Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 2

 

    "అదే - మీ పాత స్నేహితులతో తిరగటం మానేస్తానని . మరో మంచి ఉద్యోగం  చూచుకుంటాననీ....."
    అయిష్టంగానే ప్రామిస్ చేయక తప్పలేదతనికి.
    "ప్రామిస్!" అన్నాడు ఆమె చేతిలో చేయి వేస్తూ.
    ఆమె కళ్ళల్లో అనందం వెల్లి విరిసింది.
    రైలు కదిలింది.
    "లెటర్స్ రాస్తుంటావ్ కదూ?"
    "ఓ!"
    "వైజాగ్ కాలింగ్ లో ఉద్యోగం...."
    "ఓకె- ఓకె- " అన్నాడతను ఆమె మాట వినిపించు'కోకుండా!
    రైలు ప్లాట్ ఫారం చివరి కెళ్ళేవరకూ చేయి ఊపుతూనే ఉంది విజ్జీ!


                                                 *****
    
    "వైజాగ్ కాలింగ్" ఆఫీస్ లోకి అడుగు పెడుతున్న వాడల్లా హటాత్తుగా ఆగిపోయాడు భవానీశంకర్.
    "వైజాగ్ కాలింగ్" వైజాగ్ ప్రేస్టేజియస్ ఈవెనింగ్ న్యూస్ పేపర్" అన్న బోర్డు ఉండాల్సిన చోట "బుచ్చమ్మ ఊరగాయల దుకాణం" అన్న బోర్డు వేలాడుతోంది.
    మొదటి మేట్టుమీదనే నిలబడిపోయాడతను'.
    తను ప్రపంచంలో చాలా అద్భుతాలు - తమాషాలు చూశాడు. ఇంకా చాలా వాటి గురించి విన్నాడు గానీ, ఇలా ఒక్క రోజులో న్యూస్ పేపర్ ఆఫీస్ ఊరగాయల దుకాణంగా మారటం గురించి వినలేదు.
    ఎటూ తోచని స్థితిలో అతని భుజం మీద చేయి పడింది ఆప్యాయంగా.
    "పద! అంతా చెప్తాను-" అన్నాడు వైజాగ్ కాలింగ్ ఎడిటర్ సీతారామయ్య, ఇద్దరూ ఆ పక్కనే ఉన్న గణేష్ విలాస్ లో కెళ్ళి సీట్ల మీదా, టేబుల్ మీదా నిండిపోయిన ఈగల్ని పక్కకు జరిపి కూర్చున్నారు.
    "నిన్న రాత్రి సడెన్ గా నిర్ణయం తీసుకున్నాను భవానీ! ఇంత ఈ లాస్ భరించటం నా వల్ల కాదు. అందుకే "వైజాగ్ కాలింగ్" ని క్లోజ్ చేశాను -" భవానీశంకర్ నిశ్చేష్టుడైపోయాడు.


                                                 *****

    హోటల్ హుయసల ఖాళీగా ఉందారోజు.
    బయట సన్నని వర్షపు తుంపర పడుతోంది.
    ఆ హోటల్ హాల్ పక్కనే అనుకుని ఉన్న ఏసీ రూమ్ లో ఓ వ్యక్తీ కూర్చుని ప్రతి నిమిషానికి ఓసారి టైమ్ చూసుకుంటూన్నాడు. ప్రతి రెండు నిమిషాలకు ఓసారి "ప్చ్" అంటున్నాడు. ప్రతి అయిదు నిమిషాలకూ ఒకసారి "హు" అనుకుంటున్నాడు తనలో తను.
    మరోసారి "హు" అనుకోబోతుండగా ఏసీ రూం తలుపు ధభేల్ మన్న శబ్దంతో తెరచుకుంది.
    ఓ అందమయిన అమ్మాయి లోపలికి అడుగుబెట్టి గదంతా కలియజూసి మూలగా కూర్చున్న వ్యక్తిని గమనించి "హేయ్ దీప్ చంద్ " అంది ఆనందంగా.
    "హాయ్!" అన్నాడు దీప్ చంద్ చిరునవ్వుతో. ఆ రోజు ఆమె అలంకరణ , ఆమె ధరించిన పంజాబీ డ్రస్సూ - అన్నీ ఆమె అందాన్ని ఎన్నో రెట్లు పెంచేస్తున్నాయి.
    "సారీ! పదినిమిషాలు లేటయింది!" అంటూ వచ్చి అతని కేదురుగ్గా ఉన్న సీట్లో కూర్చుంది.
    "దట్సాల్ రైట్ !" అన్నాడతను సంబరంగా.
    "మరి వెళ్దామా ఇక?" అడిగిందామె వెంటనే.
    అతను కొంచెం తటపటయించాడు.
    "ఆఫ్ కోర్స్! వెళ్ళవచ్చునుకో! కానీ వెళ్ళేముందు కొన్ని వివరాలు చెప్పాలి నాకు-"
    "ఏమిటది!"
    "మీ డాడికి కోపం ఎక్కువన్నావ్ కదూ!" దిగులుగా అడిగాడతను.
    "అవును!"
    "మీ నౌకరు మొఖం మీద ఓసారి దోసకాయ పచ్చడి విసిరారని చెప్పావ్...."
    "దోసకాయ పచ్చడి కాదు! టమాటో-"
    "టమోటోనా? నేను దోసకాయనుకున్నాను-"
    "కాదు!" దీప్ చంద్ కి కొంచెం చెమటలు పట్టినయ్.
    "మరిప్పుడు -- నేను వచ్చి మన పెళ్ళి విషయం మాట్లాడితే -- నా మీద కూడా ...."
    అమ్మాయి  కిలకిల నవ్వేసింది.
    'అయ్యో! అంత- భయమెందుకు దీప్? అదీ గాక మా ఇంట్లో ఆ రెండు పచ్చళ్ళూ లేవు ప్రస్తుతానికి...."
    దీప్ చంద్ కి కొంత సంతృప్తి కలిగింది.
    "సరే, వెళ్దాం పద!" అన్నాడతను.
    బేరార్ కాఫీ కప్పులు తెచ్చి వారి ముందుంచాడు.
    "కొత్త నవల మొదలెట్టావా దీప్?" ఆసక్తితో అడిగింది అమ్మాయ్.
    "ఓ నిన్నరాత్రే మొదలెట్టాను! హీరోయిన్ పేరేంటో తెలుసా?" ఉత్సాహంగా అడిగాడతను.
    "ఏమిటి?"
    "అమ్మాయి...."
    "ఓ! నా పేరా?"
    "అవును! వెరైటీగా వుంటుందని పెట్టాను! నిజం చెప్పాలంటే నువ్వు నన్ను మొదటి పరిచయంతోనే ఎందుకాకర్శించావో తెలుసా?"
    "ఎందుకు?"
    "నీ పేరు వల్ల! చాలా కొత్తగా , తమాషాగా అనిపించింది. నీ పేరు. ఆడపిల్లలకు అలా 'అమ్మాయి' అన్న పేరు ఉండటం అంతకు ముందేక్కడా చూళ్ళేదు....."
    ఆమె చిన్నగా నవ్వింది.
    "ఇంక మనం బయల్దేరదామా? డాడీ వెళ్ళిపోతారేమో మళ్ళీ....." ఇద్దరూ బయటికొచ్చారు.
    "అసలు నీకలాంటి పేరెందుకు పెట్టారు?" అటో కోసం చూస్తూ అడిగాడతను.
    "మా డాడీకి జ్యోతిష్యం అంటే బోలెడు నమ్మకం! నా పేరు 'ఆ' అన్న అక్షరంతో మొదలయి 'యి' అన్న అక్షరంతో అఖరవాలని వాళ్ళు చెప్పారట! అలా "అమ్మాయి ' అన్న పెరోక్కటే సరిపోతుందని అలా పెట్టారు-"
    "భలే తమాషాగా ఉంది...."
    ఇద్దరూ అటో ఎక్కారు.
    అటో ఆమె ఇంటి వేపు ప్రయాణం చేస్తున్నకొద్దీ దీప్ చంద్ లో కలవరం, భయం ఆందోళనలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయ్.
    అటో దిగి ఆమె ఇంటి వేపు నడుస్తుండగా అతని కళ్ళముందు పిడికిలి బిగించి రింగ్ లో తనను తరుముతున్న అమ్మాయి వాళ్ళ డాడీ బొమ్మ భయంకరంగా కనిపించసాగింది.
    దీప్ చంద్ లో సన్నగా వణుకు ప్రారంభమయింది.
    అమ్మాయికి అతని పరిస్థితి చూస్తే నవ్వుగానూ, జాలిగానూ కూడా ఉంది.
    "అయ్యో! వై ఆర్ యూ సో స్కేర్ ద్? డాడీ ఎంతో మంచివారు దీప్! ఎప్పుడో గానీ కోపం రాదు....."నచ్చచెప్తూ అందామె.
    "అబ్బే - నేనేం భయపడటంలేదు. జస్ట్ ....ఊరికే ....అలా...." అంటూ జేబులో నుంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు.
    ఇద్దరూ డ్రాయింగ్ రూమ్ లోకి చేరుకున్నారు.
    "దీప్! నువ్విక్కడ కూర్చో! నేను డాడీని పిల్చుకొస్తాను" అంటూ లోపలకి వెళ్ళబోయింది అమ్మాయి.
    "అమ్మాయ్.....!" గాబరాగా పిల్చాడు దీప్ చంద్.
    "ఏమిటి?" వెనక్కు తిరిగి ప్రశ్నార్ధకంగా చూసిందామె.
    "పోనీ ఇవాళ ....ఇవాల్టికి ....మీ డాడీతో మాట్లాడే విషయం పోస్ట్ ఫోన్ చేద్దామా?"
    అమ్మాయి అతని దగ్గరగా వచ్చింది. ఆమెకు అతనంత పిరికిగా ప్రవర్తించడం ఏమాత్రం నచ్చటం లేదు.
    అతని నవలల్లో హీరోలందరూ హీరోయిన్ తండ్రినో పురుగుని చూసినట్లు చూడటం, మాట్లాడటం, హీరోయిన్ ని లేవదీసుకుని పారిపోయి రిజిస్టర్ మారేజ్జేసు కోవటం లాంటి సంఘటనలు కోకొల్లలు.....ఆ హీరోయిజం చూసి ముచ్చట పడి', అలాంటి వన్నీ అతనిలో ఉంటాయని నమ్మి అతని వేపు ఆకర్షించబడింది తను.
    "అయ్యో దీప్! ఏమిటిది? నువ్వో ఫేమస్ రచయితవు! మా డాడీ అంటే అంత భయపడితే ఎలా!
    "అబ్బే భయం కాదు.....కానీ .....జస్ట్ ....నేనేనేదేమిటంటే - ఇంకో రోజెప్పుడయినా లీజర్ గా- మీ డాడీ మూడ్స్ బావున్నప్పుడు...."
    "ఇప్పుడు మా డాడీ మూడ్స్ బావోలేదని ఎవరన్నారు?"
    "ఆఫ్ కోర్స్ ....అనలేదనుకో...."
    "దీప్! ప్లీజ్! ఇంకెంతకాలమిలా ! దయచేసి కూర్చో....." అతని భుజాలు పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతూ అందామె.
    దీప్ ఇంక కాదనలేకపోయాడు. ఆమె అందం, కళ్ళలోని ఆ ఆకర్షణ మరోమాట మాట్లాడకుండా కూర్చునేలా చేశాయతనిని! ఈ అమ్మాయి ఇంత గొప్ప అందగత్తె కాకపోయినట్లయితే తనీమెను పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయానికే వచ్చేవాడు కాదసలు! ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిలతో ప్రేమ కలాపాలు జరుపలేదు! ఎందుకో అమ్మాయిని చూసిన క్షణం నుంచే ఆమెను శాశ్వతంగా తన దానిని చేసుకోవాలన్న నిశ్చయానికొచ్చేశాడు.
    అమ్మాయి లోపలికెళ్ళింది.
    దీప్ చంద్ తలెత్తి గోడ కున్న నేమ్ బోర్డ్ వంక చూశాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS