Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 1


                       అమ్మాయీ ఓ అమ్మాయీ..

                                                                           యర్రంశెట్టి శాయి

 

                               


    వైజాగ్ రైల్వే స్టేషన్ చాలా హడావుడిగా ఉంది.
    స్టేషన్ బయటా లోపలా జనం క్రిక్కిరిసి పోయి వున్నారు.
    వేసవి సెలవులు ఆ రోజు నుంచీ మెదలవటమే ఆ సందడికి కారణం.
    ఆ గుంపుల మధ్యలో చాలా మంది కంటే పొడుగ్గా, చాల మంది కంటే చక్కని విగ్రహంతో, చాలామంది కంటే బావున్న ముక్కూ మొఖంతో నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడో యువకుడు. అతనిలో ఉత్సాహం, సరదా, చిలిపితనం, ఆసక్తీ , ధైర్యం, పట్టుదలా, ఇవన్నీ పుష్కలంగా శరీరంలో పాక్ చెసినట్లనిపిస్తోంది చూసేవారికి.
    అతన్ని చూసి "మేము కూడా పెళ్ళి చేసుకోకుండా , జీవితాంతం బ్రహ్మచారిగా గడుపుతే ఎంత బావుండేది" అని ఈర్ష్యపడిపోతున్నారు చాలా మంది భర్తలు.
    అతని వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేంకాదు. ఆ రైల్వే స్టేషన్ లోనే బుక్ స్టాల్ లో తీగకు వేలాడుతోన్న "వైజాగ్ కాలింగ్" అనే ఈవెనింగ్ న్యూస్ డెయిలీ లో మొదటి పేజీలో ఓ వార్త మీకు తాటికాయంత అక్షరాలతో కనబడుతుంది.
    "బీచ్ రోడ్ లో స్మగ్లర్స్ భీకరపోరాటం! ఒకరి హత్య! ముగ్గురికి గాయాలు" అన్న హెడ్డింగ్ కింద "మా ప్రత్యేక విలేకరి భావానీశంకర్ నుంచి" అన్న వాక్యం ఉంటుంది.
    అదిగో -- ఆ భవానీశంకరే ఇతను!
    భావానీశంకర్ ఉండుండి బుక్ స్టాల్ వైపు చూస్తున్నాడు - ఎవరైనా ఆదమరుపున "వైజాగ్ కాలింగ్" కొంటారేమోనని.
    అరగంట గడిచిపోయింది గానీ ఒక్కరు కూడా ఆ పేపరు కొన్న పాపాన పోవటం లేదు.
    మిగతా ప్రత్రికలూ, పేపర్లూ అన్నీ కొనేస్తున్నారు.
    భవానీశంకర్ కి అది కొంచెం నిరుత్సాహం కలిగించింది గానీ, అతని శరీరంలో క్రిక్కిరిసినట్లున్న ఉత్సాహం , సరదా -- ఇవన్నీ ఆ నిరుత్సాహాన్ని అనవాల్లెకుండా తరిమికొట్టినయ్.
    అతను టైమ్ చూసుకున్నాడు. సాయంత్రం నాలుగవలేదింకా!    
    "విజ్జీ ఇంకా రాలేదేమిటి?" అనుకున్నాడతను పోర్టికో వేపు చూస్తూ.
    హటాత్తుగా అతని దృష్టి - ఓ అద్బుతమయిన ఆనందకరమయిన దృశ్యం మీద పడింది.
    ఓ ముసలాయన "వైజాగ్ కాలింగ్' న్యూస్ పేపర్ కొంటున్న దృశ్యం అది!
    చిరునవ్వుతో ఆ ముసలాయన దగ్గరకు నడిచాడు.
    ముసలాయన "వైజాగ్ కాలింగ్ "పేపరంతా (కేవలం నాలుగు పేజీలే) రెండు నిమిషాల్లో చదివేశాడు. పేపరు మడుస్తున్న సమయంలో "ఎక్స్ క్యుజ్ మి" అన్నాడు భవానీశంకర్.
    ముసలాయన ఆశ్చర్యంగా భవానీశంకర్ వేపు చూశాడు.
    "నాపేరు భవానీశంకర్! వైజాగ్ కాలింగ్ స్పెషల్ కరెస్పాండెంట్ ని!"
    "అయితే?" అనుమానంగా అడిగాడు ముసలాయన.
    "నధింగ్ సర్! మీరు మా వైజాగ్ కాలింగ్" పేపర్ చదువుతుంటేనూ - ఈ పేపర్ మీకెంతవరకు నచ్చిందో - జస్ట్ - ఎంక్వయిరీ చేద్దామనీ-
    "ఏం పేపరది?"
    "అదేనండీ! 'వైజాగ్ కాలింగ్' మోస్ట్ ప్రిస్టేజియస్ ఈవెనింగ్ పేపర్!"
    "నేనప్పుడూ చూళ్ళేదు , వినలేదు!" అన్నాడాయన చిరాగ్గా.
    భవానీశంకర్ కేం మాట్లాడాలో తెలీలేదు.
    "మీ చేతుల్లో ఉన్నది 'వైజాగ్ కాలిగే'కదండీ !" వినయంగా చెప్పాడు.
    "నేనీ పేపర్ కొన్నది చదవటానిక్కాదు! రైల్లో కింద వేసుకుని పడుకోటానికని ఓ పనికిరాని పేపర్ ఇమ్మని స్టాల్ అతనిని అడిగాను." అన్నాడతను.
    భవానీశంకర్ అక్కడి నుంచి నేరుగా నడిచి జనంలో నుంచి పోర్టికో వేపు ఈదుకెళ్ళిపోయాడు.
    అందుక్కారణం ఆ ముసలాయన చెప్పిన నగ్నసత్యం కాదు.
    పోర్టికో బయట అప్పుడే అటో దిగి దిక్కులు చూస్తోన్న ఓ అందమైన తెల్లటి మల్లెపూవులాంటి అమ్మాయి.
    "హలో హలో హలో ...." అన్నాడు భవానీశంకర్ ఆమె దగ్గరకు వస్తూ.
    "ఓ వచ్చేశావన్నమాట! రిజర్వేషన్ చార్ట్ చూశావా!" అడిగిందామె.
    "ఓ! 'డి' కోచ్! బెర్త్ నెంబర్ ఫిప్టీ సిక్స్"
    "థాంక్యూ!" అందామె.
    "వెళ్దామా!' అడిగాడతను. ఇద్దరూ ప్లాట్ ఫారం మీదకెళ్ళి నిలబడ్డారు.
    "షల్  వుయ్ హావ్ కూల్ డ్రింక్స్?"
    "ఓ! పద!" ఇద్దరూ ఆ పక్కనే వున్న కూల్ డ్రింక్ స్టాల్ దగ్గర కెళ్ళారు. ఆ స్టాల్ చుట్టూ జనం మూగిపోయి వున్నారు. వాళ్ళ మీద నుంచీ చేతులు చాచి రెండు కూల్ డ్రింక్ లు అందుకున్నాడు భవానీశంకర్.
    "ఈ రెండు నెలలూ నువ్వేం చేయదలచుకున్నావ్?" అడిగిందామె కూల్ డ్రింక్ తాగుతూ.
    భవానీశంకర్ కొంచెం తడబడ్డాడు.
    ఏం చెప్పాలో తెలీలేదు. ఏం చెప్తే ఏం తంటానో అన్న జంకు!
    "ఏముందీ.....ఏమీ లేదు.....జస్ట్ - టైమ్ పాస్!" అన్నాడు నవ్వుతూ.
    "అంతేగానీ ఆ "వైజాగ్ కాలింగ్" ఉద్యోగం వదలవన్న మాట!' చిరాకుగా అందామె.
    ఆమె అందమయిన ముఖంలో కోపం వస్తే బాగానే ఉంటుంది గానీ భవానీశంకర్ కది ఇష్టం లేదు.
    'అబ్బే! అలా అని కాదనుకో! కానీ అందులో కొంచెం 'థ్రిల్ ' ఉంది...."
    "ఏమయినా సరే! నువ్వు ఇంకేదయినా మంచి ఉద్యోగం చేయాల్సిందే. మా డాడీ సంగతి నీకు చెప్పను కదా! ఈ విషయంలో ఆయనకు చాలా పట్టింపు...."
    "అవునవును! చెప్పావ్-" పొడిగా అన్నాడతను.
    "ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోకు!" అందామె హటాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు.
    "ఏమిటది?" అడిగాడు భయంగా.
    "మీ గాంగ్ తో తిరగడం మానేస్తే మంచిది...."
    భవానీ శంకర్ భయపడినంతా అయింది. ఈ టాపిక్ అయితే రాకూడదని కోరుకుంటూన్నాడో అది రానే వచ్చేసింది.
    "అంటే........" ఏం మాట్లాడాలో తెలీక ఆగిపోయాడు.
    "అంటే అదే! మీ రాబీన్ హుడ్, లాంటి జులాయి వాళ్ళతో నువ్వు స్నేహం చేయడం నాకు నచ్చలేదని చెప్పను కదా!"
    "ఆఫ్ కోర్స్ - చెప్పావ్ చెప్పావ్!"
    "స్నేహితులనే వాళ్ళు ఎప్పుడూ మర్యాదస్తులూ, మంచి ప్రినిపుల్స్ గలవాళ్ళూ అయుండాలి! కళలూ, సాహిత్యం లాంటి వాటిల్లో మంచి అభిరుచి ఉన్నవాళ్ళయి ఉండాలి!"
    భవానీశంకర్ కి కొంచెం విసుగు పుట్టిన మాట నిజం!
    తన స్నేహితులెలాంటి వాళ్ళుండాలి అనే సబ్జెక్టు మీద ఆమె ఇప్పటికే పద్నాలుగు సార్లు లెక్చరిచ్చింది.
    ఖాళీ అయిన ఇద్దరి బాటిల్సూ తీసుకెళ్ళి స్టాల్లో ఇచ్చేసి డబ్బు ఇవ్వడానికి జేబులో చెయి పెట్టడతను.
    గుండెలు ఝల్లుమన్నాయ్. జేబులో కేవలం రెండే రూపాయలున్న విషయం గుర్తుకొచ్చింది.
    ఈలోగా టక్కున తనే పర్స్ తీసి స్టాల్ అతనికి పదిరూపాయల నోటు ఇచ్చేసింది విజ్జీ.
    ఇలా జరగటం ఇదేం కొత్తకాదు.
    ఆమెతో పరిచయమయిన ఈ కొద్ది కాలంలో చాలాసార్లు - అలాగే తమ బిల్లు కట్టాల్సి రావటం - సరిగ్గా అసమయంకే తన దగ్గర అంత డబ్బు లేకపోవటం - టక్కున విజ్జీయే బిల్లు కట్టేయటం జరిగిపోయింది. 'అయినా ఎప్పుడూ నేనే బిల్లు కడుతున్నా' అనే ఫీలింగ్ ఆమెకి ఉండేది కాదు. ఎటొచ్చీ తన ఫ్రెండ్స్ విషయంలో, తన సరదాల విషయంలో మాత్రం కొంచెం ఓవర్ గా రియాక్టవుతుందేమో అనేది తన ఫీలింగ్! ఇద్దరూ మళ్ళీ ఆమె 'కోచ్ ' దగ్గరకు బయల్దేరారు.
    ట్రైన్ బయల్ద్రేరే టైమ్ అయినట్లు గార్డ్ హడావుడిగా విజిల్ ఊదుతున్నాడు.
    "భవానీ - " పిలిచిందామె.
    "యస్. డియర్!"
    "నువ్వు ....నువ్వు .....నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?"
    భావానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
    "అదేమిటి! అలా అడుగుతున్నావ్?" ఆమె చేతిని తను చేతుల్లోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అడిగాడు చిరునవ్వుతో.
    "మరి నా కోరికను ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నావ్?" అశాంతిగా అడిగిందామె.
    "ఏదీ ఉద్యోగం సంగతేనా? కానీ నేను న్యూస్ పేపర్ జర్నలిస్ట్ గా ఉంటే మీ డాడీ ఎందుకొప్పుకోరు? ఆయనకు జర్నలిస్ట్ లంటే పడదా?"
    "అదేం కాదు! మా డాడీ ప్రెండోకతను జర్నలిస్ట్ గా ఉండి, దరిద్రం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు....."
    "ఓకే విజ్జీ! అయ్ విల్ థింక్ వోవర్! కానీ డాక్టర్లు, ఇంజనీర్లు, గుమాస్తాలు, సేల్స్ మాన్ లాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చెసుకున్నారన్న విషయం మీ డాడీకి చెప్పు!"
    ఆమె టైమ్ చూచుకుంది.
    "ఇంకా అయిదునిమిషాలుంది- పద!"
    తనూ సామానుతో ఆమెను వెంబడించాడు భవానీశంకర్.
    ఆమె బెర్త్ దగ్గర సామానుంచాక తను దిగి కిటికీ దగ్గర నిలబడ్డాడు.
    "శంకర్! నాకు ప్రామిస్ చేస్తావా?"
    "ఏమిటది?" ఉలిక్కిపడి అడిగాడతను.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS