LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌  మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం చవిచూసిందని  వైసీపీ  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు  అన్నారు.  ఎన్నికల్లో అధికార తెలుగుదేశం కూటమి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూనే, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల ఫలితమే ఇప్పుడు  అనుభవిస్తున్నామని చెప్పారు. తద్వారా గతంలో తాము అక్రమాలు చేశామని అంగీకరించారు. విశేషమేంటంటే.. ఆయనీ ఓటమి ఒప్పుకోలు హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరై బయటకు వచ్చిన తరువాత జరిగింది. ఈడీ విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి,   రాష్ట్రంలో ఏ ఎన్నికలు నిర్వహించినా ప్రజల నుంచి ఇదే రకమైన తీర్పు వస్తుందని, ఫలితాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని చెప్పారు. వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ వైపు వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల్లో అక్రమాలు, అధికార తెలుగుదేశం కూటమి దౌర్జన్యాల కారణంగానే ఫలితాలు ఇలా వచ్చాయనీ, పోలీసులు, ఎన్నికల సంఘం, బాబు టీమ్ గా ఏర్పడి మునిసిపోల్స్ ను ఎలక్షన్ గా కాకుండా సెలక్షన్ గా మార్చేశారని విమర్శిస్తుంటే, ఆ పార్టీ సీనియన్ నాయకుడు, కీలక నేత అంబటి.. మాత్రం ప్రజాక్షేత్రంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఓటమి పలయ్యామని అంగీకరించడం గమనార్హం. జరిగిన పరిణామాలే నేడు పార్టీకి ఈ గతి పట్టించాయని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ఇదే సందర్భంగా  మద్యం రవాణాకు సంబంధించిన ఈడీ విచారణ వివరాలను కూడా అంబటి వెల్లడించారు.  తన నియోజకవర్గ పరిధిలోని వైకాపా నాయకులు సుబ్బారెడ్డి, పురుషోత్తంలకు మద్యం రవాణాకు సంబంధించి సబ్ కాంట్రాక్టులు ఇప్పించేందుకు తాను సిఫారసు చేసినట్లు  అంగీకరించారు. ఈ విషయమై అప్పట్లో వాసుదేవరెడ్డితో మాట్లాడానని కూడా అంగీకరించారు.  ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈడీ అధికారులకు   వివరించినట్లు చెప్పారు. తాను సిఫారసు చేసిన వ్యక్తులకు కాంట్రాక్టులు దక్కాయని, వాటిని సుమారు ఐదేళ్లపాటు నిర్వహించగా రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు టర్నోవర్ నమోదైందన్న అంబటి,   అయితే ఈ ఆర్థిక లావాదేవీలలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో అధికారుల దర్యాప్తులో భాగంగానే తాను విచారణకు హాజరైనట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా అధికారులు తన ఆధాన్, పాన్ కార్డు వివరాలను సేకరించారని తెలిపారు.  రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒకవైపు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో, అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే నేడు పార్టీ ఓటమికి కారణమని విపక్ష నేత స్వయంగా అంగీకరించడం గమనార్హం. ఒకవైపు ఈడీ విచారణ ఎదుర్కొంటూనే మరోవైపు ఎన్నికల పరాజయంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.   [Ambati Rambabu On AP Municipal Elections, Accepts YCP Defeat, Ambati Rambabu ED Inquiry Hyderabad, Andhra Pradesh Politics, Telugu One] 
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తోటి మనుషుల ప్రాణాలు కాపాడేందుకు వెళ్లిన రక్షక సిబ్బందే ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకోవడం స్థానికంగా కలకలం రేపింది.   సత్తుపల్లి మండలం పరిధిలోని బేతుపల్లి చెరువు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెరువు మధ్యలో నీటి ఉద్ధృతిలో చిక్కుకుపోయిన కొందరు జాలర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగిన అధికార యంత్రాంగానికి ఈ పరిణామం శరాఘాతంగా మారింది.   స్థానిక జాలర్లు చెరువులో ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.  అత్యవసర రెస్క్యూ బోట్లలో సహాయక బృందాలు చెరువులోకి ప్రవేశించి సాహసోపేతమైన చర్యలు చేపట్టాయి.ప్రారంభంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి కొందరిని సురక్షిత ప్రాంతాలకు చేర్చినప్పటికీ, మిగిలిన వారిని కాపాడే క్రమంలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ప్రవాహ వేగం విపరీతంగా పెరగడంతో పాటు ఈదురు గాలులు తోడవడంతో సహాయక బృందాలు ప్రయాణిస్తున్న రెండు బోట్లు అదుపుతప్పాయి.   ఆ రెండు బోట్లలో సుమారు పది మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఫైర్ సిబ్బంది ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. క్షణాల వ్యవధిలోనే ఉవ్వెత్తున ఎగిసిపడే వరద నీటిలో ఆ బోట్లు కొట్టుకుపోవడంతో అక్కడ తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది.    సహాయక చర్యలు అందిస్తున్న తమ సిబ్బందే వరదలో గల్లంతు కావడంతో తోటి ఉద్యోగులు, అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం ప్రస్తుతం ప్రత్యేక బృందాలు మరో రెస్క్యూ బోటు ద్వారా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. చీకటి పడుతుండటం, ప్రవాహం తగ్గకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది.   వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా గాలింపు చర్యలను వేగవంతం చేశారు. గల్లంతైన సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడాలని వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు తీవ్రంగా ప్రార్థిస్తున్నారు.  బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.గల్లంతైన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.మరోవైపు, సహాయక చర్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి సూచించారు. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కనుగొని వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.     [ Khammam SDRF boats missing, Bethupalli cheruvu flood news, SDRF personnel washed away Khammam, TeluguOne, latest district news ]
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. క్షణికావేశం కళ్లను కమ్మేసింది.. విచక్షణను చంపేసింది. చేతిలో కత్తి పట్టిన అల్లుడు కసాయిగా మారాడు. సొంత కుటుంబ సభ్యులపైనే కర్కశంగా విరుచుకుపడి రక్తపాతం సృష్టించాడు. ఆవేశంతో చేసిన దాడి ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నాడు. నిందితుడి భార్య, కుమార్తె సైతం గాయపడటంతో హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో తీవ్ర కలకలం రేగింది. వివాదం నుంచి మారణకాండ వరకు..! మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయశ్రీ కాలనీలో బుధవారం సాయంత్రం ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. సదరు కుటుంబంలో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న అల్లుడు కత్తితో ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్త నిరంజన్ బీ, బావమరిది భార్య రేష్మపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లోనే ఆ ఇల్లు రక్తపాతానికి వేదికగా మారింది. ఒకే కుటుంబంలో నలుగురిపై కత్తులతో దాడి..! నిందితుడి కర్కశ దాడిలో బావమరిది యూసుఫ్‌తో పాటు అతడి భార్య, కుమార్తె కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే యూసుఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన వారిపై ఇలా కత్తులతో విరుచుకుపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కళ్లముందే రక్తపు మడుగులో పడి ఉన్న బాధితులను చూసి చలించిపోయారు. ముందే హెచ్చరించినా.. పట్టించుకోలేదా.? ఈ ఘటనలో పోలీసుల తీరుపై మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని, కుటుంబంలో గొడవలు తీవ్రమవుతున్నాయని బాధితులు బుధవారం ఉదయమే మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు బంధువులు చెబుతున్నారు. అయినప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ముందుగానే ఫిర్యాదు చేసినా తమ వారికి రక్షణ కల్పించలేకపోయారని కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులపై వచ్చిన ఈ ఆరోపణలపై అధికారిక స్పందన తెలియాల్సి ఉంది. రంగంలోకి క్లూస్ టీమ్.. నిందితుడి కోసం గాలింపు.! ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు హుటాహుటిన జయశ్రీ కాలనీకి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వేలిముద్రలు సహా ఇతర కీలక ఆధారాలను సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు. కుటుంబ సమస్యలు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సింది పోయి.. కత్తులతో దాడికి దిగడం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇద్దరు మహిళల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో వ్యక్తి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కుటుంబ కలహాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో చెప్పడానికి మీర్‌పేట్‌లో జరిగిన ఈ రక్తపాతమే నిదర్శనం. జయశ్రీ కాలనీలో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.     [ Meerpet Murder, Hyderabad Crime, Son-in-law Attack, Family Dispute, Knife Attack, Double Murder, Jayashree Colony, Niranjan Bee, Reshma, Yusuf, Hyderabad Police, Clue Team, Family Violence, Murder Case, Telangana Crime News ]  
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.! ఉన్నత చదువుల కోసం సొంతూరిని వీడి.. కన్నవారి ఆశలను మోస్తూ వేల కిలోమీటర్ల దూరంలో విద్యను అభ్యసిస్తున్న ఓ గిరిజన యువతి జీవితం అర్ధంతరంగా ముగిసింది. బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో బలవన్మరణానికి పాల్పడింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ విషాదం.. ఆమె స్వగ్రామమైన నర్సంపేట మండలంలోని బుచ్చి నాయక్ తండాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తన బిడ్డ మరణానికి హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మోసమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఉద్రిక్తత భగ్గుమంది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్లి నిందితుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు లాఠీఛార్జ్ వరకు పరిస్థితి వెళ్లడంతో నర్సంపేటలో కలకలం రేగింది. కలల సౌధం కూలింది.. కన్నవారి ఆశలు చెదిరాయి.! వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బుచ్చి నాయక్ తండాకు చెందిన వాంకుడోతు వైష్ణవి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఐఐఐటీడీఎం (IIITDM)లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతోంది. చదువులో ప్రతిభ కనబరుస్తూ మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఆశపడేది. ఆమె భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతలోనే యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందడంతో కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలింది. చేతికొచ్చిన బిడ్డ ఇక లేదన్న వార్తతో తండాలో విషాదం అలముకుంది. రెజ్యూమ్ పంపితే.. పరిచయం.! వైష్ణవి మరణం వెనుక హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న బోడ సుమన్ ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా వైష్ణవి ఇటీవల సుమన్ పనిచేస్తున్న సంస్థకు తన రెజ్యూమ్ పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకే ప్రాంతానికి చెందిన వారమంటూ సుమన్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడని, ఆ పరిచయం కాస్తా ఆమెను మానసికంగా వేధించే స్థాయికి చేరిందని బంధువులు ఆరోపిస్తున్నారు. అతడి మోసం, వేధింపుల కారణంగానే వైష్ణవి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిగితేనే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి. అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.! మధ్యప్రదేశ్ నుంచి వైష్ణవి మృతదేహం స్వగ్రామానికి చేరుకోగానే బంధువులు, గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ బిడ్డ జీవితంతో ఆడుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉంచి సుమన్ ఇంటి వైపు కదిలారు. మృతదేహంతోనే ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు భారీగా మోహరించి మార్గమధ్యంలోనే ఆందోళనకారులను అడ్డుకున్నారు. తోపులాట నుంచి లాఠీఛార్జ్ వరకు.. రణరంగంగా మారిన నర్సంపేట.! మృతదేహాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బంధువులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ కుటుంబ సభ్యులు భీష్మించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన కొంత సద్దుమణిగింది. న్యాయం కోసం ఎదురుచూపులు.! ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి అకాల మరణం ఇప్పుడు పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. వైష్ణవి ఆత్మహత్యకు అసలు కారణాలేమిటి? కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా సుమన్ వేధింపులు, మోసం ఉన్నాయా? ఉంటే వాటికి సంబంధించిన ఆధారాలేమిటి? ఈ కోణాలన్నింటిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. తమ బిడ్డ మరణానికి కారణమైన వారికి శిక్ష పడాలని వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీళ్లు.. మరోవైపు న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువుల ఆగ్రహం.. వెరసి బుచ్చి నాయక్ తండాలో విషాదంతో పాటు ఆవేదన, ఆగ్రహం మిన్నంటాయి.       [ Vaishnavi Suicide, Telangana Student, Madhya Pradesh, Jabalpur, IIITDM Jabalpur, Vaishnavi Death Case, Narsampet, Buchi Naik Thanda, Boda Suman, Software Employee, Harassment Allegations, Student Death, Dead Body Protest, Police Lathi Charge, Justice for Vaishnavi, Warangal News ]  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్  ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సభా విలువలను కాపాడటం కోసం చక్రపాణి చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు రాజకీయాల్లో ఆయన అనుసరించిన విలువలు మరువలేనివని కొనియాడారు. చక్రపాణి సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో క్రియాశీలకంగా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత  శాసనసభ వ్యవహారాలలో ఆయన సేవలు అత్యంత కీలకమైనవిగా గుర్తింపు పొందాయి. శాసనసభ్యుడిగా, మండలి ఛైర్మన్‌గా ఆయన వ్యవహరించిన తీరు రాజకీయ విశ్లేషకుల ప్రశంసలను అందుకుంది. సభను సమర్థవంతంగా నడిపించడంలో ఆయన చూపిన సంయమనం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. వివిధ పార్టీలకు అతీతంగా అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం చక్రపాణి ప్రత్యేకత. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ఏ కష్టతరమైన రాజకీయ పరిస్థితినైనా ప్రశాంతంగా పరిష్కరించడంలో దిట్టగా పేరుగాంచారు. ఆయన నిష్క్రమణతో తెలుగు రాష్ట్రాలు ఒక సీనియర్  అనుభవజ్ఞుడైన ప్రజాప్రతినిధిని కోల్పోయాయని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాజకీయ చరిత్రలో శాసనమండలి నిర్వహణకు సంబంధించి చక్రపాణి అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే యువ నాయకులకు ఆయన రాజకీయ జీవితం ఒక దిక్సూచిలా పనిచేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన మృతితో తెలుగు రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు.       [ Chakrapani passes away, AP Legislative Council former chairman, A Chakrapani death, united Andhra Pradesh council chairman, Telugu states political news, Telugu News, Telugu One ]  
ALSO ON TELUGUONE N E W S
థియేటర్లలో మంచి స్పందనను పొందిన షరాఫుద్దీన్, సంగీత్ ప్రతాప్ నటించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ చిత్రం మనోరమా మాక్స్‌లో అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. ఈ కామెడీ థ్రిల్లర్ ఓటిటి స్ట్రీమింగ్ విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్ల నిమిషాలకు పైగా వాచ్ టైమ్‌ను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ప్రత్యేకంగా మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ నాలుగు భాషల ప్రేక్షకులను అలరిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ శ్యామిన్ గిరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఒక వినూత్నమైన కథాంశాన్ని హాస్యం ఇంకా ఊహించని ట్విస్టులతో అద్భుతంగా తెరకెక్కించింది.  ‘ప్రేమలు’ చిత్రంలో అమల్ డేవిస్‌గా, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’లో జోయెల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ ప్రతాప్ ఈ చిత్రంలో తొలిసారిగా లీడ్ రోల్‌లో నటించగా, షరాఫుద్దీన్ ఒక కీలక పాత్రలో కనిపించారు. కోమాలో నుంచి అద్భుతంగా కోలుకుని, దూరం నుంచి వచ్చే శబ్దాలు, సంభాషణలను వినే అసాధారణ శక్తిని పొందిన రూబిన్ (సంగీత్ ప్రతాప్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సూరజ్ (షరాఫుద్దీన్) అనే స్నేహపూర్వక పోలీసు అధికారిని కలవడం వల్ల జరిగే ఊహించని పరిణామాలు ఈ చిత్రంలో కామెడీ, సస్పెన్స్‌ను జోడిస్తాయి. ఈ చిత్రంలో షరాఫుద్దీన్, సంగీత్ ప్రతాప్‌లతో పాటు అఖిల భార్గవన్, పార్వతి ఆర్. కృష్ణ, కోట్టాయం నసీర్, ఆనంద్ మన్మధన్, కిరణ్ పీతాంబరన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ‘కరిక్కు’ ఫేమ్ నీలీన్ సంద్ర ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. డా. పాల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, డ్రీమ్ బిగ్ ఫిలిప్స్ బ్యానర్లపై డా. పాల్ వర్గీస్, సుజిత్ జే నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ జేవియర్ సినిమాటోగ్రఫీ అందించగా, రాకేష్ చెరుమడం ఎడిటర్‌గా వ్యవహరించారు. ముజీబ్ మజీద్ సంగీతం సమకూర్చగా, నిక్సన్ జార్జ్ సౌండ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇది కూడా చదవండి: రామాయణ ట్విట్టర్ రివ్యూ       [It’s A Medical Miracle On ManoramaMAX, It’s A Medical Miracle OTT, Sangeeth Prathap, Sharaf U Dheen, Premalu Movie, Its A Medical Miracle, OTT Movies, ManoramaMAX]  
ఎంతో కాలంగా భారతీయ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘రామాయణ’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ భారీ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మాత్రం భిన్నమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా సినిమా విజువల్స్, గ్రాఫిక్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురుస్తుండగా.. కథనం, సంగీతం విషయంలో మాత్రం కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రామాయణం గురించి వస్తున్న పోస్టులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమాలో ఎక్కువగా ప్రశంసలు అందుకుంటున్నది మాత్రం యశ్ నటన. రావణుడి పాత్రలో ఆయన కనిపించిన తీరు, ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయట. కొందరు నెటిజన్లు యశ్‌ను ఈ సినిమాకు అసలైన సీన్ స్టీలర్‌గా అభివర్ణిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు రాముడిగా రణ్‌బీర్ కపూర్ కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన నటనలోని ప్రశాంతత, పాత్రకు తగ్గట్టుగా చూపించిన హావభావాలు ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సీతగా సాయి పల్లవి కూడా తన పాత్రకు న్యాయం చేశారని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మంచి మార్కులు సంపాదిస్తోంది. గ్రాండ్ సెట్స్, యుద్ధ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయని కొందరు ప్రశంసిస్తున్నారు. అయితే కొన్ని సన్నివేశాల్లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయని, కొన్ని గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక కథనం విషయంలోనే ఎక్కువగా మిశ్రమ స్పందన వస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఎమోషన్స్, డ్రామా కొంత తగ్గిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందించారు. ఇలాంటి ఇద్దరు దిగ్గజాలు పనిచేయడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా చూసిన కొందరు మాత్రం సంగీతం ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఇతిహాస కథలో దైవత్వం, భావోద్వేగాలను సంగీతం మరింత బలంగా ఎలివేట్ చేయాల్సి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ‘రామాయణం’లో గ్రాండియర్, విజువల్స్, యశ్ నటనకు మంచి స్పందన వస్తుండగా.. కథనం, ఎమోషన్స్, సంగీతం విషయంలో మాత్రం మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సోషల్ మీడియా టాక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రామాయణ భారీ అంచనాలను అందుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ‘రామాయణ’ రివ్యూ ఇచ్చిన దిల్ రాజు.!           [Ramayana Twitter Review, Ramayana Review Telugu, Ramayana Audience Response, Ramayana Movie Review, Ramayana Mixed Reviews, Ranbir Kapoor, Yash Ravana, Sai Pallavi, Nitesh Tiwari, Namit Malhotra]  
మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్న ‘బేబీ డాల్’   చిట్టియాన్‌ కలైయాన్‌ ఫేమ్ బాలీవుడ్ గాయని కనికా కపూర్ నుంచి కొత్త పాట ఎప్పుడు వస్తుంది. ఈ సారి మాత్రం అచ్చం కనికా కపూర్ లాగా పాడాలని ఫిక్స్ అయ్యారు. కానీ హఠాత్తుగా ఆమె పర్సనల్ న్యూస్ ఆ అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.     ఈ టాలెంటెడ్ సింగర్, తన రెండో భర్త గౌతమ్ హథిరమణితో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వివాహం జరిగిన సరిగ్గా 4 సంవత్సరాలకే ఈ దంపతులు తమ బంధానికి ముగింపు పలుకుతూ వేర్వేరుగా మారుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2022 మే 20వ తేదీన లండన్‌లోని అత్యంత ప్రసిద్ధమైన వి అండ్ ఎ మ్యూజియంలో వీరి వివాహం అత్యంత వైభవంగా, అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులతో పాటు కనికా మొదటి భర్త ద్వారా సంతానమైన ముగ్గురు పిల్లలు ఆయానా, సమారా, యువరాజ్ కూడా హాజరై సందడి చేశారు. పెళ్లికి ముందు  ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ బంధం కేవలం నాలుగు సంవత్సరాల ముచ్చటగానే మిగిలిపోయింది. "ఎంతో ఆలోచించి, లోతుగా మథన పడిన తర్వాతే నేను, నా భర్త గౌతమ్ విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేం ఇద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ కనికా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక భావోద్వేగ ప్రకటనను పంచుకున్నారు. అంతేకాకుండా, ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత గోప్యతకు ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలని, దయచేసి అనవసర ఊహాగానాలకు తెరదించాలని ఆమె తన శ్రేయోభిలాషులను కోరారు. ఇది కూడా చదవండి: టబు పెళ్లి చేసుకోకపోవడానికి ఈ హీరోనే కారణం: ఇది పచ్చి నిజం!    ఇది తనకు రెండో వివాహమని, జీవితంలో రెండోసారి కూడా విడాకుల దాకా వెళ్లడం అనేది తనను ఎంతో మానసిక వేదనకు, నిరాశకు గురిచేసిందని కనికా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వివాహంలో ఏం జరుగుతుందనేది ఆ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పూర్తిగా తెలుస్తుందని, ప్రస్తుతం తాను ముంబైలో తన ముగ్గురు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ, మూడు కొత్త ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులో కూడా గౌతమ్‌తో తమ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగానే ఉండాలని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ, కేవలం 4 సంవత్సరాలకే ఈ ప్రముఖ జంట విడిపోవడం బాలీవుడ్ వర్గాల్లో మరియు సంగీత లోకంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.   [kanika Kapoor Divorce, kanika Kapoor Divorce Gautam Hathiramani, Kanika Kapoor, Gautam Hathiramani, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
  ఈ రోజు టబు పుట్టిన రోజు. కింగ్ నాగార్జున తో కింగ్ 100 చేస్తుండటంతో తెలుగు ప్రేక్షకులకి ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే పుట్టిన రోజు సందర్భంగా కింగ్ మేకర్స్  నుంచి  రిలీజ్ చేసిన టబు వీడియోతో అభిమానులు, నెటిజెన్స్ టబు గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో టబు మ్యారేజ్ న్యూస్ కూడా ఆకర్షణ న్యూస్ రూపంలో అదనపు బోనస్ అని చెప్పవచ్చు.         ఈ అందాల తార ఇప్పటికీ అవివాహితగా ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన, మజిలీ గలిగిన కథ దాగి ఉంది. దాదాపు 30 సంవత్సరాలకు పైగా సినీ రంగంలో కొనసాగుతున్న టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కారణమంటూ గతంలో టబు చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు దిగ్గజ నటులు 'విజయ్‌పథ్' సినిమాతో తమ ప్రయాణాన్ని ప్రారంభించి, 'దృశ్యం', 'గోల్‌మాల్ అగైన్', 'భోలా' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ  స్నేహితులుగా కొనసాగుతున్నారు. అయితే, ఓ ఇంటర్వ్యూలో టబు తన పెళ్లి గురించి మాట్లాడుతూ సరదాగా అజయ్ దేవగణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను యువతిగా ఉన్న రోజుల్లో అజయ్ దేవగణ్, ఆయన కజిన్ సమీర్ కలిసి తనపై నిఘా పెట్టేవారని, తనతో మాట్లాడటానికి వచ్చే అబ్బాయిలను భయపెట్టి తరిమేసేవారని టబు నవ్వుతూ పంచుకున్నారు. "అప్పట్లో వాళ్లిద్దరూ పెద్ద రౌడీలా వ్యవహరించేవాళ్లు. నా చుట్టూ తిరుగుతూ నాతో మాట్లాడే ప్రతి ఒక్కరినీ బెదిరించేవాళ్లు. నేడు నేను ఇంకా సింగిల్‌గా ఉన్నానంటే అది పూర్తిగా అజయ్ దేవగణ్ వల్లే. అతను చేసిన ఆ పనులకు భవిష్యత్తులోనైనా పశ్చాతాప పడాలని    కోరుకుంటున్నాను అంటూ టబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ నవ్విచాయి. ఇది కూడా చదవండి:  నితిన్ నార్నె శస్త్రచికిత్స డీటెయిల్స్ ఇవే!     మరో సందర్భంలో అజయ్ దేవగణ్‌ను ఇదే ప్రశ్న అడగగా, ఆయన తనదైన శైలిలో మరింత హిలేరియన్‌గా స్పందించారు. టబుకి ఎలాంటి భర్త కావాలో చెప్పమని కోరగా... "టబుకి నేనే కావాలి, కానీ నేను ఆమెకు దక్కలేను" అంటూ చమత్కరించారు. ఆ తర్వాత దాన్ని క్లారిఫై చేస్తూ, తనలాంటి వ్యక్తిని ఆమె కోరుకుంటోందని, కానీ ఈ ప్రపంచంలో తనలాంటి మరొకరు లేరంటూ అజయ్ సరదాగా మాట్లాడారు.   [Ajay Devgn Reveals Why Tabu Never Got Married, Tabu marriage, Ajay Devgn, Tabu single status reason, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత సులభం కాదు. ముఖ్యంగా మనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని వదిలిపెట్టడం మరింత కష్టం. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’.  మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓ రిటైర్డ్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఆయన.. ఆ భవనాన్ని పునర్నిర్మించేందుకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తామన్న ఆఫర్ వచ్చినా.. ఇల్లు ఖాళీ చేయడానికి అంగీకరించడు. తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని కాపాడుకోవడం కోసం ఏకంగా ఆ హౌసింగ్ సొసైటీలోని అందరినీ ఎదిరిస్తాడు. ఒక వ్యక్తి తన ఇంటి కోసం ఎంతవరకు పోరాడగలడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలేంటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ డ్రామా తెరకెక్కింది. ఈ హిందీ చిత్రం నవంబర్ 6 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది. రానా దగ్గుబాటి నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించింది. బెన్ రేఖి దర్శకత్వం వహించారు. అరవింద్ అడిగా రాసిన ఇదే పేరుతో ఉన్న నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముంబైలోని ఓ పాత హౌసింగ్ సొసైటీ నేపథ్యంలో ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’ కథ సాగుతుంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ యోగేశ్ మిశ్రా అనే రిటైర్డ్ ఫిజిక్స్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. ఆ అపార్ట్‌మెంట్‌లోని మిగతా వారంతా రీడెవలప్‌మెంట్ ఒప్పందానికి అంగీకరించగా.. యోగేశ్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా ఒంటరిగా పోరాటం చేస్తాడు. ఈ ఒప్పందం వల్ల తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంద‌రూ అనుకుంటారు. కానీ యోగేశ్ మాత్రం తనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని, అక్కడి మనుషుల మధ్య ఉన్న ఆత్మీయతను వదులుకోవడానికి ఇష్టపడడు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం క్రమంగా పరిస్థితులను మార్చేస్తుంది. ఒకప్పుడు తన స్నేహితులుగా భావించిన వారే ఆయనకు దూరమవుతారు. తమ ఆశలు, ఆకాంక్షలకు యోగేశ్ అడ్డుపడుతున్నాడని భావించి అతడిని ఓ పరాయివాడిలా చూడటం మొదలుపెడతారు. ఇలా తన ఇంటిని కాపాడుకోవాలనే ఓ వ్యక్తి పట్టుదల.. చివరకు అతడిని తన వాళ్లకే దూరం చేసే పరిస్థితులకు ఎలా దారితీసిందన్నదే ఈ సినిమా కథాంశం. ఇది కూడా చదవండి: ‘రామాయణ’ రివ్యూ ఇచ్చిన దిల్ రాజు.!       [Last Man In Tower Movie, Manoj Bajpayee, Divya Dutta, Boman Irani, Rana Daggubati, Spirit Media, Hindi Zee 5, Aravind Adiga]  
ఎన్టీఆర్ బావమరిది ప్రముఖ హీరో నితిన్ నార్నే కుడి భుజానికి  మూవీ షూటింగ్‌లో గాయమవడంతో, అక్టోబర్ 4న కిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. ఈరోజు ఉదయం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మరియు వారి బృందం (డా. ఈశ్వర్ పటేల్, డా.హరికృష్ణ  బచ్చు, డా. మధుసూదన్) నితిన్ కి  విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఇది కూడా చదవండి: పూజాహెగ్డే చేసుకోబోయే వరుడు ఏం చేస్తాడో తెలిసిపోయిందోచ్: వాళ్ళల్లో కొత్త ఆశలు!   ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు గోప్యత కల్పించాలని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని, ఆసుపత్రికి రావొద్దని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు కోరాయి.   [Nithiin Narne Surgery Details, Nithiin Narne Health Update, Nithiin Narne latest news, Ntr, Nithiin Narne, Telugu movie news, celebrity secrets,  Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]  
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే రామాయణ ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమా స్థాయిని పెంచేలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమా కూడా అలాంటి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండగా.. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా తన స్పందన తెలియజేశారు. ఈ సినిమా భారతీయ ప్రేక్షకులకు అందిస్తున్న గొప్ప ప్రయత్నమని కొనియాడారు. దిల్ రాజు తన పోస్టులో రామాయణం సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘‘రామాయణ ఇతిహాసాన్ని సినిమాగా మన తెలుగు ప్రేక్షకులకు అందించే భాగ్యం మాకు కలగడం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ఇక రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ అబ్బురపరిచారని కొనియాడారు. అంతేకాదు.. ఈ సినిమాలో అద్భుతమైన చిత్రీకరణతో పాటు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. మనసుకు హత్తుకునే కథనం ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించబోతోందని తెలిపారు. ఇంతటి స్థాయిలో ఈ పురాణ కావ్యాన్ని తెరకెక్కించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: ఇట్లు అర్జున ట్రైలర్.. నాగార్జున ప్రజెంటేషన్‌లో కొత్త ప్రయోగం.! https://x.com/SVC_official/status/2117931385683894441       [Ramayana Review By Dil Raju, Ramayana Movie, Ramayana Telugu Release, Dil Raju, Ranbir Kapoor, Sai Pallavi, Yash Ravana, Nitesh Tiwari, Namit Malhotra]  
బుట్టబొమ్మ పూజా హెగ్డే బొమ్మ ప్రస్తుతం సెల్యులాయిడ్ పై ఉన్నా లేకపోయినా అభిమానులు, ప్రేక్షకుల దృష్టి తనపై ఉంటూనే ఉంటుంది. అంతలా తన సినిమాల ద్వారా మెస్మరైజ్ చేసింది. ఈజీ పెర్ఫార్మ్ కి కూడా కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయిన పూజాకి కాబోయే వరుడు ఎవరో తెలిసిపోయింది. దీంతో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.  పూజా హెగ్డే రీసెంట్ గా  డైరెక్టర్ హరీశ్ శంకర్  తో కలిసి ఒక షో కి హాజరయ్యింది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతు 'సాధారణంగా యువత ఎక్కువగా జిమ్‌లు, సిక్స్ ప్యాక్ బాడీలు మరియు స్టైలిష్ లుక్స్ చుట్టూ తిరుగుతుంటారని, కానీ కేవలం పైపై అందాలను చూసి పూజా హెగ్డే అసలు  ఆకర్షితురాలు కాదు. నేటితరం యూత్ అంతా ఖాళీ సమయం దొరికితే చాలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫోన్ స్క్రీన్ల చుట్టూ గడుపుతుంటే, పూజా మాత్రం ఎప్పుడూ చేతిలో పుస్తకంతోనే కనిపిస్తుంది. అంతేకాదు, తాను చదివిన మంచి పుస్తకాలను ఇతరులకు, ముఖ్యంగా తనకు కూడా చదవమని రికమండ్ చేస్తుంటుందని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే పుస్తక పఠనంపై చూపించే తీవ్రమైన ఆసక్తిని చూసి ఆశ్చర్యపోయిన హరీశ్ శంకర్, "అసలు నువ్వు ఎప్పుడూ పుస్తకాలు ఎందుకు ఇంతలా చదువుతావు?" అని సరదాగా ప్రశ్నించారట. అప్పుడు పూజా హెగ్డే మాట్లాడుతూ  "నేను మగాడిలో కేవలం పైపై అందాన్ని, బాహ్య రూపం లేదా లుక్స్‌ను చూసి ఎప్పటికీ పడను. ఎదుటివారి ఆలోచనా తీరు, వారి మేధస్సు (ఇంటెలెక్ట్) నచ్చితేనే నేను ఇంప్రెస్ అవుతాను" అని ఆమె చాలా స్పష్టంగా తేల్చిచెప్పినట్లు హరీశ్ శంకర్ వెల్లడించారు. ఈ మాటలు విన్న తర్వాత ఏ కుర్రాడికైనా కేవలం జిమ్‌కి వెళ్లి కండలు పెంచాలనే ఆలోచన ఎందుకు వస్తుంది చెప్పండి అంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇది కూడా చదవండి: రాధికా ఆప్టే వ్యాఖ్యలపై నిర్మాత ఎస్‌కేఎన్ సీరియస్ ఫైర్!    ఈ ఆసక్తికరమైన విషయాలు బయటికి రావడంతో, సోషల్ మీడియాలో కుర్రకారు రకరకాల సరదా కామెంట్లు చేస్తున్నారు. బుట్టబొమ్మ మనసు గెలవాలంటే ఇకపై కేవలం డంబల్స్ పట్టుకోవడం కాదు, చేతికి పుస్తకాలు తీసుకుని విజ్ఞానాన్ని పెంచుకోవాల్సిందేనని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. మొత్తానికి దర్శకుడు హరీశ్ శంకర్ బయటపెట్టిన ఈ సీక్రెట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.   [Pooja Hegde Ideal Man Harish Shankar Reveals Secret, Pooja Hegde, Harish Shankar, Pooja Hegde ideal man, Tollywood news, Butta Bomma Pooja, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]  
Naga Chaitanya is all set to showcase his stylish new avatar as Arjun in the first single from his upcoming epic entertainer Vrushakarma. Titled 'Swag of Arjun', the song is scheduled to release on November 7. Composed by Ajaneesh Loknath, the track is being positioned as a high-energy number that captures the attitude and personality of Chay's character. Directed by Karthik Dandu, Vrushakarma is mounted on the biggest budget of Naga Chaitanya's career. The actor has undergone a complete transformation to fit the character, and his look in the song announcement poster has already raised curiosity. Meenakshi Chaudhary plays the female lead, while Sparsh Srivastava appears in a prominent role. The makers recently organised a special set visit for the media, showcasing the extensive cave set and the detailing that went into the film's production design. The team also explained how VFX has been integrated to enhance the visual experience. Produced by BVSN Prasad and Sukumar Writings, Vrushakarma is gearing up for a pan-India theatrical release on December 4. With just a month left for its arrival, 'Swag of Arjun' marks the beginning of the film's intensified promotional campaign. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
అనీష్, అనస్వర రాజన్ జంటగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో మహేష్ ఉప్పాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ ట్రైలర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల కావడం విశేషం. ఈ సినిమాకు కింగ్ నాగార్జున ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుండగా, ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. కొత్త నటుడు అనీష్‌ను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సినిమా.. ప్రేమకథతో పాటు యాక్షన్, ఎమోషన్స్‌ను కూడా మిక్స్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అర్జున్ ఒక మూగ యువకుడు. కీర్తిని ఎంతగానో ప్రేమిస్తుంటాడు. అయితే తన మనసులోని భావాలను మాటల్లో చెప్పలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి జీవితంలోకి ప్రేమతో పాటు అనుకోని ప్రమాదాలు కూడా వస్తే ఎలా ఉంటుంది? ఈ పాయింట్ చుట్టూనే సినిమా కథను నడిపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌కు సంబంధించి ఆసక్తి కలిగిస్తున్న మరో అంశం యాక్షన్ ఎపిసోడ్స్. ఈ సినిమాలో కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయని ట్రైలర్ సూచిస్తోంది. అయితే ఈ యాక్షన్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది తెరపైనే చూడాలి. అనీష్‌ తొలి చిత్రంతోనే మాటలు రాని యువకుడి పాత్రను ఎంచుకోవడం సాహసమే. అనస్వర రాజన్ కూడా తన పాత్రతో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇప్పటికే పాటలు, టీజర్ ద్వారా కొంత ఆసక్తిని పెంచింది. ఇక తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణగా నిలవనుంది. ఓవరాల్‌గా చూస్తే.. మూగ యువకుడి ప్రేమకథ, యాక్షన్, ఎమోషన్స్ కలిపి ‘ఇట్లు అర్జున’ను ఓ డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.  ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ తర్వాత మరో క్రేజీ మూవీ.. ‘ఓం’ తెలుగు హక్కులు సితార చేతికి.! https://x.com/tarak9999/status/2117940506399498383       [Itllu Arjuna Trailer, Jr NTR, Aniesh, Anaswara Rajan, Nagarjuna, Mahesh Uppala, Venky Kudumula, Thaman S, Telugu Film News]  
మనలో చాలా మందికి పాఠశాల రోజుల నుంచే ఒక ప్రాథమిక వైద్య సత్యం గుర్తిండిపోయింది. ఆరోగ్యంగా ఉన్న ఏ మనిషి శరీర ఉష్ణోగ్రత అయినా సరే సాధారణంగా 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ (37 డిగ్రీల సెల్సియస్) ఉండాలని మనం నమ్ముతూ వస్తున్నాము. ఎవరికైనా జ్వరం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి దశాబ్దాలుగా ఈ కొలతనే మనం ప్రామాణికంగా ఉపయోగిస్తున్నాము. అయితే, ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన ఒక తాజా మరియు అత్యంత విస్తృతమైన అధ్యయనం ఈ నమ్మకాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. ఆధునిక కాలంలో మనుషుల సగటు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతోందని, అలాగే 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ అనేది నేటి కాలానికి కొద్దిగా ఎక్కువేనని ఈ పరిశోధన తేల్చిచెప్పింది. నేడు సగటు మనిషి శరీర ఉష్ణోగ్రత దాదాపు 97.9 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా అంతకంటే తక్కువగా ఉంటోందని నిపుణులు వెల్లడించారు. ఈ అద్భుతమైన పరిశోధన వివరాలు వైద్య రంగంలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఈ విప్లవాత్మక అధ్యయనం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, 19వ శతాబ్దంలో అనగా 1868లో ఒక జర్మన్ వైద్యుడు కార్ల్ వండర్‌లిచ్ సుమారు 25,000 మంది రోగుల ఉష్ణోగ్రతలను సేకరించి 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌ను సగటు ప్రమాణంగా నిర్ణయించారు. కానీ కాలం మారుతున్న కొద్దీ మానవ శరీర నిర్మాణంలో మరియు జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు 19వ శతాబ్దం నుంచి నేటి వరకు సుమారు 6,77,000 మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించిన భారీ డేటాను విశ్లేషించారు. దీని ప్రకారం, పాత కాలంతో పోలిస్తే ఆధునిక కాలంలో మనుషుల శరీర ఉష్ణోగ్రత ప్రతి దశాబ్దానికి సుమారు 0.05 డిగ్రీల ఫారెన్‌హీట్ చొప్పున క్రమంగా తగ్గుతూ వస్తోందని తేలింది. 2000వ దశకంలో పురుషులలో శరీర ఉష్ణోగ్రత ప్రారంభ 1800ల నాటి పురుషులతో పోలిస్తే సగటున 1.06 డిగ్రీల ఫారెన్‌హీట్ తక్కువగా నమోదైంది. అదేవిధంగా, మహిళల్లో కూడా దాదాపు 0.58 డిగ్రీల ఫారెన్‌హీట్ మేర ఉష్ణోగ్రత తగ్గుదల కనిపించింది. మానవ శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి గల ప్రధాన కారణాలపై వైద్య నిపుణులు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గత రెండు వందల సంవత్సరాలలో మన జీవన ప్రమాణాలు మెరుగుపడటం, పబ్లిక్ హెల్త్ సదుపాయాలు అందుబాటులోకి రావడం, మరియు శరీరంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ (మంట లేదా వాపులు) తగ్గుముఖం పట్టడం ఇందుకు ముఖ్య కారణాలుగా పరిశోధకులు భావిస్తున్నారు. పాతకాలంలో క్షయ వంటి దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణంగా ఉండటం వల్ల ప్రజల శరీర ఉష్ణోగ్రతలు తరచుగా ఎక్కువగా నమోదయ్యేవి. ఆధునిక వైద్యం, మెరుగైన ఆహారపు అలవాట్లు మరియు పరిశుభ్రమైన వాతావరణం కారణంగా మన శరీరాలు అంతర్గతంగా ప్రశాంతంగా ఉంటూ, జీవక్రియలో వచ్చే మార్పుల వల్ల చల్లబడుతున్నాయి. అంతేకాకుండా, శరీర ఉష్ణోగ్రత అనేది అందరికీ ఒకేలా ఉండదని, ఇది ప్రతి ఒక్కరి వయస్సు, లింగం, బరువు, ఎత్తు మరియు రోజు జరిగే సమయాన్ని బట్టి మారుతుంటుందని స్టాన్‌ఫోర్డ్ నిపుణులు స్పష్టం చేశారు. ఉదాహరణకు, ఉదయం పూట ఉండే ఉష్ణోగ్రత కంటే మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాగే వృద్ధులతో పోలిస్తే యువతలో, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా భిన్నంగా నమోదువుతాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఒకే నిర్దిష్టమైన సాధారణ ఉష్ణోగ్రతను ఆపాదించడం సరికాదని, ప్రతి మనిషికి వారి సొంత సహజ ఉష్ణోగ్రత వేర్వేరుగా ఉంటుందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. సాధారణ జ్వరం గురించి మాట్లాడితే, వయోజనులలో కనీసం 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటేనే దానిని వైద్యపరంగా జ్వరంగా పరిగణించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత శరీర ఉష్ణోగ్రతలలోని హెచ్చుతగ్గులను ముందుగానే పసిగట్టగలిగితే భవిష్యత్తులో వ్యాధులను ముందస్తుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం సులువవుతుందని స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.     Human Body Temperature 98.6, Stanford University Health Study, Normal Temperature Facts, Medical Science Discoveries, Average Body Heat Changes, Health Facts In Telugu, Science Articles.
దీపావళి పండుగ అనగానే ప్రతి ఇంటిలోనూ సర్వత్రా ఆనందాలు, వెలుగుల సంబరాలు నిండిపోతాయి. అయితే ఈ పండుగ వేళ వెలువడే బాణసంచా పొగ ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్, మరియు సీఓపీడీ (COPD) వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ కాలం ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. బాణసంచా కాల్చినప్పుడు గాలిలోకి PM2.5 మరియు PM10 వంటి సూక్ష్మ కాలుష్య కణాలతో పాటు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ వంటి ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతాయి. వీటిని పీల్చడం వల్ల శ్వాసనాళాల్లో తీవ్రమైన చికాకు ఏర్పడి, ఆస్తమా రోగులలో దగ్గు, పిల్లికూతలు, ఛాతీ బిగుతుగా అనిపించడం, మరియు తీవ్రమైన ఆయాసం వంటి లక్షణాలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఈ వాయు కాలుష్య ముప్పు నుంచి ఊపిరితిత్తులను రక్షించుకోవడానికి కొన్ని కఠినమైన జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరం. ఆస్తమా ఉన్నవారు సాధ్యమైనంత వరకు బాణసంచా కాల్చడానికి దూరంగా ఉండాలి మరియు ఇతరులు కాల్చే చోట నిలబడి చూడటాన్ని పూర్తిగా నివారించాలి. పొగ ఎక్కువగా ఉన్న సమయాలలో బయట తిరగకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండటం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి సరిగ్గా సరిపోయే N95 మాస్క్ ధరించడం ద్వారా గాలిలోని సూక్ష్మ కణాలను కొంతవరకు అడ్డుకోవచ్చు. అయితే మాస్క్ ధరించాము కదా అని పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు గడపడం సరైన పద్ధతి కాదు. అలాగే, పండుగ రోజుల్లో గాలి నాణ్యత సూచీ (AQI) వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. గాలి నాణ్యత చాలా క్షీణించినప్పుడు ఉదయం, సాయంత్రం వేళల్లో చేసే వాకింగ్, జాగింగ్ వంటి బహిరంగ వ్యాయామాలను నిలిపివేయాలి. ఇంటి లోపలికి కాలుష్య పొగ రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. అవసరమైతే సరైన HEPA ఫిల్టర్లు కలిగిన ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించడం ద్వారా ఇంటిలోని గాలిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు మరియు గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు కాలుష్య ప్రభావానికి అతి సులువుగా లోనవుతారు కాబట్టి వారిని బాణసంచా ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. ఇంటిలో అగరబత్తులు, ధూపం లేదా సిగరెట్ పొగ వంటి ఇతరకారకాలు కూడా శ్వాసకోశ సమస్యలను మరింత పెంచుతాయి. వైద్యులు సూచించిన ఇన్హేలర్లు, రెగ్యులర్ మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. సొంత వైద్యం చేసుకోవడం గానీ, డాక్టర్ సలహా లేకుండా మందుల మోతాదును మార్చడం గానీ చేయకూడదు. పండుగ ఆనందంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి, ముందస్తు జాగ్రత్తలతో తగు రక్షణ చర్యలు తీసుకుంటూ పండుగను ఆరోగ్యకరంగా, ఆనందంగా జరుపుకోవడం మన చేతుల్లోనే ఉంది.     Diwali Smoke Asthma, Lung Care In Pollution, Cracker Smoke Safety Tips, Asthma Prevention Festival, Respiratory Health Tips, Air Pollution Precautions, Health Tips In Telugu.
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం.. ప్రకృతి సృష్టించే విలయానికి అడ్డుకట్ట వేసేదెలా.! ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి. ప్రాణ, ఆస్తినష్టాలను భారీగా మిగులుస్తాయి. ఈ ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రాణాలను కాపాడుకునే మార్గాలపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 5 తేదీన ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. అసలు సునామీ అంటే ఏమిటి? సునామీ అంటే సముద్రంలో వచ్చే పెద్ద అలలు అని అందరికీ తెలిసిందే. కానీ ఇవి సాధారణ అలలలా కాకుండా వేగంగా, గోడలా ఎత్తుగా ఎగసిపడతాయి. భూమి లోపల జరిగే మార్పుల వల్ల సముద్రపు నీరు ఒక్కసారిగా కదిలి తీరాల వైపు దూసుకొస్తుంది. ఈ విపత్తు గురించి సరైన అవగాహన ఉంటే చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. అందుకే ఈ ప్రత్యేక దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తారు. సునామీ సమయంలో ఏం జరుగుతుంది? సునామీ సమయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో అందరూ తెలుసుకోవాలి. సముద్రపు నీరు అకస్మాత్తుగా వెనక్కి తగ్గిపోవడం, తీర ప్రాంతంలో పెద్ద శబ్దాలు రావడం, భూమి కంపించడం వంటివి సునామీ రాకకు ప్రధాన సూచనలు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు ఎలాంటి భయానికి లోనుకాకుండా వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు లేదా కొండల వైపు పరుగెత్తాలి. ప్రభుత్వాల కసరత్తు.. ప్రభుత్వాలు , విపత్తు నిర్వహణ శాఖలు కూడా ఇలాంటి సమయాలలో ఎలా స్పందించాలనే దానిపై ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తాయి. తీర ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తాయి. మనం కూడా ఈ విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రకృతి ప్రకోపం ముందు మనం ఎంత బలహీనమో సునామీలు గుర్తు చేస్తాయి. కానీ సరైన ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో స్పందించే తత్వం ఉంటే ఎన్నో ప్రాణాలను రక్షించుకోవచ్చు. మన బాధ్యత.. సునామీలు నేరుగా మానవ కార్యకలాపాల వల్ల వచ్చేవి కానప్పటికీ, ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా కొన్ని రకాల తీర ప్రాంత విపత్తుల తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా సముద్ర తీరాలలో ఉండే మడ అడవులను సంరక్షించడం చాలా ముఖ్యం. ఈ అడవులు సహజ సిద్ధమైన రక్షణ గోడలా పనిచేసి, సముద్రం నుండి వచ్చే పెద్ద అలల వేగాన్ని అడ్డుకుంటాయి , తీర ప్రాంత కోతను నివారిస్తాయి. భూమిపై కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణానికి హాని కలిగించే కార్యక్రమాలను అరికట్టడం ద్వారా వాతావరణ మార్పులను నియంత్రించవచ్చు. సముద్ర తీర ప్రాంతాలలో ఇష్టానుసారంగా కట్టడాలు చేపట్టకుండా, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేయడం వల్ల ప్రకృతి ప్రకోపం నుండి రక్షణ పొందవచ్చు. ప్రకృతిని గౌరవిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పెను ముప్పుల నుంచి మనల్ని మనం రక్షించుకోగలం.                                                                                                                                              *రూపశ్రీ
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  గర్బనిరోధక మాత్రలు.. సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు. మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు                             *రూపశ్రీ.