ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.  లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా  అభివర్ణించారాయన. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో  గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు.  రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో   కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు..  అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని భరోసా ఇచ్చారు. బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే  లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేశారు. 
ఆంధ్రప్రదేశ్   ఏకైక రాజధానిగా అమరావతిని స్థిరపరుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026 కు లోక్‌సభ బుధవారం (ఏప్రిల్ 1) ఆమోదం తెలిపింది. లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతికి చట్టపరమైన రక్షణ దిశగా అత్యంత కీలక ముందడుగు పడినట్లైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, విస్తృత చర్చ అనంతరం మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును సభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది.  సభలో ఈ బిల్లుపై సుమారు రెండు గంటల పాటు అర్థవంతమైన చర్చ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన,  కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే.. చర్చ జరుగుతున్న సమయంలో  వైసీపీ సభ్యులు   సభ నుంచి  వాకౌట్ చేశారు. అనంతరం ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ బిల్లు ఆమోదం పొందినట్లు అధికారికంగా ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ  2024 జూన్ 2 నుండి అమల్లోకి వచ్చేలా నిబంధనలను రూపొందించారు. దీనివల్ల గతంలో ఉన్న రాజకీయ అనిశ్చితికి తెరపడి, అమరావతి అభివృద్ధికి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోనున్నాయి. రాష్ట్ర విభజన హామీల అమలులో భాగంగా అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.  లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును గురువారం (ఏప్రిల్ 2)  రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో కూడా బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఇది పూర్తిస్థాయి చట్టంగా మారుతుంది. తద్వారా జగన్ తన హయాంలో తీసుకువచ్చిన మూడు రాజధానుల వివాదానికి, విధానానికి శాశ్వతంగా ముగింపు పలికినట్లౌతుంది.   ఈ పరిణామంతో అమరావతి ప్రాంత రైతులు సహా ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేరుగా వైసీపీ పేరు ప్రస్తావించకుండానే కుట్ర రాజకీయాలు చేస్తున్న పార్టీగా అభివర్ణించారు. హిట్ అండ్ రన్  నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని   వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.  జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశంపై వైసీపీ ఆరోపణలను ఖండించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు తమ ప్రభుత్వ హయాంలోనే సిద్ధమయ్యాయని..  కానీ  ఆ క్రెడిట్‌ను దక్కించుకోవడానికి వైసీపీ పచ్చి అబద్ధాలు చెబుతోందన్నారు.  మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇతర ప్రాంతాల మత్స్యకారులు ఏపీ జలాల్లోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన  పేదల సేవలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా పెన్షన్లు అందిస్తున్నామని, గతంలో ఇచ్చిన హామీ మేరకు 'తల్లికి వందనం, దీపం 2.0' వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.  త్వరలోనే ఇంటింటికీ పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు   వెల్లడించారు.  
ALSO ON TELUGUONE N E W S
    -ఎలక్షన్ క్యాంపెయిన్ లో విజయ్ బిజీ -ఈ నెల 23 న ఎన్నికలు  -వైరల్ అవుతున్న జననాయగన్ కొత్త రిలీజ్ డేట్ భాష కంటే మనిషి అంతరాత్మ నుంచి వచ్చే భావం గొప్పది. ఆ అంతరాత్మకి అందరు బద్దులు కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఏ మనిషి భావం అయినా ఇట్టే అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా ఈ సత్యం సినీ ప్రియుల ద్వారా అందరి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఈ కోవలోనే రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్(Vijay)అభిమానులు 'బొబ్బిలిపులి' లోని ఎన్టీఆర్(Ntr)సాంగ్  'సంభవం, నీకే సంభవం' అనే సాంగ్ ని పాడుకుంటున్నారు. పైగా పొలిటికల్ పరంగాను సదరు న్యూస్ విజయ్ కి లింక్ అవ్వడం గమనార్హం. అసలు మ్యాటర్ చూద్దాం. జననాయగన్(Jananayagan)ఈ నెల 24 న రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు, వంకలు ఉండవని, రిలీజ్ పక్కా  అంటున్నారు. దీంతో అభిమానులు తమ సుదీర్ఘ నిరీక్షకి తెరదించుతు జననాయకుడు రావాలని, సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడాలని బొబ్బిలిపులిలోని సాంగ్ పాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ పై సినీ విశ్లేషకులు స్పందిస్తు ఏప్రిల్ 24 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే  ఏప్రిల్ 23 న తమిళనాడు ఎన్నికలు కంప్లీట్ కాబోతున్నాయి. మూవీలో రాజకీయ నాయకులపై, ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై శృతిమించిన విమర్శలు ఉండటంతో సెన్సార్ అడ్డుకట్ట వేసింది. దీంతో 24 న రిలీజ్ కి అడ్డు ఉండదని అంటున్నారు. Also read:  Rashika Shetty: హీరోయిన్‌కి టార్చర్.. నీ ఫేస్‌కి బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా! ఇక లేట్ అయినా జన నాయగన్ కాస్ట్ గురించి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సినిమాతో పాటు విజయ్ కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ అది.   
    లాస్ట్ ఇయర్ రెండు చిత్రాలతో దుమ్ము లేపింది  మరి ఎందుకు తనకి అవమానాలు  పూర్తి మాటర్ చూద్దాం జీవితమంటే పోరాటం,పోరాటంలో ఉంది జయం.. ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు.. గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు.. అని చెప్పుకుంటే వెళ్తుంటే, ఆయనేంటి సార్ పక్కన అందమైన హీరోయిన్ పిక్ పెట్టి నరసింహ మూవీలో రజనీకాంత్ చెప్పిన జీవిత సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కొంపతీసి వేరే మాటర్ కి రాంగ్ పిక్ పెట్టాడా అని మానవ ధర్మంగా ఎగతాళి చెయ్యడం మొదలుపెడతారు. కానీ నేను చెప్పేది కరెక్ట్ న్యూస్ నే. మీరు చూస్తున్న పిక్ లో ఉన్న హీరోయిన్  నాకు ఇన్స్పిరేషన్. అసలు మాటర్ తెలిసాక ఇక మనం కూడా ఎవర్ని ఎగతాళి చేయం. రాశిక శెట్టి.. కన్నడ చిత్ర సీమకి చెందిన ఈ భామ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కొంత ముందైతే నువ్వు యాక్టర్ అవుతావా అని ఎగతాళి చేసారు. ఆడిషన్స్ కూడా చాలా కష్టంగా ఉండేవి. ఎంకరేజ్ మెంట్ ఉండేది కాదు. అవకాశాలు ఇవ్వకపోవడమే కాకుండా సూటి పోటీ మాటలతో ఇబ్బందులు పెట్టేవారు. ఒకసారైతే నీ ముఖానికి బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా అని అన్నారు. దాంతో చాలా బాధపడ్డాను. కానీ ఎవరేం చేసినా, ఎన్ని మాటలు అన్నా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. వచ్చిన అవకాశాలు చేతి దాకా వచ్చి చేజారిన డోంట్ కేర్ అనుకుని ముందుకు సాగుతూ నాకంటూ ఒక రోజు వస్తుందని అనుకున్నానని చెప్పుకొచ్చింది. Also read: Ramayana: రాముడి పాత్రని తిరస్కరించిన నేటి అగ్ర హీరో.. ఇక రికార్డులే తరువాయి  మరి తన ఆత్మ విశ్వాసానికి తగ్గట్టే గత ఏడాది 'మనడ కడలు, నిమ్దే కథే అనే చిత్రాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. కన్నడ బిగ్ బాస్ 12 వ సీజన్ ని కూడా తన హిస్టరీలో ఉంచుకున్న రాశిక 2014 లోనే  సందేహం అనే మూవీతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కూడా ల్యాండ్ అయ్యింది.    
- జీతం గురించి అడిగిన త‌ల్లికి కూతురు ఇచ్చిన దిమ్మతిరిగే సమాధానం - కళ్ళలో నీళ్లు తెప్పించే జయప్రద నటన  - మధ్యతరగతి ఆడబిడ్డ ఆవేదనకు అద్దం పట్టిన దృశ్యం   మధ్యతరగతి కుటుంబాలలో ఆడపిల్ల అంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు, ఆ ఇంటికి వెన్నెముక. కానీ, అదే ఆడపిల్ల తన రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తుంటే, ఆ సంపాదన మీద కక్కుర్తి పడే మనుషులు ఉంటే.. ఆ నరకం ఎలా ఉంటుందో ఈ భావోద్వేగ సన్నివేశం మన కళ్లకు కడుతుంది. అలనాటి మేటి నటి జయప్రద తన అద్భుత నటనతో ఒక మధ్యతరగతి యువతి పడే సంఘర్షణను వెండితెరపై ఆవిష్కరించారు. మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాల‌ను తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించే దిగ్ద‌ర్శ‌కుడు కె.బాల‌చంద‌ర్ రూపొందించిన అంతులేనిక‌థ చిత్రంలోనిదీ స‌న్నివేశం. జ‌య‌ప్ర‌ద ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో ర‌జినీకాంత్‌, కమల్ హాసన్, ప్రసాద్‌బాబు, ఫ‌టాఫ‌ట్ జ‌య‌ల‌క్ష్మి, శ్రీ‌ప్రియ ఇత‌ర పాత్ర‌లు పోషించారు.        ఒక కూతురి కష్టం, ఒక తల్లి అసహాయత అదేవిధంగా బాధ్యత లేని తండ్రి, కొడుకుల ప్రవర్తన. జీతం కోసం ఎదురుచూసే త‌ల్లికి తన కూతురు పడే కష్టం కనబడదు. "ఈ నెల జీతం 50 రూపాయలు పెంచారు అన్నావుగా.. మరి నాకు ఇచ్చే డబ్బులు ఎందుకు తగ్గించావు?" అని ఆ త‌ల్లి అడిగే ప్రశ్న, సమాజంలో ఉన్న కొందరు మ‌నుషుల స్వార్థానికి నిలువుటద్దం పడుతుంది. ఆఫీసులో చాకిరీ చేసి, బస్సుల్లో రద్దీని తట్టుకుని, ఇంటికి రాగానే ఆదరణ కరువైన వేళ.. ఆమె నోటి వెంట వచ్చే మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. "జీతం పెంచింది నా తెలివితేటలకు, నా కష్టానికి.. మీరు విలాసాలు చేసుకోవడానికి కాదు" అని ఆమె గర్జించే తీరు ఒక స్ఫూర్తినిస్తుంది. ఇంటి యజమానిగా పేరుండి, బాధ్యతలు గాలికి వదిలేసిన అన్న‌య్య‌ని చూసి ఆమె పడే ఆవేదన కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తుంది. తిని తిరగడమే పనిగా పెట్టుకున్న అన్నయ్య ప్రవర్తన ఆ ఇంటిని మరింత కుంగదీస్తుంది. "జగమే మాయ.. బ్రతుకే మాయ" అంటూ తాగి వచ్చి వేదాంతాలు పలికే అన్నయ్యను చూస్తుంటే, ఒక చెల్లిగా ఆమె ఎంత క్షోభ అనుభవిస్తుందో అర్థమవుతుంది. ఆబోతుల్లా మేసే మనుషులను భరించడం నా వల్ల కాదు అని ఆమె తెగేసి చెప్పడం ఆమె ధైర్యానికి నిదర్శనం. చివరికి, "ఈ తలరాతలను కొంతకాలం దూరంగా ఉంచితే, ఈ ఇంటి రాతే మారిపోతుంది" అని ఆమె చెప్పే మాటలు జీవిత సత్యాన్ని బోధిస్తాయి. తన కుటుంబం కోసం తపించే ఒక ఆడబిడ్డను గౌరవించలేని మనుషులు ఉన్నచోట ఉండలేక, ఆమె పడే సంఘర్షణ గుండెలను పిండేస్తుంది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవ్వడమే కాకుండా, తమ ఇంట్లోని ఆడబిడ్డల విలువను గుర్తించేలా చేస్తుంది. ఆడ‌పిల్ల సంపాద‌న‌పై ఆధార‌ప‌డే మ‌గ‌మ‌హారాజుల క‌ళ్లు తెరిపించేలా ఈ స‌న్నివేశాల‌ను మ‌లిచారు ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్‌. పైకి క‌ఠినంగా క‌నిపించినా స‌ముద్ర‌మంత క‌న్నీరు దాచుకున్న స‌రిత పాత్ర‌లో జ‌య‌ప్ర‌ద జీవించార‌ని చెప్పాలి. చూసిన ప్ర‌తి ఒక్క‌రినీ భావోద్వేగానికి లోను చేసే ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. ఇలాంటి మ‌రిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
  -రాముడితో భారతీయులకి ఉన్న అనుబంధం తెలిసిందే -మరి రాముడి ఆఫర్ వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా! -కానీ ఆ హీరో చేయనున్నాడు  -మరి ఆ తర్వాత ఏం జరిగింది  భారతీయల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడిపై మూవీ తెరకెక్కించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యి ఒక బడా హీరో చేత శ్రీరాముడిగా చేయించడానికి ప్రిపేర్ అయ్యారు. మరి వాళ్ళు సదరు హీరోని ప్రిపేర్ అయ్యే ముందు ఎన్నో విధాలుగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకుంటారు. పైగా అక్కడ ఉంది శ్రీ రామచంద్రుడు. హీరో లుక్ లో ఏ మాత్రం తేడా వచ్చినా రామభక్తులు, మూవీ లవర్స్, ప్రేక్షకుల ఆగ్రహజ్వాలలకి థియేటర్స్ మొత్తం   మూవీ స్టార్ట్ అయిన మధ్యలోనే ఖాళీ అయ్యే పరిస్థితి. దీన్ని బట్టి కమిట్ మెంట్ స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. పైన మనం చెప్పుకున్న న్యూస్ కి ఆద్యుడు రణబీర్ కపూర్(Ranbir kapoor). పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా చేస్తున్న'రామాయణ'(Ramayana)ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. రీసెంట్  రణబీర్ మీడియాతో మాట్లాడుతు నాలుగు సంవత్సరాల క్రితమే నమిత్ మల్హోత్రా రాముడి ఆఫర్ ని తీసుకొచ్చారు. కానీ  తిరస్కరించాను. ఎందుకంటే శ్రీరాముడి వంటి మహోన్నతమైన క్యారక్టర్ ని పోషించే  సామర్థ్యం నాకు ఉందా? ఆ క్యారక్టర్ కి నేను న్యాయం చేయగలనా? అని నన్నునేనే ప్రశ్నించుకున్నాను. అప్పట్లో నా లైఫ్ స్టైల్, నా ఆలోచనలు వేరేలా ఉండేవి. అందుకే సెట్ అవ్వనని నిర్మొహమాటంగా చెప్పేశాను. కానీ నా కూతురు 'రాహా' రాకతో నా ఆలోచనలు మారిపోయాయి. ఒక తండ్రిగా నా బాధ్యతల్ని తెలుసుకున్న తర్వాత శ్రీరాముడి వంటి ఆదర్శవంతుడి క్యారక్టర్ లో చెయ్యడం ద్వారా నన్ను నేను మార్చుకోవచ్చని అనిపించింది. ఈ అవకాశం రావడం కూడా దైవసంకల్పంగా భావించాను. మొదట్లో ఉన్న భయం కాస్తా భక్తిగా, కృతజ్ఞతగా మారిందని  రణబీర్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. also read: Anjali Nair: హైకోర్టుకి ప్రముఖ నటి అంజలి.. 120 సినిమాల్లో ఏ పేరు ఉంది ఇక రామాయణని ప్రపంచ సినీ బడ్జెట్ కి ధీటుగా భారతీయ చిత్ర పరిశ్రమలోనే కనివిని ఎరుగని బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా దంగల్ ఫేమ్ నితిన్ తివారి(Nitesh Tiwari) తెరకెక్కిస్తున్నాడు. సాంకేతికత పరంగా కూడా వరల్డ్ సినిమాకి సవాలు విసరనుంది. రావణుడుగా కన్నడ రాకింగ్ స్టార్ యష్(Yash)హనుమంతుడిగా సన్నీడియోల్(Sunny Deol)చేస్తుండటం రామాయణ స్పెషల్. ఆస్కార్ విన్నర్స్ హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్(Ar Rehman)సంయుక్తంగా మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే రిలీజైన గ్లింప్స్రికార్డులు సృష్టించే పనిలో ఉన్నాయి. సదరు రికార్డ్స్ రాముడి పాదాల చెంతకి చేరే ఉంటాయి. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కనున్న రామాయణ ఈ ఏడాది దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండవ భాగం రిలీజ్ కానున్నాయి.      
 - కన్నీటి సాగరంలో ఆశల దీపం - చీకటి బ్రతుకులో అక్షర వెలుగు - నరకకూపం నుండి గౌరవప్రదమైన జీవితం వైపు  - ఒక అభాగ్యురాలి స్ఫూర్తిదాయక ప్రయాణం! జీవితం విసిరిన పడగనీడలో, చీకటి గదుల మధ్య బందీ అయిన ఒక అభాగ్యురాలి కథ ఇది. బ్రతకడానికి శరీరాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఒకవైపు, తన భవిష్యత్తును మార్చుకోవాలనే ఆశయం మరొకవైపు. లోకం తనను ఏ పేరుతో పిలిచినా, తను మాత్రం అక్షరాన్నే నమ్ముకుంది. ఈ హృదయ విదారక సన్నివేశం చూస్తుంటే ఎవరికైనా సరే కళ్ళలో నీళ్లు తిరగక మానవు. ఒకవైపు కస్టమర్ల తాకిడి, ఇంకోవైపు బ్రతుకు పోరాటం. ఆ సమయంలో తన వద్దకు వచ్చిన ఒక వ్యక్తిని ఆమె అడిగిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. "నన్ను త్వరగా వదిలేస్తారా? రేపు నాకు లెక్కల పరీక్ష ఉంది" అని ఆమె అడిగినప్పుడు, ఆ కళ్లలో కనిపించే ఆర్తి వర్ణనాతీతం. ఆ నరకకూపంలో ఉంటూ కూడా ఎస్.ఎల్.సి (SLC) పరీక్ష కోసం సిద్ధమవుతున్న ఆమె సంకల్పం మనల్ని ఆలోచింపజేస్తుంది. "చదువుకుంటేనే ఈ బ్రతుకు మారుతుంది" అనే నమ్మకం ఆమెను ఆ చీకటి గదిలోనూ పుస్తకం పట్టేలా చేసింది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన ఆ వ్యక్తి, ఆమెలోని ఆవేదనను, ఆశయాన్ని గుర్తించి అండగా నిలబడతాడు. సమాజం ఛీత్కరించుకునే వృత్తిలో ఉన్నా, ఆమెలోని పవిత్రమైన మనసును చూసి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. ఇది కేవలం ఒక పెళ్లి కాదు, ఒక జీవితానికి లభించిన కొత్త వెలుగు. కన్నీళ్ల మధ్య సాగిన ఆమె ప్రయాణం, చివరకు ఒక గౌరవప్రదమైన మలుపు తీసుకోవడం చూస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్లనిపిస్తుంది. ఈ సన్నివేశాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "కష్టం మనిషిని కృంగదీయవచ్చు కానీ, చదువుపై ఉన్న శ్రద్ధ మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది" అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మనసుని హత్తుకునే ఈ భావోద్వేగ సన్నివేశం, ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తే విజయం వరిస్తుందని తెలియజెప్పే ఈ వీడియో మీకు అందిస్తున్నాం. ఇలాంటి భావోద్వేగమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి
    అంజలి హైకోర్టుకి వెళ్ళడానికి కారణం ఏంటి అసలు పొరపాటు ఎక్కడ జరిగింది  మరి విజయం సాదిస్తుందంటారా! సినిమాకి, రాజకీయానికి మధ్య ఉన్న అనుబంధం రక్త సంబంధానికంటే ఎక్కువ అని చెప్పవచ్చు. మరి ఆ రెండిటి సుదీర్ఘ ట్రాక్ రికార్డు రక్త సంబంధం అనే వర్డ్ వాడటంలో ఎలాంటి తప్పులేదని చెప్తుంది. ఇక తెలుగు వారి చేత డైలీ మలయాళ సినిమా చూసేలా చేసే కేరళలో ఈ నెల 9 న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ప్రముఖ నటి అంజలి నాయర్(Anjali Nair) అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో ఆమె రీసెంట్ గా కేరళ హైకోర్ట్ మెట్లు ఎక్కడం సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం ముద్రించిన పేపర్స్ లో అంజలి నాయర్ పేరు ప్లేస్ లో అంజలి పి.వి.అని పేర్కొన్నారు. ఈ లెక్కన ఎలక్షన్స్ రోజున ఈవీఎంతో పాటు బ్యాలెట్ పేపర్ పై అదే పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ విషయంపైనే ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో నేను ఓటర్లకి  'అంజలి నాయర్' అనే పేరుతోనే పరిచయం. 'అంజలి పి.వి.' అని ఉంటే నన్ను గుర్తుపట్టడం కష్టమవుతుంది. కాబట్టి అంజలి నాయర్ గా పేరు మార్చాలని తన పిటిషన్ లో పేర్కొంది. ఈ విషయంపై హైకోర్టు స్పందిస్తు  విచారణ జరిపి పూర్తి వివరాలు అందివ్వాలని  కేంద్ర ఎన్నికల అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేసింది. Also read: Varanasi: స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా హల్ చల్.. వైరల్ అవుతున్న పిక్స్    1994 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన అంజలీ ఆనతికాలంలోనే ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా చేసి అశేష అభిమానఘనాన్ని పొందింది. దృశ్యం 2 తో పాటు ఎన్నో క్రేజీ చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. మోహన్ లాల్(Mohan lal)అప్ కమింగ్ మూవీ 'రామ్' లో ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపిస్తుంది. తన లిస్ట్ లో మొత్తం120 చిత్రాల వరకు ఉండగా 'త్రిపునతురా' సెగ్మెంట్ నుంచి బీజేపీ నేతృత్వంలో ఉన్నTwenty20 Party నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.     
  -వారణాసితో ప్రియాంక చోప్రా బిజీ -నిన్న స్వర్ణ దేవాలయం సందర్శన  -వైరల్ అవుతున్న పిక్స్  మహేష్ బాబు(Maheshbabu),రాజమౌళి(ss Rajamouli)వరల్డ్ మేకర్స్ తెలుగు సినిమా వైపు చూసేలా 'వారణాసి'(Varanasi)ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం ఆ విషయంలో నేను కూడా హామీ అంటూ మందాకినీగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించనుంది. ఈ ముగ్గురుతో పాటు మిగతా టెక్నీషియన్స్ కి తెలియని విషయం ఏంటంటే పాప కర్మలని పటాపంచలు చేయడానికి పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్న మన భారతదేశపు చిట్టచివరి నగరం వారణాసిని ప్రతి ఒక్కరు రోజు తలుచుకునేలా చెయ్యడం. ఈ విధంగా వారణాసి టీం ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రియాంక చోప్రా(Priyanka Chopra)గురించి వస్తున్న న్యూస్ నే అందుకు సాక్ష్యం. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. ప్రియాంక చోప్రా నిన్న అమృత్‌సర్‌లోని సిక్కుల పవిత్ర క్షేత్రం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. సాంప్రదాయ బద్ధంగా గులాబీ రంగు డ్రస్ ధరించి, తలపై చున్నీ వేసుకుని ఆలయ మర్యాదలని పాటించడంతో పాటు ఆలయ ప్రాంగణంలోని లంగర్ (ఉచిత అన్నదాన కేంద్రం) లో అన్నం వడ్డించడంతో పాటు స్వయంగా ఆ పాత్రలని శుభ్రం చేసింది. ఈ విధంగా అందరితో కలిసి కూర్చుని గంటల తరబడి సేవలో నిమగ్నమవ్వడం చూసి అక్కడి భక్తులు ప్రియాంక సింప్లి సిటీని మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ కావడంతో నెటిజన్స్ ప్రియాంకని మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు Also read: Samantha: సమంతపై సుకుమార్ కీలక వ్యాఖ్యలు.. నా చెంప చెళ్లుమనిపించినట్లు అయ్యింది  'వారణాసి' ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని పలు ఏరియాల్లో షూటింగ్ ని జరుపుకుంటుంది. అందులో భాగంగానే ప్రియాంక  అమృత్‌సర్ ని  సందర్శించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.      
టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లేడీ డైరెక్టర్ మానస శర్మ(Manasa Sharma). డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ యువ దర్శకురాలు ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? 'ఓయ్' హీరోయిన్ షామ్లీని గుర్తుచేస్తున్న లుక్: నిహారిక కొణిదెల నిర్మాణంలో మానస శర్మ దర్శకత్వం వహించిన 'రాకాస'(Rakasa) చిత్రం ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మానస శర్మను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆమె అమాయకపు నవ్వు, సహజమైన తెలుగుదనం చూస్తుంటే ఒకప్పటి 'ఓయ్' హీరోయిన్ షామిలి గుర్తుకువస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఒక హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని లుక్, సింపుల్ స్టైల్‌తో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రైటర్ టు డైరెక్టర్.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మానస శర్మ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. రైటర్ గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌కు పని చేసింది. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సిరీస్ కి రైటర్ గా వర్క్ చేసి మెప్పించింది. ఆ తర్వాత డైరెక్టర్ గా ఎదిగింది. 2024లో సోనీ లివ్‌లో విడుదలైన 'బెంచ్ లైఫ్' (Bench Life) వెబ్ సిరీస్ ద్వారా ఆమె దర్శకురాలిగా పరిచయమైంది. ఆ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నిహారిక సపోర్ట్.. రాకాసతో రాక.. బెంచ్ లైఫ్' సిరీస్ తర్వాత, మరోసారి నిహారిక కొణిదెల నిర్మాణ సంస్థలోనే 'రాకాస' సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం మానసకు దక్కింది. అంటే, నిర్మాత నిహారికకు ఆమె పనితీరు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో ఉన్న మానస శర్మ, 'రాకాస'తో వెండితెరకు డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ట్రైలర్ తో మంచి మార్కులు కొట్టేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ డైరెక్టర్ హీరోయిన్ లా ఉందంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/reel/DWij-dvBDpQ/
అఖిల్ అక్కినేని(Akhil Akkineni) తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. 'ఏజెంట్' వంటి డిజాస్టర్ తర్వాత రూటు మార్చిన అఖిల్, ప్రస్తుతం 'లెనిన్' (Lenin) అనే విభిన్నమైన సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు మారుతి(Maruthi)తో అఖిల్ ఒక సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. హిట్ కోసం మారుతి ప్రయత్నం దర్శకుడు మారుతి ఇటీవల ప్రభాస్‌తో చేసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా ఒక పక్కా కమర్షియల్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అఖిల్ కోసం ఒక క్రేజీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా, మారుతి గతంలో అక్కినేని హీరో నాగచైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు' అనే సినిమా చేయడం విశేషం. చర్చల దశలో ప్రాజెక్ట్ అఖిల్, మారుతి మధ్య ఇప్పటికే పలుసార్లు కథా చర్చలు జరిగినట్లు సమాచారం. అఖిల్ ప్రస్తుతం తన ఇమేజ్‌కు సరిపోయే, అదే సమయంలో వైవిధ్యంగా ఉండే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. మారుతి చెప్పిన లైన్ పట్ల అఖిల్ పాజిటివ్ గా ఉన్నాడని, అయితే పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధమయ్యాక తుది నిర్ణయం తీసుకుంటారని వినికిడి. వరుసగా కథలు వింటున్న అఖిల్ 'ఏజెంట్' రిజల్ట్ తర్వాత అఖిల్ తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కేవలం మారుతి మాత్రమే కాకుండా మరికొందరు యువ దర్శకులతో కూడా ఆయన టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 'లెనిన్' పూర్తి కాగానే, తన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ ఇనిషియేటివ్ తీసుకుంది.  హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. 9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు.  కేంద్రప్రభుత్వం స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈనెల 8వ తేదీన  అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమానికి ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం అభినందనీయం.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది,  ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం పదమూడవ రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు జైన మతానికి చెందిన 24వ తీర్థంకరుడైన  మహావీరుని జన్మదినోత్సవం. ఈ సంవత్సరం, మహావీర్ జయంతి 2026 మార్చి 31, మంగళవారం నాడు  వచ్చింది.  యువరాజు వర్థమానుడు.. మహావీరుడిగా ఎలా పరివర్తన చెందాడు? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. మహావీరుని పంచ వ్రతాలైన అహింస, సత్యం, అపవిత్రత, బ్రహ్మచర్యం, అపరిగ్రహం జైన మతానికి మూలస్తంభాలు.  మహావీరుని జన్మదినోత్సవం జైన సమాజానికి ఒక ప్రధాన పండుగ. ఈ పవిత్రమైన రోజున, జైన దేవాలయాలను అలంకరిస్తారు,  మహావీరుని విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తారు, భారీ రథయాత్రలను నిర్వహిస్తారు. ప్రజలు దానధర్మాలు చేస్తారు , మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. సాధారణ మానవుడిగా జన్మించిన వర్థమానుడు  తన జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించుకుని, జ్ఞానోదయం పొందిన ఆత్మగా, మహావీరడిగా మారి, అసాధారణమైన కార్యాలు సాధించారు. ఆయన ఒక రాజభవనంలో జన్మించి, పుట్టుకతోనే యువరాజు అయినప్పటికీ,  జ్ఞానాన్వేషణలో త్యాగాన్ని, అంకితభావాన్ని అనుసరిస్తూ మహావీరుడిగా మారారు. కానీ యువరాజు వర్ధమానుడి నుండి మహావీరుడిగా ఆయన ప్రయాణం మరింత అద్భుతమైనది. వర్థమానుడు మహావీరుడిగా మారిన ప్రయాణం..  మహావీరుడు సుమారు 2,500 సంవత్సరాల క్రితం క్రీ.పూ. 599లో  వైశాలిలోని క్షత్రియకుండ గ్రామంలో ఒక క్షత్రియ రాజ కుటుంబంలో జన్మించారు. పుట్టినప్పుడు, అతని తల్లిదండ్రులు అతని శ్రేయస్సు  బాగుండాలని  వర్ధమాన అని పేరు పెట్టారు. వర్ధమానుని తండ్రి సిద్ధార్థుడు ,అతని తల్లి త్రిశాల. శ్వేతాంబర సంప్రదాయం ప్రకారం వర్ధమానుడు యువరాణి యశోదను వివాహం చేసుకున్నాడు. అయితే దిగంబర సంప్రదాయం మహావీరుడిని జీవితాంతం బ్రహ్మచారిగా వర్ణిస్తుంది. 30 ఏళ్ల వయసులో వర్ధమాన యువరాజు లౌకిక జీవితాన్ని త్యజించాలని నిశ్చయించుకుని, సర్వస్వం త్యజించి సత్యం , జ్ఞానం కోసం అన్వేషిస్తూ  బయలుదేరాడు. దీక్ష స్వీకరించిన తరువాత, అతను ఒక సంవత్సరానికి పైగా దేవదూష్య వస్త్రాలు ధరించి, ఆపై వస్త్రాలు విడిచిపెట్టి, తపస్సు మార్గాన్ని అనుసరించి కఠోర తపస్సు చేశాడు. 12 సంవత్సరాల మౌనం, తపస్సు, ఉపవాసం , ఆత్మసంయమనం తరువాత చివరకు రిజుబాలిక నది ఒడ్డున ఉన్న ఒక సాల వృక్షం కింద కైవల్యాన్ని పొందాడు. 42 ఏళ్ల వయసులో దివ్య జ్ఞానోదయం పొందిన తర్వాత,  మహావీరుడు  తన జీవితంలోని తదుపరి 30 సంవత్సరాలు బీహార్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఈ సమయంలో, ఆయన ధర్మ సందేశాన్ని కూడా వ్యాప్తి చేశారు. 72 ఏళ్ల వయసులో, దీపావళి కార్తీక అమావాస్య రోజున,  మహావీరుడు బీహార్‌లోని పావాపురిలో  నిర్వాణం పొందారు. ఇది మహావీరుడి కథ..!                                       *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా కూడా సాగుతాయి.  చాలామంది భార్యాభర్తలు గొడవలు జరిగిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి గొడవలే కాదు.. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని అలవాట్లు భార్యాభర్తల మధ్య బంధాన్ని విచ్చిన్నం చేస్తాయని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  బంధాన్ని నాశనం చేసే అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. తప్పులు వెతకడం.. భార్యాభర్తల బందం ముడిపడింది అనగానే పూర్తీగా ఒకరి చేతిలో బంధం కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు కొందరు. మరీ ముఖ్యంగా భర్తలు ఇలా ఎక్కువ చేస్తారు. వారు నిలబడే తీరు, ధరించే దుస్తులు, చేసే పనులు ఇలా.. ప్రతి విషయంలో తప్పులు వెతకడం చేస్తుంటారు. అలా తప్పులు చూపించడం తమ గొప్ప అని వారు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల లైఫ్ పార్ట్నర్ చాలా ఇబ్బంది పడతారు. ఇదే విధంగా ఎక్కువ కాలం సాగితే.. మా ఇద్దరికి సెట్ కావడం లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కాస్తా బంధం పెళుసుబారడానికి దారితీస్తుంది. మౌనం.. భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరైనా సరే.. ఏదైనా తమకు నచ్చని పని జరిగినప్పుడు లేదా తమకు ఏ విషయంలో అయినా అసంతృప్తి ఏర్పడినప్పుడు దాని గురించి మాట్లాడటం కంటే.. మౌనంగా ఉండి భాగస్వామిని సాధిస్తూ ఉంటారు. ఈ పద్ధతి చాలా హానికరమైనది.  భాగస్వామిని పట్టించుకోకుండా  మానసిక హింసకు గురి చేయడం లాంటిది ఇది. ఆరోగ్యకరమైన సంబంధానికి,  మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడటం చాలా అవసరం. మౌనంగా ఉండటం వల్ల  భాగస్వామి అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఎక్కువ, అంతేకాదు.. ఇలాంటి ప్రవర్తన వల్ల బంధంలో దూరం పెరుగుతుంది. పాత  విషయాలు.. గొడవల సమయంలో బార్యాభర్తలలో చాలామంది పాత విషయాలను బయటకు లాగి వాటిని తమకు అనుగుణంగా ఉండేలా చేసుకుంటారు. భాగస్వామి చేసిన తప్పును ఒకసారి క్షమించేశాక.. తరువాత వాదన జరిగిన ప్రతిసారీ ఆ విషయాన్ని తిరిగి ప్రస్తావించకూడదు. ఇలా చేయడం వల్ల  భాగస్వామి నమ్మకం దెబ్బతింటుంది,   ఇంకా పాత విషయాలను మనసులో పెట్టుకున్నారని, బంధంలో అర్థం చేసుకునే తత్వం లేదని అనుకుంటారు. ఆధిపత్యం.. ప్రేమ అంటే  భాగస్వామి ఫోన్‌ను నిరంతరం రహస్యంగా చూడటం, వారు స్నేహితులతో ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు గమనించడం, గూఢచర్యం చేసినట్టు బిహేవ్ చేయడం, ఇవన్నీ కాదు.. చాలామంది ఇవన్నీ చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ దాన్ని ప్రేమ అని అనుకుంటారు. కానీ ఇలా ప్రవర్తిస్తే అది వ్యక్తి స్వేచ్ఛను హరించినట్టే.. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి బంధంలో నమ్మకం పోతుంది. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను ఇతరులతో పోల్చడం మంచిది కాదు.  భాగస్వామిని స్నేహితులు, వారి భాగస్వాములు,  అక్క చెళ్లేళ్లు,  అన్నదమ్ములు ఇలా అందరితో  పోల్చడం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి బలాలు, బలహీనతలు ఉంటాయి. పోలికల వల్ల  భాగస్వామి బాధపడవచ్చు.  బంధంలో ఎప్పటికీ వ్యక్తిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి.అప్పుడే బంధం బాగుంటుంది. లేదంటే బంధం విచ్చిన్నమవుతుంది.                                            *రూపశ్రీ  
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం. మధ్యాహ్నం పూట ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడమే ఒక పెద్ద పనిగా మారుతుంది.  మండే ఎండల్లో బయటకు వెళ్లిరావడం అంటే పెద్ద యుద్దం చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతాయి.   ఇంత కఠినమైన వేసవి ఎండలో బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు తమకు తాము రక్షణ కల్పించుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.  లేకపోతే  అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వేసవి ఎండలో ఇంటి నుండి బయటకు వెళ్లే అవసరం వస్తే.. మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లాలని, అది వారికి ఎంతో సహాయపడతాయని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఇంతకూ వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసిరిగా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటో.. వారి ఉపయోగం ఎంటో తెలుసుకుంటే.. వాటర్ బాటిల్.. మండుటెండలో  ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే అనేక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు  బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిల్  ఉంచుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే డీహైడ్రేషన్ తీవ్రమై  అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ. సన్ గ్లాసెస్.. వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు  బ్యాగ్‌లో సన్ గ్లాసెస్ తప్పకుండా ఉంచుకోవాలి. ఎండ నుండి  కళ్ళను కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఇవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి. సన్‌స్క్రీన్ క్రీమ్.. వేసవి ఎండలకు సన్‌స్క్రీన్ క్రీమ్ చాలా ముఖ్యం. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ  చర్మం పొడిబారడం లేదా గరుకుగా మారడం మొదలైతే వెంటనే సన్ స్క్రీన్  రాసుకోవచ్చు. గొడుగు.. వానలో తప్ప ఎండలో గొడుగు వాడటం తెలియని వారు ఉన్నారు. ఈ మండుటెండలో బ్యాగ్‌లో తప్పకుండా ఒక గొడుగు ఉంచుకోవాలి. ఇది  ఎండ నుండి కాపాడటానికి సహాయపడుతుంది. స్కార్ఫ్ లు.. అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు తమ బ్యాగ్‌లో తప్పకుండా స్కార్ఫ్ ఉంచుకోవాలి. ఇది  తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది, అలాగే ఎండదెబ్బ,  చర్మం నల్లబడటాన్ని కూడా నివారిస్తుంది.                                     *రూపశ్రీ.
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏసీలో ఎక్కువగా గడిపేవారిలో ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి.  ఏసీ లో గడపడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ నిజాలు తెలుసుకోవాలి... ఊబకాయం ఎలా పెరుగుతుందంటే.. కార్యకలాపాలు లేకపోవడం.. శరీరం సౌకర్యవంతంగా చల్లగా ఉన్నప్పుడు, అది శక్తిని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయదు. రోజంతా కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కేలరీల బర్నింగ్  గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా, కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. ఉష్టోగ్రత.. వేడి వాతావరణంలో, శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది, దీనివల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది. ఏసీలో ఉండటం ఈ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల జీవక్రియ రేటు తగ్గి బరువు పెరుగుతుంది. ఆకలి.. చల్లని వాతావరణంలో శరీరానికి అదనపు శక్తి అవసరం ఏర్పడుతుంది. దీని ఫలితంగా తరచుగా ఆకలి వేయడం, విచక్షణారహితంగా జంక్ లేదా నూనె పదార్థాలను తినడం వంటివి ఊబకాయానికి దారితీస్తాయి. చెమట, డిటాక్స్.. చెమట పట్టడం అనేది శరీరం  సహజ డిటాక్స్ ప్రక్రియ. ఎయిర్ కండిషన్డ్ గదులలో ఉండటం వల్ల చెమట తక్కువగా పడుతుంది, దీనివల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, బరువు పెరగడం,  ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మనస్సు, శరీరం.. చల్లటి గాలి మనసును మొద్దుబార్చి, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రేరణపై కూడా ప్రభావం చూపి, వ్యాయామం పట్ల ఇంటరెస్ట్ లేకుండా చేస్తుంది.  సోమరితనం పెంచుతుంది. ఇలా జాగ్రత్త పడాలి.. ప్రతి 45 నిమిషాలకు 5 నిమిషాల పాటు నడవాలి,  లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి. ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచకూడదు, దానిని 24–26 డిగ్రీలకు పరిమితం చేయాలి. ఇంటి పనులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. తాజా పండ్లు, సలాడ్లు,  నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం కోసం కనీసం 30 నిమిషాలు కేటాయించాలి. విశ్రాంతి ముఖ్యం, కానీ విశ్రాంతి అలవాటు వల్ల వచ్చే ఊబకాయం జీవితాంతం ఉండే ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది.                                   *రూపశ్రీ.
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. అంటే.. బంగారం అంత మన్నికైనవని అర్థం.  చాలామంది చలికాలంలో పసుపు పాలు తాగుతారు.  అనారోగ్యాల నివారణకు పసుపు పాలు ప్రసిద్ధి చెందాయి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి,  వాపును తగ్గిస్తాయి,  నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం  అందరికీ సురక్షితం కాదని అంటున్నారు.  కొంతమందికి పసుపు పాలు తాగడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి.  ఇంతకీ పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలేంటి?  పసుపు పాలు ఎవరు తాగకూడదు? తెలుసుకుంటే.. పసుపు పాలు ప్రయోజనాలు.. రోగనిరోధకశక్తి.. పసుపులో లభించే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,  యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.   వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు రాకుండా నివారించడంలో ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా  ఉంటుంది. జలుబు, దగ్గు.. పసుపు పాలు గొంతు నొప్పి, దగ్గు,  జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి.  దీని వేడి చేసే గుణం శ్లేష్మాన్ని వదులు చేసి, గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. వాపులు.. పసుపులో ఉండే శోథ నిరోధక గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు,  కండరాల బిగువును తగ్గించడంలో సహాయపడతాయి. గాయం లేదా వ్యాయామం తర్వాత పసుపు పాలు తీసుకోవడం వల్ల వేగంగా కోలుకుంటారు. పసుపు పాలు ఎవరు తాగకూడదు? జీర్ణసమస్యలు ఉన్నవారు.. తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లేదా విరేచనాలతో బాధపడుతుంటే, పసుపు పాలు  సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క వేడి స్వభావం,  పాల యొక్క బరువైన స్వభావం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. రక్త సంబంధ వ్యాధుల మందులు.. పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి పనిచేస్తుంది.  ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నట్లయితే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరగవచ్చు. మధుమేహ రోగులు.. పసుపు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు.  మధుమేహం రోగులు ఇప్పటికే మందులు తీసుకుంటున్నట్లయితే, వాటి ప్రభావం అధికంగా ఉండి, చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉన్న రోగులు.. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో పసుపును అధిక మోతాదులో తీసుకోవడం సురక్షితం కాదు.  దీనివల్ల హార్మోన్ల మార్పులు కలగవచ్చు, కాబట్టి డాక్టర్ సలహా లేకుండా గర్భిణి స్త్రీలు పసుపు పాలు తీసుకోకూడదు.                              *రూపశ్రీ.
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. అయితే  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. రాత్రి భోజనం.. రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది.  చాలామంది బాగా పుష్టిగా తింటుంటారు.  కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం  అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే  జీర్ణ సమస్యలు తలెత్తి, రక్త ప్రసరణ,  గుండె పనితీరు ప్రభావితం కావచ్చు. కాఫీ.. కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది.  రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తుంటారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది  నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఫోన్.. రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు.  అయితే రాత్రి పడుకునే ముందు  ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు.  పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి.  గుండె ఆరోగ్యాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది. చిరుతిళ్లు.. కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల  ఆకలి తగ్గడమే కాకుండా,  నిద్ర కూడా ప్రభావితం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం  గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి.. నేటి కాలంలో చాలా మంది చేస్తున్న ఫిర్యాదు ఒత్తిడి.  అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు,  గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు. మద్యం.. రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు.  ఈ అలవాటు వల్ల  రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.                                  *రూపశ్రీ.