నటీనటులు: రఘు కుంచె, వికాస్ ముప్పాళ , రామచంద్రం పుణ్యమంతుల, రవి చిన్నిబిల్లి, టీనా శ్రావ్య, మౌనిక, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీతం: రఘు కుంచె
ఎడిటర్: సుధీర్ ఎడ్ల
సినిమాటోగ్రఫీ: మురళీకృష్ణ
దర్శకత్వం: చైతన్య మోటూరి
నిర్మాత: వాణి రవికుమార్
విడుదల తేదీ: ఏప్రిల్ 24, 2026
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన 'గేదెల రాజు' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకినాడ నేపథ్యంతో సాగే ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా ఎలా ఉందంటే..? (Gedela Raju Movie Review)
కథ:
ఈ సినిమా కథ కాకినాడ పరిసరాల్లో తిరుగుతుంది. గేదెల రాజు (రఘు కుంచె) ఒక రౌడీ షీటర్. రాజకీయాల్లోకి ప్రవేశించి మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎదగాలని అతను కలలు కంటుంటాడు. అయితే, అనూహ్యంగా ఒక గుర్తుతెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురవుతాడు. గేదెల రాజుకు శత్రువులు చాలా మంది ఉండటంతో, అసలు అతన్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఈ క్రమంలో బయటపడిన ఆశ్చర్యకరమైన నిజాలే ఈ చిత్ర కథాంశం.
విశ్లేషణ:
ఈ సినిమా కేవలం ఒక రౌడీ షీటర్ కథ మాత్రమే కాదు, అధికారం కోసం జరిగే ఆధిపత్య పోరాటం. కాకినాడ ప్రాంతంలోని లోకల్ పాలిటిక్స్, అక్కడ కార్పొరేటర్ స్థాయికి ఎదగాలనుకునే ఒక రౌడీ షీటర్ ప్రయాణాన్ని దర్శకుడు చైతన్య మోటూరి చూపించారు. కథలో వచ్చే మలుపులు, ముఖ్యంగా గేదెల రాజు హత్య చుట్టూ అల్లిన సస్పెన్స్ సినిమాకు ప్రాణం పోసింది.
కథ పాతదే అయినప్పటికీ, పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి రాజకీయాలను సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కథనం చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మోడ్‌లో సాగుతుంది. ఒక వైపు గేదెల రాజు గతం, మరోవైపు అతని హత్య గురించి పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్.. ఈ రెండింటినీ సమాంతరంగా నడిపారు. ఈ క్రమంలో శత్రువుల పాత్రలు, ప్రేమ కథలు రావడం కొంత గందరగోళంగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే నెమ్మదించినట్లు అనిపించినా, కీలక సన్నివేశాల్లో మాత్రం పట్టు కోల్పోలేదు.
సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. గేదెల రాజు క్యారెక్టరైజేషన్, అతని పవర్ వంటి అంశాలతో మొదటి 30 నిమిషాలు వేగంగా సాగిపోతాయి. అయితే, ఇంటర్వెల్ వైపు వెళ్లే కొద్దీ కథనం కొంచెం నెమ్మదించి, పాత్రల మధ్య వైరాన్ని ఎస్టాబ్లిష్ చేయడంపై దృష్టి పెట్టింది.
సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. గేదెల రాజును చంపింది ఎవరు? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ ఇన్వెస్టిగేషన్ సీన్స్ నడుస్తాయి. అయితే మధ్యలో కొన్ని డ్రామా సీన్స్ కథా వేగాన్ని తగ్గించాయి. కానీ, ప్రీ-క్లైమాక్స్ నుండి సినిమా మళ్ళీ పుంజుకుంటుంది. క్లైమాక్స్ మెప్పించింది. హంతకుడు ఎవరనేది రివీల్ అయ్యే సీన్ ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రఘు కుంచె ఈ సినిమాకు ప్రధాన బలం. నెగటివ్ షేడ్స్ ఉన్న రౌడీ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ఆయన పలికిన గోదావరి యాస, మేనరిజమ్స్ సహజంగా ఉన్నాయి. కాస్ ముప్పాళ , రామచంద్రం పుణ్యమంతుల, రవి చిన్నిబిల్లి, టీనా శ్రావ్య, మౌనిక, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు.
చైతన్య మోటూరి ఎంచుకున్న కథాంశం బాగున్నా, కథనంలో కొంత తడబాటు కనిపించింది. ఒక థ్రిల్లర్‌గా ప్రారంభమైన సినిమా, మధ్యలో సాగదీతకు గురైంది. మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ అక్కట్టుకుంది. డార్క్ థీమ్, సహజమైన లోకేషన్స్ సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చాయి. నేపథ్య సంగీతం చాలా నేచురల్‌గా ఉందని చెప్పవచ్చు. ఎడిటర్ కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
రఘు కుంచె నటన
ప్రారంభ సన్నివేశాలు
చివరిలో ట్విస్ట్
మైనస్ పాయింట్స్:
కథనంలో గందరగోళం
కొన్ని అనవసరమైన సన్నివేశాలు
ఫైనల్ గా..
'గేదెల రాజు' ఒక సాధారణ రూరల్ యాక్షన్ డ్రామా. కథాంశం బాగున్నా, కథనంలో తడబాటు కారణంగా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.
రేటింగ్: 2.25/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.