్సన్ తోనూ ఓ సినిమా కమిటై ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో కన్నడ డైరెక్టర్ తో ఎన్టీఆర్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. రిషబ్ శెట్టి.   'కాంతార'తో నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో 'కాంతార-2' రూపొందుతోంది. ఇది అక్టోబర్ 2న విడుదల కానుంది. రిషబ్ 'కాంతార-3'ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు, ఇందులో ఒక కీలక పాత్ర కోసం ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.    ఎన్టీఆర్, రిష‌బ్ శెట్టి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తే.. ప్రశాంత్ నీల్ తో పాటు రిషబ్ ని కూడా కలుస్తుంటాడు. దాంతో వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు 'కాంతార-3'లో ఎన్టీఆర్ నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా న్యూస్ వినిపిస్తోంది. అదే జ‌రిగితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.  
 రెండు దశాబ్డల నుంచి భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన అన్ని భాషల్లోను తన సత్తా చాటుతు వస్తున్న నటి 'తమన్నా'(Tamannaaah Bhatia). తెలుగులో కూడా అగ్ర హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్ అనే టాగ్ లైన్ ని  సొంతం చేసుకున్న తమన్నా, గత కొంత కాలంగా స్పెషల్ సాంగ్స్ లో చేస్తూ చిత్ర విజయంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ ఏడాది మే నెలలో విడుదలైన 'అజయ్ దేవగన్ మూవీ 'రెయిడ్ పార్ట్ 2 'లోను స్పెషల్ సాంగ్ లో మెరిసింది.    రీసెంట్ గా తమన్నా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఒక కొత్త సినిమాకి సంతకం చేసేటప్పుడు, దాని ద్వారా వచ్చే డబ్బు గురించి ఆలోచించను. నేను చేస్తున్న పని ప్రేక్షకులపై ఏ మేర ప్రభావం చూపిస్తుందని మాత్రమే ఆలోచిస్తాను. పాట, నటన, సినిమా ఇలా ఏదో ఒకటి ప్రేక్షకులని తాకడం నాకు ముఖ్యం. ఇటీవల చాలా మంది తల్లులు నాకు ఫోన్ చేసి 'ఆజ్ కి రాత్'(Aaj Ki Raat)పాట పెడితేనే మా పిల్లలు అన్నం తింటున్నారని చెప్పారు. ఈ విషయంలో భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే పిల్లలకి సాహిత్యం అర్ధం కాదు. సంగీతం వింటూ ఎంజాయ్ చేస్తున్నారని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నాపై చిత్రీకరించిన 'ఆజ్ కి రాత్' స్పెషల్ సాంగ్ హర్రర్ కామెడీ గా తెరకెక్కిన 'స్త్రీ 2 '(Stree 2)చిత్రంలోనిది. గత సంవత్సరం ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. 'ఆజ్ కి రాత్' సాంగ్ వలన సక్సెస్ స్థాయి మరింతగా పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అంతలా ఆ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. 'సచిన్, జిగర్' (Sachin, Jigar)సంగీత ద్వయంలో ఆ సాంగ్ రూపొందగా, యూ ట్యూబ్ లో ఇప్పటి వరకు 738 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన స్త్రీ 2 800 కోట్ల వరకు వసూలు చేసింది. రాజ్ కుమార్ రావు(Rajkummar rao)శ్రద్ధ కపూర్(Shraddha kapoor)జంటగా నటించగా అమర్ కౌశిక్(Amar Kaushik)దర్శకత్వం వహించాడు.    
  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు వేతనాలు 30 శాతం పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. దీంతో ప్రస్తుతం చిత్రీకరణ దశలో పలు సినిమాలు, సిరీస్ ల షూటింగ్ కి బ్రేక్ పడే అవకాశముంది.   సినీ కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచాలనే నిబంధన జూన్ 30తో ముగిసింది. దీంతో 30 శాతం వేతనాలు పెంచాలని, లేదంటే ఆగస్టు 1 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే ఫెడరేషన్ ప్రకటించింది. దీనికి సంబంధించి కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది.   సోమవారం(ఆగస్టు 4) నుంచి 30 శాతం వేతనాలు పెంపుకి అంగీకరించి, కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన నిర్మాతల షూటింగ్ లకి మాత్రమే తమ సభ్యులు వెళ్తారని ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది. పెంపుకి అంగీకరించకపోతే అప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్ ల షూటింగ్ లో పాల్గొనేది లేదని స్పష్టం చేసింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పలు షూటింగ్ లకు బ్రేక్ పడే ప్రమాదముంది.     
  మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నారా? వచ్చే సంక్రాంతి బరిలో వీరిద్దరి సినిమాలు నిలవబోతున్నాయా? అంటే ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే మాట వినిపిస్తోంది.   చిరంజీవి తన 157వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'మన శంకర్ వరప్రసాద్ గారు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడిదే సీజన్ పై పవన్ కళ్యాణ్ సినిమా కన్నేసినట్లు వినికిడి.   'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.    తెలుగు సినిమాలకు సంక్రాంతి అనేది పెద్ద సీజన్. ఆ సమయంలో రెండు, మూడు బడా హీరోల సినిమాలు విడుదలవ్వడం కామన్. అందుకే బరిలో అన్నయ్య చిరంజీవి మూవీ ఉన్నప్పటికీ, తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాని రిలీజ్ చేయాలని 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్ భావిస్తున్నారని టాక్. ఈ రెండు సినిమాల మధ్య రెండు మూడు రోజులు వ్యవధి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.  
  జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఆగస్టు 14న బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇదే వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. అలాగే త్రివిక్రమ్, నెల్సన్ ప్రాజెక్ట్ లు కూడా ఎన్టీఆర్ చేతిలో ఉన్నాయి. దీంతో అసలు 'దేవర-2' ఉంటుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ 'దేవర-2' షూటింగ్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.   'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'దేవర'. 2024 సెప్టెంబర్ లో విడుదలైన ఈ మూవీ.. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, ఘన విజయం సాధించింది. అయితే కంటెంట్ పరంగా ఈ చిత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిందని, కేవలంలో ఎన్టీఆర్ స్టార్డంతోనే ఆ స్థాయి వసూళ్లు వచ్చాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే 'దేవర-2' ఉండకపోవచ్చనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం 'దేవర-2' ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే షూట్ కి ముహూర్తం కూడా ఖారైనట్లు సమాచారం.   ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'డ్రాగన్' మూవీ షూటింగ్ ను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేసి.. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో 'దేవర-2'ను మొదలు పెట్టాలని ఎన్టీఆర్ చూస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో కొరటాల బిజీగా ఉన్నాడట. 'దేవర-2' స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, పార్ట్-1 తో పోలిస్తే పార్ట్-2 అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని.. అందుకే ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు.   మరోవైపు, నెల్సన్ ప్రస్తుతం రజినీకాంత్ తో 'జైలర్-2' చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తో ఓ సినిమా కమిటై ఉన్నాడు. ఆ ఇద్దరు దర్శకులు తమ కమిట్మెంట్స్ పూర్తి చేసి, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడానికి టైం పడుతుంది. ఆ గ్యాప్ లో ఎన్టీఆర్ 'దేవర-2'ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడట.   
  విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ 'కింగ్‌డమ్' బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. కేరళ కలెక్షన్స్ మాత్రం అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. (Kingdom)   నిజానికి 'కింగ్‌డమ్' సినిమా మలయాళ వెర్షన్ విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ సినిమా కేరళలో 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో నాన్ మలయాళ వెర్షన్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఏకైక తెలుగు చిత్రంగా 'కింగ్‌డమ్' రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే జోరు కొనసాగితే కేరళలో 'కింగ్‌డమ్' మరిన్ని సంచలనాలు సృష్టించేలా ఉంది.   గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ జూలై 31న థియేటర్లలో అడుగుపెట్టింది.    
  టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణ మాస్టర్ పై గత నెలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు అయింది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. దీంతో కృష్ణ మాస్టర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు కావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. బెంగుళూరులోని తన అన్న నివాసంలో కృష్ణ మాస్టర్ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు.. తాజాగా అతనిని అదుపులోకి తీసుకున్నారు.    ఈ పోక్సో కేసుతో పాటు కృష్ణ మాస్టర్‌ పలు వివాదాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మహిళను వివాహం చేసుకొని, ఆమెకి సంబంధించిన రూ.9.50 లక్షలు నగదు తీసుకుని పరారయ్యాడని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతులను, మహిళలను మోసం చేసినట్లు కూడా అతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి.  
  ఈ ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఒకటి 'వార్-2' కాగా, మరొకటి 'కూలీ'. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓవరాల్ హైప్ ని పక్కన పెడితే.. సౌత్ లో మాత్రం 'వార్-2' కంటే 'కూలీ' ముందు ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ట్రైలర్ విడుదల తర్వాత ఒక్కసారిగా అది రివర్స్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.   సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'కూలీ'. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్స్ ఇందులో భాగమయ్యారు. దీంతో 'కూలీ'పై మొదటి నుంచి అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో తాజాగా విడుదలైన ట్రైలర్ ఫెయిల్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   రీసెంట్ గా వచ్చిన 'కూలీ' ట్రైలర్ ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ట్రైలర్ రెగ్యులర్ గా ఉందని, అంతమంది స్టార్స్ ఉన్నా వావ్ మూమెంట్స్ లేవని అంటున్నారు. కొందరు మాత్రం సినిమాలోని కంటెంట్ రివీల్ చేయకుండా లోకేష్ కావాలని ఇలా ట్రైలర్ కట్ చేయించి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు.   ఏది ఏమైనా 'కూలీ' ట్రైలర్ కి ఓ రేంజ్ రెస్పాన్స్ రాకపోవడం 'వార్-2'కి కలిసొచ్చే అవకాశముంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'వార్-2'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టీజర్ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. కొద్దిరోజులు క్రితం విడుదలైన ట్రైలర్ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు 'కూలీ' ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో.. 'వార్-2'పై అందరి దృష్టి మరింతగా పడుతోంది.  
  తెలుగునాట తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సొంతం. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించారు పవర్ స్టార్. అలాంటి పవన్.. ఒక విషయంలో మాత్రం వెనకబడిపోయారు. తన తోటి స్టార్స్ అంతా రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరారు. ఈ ఫీట్ ని అందరికంటే ముందు సాధించగల సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా సాధించలేదు. దానికి కారణం ఆయన గత దశాబ్ద కాలంగా రాజకీయాలతో బిజీగా ఉండటమనే చెప్పవచ్చు.    గత పదేళ్లలో పవన్ నుంచి తక్కువ సినిమాలే వచ్చాయి. పైగా ఆయన స్టార్డంకి తగ్గ సినిమాలు పెద్దగా రాలేదు. ఇది చాలదు అన్నట్లు.. టికెట్ ధరలు తక్కువ కారణంగా 'భీమ్లా నాయక్' వంటి సినిమాలు వంద కోట్ల షేర్ కి అడుగు దూరంలో ఆగిపోయాయి. ఇక ఇటీవల విడుదలైన 'హరి హర వీరమల్లు' కూడా దారుణంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. దాంతో వంద కోట్ల షేర్ క్లబ్ కి చేరువ కాలేకపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ'పైనే ఆశలు పెట్టుకున్నారు. (They Call Him OG)   చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ భారీ సినిమా 'ఓజీ' రూపంలో వస్తోంది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'ఓజీ' నుంచి వస్తున్న ఒక్కో కంటెంట్ అంచనాలను పెంచేస్తోంది. రీసెంట్ గా విడుదలైన 'ఫైర్ స్ట్రామ్' సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న 'ఓజీ' మూవీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రూ.100 కోట్లు కాదు.. ఏకంగా రూ.200 కోట్ల షేర్ సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం ఈ మూవీ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో దోమల సంఖ్య  పెరగడం మొదలవుతుంది. అవి కుట్టడం వల్ల దురద, దద్దుర్లు వంటివి   కలిగించడమే కాకుండా డెంగ్యూ,  మలేరియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. సాధారణంగా  దోమలను తరిమికొట్టడానికి కాయిల్స్ లేదా లిక్విడ్స్  ఉపయోగిస్తారు. కానీ వాటిలో ఉపయోగించే రసాయనాల కారణంగా ఇవి అనారోగ్యానికి దారి తీస్తాయి.  వీటి మీద అవగాహన ఉన్న వారు రసాయనాలను వదిలి సహజమైన పద్దతిలో దోమలు పారద్రోలడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. పాత రోజుల్లో దోమలను తరిమికొట్టడానికి  వేప ఆకులను పొగబెట్టేవారు. కానీ ఈ కాలంలో ఈ  పొగ వల్ల కూడా  సమస్యలను ఎదుర్కొంటారు. అలా కాకుండా దోమలను తరిమికొట్టేందుకు  వేపను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. వేపనీరు.. ఇది సులభమైన మార్గం.. . కొన్ని వేప ఆకులను తీసుకొని నీటిలో బాగా మరిగించాలి. నీటి రంగు మారి ఆకులు మృదువుగా మారినప్పుడు నీటిని చల్లబరిచిన తర్వాత ఫిల్టర్ చేయాలి.  ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి మూలల్లో, కర్టెన్లలో,  దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. దోమలు దాని వాసన కారణంగా పారిపోతాయి. వేప ఆకులు.. వేప ఆకులను ఉంచడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా  సహజ అవరోధంగా పనిచేస్తుంది . తాజా వేప ఆకులను తీసుకొని వాటిని మెష్ చేసిన కిటికీలు, తలుపులు లేదా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలపై వేలాడదీయాలి లేదా ఉంచాలి. వేప వాసన దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. కావాలంటే  వాటిని బాత్రూమ్ కిటికీపై కూడా ఉంచవచ్చు. వేప పేస్ట్.. వేప పేస్ట్ తయారు చేయడం వల్ల చర్మాన్ని దోమల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తాజా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి.  కావాలంటే దానికి కొంచెం కొబ్బరి నూనె కూడా జోడించవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్‌ను పడుకునే ముందు చేతులు, కాళ్ళు,  మెడపై రాయాలి. దీని బలమైన వాసన దోమలను దగ్గరికి రానివ్వదు.   పొగ.. నేరుగా వేపాకు పొగ వేయడానికి ఇబ్బంది పడేవారు వేపాకును పొగలో ఉపయోగించడానికి సులభమైన చిట్కా ఉంది. అదే సాంబ్రాణి పొగ.. ప్రతి రోజూ సాయంత్రం కొన్ని బొగ్గులను కాల్చి అందులో సాంబ్రాణితో  పాటూ కాసింత వేపాకుల పొడిని కూడా వేస్తే ఆ పొగకు దోమలు పరార్ అవుతాయి.                            *రూపశ్రీ.  
ఒక మనిషి వ్యక్తిత్వం ఆ మనిషి జీవితంలో ఎదుగుదలను,   ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరూ తాము కరెక్టే అనుకుంటూ ఉంటారు. ఇలా కరెక్టే అనుకోవడం ఆ మనిషికి తన మీద తనకు నమ్మకం ఉండటం కావచ్చు. కానీ.. కొన్నిసార్లు ఇట్లాంటి నమ్మకాలు,  వ్యక్తిలో ఉండే కొన్ని గుణాలు వ్యక్తిని దెబ్బతీస్తాయి.  వాటిని సరిగా అర్థం చేసుకోలేని పక్షంలో అవి వ్యక్తిని పాతాళానికి తొక్కేస్తాయి కూడా.  ఆ అలవాట్లేంటో తెలుసుకుంటే.. ఆధిపత్యం.. ప్రతిసారీ  అభిప్రాయాన్ని చెప్పే అలవాటు ఉందా? వాదనలో ఎదుటి వ్యక్తి మాట వినకుండా నిర్ణయం తీసుకుంటారా? అలా అయితే తెలియకుండానే ఆధిపత్య వ్యక్తిత్వంలో భాగమయ్యే అవకాశం ఉంది.  ఇది క్రమంగా సంబంధాలలో దూరాన్ని సృష్టించవచ్చు. ప్రతి పరిస్థితిలోనూ నాయకత్వం వహించడం అవసరం కావచ్చు, కానీ అది అహం,  నియంత్రణగా మారినప్పుడు అది సంబంధాలకు ,  స్వంత వ్యక్తిత్వానికి హాని కలిగిస్తుంది. సంబంధంలో కనెక్షన్ ముఖ్యం, నియంత్రణ కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. సంభాషణలో అంతరాయం.. సంభాషణ మధ్యలో  ఎవరినైనా పదే పదే అంతరాయం కలిగిస్తే లేదా ఎల్లప్పుడూ మీ అభిప్రాయాన్ని ముందుగా తెలియజేస్తే, అది ఆధిపత్య ప్రవర్తన. ఇతర వ్యక్తులు ఈ రకమైన ప్రవర్తనను ఇష్టపడరు.  వారు మీతో మాట్లాడకుండా ఉంటారు. దీన్ని సరిచేసుకోవాలంటే..  ఇతరులు మాట్లాడటం ముగించిన తరువాత   సమాధానం ఇవ్వాలి.  మీరు మాట్లాడిన తరువాత వారి సమాధానం వినాలి. సొంత నిర్ణయాలు.. స్నేహం, సంబంధం లేదా ఆఫీసులలో  ప్రతిసారీ "ఏమి చేయాలో" ఎవరికి వారు  నిర్ణయించుకోకూడదు.  ఒక వేళ అలా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే  ఎదుటి వ్యక్తి ఆలోచనలకు స్థలం ఇవ్వడం లేదని అర్థం. ప్రతి విషయాన్ని ఇతరులకు ఒక ఆర్డర్ లాగా సొంతంగా నిర్ణయం తీసుకుని అధికారం చూపిస్తే అది చాలా తప్పు. దాన్ని సరిదిద్దుకోవాలి.  నలుగురు పాల్గొనే ఒక విషయంలో నలుగురి నిర్ణయాలు,  నలుగురి ఆలోచినలు, నలుగురి వ్యక్తీకరణలు కూడా ఉండాలి. వాదనలో గెలవాలనే తత్వం..  చర్చ సమయంలో ఎల్లప్పుడూ వాదనలో గెలవడానికి ప్రయత్నిస్తే లేదా వాదనలో గెలిచిన తర్వాత  అభిప్రాయాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే.. ఇది కూడా ఆధిపత్యానికి సంకేతం. వాదనలో గెలవడం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ప్రతిసారీ వాదనలో గెలవడానికి ప్రయత్నించకూడదు.  ఇతరులు ఏమి చెబుతారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. విషయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప.. నష్టం చేకూరినా సరే.. తన మాటే నెగ్గాలి అనే స్వభావం పనికిరాదు. అందరూ తనకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం.. ప్రతి ఒక్కరికీ ఒక ఆలోచన,  ఒక అభిప్రాయం,  కొన్ని ఇష్టాఇష్టాలు.. ఉంటాయి.  వాటికి తగినట్టే వారి ప్రవర్తన కూడా ఉంటుంది. కానీ ఇతరులను మార్చడానికి ప్రయత్నించేవారు లేదా వారి అభిప్రాయమే ఫైనల్ అని కోరుకునే వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని అర్థం.  మీ ఇష్టానుసారం ఇతరులను మార్చడానికి ప్రయత్నించే బదులు, వారి ఆలోచనలు, జీవనశైలి,  ప్రవర్తనను స్వీకరించడమే ఉత్తమమైన వ్యక్తిత్వం.  ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం వల్ల ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావు. అట్లాగే.. తన వ్యక్తిత్వ గౌరవాన్ని నిలబెట్టుకుంటూనే.. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించడం చేసినట్టు అవుతుంది.                               *రూపశ్రీ.
ఒక రిలేషన్ ఏర్పడటం పెద్ద సమస్య కాదు.. కానీ ఆ రిలేషన్ అన్ని సమస్యలను ఎదుర్కొని విజయవంతం కావడం నేటి కాలంలో చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకంటే సంబంధాలు  ఏర్పడినంత తొందరగానే బ్రేకప్ అవుతున్నాయి. ముఖ్యంగా బార్యాభర్తల బంధం మన భారతదేశ ధర్మానికి ఒక ముఖ్యమైన మూల స్తంభం. అలాంటి మూల స్తంభం చాలా బలహీనం అయి, బీటలు వారుతోంది. ఈ కారణంగా నేటికాలంలో వివాహాలు చేసుకోవాలన్నా కూడా చాలామంది సంకోచిస్తున్నారు. ఒక రిలేషన్  విజయవంతం కావడానికి ప్రేమ, నమ్మకం, గౌరవంతో పాటు ఇద్దరి మధ్య  స్పష్టమైన సంభాషణ  అవసరం. సంతోషకరమైన సంబంధానికి పునాది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. సంబంధంలో నిజాయితీ, అర్థం చేసుకోవడం,  ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనవి. సంబంధం కొత్తదైనా లేదా పాతదైనా,  ఇవన్నీ  ప్రతి జంటకు ముఖ్యమైనవే. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది,  సంబంధంలో సమస్యలు రాకుండా చేస్తుంది.  ప్రతి జంట సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలంటే ఏం చేయాలి అనేది రిలేషన్షిప్ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.  వాటి గురించి తెలుసుకుంటే..  వినడం.. వినడం అనేది ఒక సాధారణమైన విషయమే  కానీ సంబంధంలో చాలా ముఖ్యమైనది.   ఇది ప్రతి ఒక్కరూ అది అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా తెలుసుకోవాలి. భార్యాభర్తల రిలేషన్ లో  మాట్లాడటం,  అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో పాటు, వినడం కూడా చాలా ముఖ్యం. తరచుగా భార్యాభర్తలు ఒకరు చెప్పేది మరొకరు వింటారు.  కానీ కొందరి ఉద్దేశ్యం ఎలా ఉంటుందంటే కేవలం వినడం ఆ తరువాత ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తనకు నచ్చినట్టే జరగాలని అనుకోవడం జరుగుతుంది.  ఇది సంబంధాన్ని చాలా దెబ్బ తీస్తుంది.ఆరోగ్యకరమైన రిలేషన్ ఉండాలంటే అవతలి వ్యక్తి చెప్పే మాటలను వినడమే కాదు.. వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. స్పేస్.. భార్యాభర్తల బంధంలో ప్రేమదే అగ్రస్థానం. భాగస్వాములు అయ్యాక ఒకరికొకరు ఇచ్చే ప్రాధాన్యత,  ఒకరికి మరొకరు ఇచ్చే విలువ ఆ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కానీ ప్రేమ అంటే మనిషిని కట్టడి చేసినట్టు ఉండకూడదు.  ప్రతి విషయం తనకు తెలియాలి అనుకోకూడదు. కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందంటే.. పెళ్లైంది కదా.. ఆ మనిషి నా సొంతం.. తనకు ఎలాంటి స్పేస్ కూడా ఉండకూడదు అని అనుకుంటారు. కానీ సంబంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. వారికంటూ కాస్త స్పేస్.. వారికంటూ పర్సనల్ సమయం ఇవ్వడం కూడా ముఖ్యం.  స్పేస్ అనేది లేకపోతే బంధాన్ని గట్టిగా బిగించినట్టు ఉంటుంది. నిజానికి కొందరు ఇలా స్పేస్ ఇవ్వకుండా ఉండటం వల్ల అనుమాన పూరిత ప్రవర్తన అనుకునే అవకాశం కూడా ఉంటుంది. సారీ.. థ్యాంక్స్.. రిలేషన్ ను బలంగా మార్చేది ఏదైనా ఉందంటే అది తనకు ఏదైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞత చెప్పడం. అలాగే తన వైపు ఏదైనా తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం. పెళ్లి చేసుకున్నారు, భాగస్వామి అయ్యారు కాబట్టే కదా బాధ్యత కాబట్టి మనకోసం ఏదైనా చేశారు అనుకోవడం,  కనీసం థ్యాంక్స్ చెప్పకపోవడం.. ఏదైనా తప్పు జరిగినప్పుడు సారీ చెప్పకపోగా అయితే ఏంటి? అని రివర్స్ లో వాళ్ళ మీద అరవడం,  సమర్థించుకోవడం వంటివి చేయడం వల్ల ఒకరిమీద ఒకరికి ఆశించినంత ప్రేమ,  గౌరవం నిలబడవు. ఎప్పుడైతే ఇట్లా సందర్బానుసారంగా సారీలు,  థ్యాంక్సులు చెపుతూ ఉంటారో అప్పుడు ప్రేమ,  గౌరవం పెరుగుతాయి.  నిజమైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది.                                 *రూపశ్రీ.
  నేటి బిజీ జీవితంలో మానసిక ఒత్తిడి దాదాపు ప్రతి వ్యక్తి లైఫ్ లో  భాగంగా మారింది. పని ఒత్తిడి, సామాజిక అంచనాలు, సంబంధాల సమస్యలు,  భవిష్యత్తు గురించి అసంతృప్తి.. మొదలైనవన్నీ  మానసిక ఆరోగ్యంపై నిరంతరం ప్రభావం చూపుతున్నాయి. ఒత్తిడి మరియు ఆందోళన మీ మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా, నిద్ర లేకపోవడం, జీర్ణ సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ,   అలసట వంటి  శారీరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి.  దినచర్యలో కొన్ని చిన్న,  సులభమైన మార్పులు చేయడం ద్వారా  ఒత్తిడి,  ఆందోళన నుండి బయటపడవచ్చని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండి మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడే మూడు మార్పుల గురించి తెలుసుకుంటే.. వ్యాయామం, శారీరక శ్రమ.. ఒత్తిడిని తగ్గించడానికి మొదటి సులభమైన మార్పు క్రమం తప్పకుండా వ్యాయామం. ప్రతిరోజూ 20-30 నిమిషాలు వేగంగా నడవడం, యోగా లేదా స్ట్రెచింగ్  వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అనులోమ-విలోమ వంటి  ప్రాణాయామం,  ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఇంట్లో తేలికపాటి ఏరోబిక్స్ లేదా డాన్స్  కూడా ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సమతుల ఆహారం,  హైడ్రేషన్.. సమతుల్య ఆహారాన్ని స్వీకరించడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన కంట్రోల్ లో ఉంచవచ్చు. చేపలు, వాల్‌నట్‌లు,  అవిసె గింజలు వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. విటమిన్ బి,  మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు, ఆకుపచ్చ కూరగాయలు, అరటిపండ్లు,  బాదం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. చక్కెర,  కెఫిన్ అధికంగా తీసుకోవడం ఆందోళనను పెంచుతుంది. కాబట్టి వాటిని తీసుకోవడం పరిమితం చేయాలి. ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్ నివారించవచ్చు.  ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది. మైండ్ఫుల్నెస్.. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి మూడవ మార్పు  మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం,  బాగా నిద్రపోవడం. 5-10 నిమిషాల లోతైన శ్వాస పద్ధతులు వంటి మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నీలి కాంతి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి, నిద్రవేళకు ముందు స్క్రీన్ సమయాన్ని (మొబైల్, టీవీ) తగ్గించాలి. ప్రతిరోజూ 7-8 గంటల గాఢ నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుంది.  మెదడును రీఛార్జ్ చేస్తుంది. నిద్రవేళకు ముందు గోరువెచ్చని నీరు త్రాగడం లేదా పుస్తకం చదవడం నిద్రను మెరుగుపరుస్తుంది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  కాఫీ.. భారతీయులు ఎక్కువగా తీసుకునే పానీయాలలో ఒకటి.  భారతదేశంలోని ప్రతి ఇంట్లో.. కాఫీ లేదా టీ.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా తాగుతూ ఉంటారు.  అయితే చాలామంది కాఫీ వైపు మొగ్గు చూపుతారు. కాఫీ సువాసనే మనిషికి పెద్ద బూస్టింగ్ ఇస్తుంది. ప్రపంచంలోనే ఆదరణ ఉన్న పానీయాలలో కాఫీ ఒకటి. కాఫీ ఆరోగ్యానికి మంచిదే అని అంటూ ఉంటారు.  పరిమిత మోతాదులో కాఫీ తీసుకుంటే అది ఆరోగ్యానికి చేసే మేలు ఎక్కువే.. ఇది పరిమితంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కూడా. అయితే ఇటీవల కాఫీ మీద జరిగిన పరిశోదనలలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అసలు కాఫీ తాగిన తరువాత 30 నిమిషాలలోపు శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. మెదుడు ప్రభావితం అవుతుంది.. కాఫీ తాగిన 30 నిమిషాల్లోనే అది  మెదడును ప్రభావితం చేస్తుందట.   కాఫీ తాగిన వారిని  మరింత అప్రమత్తంగా,  చురుగ్గా ఉండేలా చేస్తుంది. నిజానికి కాఫీలో ఉండే కెఫిన్  జ్ఞాపకశక్తి పనితీరును,  దృష్టిని మెరుగుపరిచే ఉద్దీపన . బాత్‌రూమ్ కు వెళ్లాలని అనిపిస్తుంది.. చెప్పుకోవడానికి కాస్త తమాషాగా,  చెప్పడానికి సిగ్గుగానూ అనిపిస్తుందేమో.. కానీ కాఫీ తాగిన తరువాత 30 నిమిషాలలోపు బాత్రూమ్ కు వెళ్ళాలి అనిపిస్తుందట. కాఫీ తాగడం వల్ల మలబద్ధకం సమయంలో  ప్రేగులలో కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది బాత్రూమ్ కు వెళ్లేలా చేస్తుందట. రక్తప్రసరణ.. కాఫీ  గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండెను మరింత బలపరుస్తుంది. ఇది ఏ రకమైన మంటనైనా తగ్గిస్తుంది. అందుకే కాఫీ గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కాఫీ వీరు తాగకూడదు.. కాఫీని పరిమితమైన మోతాదులో తాగడం ఆరోగ్యానికి మంచిదే.. అయితే అందరికీ కాఫీ తాగడం మంచిదని చెప్పలేం. ముఖ్యంగా ఆందోళన, రక్తపోటు, మద్యపానం అలవాటు ఉన్నవారు కాఫీ తాగడం మంచిది కాదట.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  చాలా మంది రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ళ సిరలు అకస్మాత్తుగా ఉబ్బుతాయి. నరాలు ఉబ్బి చాలా నొప్పిని కలిగిస్తాయి.  నిద్రకు కూడా భంగం కలిగిస్తాయి. ఇది కొన్నిసార్లు జరగడం సాధారణం.  కానీ ఇది చాలా ఎక్కువగా   జరుగుతుంటే అది విటమిన్ లోపం  సంకేతం కావచ్చని అంటున్నారు ఆహార నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల సిరలు ఉబ్బుతాయో.. ఇది ఎందుకు జరుగుతుందో.. విటమిన్ల ప్రధాన పాత్ర ఏంటో.. తెలుసుకుంటే.. విటమిన్ల పాత్ర.. శరీర అభివృద్ధికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా నరాలు,  గుండె పనితీరుకు కూడా చాలా ముఖ్యమైనవి. విటమిన్ లోపం నరాలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ సి లోపం.. విటమిన్ బి12 తో పాటు, విటమిన్ సి లోపం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి. నిజానికి విటమిన్ సి లోపం వల్ల రక్త కణాలు బలహీనపడతాయి. దీనివల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి. విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి నారింజ, నిమ్మ, జామ వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇంటి చికిత్సలు.. ఐస్ కంప్రెస్.. నిద్రలో నరాలు ఉబ్బడం, పట్టేసినట్టు అవ్వడం,  నొప్పి కలిగించడాన్ని వెరికోస్ వెయిన్ అంటారు.  ఈ వెరికోస్ వెయిన్  నుండి తక్షణ ఉపశమనం పొందడానికి  కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వెరికోస్ వెయిన్ వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ భాగానికి ఐస్ కంప్రెస్ వేయవచ్చు. 3 నుండి 5 నిమిషాలు కంప్రెస్ వేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆయిల్ మసాజ్..  అకస్మాత్తుగా నరాల నొప్పి వస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి అమ్మమ్మలు సూచించిన  ది బెస్ట్ ఇంటి నివారణను ఆయిల్ మసాజ్. నరాల నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయవచ్చు. తేలికపాటి చేతులతో మసాజ్ చేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..