LATEST NEWS
రాను రానంటూనే  చిన్నదీ రాములోరి గుడికొచ్చే అనే పాట చందంగా రాజకీయాలలో పొత్తుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తోంది. తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఆంధ్రప్రదేశ్ లోనూ, జాతీయ స్థాయిలోనూ జనసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో ఎటువంటి పొత్తూ ఉండదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఇప్పటికే పలుమార్లు విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పోటీకి జనసేన రెడీ అవుతోంది.  రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేనతో  కలిసి ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.  ఉమ్మడి ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఎమ్మెల్సీ పోరులో జనసేన   అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ పార్టీకి అండగా నిలబడుతోందన్న అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారికంగా మిత్రపక్షాలుగా కొనసాగుతున్న జనసేన,  బీజేపీలు, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ ఎవరికి వారే యమునా తీరే చందంగానే వ్యవహరిస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి తీరు మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, రెండు పార్టీలూ అనివార్యంగా అవగాహనకు వచ్చాయంటున్నారు పరిశీలకులు.   జనసేన అభ్యర్థి బరిలో నిలిచే స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని పోటీకి పెట్టకుండా పరోక్షంగా మద్దతు తెలిపేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరిందన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇదే జరిగితే.. ముందు ముందు జరగనున్న స్థానిక ఎన్నికలు, ఆ పై 2028 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలూ జతకట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Jana Sena  BJP Alleance Telangana,  MLC Elections, Graduate MLC,Telangana Politics,  , Warangal Khammam Nalgonda Graduates MLC, Telugu One]
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన సినీమా అయిపోయిందా? స్థానిక నామినేషన్లలో ఆ నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ స్థానాలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఏకగ్రీవం కావడం దీనినే సూచిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  స్థానిక   ఎన్నికల ప్రచారంలో అధికార తెలుగుదేశం కూటమి నేతలు  జగన్‌ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.  జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందుల గడ్డపై   జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.  పక్కా ప్రణాళికతోనే తాము పులివెందులలో అడుగుపెట్టామని, మాజీ సీఎంకు సినిమా చూపిస్తామంటూ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పులివెందులలో జగన్ సినిమాకు ఎండ్ కార్డ్ పడిందా? అన్న అనుమానాలకు తావిచ్చాయి.  జగన్‌  సినిమా డైలాగులు చెబుతున్నారని, చొక్కాలు మడతపె డతామంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని పరాజయ భయాన్ని ఎత్తి చూపుతున్నాయనీ ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన చొక్కా చేతులు మడతపెడితే భయపడే పరిస్థితులు పులివెందులలో ఇప్పుడు లేవని ఎద్దేవా చేశారు. పులివెందులలో జగన్ కు ఇప్పుడు తాము సినిమా చూపిస్తామని హెచ్చరించారు.   ఒకప్పుడు జగన్ వెంటే నడిచి, ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశంకూటమి అభ్యర్థిగా జమ్మలమడుగు నుంచి గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇదే సభలో ఆయనతో పాటు పాల్గొన్న పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి కూడా  జగన్‌పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. తనను అంతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా తాను ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, పులివెందుల ప్రజల మద్దతుతోనే మునుపటి కంటే బలంగా నిలబడ్డానన్న ఆయన.. గత నాల్గ దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేసిన తప్పిదాలకు పులివెందుల ప్రజలు ఇప్పుడు సరైన సమాధానం చెబుతున్నారన్నారు. నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Local Body Elections Pulivendula, Jagan, Ycp, Backfoot, Adinarayana Reddy, Pulivendula Politics, BTech Ravi, Telugu One]
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చేటు చేసుకుంది. ఈ పరిణామం అధికార విపక్షాల మధ్య రాజకీయ ఘర్షణను మరో లెవెల్ కు తీసుకువెళ్లే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ కేసులో  బీఆర్ఎస్ అధినేత,  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం అదనపు ఛార్జిషీట్‌ను సిద్ధం చేస్తోందన్న ప్రచారం జోరందుకుంది.  ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ  వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కె. నవీన్‌ల పేర్లు కూడా ఈ అదనపు చార్జిషీట్ లో ఉండనున్నాయి.  దర్యాప్తు అధికారులు, సాక్షుల వాంగ్మూలాలు,  సాంకేతిక ఆధారాలతో పాటు,   కేటీఆర్,  నవీన్‌లకు సంబంధించిన ఆరోపణలలో, ఎన్నికల బాండ్ల ద్వారా రూ.13 కోట్లు విరాళంగా ఇవ్వాలని తనను బలవంతం చేశారంటూ ఓ రియల్టర్  ఇచ్చిన వాంగ్మూలం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును   దర్యాప్తును వేగవంతం చేసిన  సిట్, ఈ అదనపు చార్జిషీట్ ను త్వరలోనే కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.   గతంలో రాష్ట్రంలో ప్రభుత్వ మారిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ట్యాపింగ్ ఉదంతంపై సుదీర్ఘకాలంగా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రారంభంలో పలువురు పోలీసు అధికారులను మాత్రమే నిందితులుగా చేర్చినప్పటికీ, రానురాను ఈ విచారణ రాజకీయ నాయకుల పాత్ర వైపు మలుపు తిరిగింది. తాజాగా సిట్ రూపొందిస్తున్న అదనపు చార్జ్‌షీట్‌లో కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్లు కూడా  ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో భాగంగా గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. నాటి ప్రభుత్వ నిర్ణయాలు, నిఘా విభాగానికి చెందిన కీలక అధికారులతో ఆయనకున్న సంబంధాలపై ఆ సమయంలో ఆరా తీశారు. అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కేవలం పోలీసు అధికారులకే పరిమితం కాకుండా, ఈ నిఘా కార్యకలాపాల వెనుక ఉన్న రాజకీయ నాయకత్వాన్ని కూడా ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా కోర్టు ముందుకు తీసుకురావాలని సిట్ భావిస్తున్నది. అయితే,   చార్జ్‌షీట్ దాఖలైన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [KCR Name In Phone Tapping Case,SIT Aditional Charge Sheet,  SIT Investigation, Telangana Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
పాటల ప్రేమికులు నిత్యం ఈ సూపర్ హిట్ మెలోడీ ని మనసారా వీక్షిస్తూ 'ఆహా ఏమి రుచి తినరా మైమరిచి రోజు తినా మరి బోరే కొట్టనిది... నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా అనే ఘనతని తిరిగి పాట రూపంలోనే అందించి తమ జన్మ చరితార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే సంగీత ప్రియులకి పాటే భోజనం,ఆరాధన. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మాస్ మరియు క్లాస్ మెస్మరైజింగ్ డ్యాన్స్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాల్లో 'రాజా విక్రమార్క' ఒకటి. సరిగ్గా 36 ఏళ్ల క్రితం 1990 నవంబర్ 12 న విడుదలై కొత్త రకం జోనర్స్ కి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. చిరంజీవి సరసన అమల జత కట్టగా రాధిక మరో హీరోయిన్.  అన్ని పాటలు అప్పట్లో మారుమోగిపోగా, ముఖ్యంగా చిరంజీవి, అమల కాంబోలో వచ్చిన  'కొండ కోనా తాంబూలాలే   ఇచ్చేనంట.. కోకిలమ్మా పేరంటానే వచ్చేనంట' సాంగ్  అపురూపమైన మ్యూజికల్ మాస్టర్‌పీస్. ప్రముఖ సంగీత ద్వయం రాజ్ కోటి అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఈ పాటకి ప్రాణం పోశాయి. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి ప్రదర్శించిన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్, అమల అద్భుతమైన అభినయం ప్రేక్షకులను కట్టిపడేశాయి. కాలం మారుతున్న కొద్దీ ఎన్నో కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ, ఈ క్లాసిక్ సాంగ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం అణగారలేదు.   దాదాపు 36 ఏళ్లు గడుస్తున్నా, ఈ ఎవర్ గ్రీన్ మెలోడీకి సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్‌లో ఆదరణ మరింత పెరుగుతూనే ఉంది. యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్ ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటూ అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా కేవలం ఒక్క 'కొండ కోనా'  యూట్యూబ్‌లో 14 మిలియన్లకి పైగా వ్యూస్ తో దూసుకుపోతుండటం విశేషం. దీన్ని బట్టి ఈ సాంగ్ ని ఎంతలా అభిమానులు, ప్రేక్షకులు ఆస్వాదిస్తూ ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉన్న తేడా ఇదే: శుభలేఖ సుధాకర్ వ్యాఖ్యలు వైరల్!     ఎంత కొత్త మ్యూజిక్ వచ్చినా ఇలాంటి క్లాసికల్ మెలోడీ సాంగ్స్‌కు ఉండే ప్రత్యేకత ఎప్పుడూ చెక్కుచెదరదు అనడంలో కూడా  ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్, అమల అద్భుతమైన అభినయం సూపర్. మరి వినకపోతే వెంటనే వినేసేయండి. సమస్త టెన్షన్స్ ప్రకృతి సాక్షిగా హామ్ ఫట్.    [Chiranjeevi And Amala Raja Vikramarka Song Records, Konda Kona Thamburane Ichenanta song records, Chiranjeevi, Amala, Raja Vikramarka song, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]      
    శుభలేఖ సుధాకర్: చిరంజీవి, డైరెక్టర్ విశ్వనాధ్ ల 'శుభలేఖ' మూవీతో తన పేరు ముందు శుభలేఖ చేరింది కానీ, తెలుగు సినిమా ఉన్నంత కాలం నాగార్జున, రామ్ గోపాల వర్మల శివ గుర్తుకొచ్చినప్పుడలా సుధాకర్ గుర్తుకొస్తూనే ఉంటారు. ప్రస్తుతం అడపాదడపా విభిన్నమైన క్యారెక్టర్స్ పోషిస్తూ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సబ్జెట్స్ కి పర్ఫెక్ట్ ఫిగర్ అనిపించుకుంటున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ , చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.  బాలకృష్ణ సెట్స్‌లో ఎంత కఠినంగా ఉంటారో, తెర వెనుక అంతకంటే ఎక్కువగా ఆప్యాయతని పంచుతారు. చిన్నపిల్లవాడి మనస్తత్వమున్న వ్యక్తి . దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అలవాటు. సెట్స్  లో నటన తప్ప మరో ధ్యాస ఉండదు.  నా  జీవితంలో ఒక క్లిష్టమైన సమయంలో, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరూ నాకు అండగా నిలిచారు. సుమారు 54 రోజుల పాటు రోజువారీగా  ఫోన్ చేసి తన యోగక్షేమాలని  అడిగి తెలుసుకునేవారు. అది నాకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు  ఆ అనుబంధం జీవితాంతం నాతోనే ఉంది. బాలకృష్ణ గారు, విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'జననీ జన్మభూమి' మూవీ  షూటింగ్ సమయంలో నేను  కామెర్ల బారిన పడి, పసలపూడిలో స్థానిక ఆసుపత్రిలో చేరినప్పుడు, బాలకృష్ణ ప్రతిరోజూ ఉదయం షూటింగ్‌కు వెళ్లే ముందు, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు పరామర్శించేవారు.  ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ జోనర్ ఇదే: ఆ ప్రాంతం యొక్క ఉద్యమం, ప్రేమ!   ఆ సంఘటన బాలకృష్ణలోని ఆప్యాయతను, స్నేహశీలి స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆయనలో అప్పట్లో ఉన్న కన్సర్న్, బ్రదర్‌హుడ్ ఇప్పటికీ అలాగే ఉంది. బాలకృష్ణలో ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికీ తగ్గకపోవడమే  ఆయన ప్రత్యేకత. ఇదే విషయం మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా నిజం. వారిద్దరూ ఎప్పుడు అలాగే ఉండాలని అన్నారు. బాలకృష్ణ, చిరంజీవిల నుండి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం నెవర్ గివ్ అప్ ఆటిట్యూడ్  పని పట్ల  కసి, పట్టుదల, సానుకూల దృక్పథం ఎంతో స్ఫూర్తిదాయకం. వారిద్దరూ ఎప్పడు అలాగే ఉండాలని చెప్పుకొచ్చాడు.     [Subhalekha Sudhakar About chiranjeevi And Balakrishna,Subhalekha Sudhakar, Nandamuri Balakrishna, Balayya Babu, Tollywood news, Tollywood, Telugu News, TeluguCinema]    
  'ది ప్యారడైజ్' తో దర్శకుడిగా తన టేకింగ్ కి ఉన్న కెపాసిటీని తెలియచేసాడు శ్రీకాంత్ ఓదెల. రచయిత కూడా తనే కాబట్టి కథ, కథనంపై మరింత శ్రద్ద పెట్టి ఉంటే ప్యారడైజ్ ఫలితం ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండేది. ప్యారడైజ్ రిజల్ట్ పై ఇప్పటికి ట్రోల్ల్స్ కి గురువవుతున్న శ్రీకాంత్ ట్రోలర్స్ ని తన డై హర్డ్ ఫ్యాన్స్ గా మార్చుకోవాలనే దృఢసంకలంతో తన నెక్స్ట్ మూవీని ఒక వినూత్నమైన జోనర్ లో స్టార్ట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నట్టుగా టాక్.   హృదయానికి హత్తుకునే ఒక స్వచ్ఛమైన, ఇంటెన్స్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు శ్రీకాంత్ ఓదెల సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా 2014 తెలంగాణ మలిదశ ఉద్యమం మరియు రాజకీయ పరిణామాల నేపద్యనికి  ఒక పీరియాడిక్ లవ్ డ్రామాని సిద్ధం చేస్తున్నారని సమాచారం. తన తొలి రెండు చిత్రాల మాదిరిగానే ఈ కథ కూడా తెలంగాణ గ్రామీణ మరియు నేల మూలాల నుంచి పుట్టుకొచ్చిన బలమైన భావోద్వేగాలతో సాగనుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ జోనర్ నుంచి సడన్ గా లవ్ స్టోరీ వైపు శ్రీకాంత్ రూటు మార్చడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  ఇది కూడా చదవండి: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: RC 17 కోసం ఈ పాలరాతి ముద్దుగుమ్మకి లుక్ టెస్ట్!   మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే 'ది ప్యారడైజ్' ఫలితం మరియు ఆలస్యం కారణంగా ఈ మెగాస్టార్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడినట్లు, లేదంటే ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. నాని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరు ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదని, ప్రస్తుతానికి ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ఒక అపజయం లేదా మిశ్రమ స్పందన తన కెరీర్‌కు ఎండ్ కార్డ్ కాదని నిరూపించేందుకు శ్రీకాంత్ ఓదెల తన బలమైన బలమైన కథా బలంతో మరోసారి  ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నా డు. మరి  ఈ కొత్త లవ్ స్టోరీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో  చూడాలి.   [Srikanth Odela New Movie Deatils, Srikanth Odela, The Paradise movie, Nani director Srikanth, Megastar Chiranjeevi project, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]  
కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్‌గా నందినీ రెడ్డి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘ఇద్దరి గుండెలపైన’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని హిట్ మెషిన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు. పాట చాలా బాగుందని, సినిమా కాన్సెప్ట్ విన్నాను, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇమాన్యుయేల్ చాలా క్లోజ్ అని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మారుతి రాజా అందించిన బాణీ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్‌గా మారుతుందేమోనని అనిపిస్తోంది. ఈ పాటకు శ్రీరామ్ తపస్వి సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి, అభిఖ్య తణికెళ్ల గాత్రం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ఇక చంద్రకిరణ్ మాస్టర్ స్టెప్పులు ఎంతో సింపుల్‌గా, అందరూ రీల్స్‌తో ట్రెండ్ చేసేలా ఉన్నాయి. ఆయన కొరియోగ్రఫీతో ఈ పాట మరింత అందంగా మారింది. ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు. ఇది కూడా చదవండి: పాకెట్ రాకెట్స్.. గ్యాబ్లింగ్‌ సినిమాతో సర్ప్రైజ్ చేసిన నిహారిక కొణిదెల.!       [Anil Ravipudi, Iddari Gundela Paina Song, Destiny Movie, Jabardasth Emmanuel, Sri Satya, Chendu Muddu, Telugu Songs, Telugu Film News]  
హమ్మయ్య.. మెగా ఫ్యాన్స్ లో ఉన్న ఎగ్జైట్మెంట్ తో కూడిన టెన్షన్ కి కొంచం రిలీఫ్ వచ్చినట్లయింది. అదేనండి ఆర్ సి 17 లో చరణ్ తో జోడి కట్టే భామ ఎవరా అని!  మరి సుకుమార్, చరణ్ కాంబో అంటే మాటలా చెప్పండి. పైగా రంగస్థలం తర్వాత వస్తున్న కాంబో, అది కూడా పాన్ ఇండియా బంపర్ హిట్ పుష్ప సిరీస్ తర్వాత సుకుమార్ మూవీ. దీన్ని బట్టి హీరోయిన్ కట్ అవుట్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో క్లియర్ కట్ గా తెలుస్తుంది కదు . విశ్వసనీయ సమాచారం ప్రకారం ధురంధర్ బ్యూటీ 'సారా అర్జున్‌' కి మేకర్స్ లుక్ టెస్ట్ నిర్వహించారని సమాచారం. మేకర్స్ సంతృప్తిగా కూడా ఉన్నారని 'సారా' ఫిక్స్ అనే    మాటలు కూడా వినపడుతున్నాయి. మరి సారా నిజమైతే ఆర్ సి 17 కి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ముఖ్యంగా పొడవాటి జుట్టుతో, కొత్త లుక్‌లో కనిపించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చరణ్ తన క్యారక్టర్ కోసం  రూపురేఖల్లో మార్పులు చేసుకున్నారనే ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే, ఈ లుక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఒకే ఇంట్లో కోడళ్ల మరణాలకు సమాధానం: మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2... తెలుగులోనూ స్ట్రీమింగ్!   ప్రస్తుతానికైతే  ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. ఆర్ సి 17  ని నిర్మిస్తున్న మైత్రి అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ రీసెంట్ గా ఒక కార్యక్రమంలో మాట్లాడుతు ఈ నెల చివరిలో ప్రారంభం చేస్తామని అన్నాడు. మరి నెల అయిపోతుంది కాబట్టి ఆ వాతావరణం ఏమి కనిపించడం లేదు. నవంబర్ 1న నిర్వహించనున్నట్లు కొత్త ప్రచారం.   [Rc17 Sara Arjun Look Test Completed, RC 17 cast, Ram Charan, Sukumar, Sara Arjun, RC17 movie, Tollywood news, Look test completed Telugu Movie News, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]  
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ త్రినాథ్ వర్మ, డెబ్యూ హీరో నిర్మల్ హీరోలుగా.. శుభం ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్‌గా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌ని, కాన్సెప్ట్ పోస్టర్‌ని తాజాగా రివీల్ చేశారు. విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని ‘పాకెట్ రాకెట్స్’లో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలో టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. గ్యానీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు. ఇది కూడా చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత! https://www.instagram.com/p/DfCbWlegtYY/       [Pocket Rockkets Movie, Niharika Konidela, Pink Elephant Pictures, Pocket Rockets Movie, Committee Kurrollu, Trinadh Varma, Shriya Kontham, Telugu Film News]  
  మనలో మన మాట పక్క ఫోటోలో చూస్తున్న మూవీ మామూలు మూవీ కాదు. క్షణం క్షణం  ఉత్కంఠతతో సాగే సూపర్  సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. తెలుగులో కూడా వచ్చేసింది.  అదే 'అయ్యన మనే సీజన్ 2'.  ప్రముఖ డిజిటల్ ఓటీటీ వేదిక అయిన జీ5 (Zee5) వేదికగా ఈ రోజు నుంచి  స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. మొదటి సీజన్ సృష్టించిన అపూర్వ విజయం, విమర్శకుల ప్రశంసలు మరియు ఊహించని ఉత్కంఠభరితమైన మలుపుల తర్వాత ఇప్పుడు ఈ రెండో భాగంపై దేశవ్యాప్తంగా ఉన్న థ్రిల్లర్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. మొత్తం 6 ఎపిసోడ్స్‌తో స్ట్రీమ్ అవుతోన్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌ ఫస్ట్ సీజన్‌లో మిగిలిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 'అయ్య ఇంట్లో ప్రతీ ఒక్కరూ ఒక ముసుగు ధరించి ఉంటారు. ప్రతీ ముసుగు వెనుక ఒక కథ దాగి ఉంటుంది. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో? బయటపడే సమయం ఇది.' అంటూ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.  ఓ గొప్ప ఇంట్లో అడుగు పెట్టిన ముగ్గురు కోడళ్లు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. కుల దేవత శాపం అని ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఊరి గ్రామస్థులు కూడా నమ్ముతుంటారు. ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడలు ఆ మరణాల వెనుక మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తుంది. క్షణ క్షణం ట్విస్టులతో సాగుతుంది . ఇంతకంటే ఎక్కువగా చెప్తే బాగోదు. వెంటనే చేసి సినీ మజా పొందండి. ఈ వెబ్ సిరీస్ కథాంశం విషయానికి వస్తే, ఒకే ఇంట్లో జరిగిన కోడళ్ల మరణాలు మరియు ఆ కుటుంబానికి సంబంధించిన భయంకరమైన నిజాలు ఈ కథలో ప్రధాన కేంద్ర బిందువుగా నిలుస్తాయి. పాతకాలపు పెద్ద ఇల్లు, ఆ ఇంటి గోడల వెనుక కాలగర్భంలో కలిసిపోయిన చీకటి రహస్యాలు, ఎవరికీ అంతుచిక్కని వరుస మరణాలు ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కూర్చోబెడతాయి. మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో, సరిగ్గా అక్కడి నుంచే ఈ రెండో సీజన్ కథ కొనసాగుతుంది. "ఆ రాత్రి అసలు అక్కడ ఏం జరిగింది?" అనే ఎన్నో ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు ఈ కొత్త భాగంలో స్పష్టమైన సమాధానాలు లభించనున్నాయి.      ఇది కూడా చదవండి: టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూత!   ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ప్రసిద్ధ నటి ఖుషి రవి, అక్షయ్ నాయక్ తమ అద్భుతమైన సహజ నటనతో మరోసారి ప్రేక్షకులను కథలో లీనం అయ్యేలా చేశారు.   ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత రిచ్ వాల్యూస్‌తో నిర్మించగా, దర్శకుడు రమేష్ ఇందిరా దీన్ని ఎక్కడా తడబాటు లేకుండా అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ యొక్క మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా తెలుగు, కన్నడ, తమిళం మరియు హిందీ అనే మొత్తం 4 ప్రధాన భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబడింది.      [Ayyana Mane Season 2 Ott Release, Ayyana Mane Season 2, Kushee Ravi, Zee5 OTT, Telugu web series, suspense thriller, mystery web series, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]  
  షార్ట్ న్యూస్  టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ నిర్మాత  కన్నుమూత! తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత, 'జగపతి మూవీ క్రియేషన్స్' అధినేత జె.వి.ఆర్. చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఒక సాధారణ హాల్ బుకింగ్ క్లర్క్‌గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి సినిమా రంగంపై మక్కువతో  ఎన్నో కష్టనష్టాలని ఎదుర్కొంటూ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా ఎదిగారు.   'జగపతి మూవీ క్రియేషన్స్` బ్యాన‌ర్ ని స్థాపించి తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వినోద్ కుమార్ హీరోగా వచ్చిన యాక్షన్ డ్రామా `నేటి దౌర్జన్యం` , బి. విఠలాచార్య దర్శకత్వంలో భక్తిరస చిత్రం `కరుణించిన కనకదుర్గ`  వంటి చిత్రాలు ఆయన నిర్మాణ ప్రతిభకి  నిదర్శనంగా నిలిచాయి.2015లో స్వీయ దర్శకత్వంలో వచ్చిన బాల‌ల చిత్రం దాన‌వీరశూర‌క‌ర్ణ‌ పెద్ద విజ‌యం సాధించింది. ఎన్టీఆర్ మనవడు నందమూరి జానకి రామ్ కుమారుడు మాస్టర్ ఎన్టీఆర్‌  శ్రీకృష్ణుడిగా కనిపించాడు. ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా.. 2015 సంవత్సరానికి గాను `ఉత్తమ బాలల‌ చిత్రం`గా నంది అవార్డుని అందుకోవడం విశేషం.     ప్రస్తుతం తన సొంత ఊరు 'విజయవాడ'లో వృద్ధాశ్రమాన్ని నడుపుతూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. సినిమా అభివృద్ధి కోసం కూడా తన వంతు పాటు పడ్డారు. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే సినిమాని ప్రాణంగా భావించే వాళ్ళు చనిపోతే మళ్ళీ సినిమాని తన ఆయువుగా మార్చుకోవడానికి జన్మిస్తారని. మరి ఈ పాటికే ఎక్కడో పుట్టిన వెంకటేశ్వరరావు గారు తన పసి చిరు ఆలోచనలతో సినిమాని మళ్ళీ ఎలా ఏలాలి తన ప్రతిభ ఎలా చాటలో అనే పనిలో ఉండే ఉంటారు.ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ గా కూడా రికార్డు ఉంది మరి.    [Jvr Chalasani Venkateswara Rao Passes Away, JVR Chalasani Venkateswara Rao, Tollywood producer passes away, Jagapathi Movie Creations, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మనలో చాలామందికి ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు డాక్టర్లు రాసిచ్చిన మందులను వేసుకోవడం సర్వసాధారణం. అయితే, కొన్నిసార్లు హడావుడిగా లేదా నీరు తాగడం ఇష్టం లేక కొందరు కేవలం ఒక గుక్క నీటితో లేదా నీరు లేకుండానే నేరుగా మాత్రలు మింగుతుంటారు. కానీ, ఈ చిన్న అలవాటు మీ ఆరోగ్యానికి ఎంతటి ప్రమాదకరమో చాలామందికి తెలియదు. మాత్రలు మింగేటప్పుడు తగినంత నీటితో తీసుకోకపోతే జరిగే తీవ్రమైన నష్టాలు ఏమిటి? వైద్యులు ఇస్తున్న హెచ్చరికలు ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం. మనం ఏదైనా టాబ్లెట్ లేదా క్యాప్సూల్ తీసుకున్నప్పుడు అది గొంతు దాటి సులభంగా కడుపులోకి చేరాలి. అయితే తగినన్ని నీరు తాగకపోతే, ఆ మాత్ర నేరుగా కిందికి వెళ్లకుండా గొంతులో లేదా ఆహార నాళ మార్గంలోనే అతుక్కుపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, మరియు క్యాల్షియం మాత్రలు ఇలా గొంతులో లేదా ఆహార నాళంలో నిలిచిపోయినప్పుడు, వాటి రసాయన ధర్మాల వల్ల ఆహార నాళం పొరల్లో తీవ్రమైన మంట, చికాకు, వాపు, చివరికి పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తగినంత నీరు లేకపోవడం వల్ల మందులు జీర్ణకోశంలో సరిగ్గా కరిగి, శరీరంలో శోషించబడే ప్రక్రియ కూడా తీవ్రంగా మందగిస్తుంది. దీనివల్ల ఆ మందులు పూర్తి స్థాయిలో పనిచేయకపోగా, ఆ వ్యాధి నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా, వృద్ధులలో, మింగేయడంలో ఇబ్బంది ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారవచ్చు. అందువల్ల వైద్యులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను సూచిస్తున్నారు. డాక్టర్ ప్రత్యేకంగా పరిమితం చేయకపోతే, ప్రతిసారీ మాత్రలు వేసుకునేటప్పుడు ఒక పెద్ద గ్లాసు నిండా సాధారణ నీటిని తాగడం చాలా ముఖ్యం. మాత్ర లేదా క్యాప్సూల్ వేసుకున్న వెంటనే పడుకోవడం పూర్తిగా మానుకోవాలి. మందులు సులభంగా కడుపులోకి చేరేలా కనీసం కొద్దిసేపు నిలబడటం లేదా కూర్చోవడం చాలా మంచిది. మింగడానికి కష్టంగా ఉందని చాలామంది మందులను పొడిగా చేయడం లేదా ముక్కలుగా చేయడం చేస్తుంటారు. ఇది మందుల పనితీరును మరియు మోతాదు ప్రభావాన్ని పూర్తిగా మార్చివేస్తుంది కాబట్టి వైద్యుల సలహా లేకుండా అలా చేయడం సురక్షితం కాదు. మీకు గొంతులో ఏదైనా అడ్డు పడినట్లుగా అనిపించినా లేదా మింగేటప్పుడు తీవ్రమైన నొప్పి ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.     Swallowing Pills With Little Water, Medication Safety Tips, Side Effects Of Taking Tablets Dry, Esophageal Pill Injury, Doctor Warning On Water Intake, Health Risks Of Bad Habits, Proper Way To Take Medicines.  
క్యాన్సర్ అనే పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో మొదట మెదిలే ఆలోచన సర్జరీ లేదా ఆపరేషన్. క్యాన్సర్ చికిత్సకు సర్జరీ అత్యంత కీలకమైన భాగమే అయినప్పటికీ, నేడు వైద్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా అన్ని రకాల క్యాన్సర్లకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో, రేడియేషన్ థెరపీ మరియు రేడియోసర్జరీ వంటి అత్యాధునిక పద్ధతుల ద్వారా ఎలాంటి చీరా లేదా కోతలు లేకుండానే క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా తొలగించడం సాధ్యమవుతోంది. ఇది రోగులకు శస్త్రచికిత్స భయాల నుంచి పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. రేడియేషన్ థెరపీలో శక్తివంతమైన హై ఎనర్జీ కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేయడం లేదా వాటి వృద్ధిని పూర్తిగా అడ్డుకోవడం జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లకు ఇదే ప్రధాన చికిత్సగా ఉపయోగపడుతుండగా, మరికొన్ని సందర్భాల్లో కీమోథెరపీ లేదా సర్జరీతో కలిపి దీనిని అందిస్తారు. ముఖ్యంగా IMRT (ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ), IGRT (ఇమేజ్  గైడెడ్ రేడియేషన్ థెరపీ) వంటి అధునాతన సాంకేతికతలతో ట్యూమర్‌ను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోవచ్చు. దీనివల్ల క్యాన్సర్ కణాలపై మాత్రమే ప్రభావం పడి, చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలకు అతి తక్కువ నష్టం వాటిల్లుతుంది. ఈ ఆధునిక చికిత్సల్లో  ఆన్‌లైన్ అడాప్టివ్ రేడియోథెరపీ  మరింత విప్లవాత్మకమైనదిగా నిలుస్తోంది. రోగి రోజువారీ శారీరక స్థితికి అనుగుణంగా చికిత్స ప్రణాళికను ఎప్పటికప్పుడు మార్చుకునే వెసులుబాటును ఈ టెక్నాలజీ అందిస్తుంది. చికిత్స సమయంలో ట్యూమర్ పరిమాణంలో లేదా ఆకారంలో మార్పులు జరిగితే, ప్రతి సెషన్‌కు ముందు తీసే ఇమేజింగ్ స్కానింగ్ ఆధారంగా వైద్యులు రేడియేషన్ ప్లాన్‌లో తక్షణ మార్పులు చేస్తారు. ఇది సున్నితమైన అవయవాలను సురక్షితంగా రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక  రేడియోసర్జరీ  విషయానికి వస్తే, పేరులో సర్జరీ ఉన్నప్పటికీ ఇందులో ఎలాంటి కోతలు లేదా చీల్చడం ఉండదు. ఇది ఒక ప్రత్యేకమైన మరియు అత్యంత ప్రభావవంతమైన రేడియేషన్ టెక్నిక్. దీనిలో భాగంగా హై డోస్ రేడియేషన్‌ను నేరుగా ట్యూమర్‌పై ప్రయోగిస్తారు. మెదడులోని కొన్ని రకాల గడ్డల కోసం స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీని ఉపయోగిస్తే, ఊపిరితిత్తులు మరియు కాలేయం వంటి సున్నితమైన భాగాలకు స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీని వాడతారు. ఈ పద్ధతి ద్వారా చాలా తక్కువ సెషన్లలోనే చికిత్స పూర్తవుతుంది. అయితే, ఈ అత్యాధునిక పద్ధతులన్నీ ప్రతి రోగికి మరియు అన్ని రకాల క్యాన్సర్లకు సరిపోవు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్యూమర్ పరిమాణం, అది శరీరం ఏ భాగంలో ఉంది, మరియు రోగి మొత్తం ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణులైన ఆంకాలజిస్ట్ సరైన చికిత్స విధానాన్ని నిర్ణయిస్తారు. క్యాన్సర్ చికిత్సలో ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకుండా, వైద్యుల పర్యవేక్షణలో తగిన పద్ధతిని ఎంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.     Cancer Treatment Without Surgery, Radiation Therapy Benefits, Incision Free Cancer Care, Oncology Treatments, Surgery Vs Radiation, Modern Cancer Healing, Advanced Medical Care.  
గర్భధారణ కాలంలోని మొదటి పన్నెండు వారాలు లేదా మొదటి త్రైమాసికం (First Trimester) తల్లి మరియు కాబోయే బిడ్డ ఆరోగ్యానికి అత్యంత కీలకమైన దశ. ఈ తొలినాళ్లలో బిడ్డ మెదడు, వెన్నుపాము, గుండె మరియు ఇతర ప్రధాన అవయవాలు రూపుదిద్దుకుంటాయి. ఈ కీలక సమయంలో కేవలం 'ఇద్దరి కోసం తింటున్నాము' అనే అపోహతో అధికంగా తినడం కంటే, పోషకాలతో కూడిన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొదటి త్రైమాసికంలో ప్రతి గర్భిణి ఫోలిక్ ఆసిడ్, ఐరన్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్ డి, అయోడిన్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను తమ రోజువారీ ఆహారంలో విధిగా చేర్చుకోవాలి. బిడ్డ మెదడు మరియు వెన్నుపాము లోపాలను నివారించడంలో ఫోలిక్ ఆసిడ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వైద్యుల సిఫారసు మేరకు గర్భిణులు లేదా గర్భం దాల్చాలని ప్లాన్ చేసుకునే మహిళలు రోజువారీగా 400 మైక్రోగ్రాముల ఫోలిక్ ఆసిడ్ సప్లిమెంట్‌ను తీసుకోవడం చాలా అవసరం. దీనితో పాటు ఆకుకూరలు, కాయధాన్యాలు, సిట్రస్ జాతి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడానికి మరియు రక్తహీనతను నివారించడానికి ఐరన్ ఎంతగానో దోహదపడుతుంది. దీనికోసం పప్పుధాన్యాలు, శనగలు, బచ్చలికూర, లీన్ మీట్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్లాంట్-బేస్డ్ ఐరన్ శోషణ మెరుగుపడటానికి ఉసిరి, జామకాయ లేదా నారింజ వంటి విటమిన్ సి ఉన్న పదార్థాలతో జత చేయడం మంచిది. అయితే టీ మరియు కాఫీలు ఐరన్ శోషణను తగ్గిస్తాయి కాబట్టి వాటిని ఐరన్ ఆహారాలకు దూరంగా ఉంచాలి. బిడ్డ కణజాలాల వృద్ధికి మరియు తల్లి శరీర బలానికి ప్రొటీన్ అత్యవసరం. గుడ్లు, పాలు, పెరుగు, పన్నీర్, పప్పులు మరియు గింజలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ప్రొటీన్ అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. అలాగే బిడ్డ ఎముకలు, దంతాల పటిష్టతకు కాల్షియం మరియు విటమిన్ డి చాలా ముఖ్యం. పాలు, రాగి, నువ్వులు మరియు ఎండ తగలడం ద్వారా శరీరానికి తగినంత కాల్షియం, విటమిన్ డి అందుతాయి. బిడ్డ మెదడు ఎదుగుదలకు అయోడిన్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతో అవసరం. అయోడైజ్డ్ ఉప్పును మితంగా వాడటంతో పాటు, మెరుగైన నాణ్యత గల చేపలు లేదా తగిన సప్లిమెంట్లను డాక్టర్ సలహాతో తీసుకోవాలి. వీటికి తోడుగా మొదటి త్రైమాసికంలో తరచుగా వేధించే మలబద్ధకం, వికారం వంటి సమస్యలను నివారించడానికి తగినన్ని నీళ్లు తాగుతూ, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. కెఫిన్ వినియోగాన్ని రోజుకు 200 మి.గ్రా కంటే తక్కువగా పరిమితి చేసుకోవాలి మరియు ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. సరైన పోషకాహార నియమాలు పాటించడం ద్వారా మొదటి త్రైమాసిక ప్రయాణాన్ని ఆరోగ్యకరంగా మరియు సురక్షితంగా మార్చుకోవచ్చు.     First Trimester Diet, Pregnancy Nutrition Guide, Folic Acid During Pregnancy, Iron And Protein For Mom, Early Pregnancy Food Chart, Maternal Health Tips, Vitamins For Baby Growth.  
పక్షవాతం (స్ట్రోక్) అనేది అత్యంత ప్రమాదకరమైన వైద్య అత్యవసర పరిస్థితి. మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ నిలిచిపోవడం లేదా రక్తనాళం పగిలి రక్తస్రావం కావడం వల్ల ఇది సంభవిస్తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల మెదడు కణాలు కొన్ని నిమిషాల్లోనే దెబ్బతినడం మొదలవుతాయి. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి మరియు అత్యవసర వైద్య నిపుణులు డాక్టర్ నిఖిల్ వంగపల్లి తెలిపిన వివరాల ప్రకారం, పక్షవాతం వచ్చిన తొలి ఐదు నిమిషాలు ఇంట్లోనే చికిత్స చేయడానికి ప్రయత్నించకుండా, తక్షణమే అత్యవసర వైద్య సహాయం కోరడం మరియు రోగిని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రపంచ స్ట్రోక్ సంస్థ (World Stroke Organization) మరియు వరల్డ్ స్ట్రోక్ డే ప్రచారాల ప్రకారం, ఈ సమయంలో ప్రతి నిమిషం చాలా అమూల్యమైనది. పక్షవాతం లక్షణాలను గుర్తించడానికి  BE FAST  పరీక్ష ఎంతగానో సహాయపడుతుంది.  B  అంటే బ్యాలెన్స్ (నడకలో లేదా సమన్వయంలో అకస్మాత్తుగా ఇబ్బంది కలగడం), E  అంటే ఐస్ (ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మందగించడం లేదా కోల్పోవడం),  F  అంటే ఫేస్ (నవ్వుతున్నప్పుడు ముఖం ఒకవైపుకు వంగిపోవడం),  A  అంటే ఆర్మ్స్ (రెండు చేతుల్లో ఏదో ఒక చేతిలో బలహీనత లేదా కిందికి జారడం),  S  అంటే స్పీచ్ (మాట తడబడటం లేదా వింతగా మాట్లాడటం), మరియు  T అంటే టైమ్ (ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అత్యవసర సేవలకి కాల్ చేయడం). ఈ లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కు కాల్ చేయాలి. భారతదేశంలో 112 నంబర్‌కు డయల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు. అలాగే, రోగి లక్షణాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో కచ్చితమైన సమయాన్ని గమనించడం వైద్యులకు అత్యంత కీలకం. ఒకవేళ ఎవరూ గమనించకపోతే, ఆ వ్యక్తి చివరిసారిగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నారో గుర్తుంచుకోవాలి. రోగిని సురక్షితమైన ప్రదేశంలో కూర్చోబెట్టడం లేదా పడుకోబెట్టడం చేయాలి. అనవసరమైన కదలికలను నివారించి, వైద్యులు వచ్చే వరకు వారి దగ్గరే ఉండాలి. ముఖ్యంగా, రోగికి నోటి ద్వారా ఎలాంటి ఆహారం, నీరు, మాత్రలు లేదా ఇంటి చిట్కాలు ఇవ్వకూడదు. పక్షవాతం మింగే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, దీనివల్ల ఊపిరితిత్తులలోకి ఆహారం వెళ్లి ఊపిరి ఆడకుండా పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు లక్షణాలు కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోయి సాధారణ స్థితికి రావచ్చు. అయితే, దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్ (TIA) అనబడే  మినీ స్ట్రోక్  కావచ్చని, భవిష్యత్తులో వచ్చే పెద్ద స్ట్రోక్‌కు ఇది హెచ్చరిక అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు అదృశ్యమైనప్పటికీ వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. అదనంగా, బ్లీడింగ్ స్ట్రోక్ ప్రమాదం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పిరిన్ (Aspirin) వంటి మందులను సొంతంగా ఇవ్వకూడదు. ప్రతి నిమిషం విలువైన ఈ ప్రాణాపాయ స్థితిలో, సరైన సమయంలో తీసుకునే వేగవంతమైన నిర్ణయాలే రోగి ప్రాణాలను మరియు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.     stroke first aid first 5 minutes, be fast stroke symptoms, what to do during a stroke emergency, doctor advice on stroke care, common mistakes during stroke attack, stroke warning signs and symptoms, emergency brain stroke treatment tips.
    ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలియగానే మహిళలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తల్లి ఆరోగ్యంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలకు కూడా సరైన పోషకాహారం ఎంతో ముఖ్యం. అయితే గర్భం దాల్చిన మొదటి రోజుల నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలి? బయట ఆహారం తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? గర్భిణులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఈ ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఏ 5 ఆహారాలకు దూరంగా ఉండాలి? గర్భధారణ సమయంలో ప్రతి ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కొన్ని ఆహారాలు కలుషితం కావడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగవచ్చు. సరిగా ఉడకని ఆహారాలు, పరిశుభ్రత పాటించకుండా తయారు చేసిన పదార్థాలు, బయట లభించే ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? గర్భిణులు నివారించాల్సిన ఆహార పదార్థాలు ఏవి? ఈ అంశాలపై డాక్టర్ హరిత వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. గర్భిణులు బయట ఆహారం ఎందుకు తగ్గించాలి? ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం తయారీలో పరిశుభ్రత, పదార్థాల నాణ్యత, సరైన నిల్వ పద్ధతులు చాలా ముఖ్యం. బయట ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం తాజాగా ఉందా, సరిగ్గా ఉడికించారా, పరిశుభ్రంగా తయారు చేశారా అనే విషయాలను గమనించాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎంచుకోవడం ఎందుకు అవసరమో ఈ వీడియోలో వివరించారు. ప్రసవం తర్వాత బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రసవం తర్వాత తల్లి శరీరానికి కోలుకోవడానికి, బిడ్డకు పాలివ్వడానికి తగినంత శక్తి, పోషకాలు అవసరం. ఈ సమయంలో ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు అందించే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఎలా ఎంచుకోవాలి? రోజువారీ ఆహారంలో ఎలాంటి పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి? బాలింతలు తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. తల్లిపాలు పెరగడానికి ఎలాంటి ఆహారం ఉపయోగపడుతుంది? బిడ్డకు తగినంత తల్లిపాలు అందడం తల్లి, శిశువు ఇద్దరి ఆరోగ్యానికి ముఖ్యమైనది. పాలిచ్చే తల్లులు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోవడం, విశ్రాంతి పొందడం అవసరం. పాలిచ్చే సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారం, ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ హరిత అందించే సూచనలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బిడ్డ ఎదుగుదలకు సరైన పోషకాహారం ఎందుకు ముఖ్యం? శిశువు ఎదుగుదలలో సరైన సమయంలో తగిన ఆహారాన్ని పరిచయం చేయడం ఎంతో ముఖ్యం. వయస్సుకు తగిన అనుబంధ ఆహారం, బేబీ ఫుడ్ ఎంపిక, అవసరమైన పోషకాలు, పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పులు వంటి అంశాలపై కూడా ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలను తెలుసుకోవచ్చు. గర్భధారణ నుంచి ప్రసవం తర్వాతి దశ వరకు తల్లి పోషకాహారం, తల్లిపాలు, శిశువు ఆహారపు అలవాట్ల గురించి అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం, నివారించాల్సిన పదార్థాలు, బాలింతల పోషకాహారం గురించి మరిన్ని వివరాల కోసం డాక్టర్ హరిత వివరణను పూర్తిగా చూడండి. గమనిక: గర్భధారణ సమయంలో మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహార నియమాలను పాటించడానికి మీ వైద్యుడి సూచనలు తీసుకోండి.