రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే ఏపీ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రంలోని ఆవిష్కరణలు, స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎక్స్ఛేంజ్ (APEX) కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన 6 ప్రతిభావంతమైన స్టార్టప్ ల నిర్వాహకులను అభినందించి, ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్రానికి చెందిన 31 స్టార్టప్ లకు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ-2024 కింద తొలి విడతగా రూ.2.11 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంత్రి లోకేష్ చేతుల మీదుగా అందించారు. ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన అప్రూవల్ లెటర్స్, చెక్కులను ఆయా స్టార్టప్ సంస్థలకు అందజేశారు.
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ ల అభివృద్ధి.!
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25 విభిన్న పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. సిమెంట్ వంటి సంప్రదాయ రంగాల నుంచి క్వాంటం టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల వరకు ఈ ఎకోసిస్టమ్‌లను నిర్మిస్తున్నాం. ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ను సందర్శించినప్పుడు అక్కడ ఎన్నో అద్భుతమైన విజయగాథలు విన్నాను. అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి.
ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్‌కు అవసరమైన విడిభాగాల తయారీ వైపు కొన్ని కంపెనీలు తమ వ్యాపారాలను మలచుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఏపీలో క్వాంటం ఎకోసిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. సిమెంట్, స్టీల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంగాట్, సోలార్, వేఫర్, సెల్ తయారీ, ఎయిర్ కండిషనింగ్, ఆక్వా, క్వాంటం, మెడికల్ డివైజెస్, ఫార్మా, డేటా ఎకోసిస్టమ్ వంటి మొత్తం 25 రంగాలకు సంబంధించిన ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేస్తున్నామని లోకేష్ తెలిపారు.
ప్రతి ఎకోసిస్టమ్‌లో వర్టికల్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఒక మొబైల్ ఫోన్ తయారు కావాలంటే అనేక విడిభాగాలు ఒకచోట కలవాలి. బ్యాటరీ, కెమెరా మాడ్యూల్, కెమెరా లెన్స్, స్క్రీన్, ఇతర ఉపకరణాలు, ప్యాకేజింగ్, టెస్టింగ్ ఇలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ మొత్తం సరఫరా వ్యవస్థ, తయారీ ప్రక్రియ దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలోనే అందుబాటులో ఉండాలి. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తోంది. నైపుణ్యాభివృద్ధికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఖాకీ వెనుక ఓ సామాజిక యోధుడు..హైదరాబాద్ కొత్త సీపీ మహేష్ భగవత్ ప్రస్థానం.!
రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్ అందుబాటులో ఉన్నాయి. బీచ్ శాండ్ నుంచి వీటి తవ్వకాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచస్థాయి విద్యాసంస్థలతో కలిసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి, దానికి అనుగుణంగా ప్రత్యేక కరిక్యులమ్ రూపొందించడానికి కృషి చేస్తున్నాం. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ (SMR) రంగంలో కూడా మన దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవసరమైన ఇంజనీర్లను తయారు చేయాల్సిన అవసరం ఉంది.
రతన్ టాటా గారు అందరికీ స్ఫూర్తి.!
రతన్ టాటా గారు మనందరికీ నిజమైన స్ఫూర్తి. ఆయన నాయకత్వం మనందరినీ ప్రేరేపిస్తుంది. మనం మరింత ఉన్నత విజయాలు సాధించే దిశగా ముందుకు సాగుతున్నప్పుడు నైతిక విలువలు, నిజాయతీతో కూడిన మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యం. రతన్ టాటా గారు భారతదేశానికి అందించిన గొప్ప విలువలు ఇవే. ఆయన ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారు. అందుకే ఈ ఎకోసిస్టమ్‌కు ఆయన పేరు పెట్టడం జరిగింది. మీ అందరితో కలిసి ఈ సమగ్ర ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి మేం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.
ఇంటికో పారిశ్రామికవేత్త ఏపీ లక్ష్యం.!
ఇంటికో పారిశ్రామికవేత్త ఏపీ లక్ష్యం. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా ఒక వ్యవస్థను రూపొందిస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం, లక్ష్యం. ఆయనకు ఉన్న అపారమైన అనుభవం వల్ల మేం సరైన దిశలో ప్రయాణిస్తూ.. అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతున్నాం. ఆయనకు మద్దతుగా యువతరంతో కూడిన, కొత్త ఆలోచనలతో కూడిన మంత్రుల బృందం ఉంది. ముఖ్యమంత్రి విజన్‌ను సమర్థవంతంగా అమలు చేయడం మా బాధ్యత.
స్కైరూట్, సాగర్ డిఫెన్స్ సంస్థలే ఉదాహరణ.!
పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలపై నమ్మకంతో, వారికి అండగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకు స్కై రూట్, సాగర్ డిఫెన్స్ సంస్థలే ఉదాహరణ. స్కైరూట్ పై నమ్మకంతో 18 నెలల క్రితం స్పేస్ సిటీలో 300 ఎకరాల భూమిని కేటాయించాం. మరోవైపు సాగర్ డిఫెన్స్ సంస్థ రానున్న రోజుల్లో ఐపీవోకు వెళ్లనుంది. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా సముద్ర రంగంలో ఉపయోగించే డ్రోన్లను సాగర్ డిఫెన్స్ సంస్థ తయారుచేస్తోంది. ఒక పారిశ్రామికవేత్తతో కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ మంత్రి లోకేశ్ తెలిపారు.
పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందిస్తాం.!
పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించడానికి, వారి ఆలోచనలను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మీకు అవసరమైన భూమి కేటాయించడంతో పాటు ఎక్స్ పోజర్ విజిట్స్, వెంచర్ క్యాపిటలిస్టులతో అనుసంధానం కల్పిస్తాం. మీలో పట్టుదల, సాధించాలనే తపన ఉండాలి. మీ విజయాన్ని నిర్ణయించేది, మీ భవిష్యత్తును నిర్దేశించేది ఆ సాధించాలనే తపనే.
ఆ పట్టుదలను, ఆ లక్ష్యసాధన తపనను ఎప్పటికీ కోల్పోవద్దు. గొప్ప విజయాలు సాధించి ఏపీకి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కే.రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, హోంమంత్రి వంగలపూడి అనిత, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ఎం.సూర్యతేజ పాల్గొన్నారు.
మీకు నచ్చవచ్చు: 1999లోనే చంద్రబాబు ముందుచూపు..నేడు రూ.75 వేల కోట్ల ఆదాయం: గ్రంధి మల్లికార్జునరావు
మీకు నచ్చవచ్చు: మీ తాత గ్రేట్.. మా తాత గ్రేట్: విశాఖ వేదికగా లోకేష్, ఉపాసనల ఆసక్తికర సంభాషణ.!
[ RTIH Visakhapatnam, Nara Lokesh, AP Industrial Ecosystems, MSME Parks Andhra Pradesh, CM Chandrababu ]