Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 2


    ఇక ఆలస్యం చేయలేదు అతను. పక్కనున్న డాబా మీదకు ఒక్క గెంతు గెంతాడు. అదృష్టం కొద్దీ అక్కడంతా చీకటిగా వుంది.

 

    అక్కడే ఓ మూల నక్కి చూస్తున్నాడు.

 

    "ఎక్కడ్రా వాడు? ఇద్దరూ సెకండ్ షోకి వెళ్ళాలని అనుకున్నారట కదా? ఇక్కడే వుండాలి" చాలా కర్కశంగా వున్న గొంతు బెదిరిస్తోంది.

 

    వాళ్ళు దాదాపు పదిమందిదాకా వున్నారు. వాళ్ళ చేతుల్లోని చైన్లు, రాడ్ లు మెరుస్తున్నాయి. ఒకడు ముందుకు ఓ అడుగు వేసి మధు చొక్కా పట్టుకున్నాడు. ఇంకొకడు గది లోపలికి వెళ్ళి వచ్చి లేడన్నట్లు పెదవి విరిచాడు.

 

    వాళ్ళు రూడ్ గా ఏదో మాట్లాడుతున్నారే తప్ప ఏం చేయడం లేదు. మధుకి  ప్రమాదం లేదన్న భరోసా రావడంతో తరుణ్ నిశ్శబ్దంగా పైకి లేచి పక్క డాబా మీదకు దూకాడు. అక్కడినుంచి పక్కదానికి. అలా మూడు డాబాలు దాటాక వీధి వచ్చింది. ఇక లాభం లేదు. కిందకి దిగాలి.  

 

    మెట్ల కోసం చీకట్లో కళ్ళని సాగదీసి చూశాడు. చీకటి బావిలా మెట్లున్న ప్రదేశం కనిపించింది.

 

    ఏమీ శబ్దం రాకుండా కిందకు దిగాడు. వరండాలో ఓ క్షణంసేపు నిలుచున్నాడు.

 

    తుఫాను మొదలయిందని దండోరా వేస్తున్నట్లు గాలి రివ్వున వీస్తోంది.

 

    తల పైకెత్తి చూశాడు.

 

    కమిలిపోయిన చర్మంలాగా ఆకాశం. కుంభవృష్టి కురుస్తుందని చెబుతున్నట్లు సైలెంట్ గ చినుకులు రాలడం మొదలుపెట్టాయి.

 

    యుద్ధభూమిలో సైనికులు చెల్లాచెదురైనట్లు జనం పరుగులు ప్రారంభించారు. ఎవరి హడావుడిలో వాళ్ళున్నారు కాబట్టి తనను ఎవరూ ప్రత్యేకించి గమనించరన్న నిర్ధారణకు రావడంతో తరుణ్ వీధిలో పడ్డాడు. వడివడిగా నడవడం మొదలుపెట్టాడు.

 

    ఉత్తరం వైపుకి నడిచి, టౌన్ అవుట్ స్కర్ట్స్ దాటాడు. ఇక ఇళ్ళు లేవు. అన్నీ తుప్పలే. కనబడుతున్న చిన్న దారంట అడుగులు వేస్తున్నాడు.

 

    వాన ఎక్కువైంది. ఆకాశం చీలుతున్నట్లు మెరుపులు మెరుస్తున్నాయి. కబురు రావడంతో మంత్రసాని పరిగెడుతున్నట్లు గాలి వేగంగా తగులుతోంది.

 

    ఇలా భీరువుగా పారిపోవడం అతని నేచర్ కి పడదు. కానీ పరిస్థితులు అన్నీ తిరగబడటంతో ఇక తప్పనిసరై దూరంగా వెళ్ళిపోతున్నాడు.

 

    మామూలుగా భయం అంటే ఎరుగని మనిషి. పదిహేనేళ్లు వచ్చేవరకూ అతనూ అందరిలాంటి కుర్రాడే. ఇంటర్ సీనియర్ లో వుండగా అతని కళ్ళపడ్డ ఓ పుస్తకం అతని జీవనవిధానాన్నే మార్చేసింది. అది చలం మైదానం.

 

    అంతవరకు కథలు, నవలలు చదివి ఎరగడు. ఓరోజు మిత్రుడి రూమ్ కెళితే ఆ పుస్తకం కనపడింది. తెచ్చుకుని చదివాడు. ఒక సెన్సిటివ్ కుర్రాడ్ని ఏం చేయగలదో అదంతా చేసిందా పుస్తకం.

 

    పెద్దలు, సాంప్రదాయాలు, దొంగపూజలు, నంగిభయాలు, ఆచారాలు, నైతికవిలువలు అన్నీ ఒక్కసారిగా తిరగబడ్డాయి. తను ఇన్ని సంవత్సరాలుగా ఎంతో గొప్పవనుకున్న విలువలు ఎంత నీచమైనవో తెలిశాయి. కొత్త ప్రపంచపు ద్వారాలు తెరుచుకున్నాయి. కాలేజీ విషయమే మరిచిపోయాడు.

 

    తెలుగులో, ఇంగ్లీషులో మంచి నవలలు అన్నవన్నీ చదివాడు. మార్క్సిజం అంటే చాలా యిష్టం ఏర్పడింది.

 

    ఫ్రాయిడ్ అన్నా, సార్త్రే అన్నా ప్రత్యేకమైన గౌరవం కలిగాయి.

 

    ఎం.ఏ. అయిపోయాక స్వంతంగా బ్రతకాలన్న ఆలోచన వచ్చింది.

 

    చిన్న చిన్న ఉద్యోగాలు చాలా వేశాడు. ఎక్కడా పొసగలేదు.

 

    తీరిగ్గా వున్నప్పుడు పేదలకు ఇళ్ళ పట్టాలిప్పించడం, రేషన్ కార్డులు తెచ్చి పెట్టడం, కులాంతర వివాహాలు చేయడం లాంటివి చేసేవాడు. నెలరోజుల క్రితం ఓ దినపత్రికలో రిపోర్టర్ గా చేరాడు. చేరిన రెండోరోజే పెద్ద దుమారం చెలరేగింది.

 

    ఆ టౌన్ లో వివాహిత మృతి చెందింది. ఆమె లాయర్ భార్య. భార్యాభర్తల మధ్య కట్నం విషయమై తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. సడన్ గా ఓరోజు చనిపోయిందామె. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.  

 

    ఈ విషయం తెలిసిన వెంటనే తరుణ్ అక్కడికి వెళ్లాడు. ఆమె శవం తీరుతెన్నులను పరిశీలించాడు. ఇరుగు పొరుగును విచారించాడు.

 

    ఇది అనుమానాస్పద మృతి కాదనీ, హత్యేనని అన్ని రుజువులు దొరికాయి. రాత్రి పదకొండు గంటలప్పుడు ఆఫీసుకి వచ్చాడు. అది సిటీ వార్త కాబట్టి పన్నెండు గంటల వరకు యివ్వచ్చు.

 

    మొత్తం వార్త రాసేటప్పటికి పన్నెండయింది. డెస్క్ హాండిల్ చేసే సీనియర్ సబ్ కి వార్త యిచ్చాడు.

 

    ఇలాంటి కాంట్రావర్మీ వార్తలొచ్చినప్పుడు వాటిని న్యూస్ ఎడిటర్ కి తెలియచేయాలి. ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అదీ ఆ దినపత్రికలో రూలు. అందుకే సీనియర్ సబ్ న్యూస్ ఎడిటర్ కి ఫోన్ చేశాడు. లాయర్ దురదృష్టమో, తరుణ్ అదృష్టమో తెలియదుగానీ న్యూస్ ఎడిటర్ సెకెండ్ షో సినిమాకెళ్ళాడని పనిమనిషి చెప్పింది. తటపటాయిస్తూనే సీనియర్ సబ్ ఆ వార్తను ఫస్ట్ పేజీలో పెట్టి పైపెచ్చు దానికో బాక్స్ తగిలించాడు.

 

    రెండోరోజు తరుణ్ ఆఫీసుకెళ్ళేసరికి న్యూస్ ఎడిటర్ నరసింహా వతారంలో ఉన్నాడు.

 

    "వాటీజ్ దిస్?" అని ముఖమంతా ఎర్రగా చేసుకుని పేపరుని తరుణ్ ముందుకి విసురుగా తోశాడు.

 

    "లాయర్ తన భార్యను చంపేశాడు"

 

    "మీరు చూశారా?"

 

    "చూళ్ళేదు. చంద్రమండలంలో మనిషి కాలుపెట్టిన వైనం కూడా మనం చూడలేదు . అలాగని వార్త రాయకుండా వుండగలమా?"

 

    "నేనడిగింది ఆర్గ్యుమెంట్ కాదు - సంజాయిషీ"

 

    "ఎందుకు సార్? లాయరే చంపేశాడని సాక్ష్యాధారాలు వున్నాయి సార్"

 

    "మరి పోలీసులు అనుమానాస్పద మృతి అని నమోదు చేశారుకదా. అందుకు విరుద్ధంగా మీరు హత్య అని రాశారు. ఎంత గొడవలై పోతున్నాయో తెలుసా? ఇప్పుడు ఆ లాయర్ మనల్ని కోర్టుకు లాగితే ఏమిటి చేయడం?"

 

    "వార్తాపత్రిక పెట్టేటప్పుడు అలాంటివాటికి సిద్ధపడాలి సార్! మన దృష్టిలో రాయాలి. పోలీసులు చెప్పింది రాసుకుంటే నేను రిపోర్టర్ గా ఎందుకు? ఆ ఎస్.ఐ.నే రిపోర్టర్ గా పెట్టుకోండి. గుడ్ బై" అని మరో మాటకు తావివ్వకుండా వచ్చేశాడు తరుణ్.

 

    అంతవరకు ఇలా మాట్లాడిన రిపోర్టర్ ను చూళ్ళేదు న్యూస్ ఎడిటర్. దాంతో ఖంగుతిని పేపర్ వెయిట్ ను నలిపేసేందుకు ప్రయత్నించాడు.

 

    అది ఫస్ట్ వార్నింగ్ కింద మన్నించి వదిలేశారు. అలా గండం గడిచింది.

 

    అధికారులతోనే కాదు - తన కొలీగ్స్ తో కూడా ఇంత స్ట్రయిట్ గానే వ్యవహరించేవాడు అతను.

 

    బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేసేప్పుడు అతనితోపాటు ఓ అమ్మాయి పనిచేసేది. పేరు నిరుపమ. అందంగా వుంటుందిగానీ కాస్తంత లావుగా వుండేది. అందులోనూ ఆమెకు మెల్లకన్ను. మరీ పరిశీలించి చూస్తే తప్ప ఎదుటివాళ్ళకు ఈ విషయం తెలియదు. తనను చూస్తూనే మెల్లకన్ను కన్పిస్తుందని ఆమె నమ్మకం.

 

    ఆమెలో ఈ మెల్లకన్ను కాంప్లెక్సూ, లావుగా వున్నానన్న భయమూ వయసుతోపాటు పెరిగాయి. తనను ఎవరూ పెళ్ళి చేసుకోరన్న నమ్మకాన్ని ఏర్పరచుకుంది. తను లావుగా వుండడం వల్ల అందరూ ఏవగించుకుంటున్నారన్న భావన కూడా వుండేది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS