చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం, ఈర్ష్య, అసూయ, ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు. చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు. వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు. వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు. తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా? తెలుసుకుంటే..
ప్రసంశలు..
ఎవరైనా కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది.
తప్పు ఒకరిది, అవమానం మరొకరిది..
తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా చేస్తారు.
తమని తాము అనుమానించుకునేలా..
"నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా.. "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం జరగలేదు." వంటి మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే.. జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి.
అయ్యో పాపం అనుకునేలా చేయడం..
పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు.
ఇష్టమైన వారి నుండి వేరు చేయడం..
మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు.
అవసరం..
అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం. ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు .
తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.
*రూపశ్రీ.