మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని మన పెద్దలు చెప్తుంటారు. దానికి తగిన కృషి, పట్టుదల, దీక్ష, నిరంతర శ్రమ అవసరం. ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొని నిజాయితీగా ప్రయత్నిస్తే అది సాధ్యమేనని నిరూపించారు తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్. పాతికేళ్ళ క్రితం ఇంటర్నెట్ అనే వ్యవస్థ గురించి ప్రజల్లో సరైన అవగాహన లేని సమయంలోనే తెలుగువన్ పేరుతో తెలుగులో తొలి పోర్టల్‌ను ప్రారంభించి భవిష్యత్తులో తాను సాధించబోయే విజయాలకు బీజం వేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు డిజిటల్ రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. యూట్యూబ్‌కి కనెక్ట్ అయిన తొలి ఛానల్‌గా తెలుగు వన్‌ను నిలబెట్టారు. అంతేకాదు, పాతికేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక యూ ట్యూబ్ ఛానల్‌గా తెలుగువన్ అవతరించింది. ప్రస్తుతం తెలుగువన్ నీడలో దాదాపు 400 ఛానల్స్ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిర్విఘ్నంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది తెలుగువన్. ఈ అపురూప క్షణాలను ప్రముఖులతో, ప్రజలతో పంచుకోవాలన్న ఉద్దేశంతో మే 18న హైదరాబాద్‌లో తెలుగువన్ రజతోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అలాగే ఏపీ డ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్, పరమహంస పరివ్రాజకులు, జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి మహా విశిష్ట అతిథిగా హాజరై తెలుగువన్ టీమ్‌ని ఆశీర్వదించారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి మాజీ ఎం.పి. మురళీమోహన్, ఆర్.నారాయణమూర్తి, సినీ రచయిత తనికెళ్ల భరణి, సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, హీరోయిన్ పూనమ్ కౌర్ హాజరయ్యారు.
వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించడమే కాకుండా, ప్రజల్లో స్ఫూర్తిని నింపిన పది మంది ప్రముఖులను తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారాలతో ఘనంగా సత్కరించింది తెలుగువన్. సహస్రావధాని మేడసాని మోహన్, ప్రజావైద్యులు డాక్టర్ పాములపర్తి రామారావు, తెలుగు మీడియా అకాడమీ చైర్మన్ కల్మెకొలను శ్రీనివాసరెడ్డి, ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నతాధికారి డాక్టర్ పి.వి.రమేష్, వ్యవసాయ నిపుణుడు ముళ్లగూరు అనంతరాముడు, నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావు, సీఎస్‌బీ, ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు మల్లవరపు బాలలత, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్.. తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ అనేది జనానికి ఎంత దగ్గరైందో అందరికీ తెలిసిందే. తమ వీడియోలతో జనంలోకి వేగంగా దూసుకెళ్తున్న కొందరు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను తెలుగువన్ సత్కరించింది. ప్రారంభం నుంచీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాస భరితంగా సాగిన ఈ వేడుకలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, మిమిక్రీ కళాకారులు చేసిన ప్రత్యేక అంశాలు, ఫన్ బకెట్ చేసిన స్కిట్, తెలుగువన్ సిబ్బంది ప్రదర్శించిన స్కిట్ అందర్నీ ఆకట్టుకున్నాయి.