Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 2

    రాత్రి పదకొండు గంటలు దాటితే ఆ హోటల్ గేటు తెరచుకోదు. కానీ కొందరి విషయంలో అలా కాదు. ముఖ్యంగా సులేమాన్ లాంటి వ్యక్తుల విషయంలో అంతకన్నా కాదు.
   
    గేటు దగ్గరున్న గూర్ఖా...కొన్ని సెకన్లపాటు బ్యాటరీ లైటుకారులోకి ఫోకస్ చేసి ఆ వెంటనే సెల్యూట్ చేస్తూ తాళం తీసి గేటు తెరిచాడు.
   
    పార్కింగ్ ప్లేసులో మారుతీ వ్యాన్ ఆగాక...సులేమాన్ కిందకు దిగి జేబులోంచి సిగార్ తీసి లైటర్ తో వెలిగించుకున్నాడు.
   
    ఆ లైటర్ వెలుతుర్లో కిట్టూను పరీక్షగా చూసాడతను.
   
    రెండు సంవత్సరాల క్రితానికీ.....ఇప్పటికీ అతనిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు....
   
    కిట్టూ ఆశ్చర్యంతో వ్యాన్ దిగాడు.
   
    దట్టంగా సిగార్ పొగ వదులుతూ సులేమాన్ నడుస్తుంటే అతన్ని అనుసరించాడు.
   
    లిఫ్ట్ లో ఇద్దరూ రెండవ అంతస్థుకు చేరుకున్నారు.
   
    తన గది ముందు నిలిచి తాళం తెరిచాడు సులేమాన్.
   
    గదిలోకి అడుగుపెట్టాక కానీ కిట్టూ పూర్తిగా కుదుటపడలేక పోయాడు.
   
    కొద్ది క్షణాలలో పోలీసులకు చిక్కి ఈపాటికి థర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఉండవలసిన తను....ఎ.సి రూమ్ లో ఉండడం ఆశ్చర్యమే మరి!
   
    సులేమాన్ అప్పటికే విస్కీబాటిల్ ఓపెన్ చేసి రెండు గ్లాసుల్లోకి ఒంపాడు.
   
    విస్కీ చూడగానే కిట్టూ పెదవులు తడుపుకున్నాడు.
   
    ఖరీదైన సరుకు__
   
    అందుకే ఆశగాబాటిల్ వైపు చూస్తుండిపోయాడతను.
   
    'విస్కీ గొంతులోకి దిగి చాలా రోజులైంది...' తనలో తనే అనుకుంటున్న కిట్టూ ఆలోచనను గ్రహించినట్టు చిరునవ్వు నవ్వాడు సులేమాన్.
   
    సోడా కలిపి గ్లాసు అందించాడు.
   
    ఎలాంటి సంకోచం లేకుండా గ్లాసును తీసుకుని ఆత్రంగా గొంతులోకి పంపేసుకున్నాడు కిట్టూ.
   
    "కొట్టు భాయ్...చాలా రోజుల తర్వాత కలిసినా కనీసం మర్యాద కోసమైనా చీర్స్ చెప్పకుండానే మందు లాగించావంటే చాలా కరువులో ఉన్నవని అర్ధమావుతూనే ఉన్నదీ...." అన్నాడతను.
   
    "కరువు....కొద్దిగా కాదు...చాలా ఉంది సులేమాన్...కడుపు నిండుగా మందు కొట్టి కొన్ని నెలలైందంటే నమ్ము.."
   
    మళ్ళీ పోయమనే అర్ధం వచ్చేలా గ్లాసు అతని ముందు పెడుతూ అన్నాడు కిట్టూ.
   
    సులేమాన్ సర్వం తెలిసిన ప్రవక్తలా చిరునవ్వు నవ్వాడు.
   
    మనిషికి డబ్బు కరువొస్తేనే తెగిస్తాడు.
   
    ఆ తెగింపులో ముందూ, వెనుకా ఆలోచించడు.
   
    కిట్టూ గ్లాసులో ఒక లార్జ్ పెగ్ విస్కీ పోశాడు.
   
    సోడా కలుపబోతుండగా..గ్లాసందుకున్నాడు.
   
    "సోడా వద్దులే_ఇప్పుడు చెప్పు భాయ్.... నీ పరిస్థితి మంచి సౌండుగా ఉందనుకుంటాను. అప్పుడేదో స్మగ్లింగ్ కేసులో చిక్కుకుని తీహార్ జైలుకి వెళ్ళావని విన్నాను..."
   
    జైలుకి వెళ్ళడం ఎంతసేపు? రావడం ఎంతసేపు? అందుకే మన పాత కిరాయి పనులను స్వస్తిచెప్పి తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదించే విషయాల మీద నా దృష్టిని కాన్ సెన్ ట్రేషన్ చేస్తున్నాను. పెద్దగా కష్టపడకుండానే రెండు చేతులా సంపాదించగలుగుతున్నాను..."
   
    సులేమాన్ మాటలు వింటున్న కిట్టూ నోరు ఆశ్చర్యంతో తెరుచుకున్నది.
   
    "నిజమా?"
   
    సులేమాన్ సునాయాసంగా పెద్ద మొత్తాలలో డబ్బు సంపాదిస్తున్నావని చెప్పేసరికి నమ్మలేకపోతున్నాడతను.
   
    "నిజం కిట్టూ భాయ్... ఆ విషయాలన్నీ వదిలేయ్... నీకో పని అప్పగిస్తాను. నీ కప్పగించిన పని సమర్ధవంతంగా చేయగలిగితే నీకు దండిగా డబ్బు కూడా అందుతుంది. లక్షలు సంపాదించే ఆవకాశం నీకు నేను చూపిస్తాను..."
   
    "సారీ సులేమాన్ భాయ్...నువ్వు చెప్పినట్టు హత్యలు చేస్తే తప్ప అంత డబ్బు ఎవరూ ఆఫర్ చేయరు. నేను హత్యలు చేసే స్థాయికి ఇంకా ఎదగలేదు. పొట్టకూటి కోసం దోపిడీలు, దొంగతనాలు చేయడమే తప్ప ప్రాణాలు తీయగలిగినంత దుర్మార్గం నాలో లేదు...
   
    కిట్టు చెబుతుండగానే సులేమాన్ పెద్దపెట్టున నవ్వాడు.
   
    "హత్యలు చేయడం...చేయించడం అనే డర్టీ గేమ్స్ నాకూ ఇష్టం లేదు. మనదంతా చేతికి మట్టి అంటకుండా పనులు చేసుకుపోయే పద్దతి. ఈ రోజుల్లో రాత్రికి రాత్రే బడాకింగ్ వై పోవడం బ్రతకనేర్చినవాడి వ్యవహారం...అందులోనూ అతి పెద్ద సూపర్ మార్కెట్ లాంటి ఈ దేశంలో అవినీతిని ఆశ్రయిస్తే చాలు...చాలా ఈజీగా లక్షాధికారై పోవచ్చు.
   
    "నేను రేపు దుబాయ్ వెళుతున్నాను సరిగ్గా నెలరోజులకు తిరిగి మద్రాస్ వస్తాను. ఈ నెలరోజుల్లో నువ్వు చెయ్యవలసిన పని ఒకటి వున్నది. నేను చెప్పినట్టు 'తుచ' తప్పకుండా చేయగలిగితే నీకు కోటి రూపాయలు ఇస్తాను. నేనిచ్చే డబ్బుకు ఆనందంగా తలవూపి ఒప్పుకునే నేరస్థులు చాలామంది నాకు తెలుసు. కానీ నాకు కావల్సింది నమ్మకం...నీవు ఎలాంటి నమ్మకస్థుడివో తెలుసు కాబట్టే ఈ పనికి నిన్ను ఎన్నుకున్నాను..."
   
    కిట్టూలో కొనవూపిరితో వున్న కోరిక కాస్త లేచి కూర్చున్నఃది.
   
    కోటి రూపాయలంటే మాటలుకాదు...
   
    జీవితకాలం కష్టపడినా తను సంపాదించలేడు. ఒక్కసారి సులేమాన్ చెప్పిన పనేదో చేసి ఆ తరువాత నుంచి ఈ నేరాలకు దూరంగా ఎక్కడికో పోయి హాయిగా ఎంజాయ్ చేసెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చాడతను.
   
    మందు గ్లాసు వదిలిపెట్టి సులేమాన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు కిట్టూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS