Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 6

ఈలోగా మంగమ్మ వ్యవహారాన్ని నేనూ రామచంద్రమూ కలిసి తేల్చివేశాం. నాగమణికి అయిదువేల
రూపాయిలిచ్చి, మంగమ్మను శాస్వతంగా ఆవిడ చెరనుండి తప్పించేశాం. నాగమణి లబ్బుమని ఏడుస్తూ వెళ్ళిపోయింది.
"సగంపీడా వొదిలింది?" అన్నాడు రామచంద్రం.
"సగమేం ఖర్మ పూర్తి పీడాయే వదిలింది. ఈరుణం ఎలా తీర్చుకోవాలో తెలియకుండా వుంది" అన్నది మంగమ్మ. "ఎలా తీర్చుకోవలసిందీ నేను చెబుతాలే పద!" అన్నాడు రామచంద్రం
రమా రమీగా ఆరేళ్ళపాటు మా సమాజం అమోఘంగా నాటకాలాడింది. అనేక పోటీల్లో పాల్గొని బహుమతులందుకొంది. మా సమాజంలో ఉన్న కొంతమంది సినిమాల్లోకి వెళ్ళిపోయారు. ఊరూరా కొత్త కొత్త సమాజాలు వెలిశాయి. అఖిల భారత స్థాయిలో ప్రజా నాట్యమండలి ఏర్పాటయింది. దాని శాఖలు, గ్రామగ్రామాల వెలిశాయి. తక్షణ సమస్యలను నాటకాలుగా, నాటికలుగా మలచి ఈ నాట్య మండలులు ప్రదర్శించసాగాయి. ఉత్సాహవంతులైన యువతీ యువకులెందరో ఈ సంఘాల్లో చేరుతున్నారు. వీరిలో మరుగునపడిఉన్న కళాకృష్ణను ఈ సంఘాలు తీర్చుతున్నాయి.
మా సమాజ సభ్యులలోకూడా మునుపున్నంత ఉత్సాహం కనిపించడంలేదు. బహుశా -వయస్సు కొంతవరకూ కారణమనుకొంటాను. కాలంతోబాటు ముందుకెళ్ళగల చొరవా, తెగింపూ తగ్గిపోయాయి. 'నటన'అనేది యాంత్రికస్థాయికి తగ్గిపోయింది. కొత్తదనం కోసం రాత్రింబవళ్ళు తపస్సు చేసిన రోజులకూ, ఈ రోజులకూ ఎంత తేడా ఉంది!
మా ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకు మార్చాక మరెన్నో మార్పులు కలిగాయి. ఉన్నవారిలో కొంతమంది ఎక్కువ కిరాయికి, ఇతర సమాజాల్లోకి వెళ్ళిపోయారు. ఒకరిద్దరు సినిమాల మీద ఆశతో మద్రాసు వెళ్ళారు. ముగ్గురు వ్యాపారంలోకి దిగారు. రాగాపోగా మిగిలినవాళ్ళం నేనూ, రామచంద్రం మంగమ్మా మాత్రమే!
గడచినా కాలమంతా జ్ఞాపకమొస్తే మనస్సంతా అదోలా అయిపోతుంది. ఏ ఉద్దేశంతో ఈ సమాజాన్ని ప్రారంభించాయో, అది కొంతవరకూ నెరవేరింది. ప్రాచీన నాటక పద్దతికి, ఆధునిక విధానానికి మధ్య వంతెనలాగా మా సమాజం పనిచేసింది. ఇప్పుడు వాని అవసరంలేదు. ఇక ముందుకూడారాదు. ఇప్పుడు దీనికున్న స్థానం, ఒక జ్ఞాపకానికున్న స్థానంకన్నా పెద్దదేమీ కాదు. ఈ వంతెనమీదుగా దాటిపోయిన ప్రయాణీకులకు, బహుశా దీని విషయం జ్ఞాపకం ఉండకపోవచ్చు కూడాను. దీని ఉనికి - ఈ రోజున కేవలం నిష్ప్రయోజనం!
జనవరి 4వ తేదీ ననుకొంటాను. రామచంద్రం వొచ్చి, ఇన్సుమంటూ కుర్చీలో జారగిలబడ్డాడు. మంగమ్మ రెండోఆట సినిమాకెళ్ళింది. ఆఫీసులో మేమిద్దరం తప్ప మరో పురుగులేదు.
"అయిపోయిందిరా!" అన్నాడు రామచంద్రం.
వాడిగొంతు విచారంతో పూడుకుపోవడం నేను గమనించాను.
"ఇంటాయనతో చెప్పేశాను. మనం ఎప్పుడు ఖాళీ చేసినా తనకభ్యంతరం లేదన్నాడు" అన్నాడు వాడు.
మా సమాజానికివన్నీ అంత్యక్రియలన్నమాట! మరో రెండు మూడు రోజుల్లో శాశ్వతంగా ఇది భూస్థాపిత మయిపోతుందన్న మాట! ఒకప్పుడు, ఆంధ్ర దేశాన్నంతా, ఉర్రూతలూపిన ప్రఖ్యాత నాతకసమాజ మొకటి ఉన్నదనే విషయం కేవలం ఓ జ్ఞాపకం క్రిందనే ఉండిపోతుందన్నమాట!
శరీరమంతా ఎవరో నలిపివేస్తున్నట్లుగా గిజ గిజ లాడిపోయాను. రామచంద్రం ముఖం చూడటానికి భయం వేసింది. పంతానలేచి మా రిహార్సల్స్ రూంలో కెళ్ళాను. గది బావురు మంటోంది. కొన్ని వందలసార్లు మేమీ గదిలో రిహార్సల్స్ చేసి ఉంటాము. గదిగోడలకు ప్రాణాలుండటమే జరిగితే, మా డైలాగ్సన్నీ వాటికి కంఠతా వచ్చి వుంటాయనుకొంటాను. మాటలు, పాటలు, అభినందనలు, అభిశంసనలు, చిరాకులు, కోపతాపాలతో, ఈగది నిండిపోయి ఉంటుంది. ఇప్పటికి, ఆగదిలో ఏదో నాటకం, రిహార్సల్ జరుగుతునట్లు, ఆ మూలగా మంగమ్మ నిలబడి సంభాషణలు చెబుతున్నట్లూ, బ్రహ్మానందం ఈ ప్రక్కన కూచుని హార్మోనియం వాయిస్తున్నట్లు ఫీలయ్యాను. ఆ శబ్దాలన్నీ వొక్కసారి చెవుల్లో గింగురుమని మోతపెట్టాయి.
ప్రక్క గదిలోంచి ఎవరో సన్నగా ఏడవటం వినిపించింది. రామచంద్రం వోదార్పు మాటలు కూడా నేను విన్నాను.
"ఎందుకలా చంటిపిల్లలా ఏడుస్తావ్. ఏడ్చి నువ్వు సాధించేదేమిటి గనక?" అంటున్నాడు వాడు.
మంగమ్మనేదో వాడు వోదారుస్తున్నాడుగానీ, వాడికి దుఃఖం పుక్కివలింత లవుతున్నదని తెలిసిపోతూనే ఉంది.
"నువ్వు సినిమాకు వెళ్ళలేదా?" అన్నాను మంగమ్మతో, విషయం తప్పించుకొందామని.
మంగమ్మ తల అడ్డంగా తిప్పింది.
"ఈ దిగులు మరచిపోదామనే వెళ్ళాను మేష్టారూ! అంతమందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్లనిపించింది. సినిమా చూడలేక పోయాను. వచ్చేశాను" అన్నది మంగమ్మ.
ఆవిడ కళ్ళు కెంపుల్లాగా మెరిసిపోతున్నాయి. అనేకసార్లు రంగస్థలం మీద మంగమ్మ ఏడవడం నాకు తెలుసు. ఆవిడ ఏడవటమే కాకుండా, వేలాది ప్రేక్షకులకళ్ళను నీటితో నింపగలిగేది మంగమ్మ. కానీ ఇంతలా హృదయం తరుక్కుపోయేలా, మంగమ్మ చిచారించిన జ్ఞాపకం నాకు లేదు.
"నీకేవమ్మా! భగవంతుడు ఇంత అందమిచ్చాడు. నటించే శక్తినిచ్చాడు. ఏ సమాజంలో చేరుతానన్నా కళ్ళకద్దుకుని తీసుకుంటారు. నువ్వు విచారించడంలో అర్ధంలేదు" అన్నాడు రామచంద్రం.
మంగమ్మ ఓక్షణం నాకేసి, రామచంద్రంకేసి చూసింది. ఆ తరువాత చాలా సేపటిగ్గాని ఆవిడ సన్నగా నవ్వలేదు.
"ఎలా బ్రతకడమన్నభయం నాకులేదు మేష్టారూ!" అన్నది మంగమ్మ, పైటచెంగుతో కళ్ళను సద్దుకుంటూ ఇంతకాలం పుట్టింట్లో ఉన్నాను. ఇప్పుడు-
"మేమయినా నిన్ను అన్యాయంగా వెళ్ళమనడం లేదుగా! మధ్యాహ్నం నేనూ, వాడూ ఆలోచించాం. నీకో అయిదు వందలిద్దామనుకొన్నాం. ఆ డబ్బు, నీకు జీవితాంతం సరిపోతుందని కాదు గానీ, వెంటనే కాళ్ళు విరగ దొక్కుకుని బావకుండా, కాస్తంత ఆధారవుగా ఉంటుంది. భగవంతుడి దయవల్ల ఈ లోగా నీకెక్కడన్నా ఛాన్స్ దొరికితే సరే సారి! లేదా మే మెటుగూడి ఉండనే ఉన్నాం. ఓ కార్డు ముక్క రాసిపడేయ్. వాడో నేనో వస్తాం. అంతదాకా దేనికనుకుంటే, నువ్వే వచ్చేయ్ నువ్వు  పస్తులుంటుంటే., మేము చూస్తూ ఉండగలమా అన్నాడు" రామచంద్రం.
మంగమ్మ మరోసారి బావురు మన్నది.
"ఈ రుణం నేనెలా తీర్చుకోను?" అన్నది బెక్కుతూ.
మంగమ్మలోని అసలు మనిషని అప్పుడే చూస్తున్నాననిపించింది నాకు.
రామచంద్రం ఫక్కున నవ్వాడు.
"మరింక ఆ వివరాలన్నీ నన్నడక్కు, అప్పుగా మే మివ్వని మాట నిజమేగానీ, మరీ అంత నిస్వార్ధంగా ఇస్తున్నామనీ అనుకోకు, రేపు నువ్వో గొప్ప - పెద్ద - బ్రహ్మాండమైన స్టార్ అయితే - మేం ఫిలిం ప్రొడ్యూసర్లమయితే పదివేలు తక్కువ తీసుకొని, మాపిక్చర్లో వేషం వేద్ధువు గాని సరా?" అన్నాడు రామచంద్రం.
"ణా ముఖానికి అంతరాత కూడానా మేష్టారూ!" అన్నది మంగమ్మ.
"అదేం? అన్నాను నేను."
"ఆ అదృష్టజాతకులు వేరు!" అన్నదావిడ.
"అదృష్టమంటే, నీకంతా తెలిసిపోయినట్లు మాట్లాడకు. నువ్వొగొప్ప హీరోయిన్ వవుతావని కాదు. అయ్యే అవకాశాలున్నాయా, లేవా అన్నదే ముఖ్యం. నీకున్నవాటిల్లో శతాంశం అవకాశాలు లేనివారు. సినిమాల్లో వెలిగిపోతున్నారు. కాలం కలసివస్తే నువ్వూ అలాకావచ్చు కాగూడదనే నిబంధనేమీ లేదుమరి!" అన్నాడు రామచంద్రం.
మంగమ్మ ఇంకేమీ మాట్లాడలేదు.
రామచంద్రం, మంగమ్మ వేపు కన్నార్పకుండా చూస్తూ "అప్పుడు మేమొస్తే నువ్వసలు మాట్లాడవనుకుంటాను!" అన్నాడు నవ్వి.
"ఈ పూట నామీద పట్టించారేమిటి రధం?" అన్నది మంగమ్మ.
"అంత దశ ఈ దిక్కూ మొక్కూ లేనిదానికి పట్టాలేగాని, మాట్లాడకపోయినా మీరేమీ అనుకోరు, ఏం చేతంటే...."
"వింటున్నాను" అన్నాడు రామచంద్రం,
"నామీద మీకంత అభిమానం గనక" అని వాఖ్యం పూర్తి చేసిందావిడ.
"మీరు రూపాయికి వొకవేపే చూస్తున్నారు. రెండోవేపు చూడ్డంలేదు. ఆవేపున చాలా
పిచ్చిగీతలున్నాయి."
"అంటే - మళ్ళీ నాగమణి దగ్గరకెళ్ళడమేనా?" అన్నాను నేను. మంగమ్మ పలకలేదు.
"అంతదాకావస్తే, నువ్వు దానికొంపకెళ్ళే బదులు, నాదగ్గరకే మా ఆవిడతోబాటు నువ్వూ ఉందువుగాని" అన్నాడు రామచంద్రం.
"అప్పుడు నీకు పోటీగా నేనొకణ్ణుంటానని మరచిపోకు. మనిద్దర్లో ఎవరిదగ్గర ఉండాలో తేల్చవలసింది మంగమ్మే" అన్నాను నేను.
"ఇద్దరిదగ్గరా ఉంటుంది. తప్పేం? ద్రౌపది అయిదుగురితో కాపరం చేసింది. మంగమ్మ ఇద్దరితో చేస్తూంది ఏవమ్మా - అంతేనా?" అన్నాడు రామచంద్రం.
మంగమ్మ సిగ్గుపడటానికి బదులు పగలబడి నవ్వింది. అంతే గాని ఏ సంగతి తేల్చి చెప్పలేదు. అలా - అసలు విషయాన్ని మరుగున ఉంచి, ఉంచిందన్న స్పృహ ఇవతలవాడికి కలగనీయకుండా మేనేజ్ చేయడం మంగమ్మకు చక్కగా తెలుసు., ఆవిడకోసం నేను ఆరాటపడిన ఘడియలు లేకపోలేదు. నేనిలా ఆరాటపడుతున్నట్లు ఆవిడకూ తెలుసు. కానీ తెలిసినట్టు బయటపడేది కాదు. పడకపోగా యధాశక్తి ఇంకో రెండు సమిధలు, ఆ అగ్నిలో వేసి మరీ పోయేది. తనకోసం ఇద్దరు మొగాళ్ళు తక్కిన మక్కిసలాడుతున్నారని తెలిసినప్పుడు స్త్రీ ప్రవర్తన ఎలా ఉందేది మంగమ్మను చూస్తే తెలుస్తుంది. ఆవిడ అటు రామచంద్రాన్నీ, ఇటు నన్నూకూడా ఆకట్టకలిగింది. ఇతే ఆ సున్నితమైన బంధనాలు మాకు చాలా కాలందాకా తెలియరాలేదు.
మంగమ్మను నేను ప్రేమించాననడం అబద్దం, 'ప్రేమ' అన్నముక్కకు నాకుండే అర్దాలేవో నాకున్నాయి.
మంగమ్మమీద వాంఛను 'దత్తి' అంటె సరిపోతుందనుకొంటాను. అదీ కొత్తలో సంగతి, మంగమ్మ మాలో వొకతెగా అయిపోయినాక - ఆవిడ్ను చూస్తే ఏ ఉద్రేకమూ కలగటం మానేసింది. ఆవిడకోసం ఆర్రులు చాపే వాళ్ళను చూస్తుంటే - నాకొక్కోసారి నవ్వు కూడా వొచ్చేది.
మంగమ్మ రేపే మవుతుందన్న దుగ్దానాకులేదు. ఆవిడకు బ్రతకడం చాతవును. అందులోనూ బ్రహ్మాండంగా బ్రతకకలదు. చిన్నప్పట్నించీ మంగమ్మ పెరిగిన వాతావరణం అటువంటిది? అయితే రామచంద్రానికి అభిప్రాయాల్లేవు, వాడు మంగమ్మను వదలనూ లేడు మంగమ్మ శరీరమంటే ఈ క్షణానికీ వాడికి వాడికి వల్లమాలిన అభిమానముంది. మంగమ్మ అనే ఆవిడ ఈ, సమాజంలోకి రావడమంటే జరక్కపోతే, రామచంద్రం అన్ని వేల రూపాయలు నాటకాలకి ఖర్చుపెట్టి ఉంటాడనటం అబద్దం. ఈ పెట్టుబడిద్వారా వాడు నష్టపోయిందేమీ లేదు. మంచి నటుడన్న పేరుతోబాటు, మంగమ్మ గూడా దొరికింది.
వాళ్ళిద్దరూ అప్పుడు వాడికీ మంగమ్మకూ సరసం సాగుతున్నదని పసిగట్టినప్పుడే నేనురంగంనుండి తప్పుకొన్నాను. ఇందుకు  రామచంద్రంకన్నా మంగమ్మే ఎక్కువ సంతోషించి ఉంటుంది. రామచంద్రం ఎంత త్వరగా అతుక్కున్తాడో, అంతకన్నా రెట్టింపు  వేగంతోఊదిపోతాడు. పట్టిన పట్టు విడిచి పెట్టడం వాడి స్వభావానికే విరుద్దం. ఈ మనస్తత్వం మంగమ్మలాంటి వాళ్ళకు పనికొస్తుంది. నాకన్నా రామచంద్రం వల్లనే తన కెక్కువ ఉపయోగాలున్నాయని మంగమ్మ భావించిందంటే అందులో తప్పేమీ లేదు. సమాజానికి ఆయువుపట్టు వాడే కదా! కేవలం స్నేహరీత్యానే వాడు నాకీ పెద్దరికాన్ని అంటగట్టాడు. ణా మాటను వాడెన్నడూ కాదనలేదు. వాణ్ని కాదని నేను చేసిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ వాడు సహించాడంటే, తనకన్నా నేను బాగా ఆలోచించగల నమ్మకం ఉండటమే. తాత్కాలికమైన ఉద్రేకాలకులొంగి, దీర్ఘ కాలిక ప్రయోజనాలను వదులుకోవడంలో నాకు అర్ధంకనుపించలేదు. మంగమ్మకోసం, నేను వాడితో ధారాళంగా దెబ్బలాడగలను. అందువల్ల ప్రయోజనమేమీ లేదు. వాడుకూడా ఆవిడలో నాకు భాగామివ్వడానికి సంకోచించడని నాకు తెలుసు. తన శరీరం ఎరగాచూపి తనక్కావలసిన పనులన్నీ నాచేత సులభంగా చేయించుకోవచ్చునన్న అభిప్రాయం మంగమ్మకు కలిగినరోజున ఆవిణ్ణి నేను అదుపులో ఉంచడం కాళ్ళ. సగం అందుకే నేను ఆవిడ ప్రోధ్బలానికి లొంగలేదు. ఈ నిగ్రహం వల్ల నేను అద్భుతమైన ఫలితాలను సాధించాను. నేనంటే మా సమాజంలో వారందరికీ చచ్చేంత భయంగా ఉండేది. వాళ్ళ తప్పులను పొరబాట్లను, నేను తీవ్రంగా సరిదిద్దేవాణ్ని. ఎవ్వరూ కిక్కురుమనేవాళ్ళు కాదు. నేనూ నలుగురితో పాటు నారాయణ పతుగా ఉంటే ఈ సమాజం ఇన్నేళ్ళపాటు ఉండేదీ కాదు. ఇంతకట్టుదిట్టంగా పనిచేసేదీ కాదు.
ఏది ఏమైతేనేం గాని ఇవన్నీ గత సంఘటనలే అయిపోయాయి. వాటి ప్రభావం మా జీవితాలమీద ఎలా పని చేసిందన్న ప్రశ్నకు ఇప్పుడప్పుడే సమాధానం చెప్పడం కష్టం. అయినా ఇది లాభనష్టాలు బేరీజు వేసుకొనే సమయం కాదు. లాభంగానీ, నష్టం గానీ, భరించక తప్పేదేమీలేదు. ఒక్క సంతృప్తిమాత్రం దక్కింది. మేము సమాజాన్ని ప్రారంభించిన ఆశయాలు చాలా మేరకు నెరవేరాయి. ఈ ఫలితాలు సాధించడంకోసం మే మెన్ని బాధలు పడ్డామన్నది వేరు విషయం. ఏ ఫలితం రావాలన్నా ఎంతో కొంత శ్రమపడకుండా వస్తుందని నాకు నమ్మకం లేదు. అలా వచ్చిన ఫలితం కష్టపడి సాధించిన విజయమిచ్చే ఆనందమిస్తుందని నేననుకోను.
ఆ మరునాడు మంగమ్మకు అయి దొందల రూపాయలిచ్చాను. ఆవిడ వాటాకేసి ఓ సారి చూసి అలానే గుప్పిట్లో పెట్టుకుంది. ఆవిడ కళ్ళల్లో మరోసారి నీళ్ళు తిరిగాయి.
"నన్ను మర్చిపోతారా?" అన్నది మంగమ్మ వంగి నాకు దణ్ణం పెడుతూ.
"నువ్వే మనుకొంటున్నావ్?" అన్నాడు రామచంద్రం.
ఈసారి మంగమ్మ, నాకేసి శూన్యంగా చూసింది.
ఏదో కొంపమునిగినట్టు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వూ మేమూ ఇంతటితో తెగతెంపులు చేసుకోవడం లేదు. మనమందరం కలిసిపనిచేసే అవకాశం రావచ్చు. అంతదాకా ఇది ఆటవిడుపులాంటిది. గుంటూరుకు, మా వూరుకూ పది మైళ్ళలోపు దూరం ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే రావచ్చు. అర్ధరూపాయి దూరంలో ఉన్నాం అన్నారు.
ముగ్గురం వీధి చేడీలదాకావచ్చాం. ప్రాణం ఉండబట్టక నేను వోసారి వెనక్కు తిరిగి చూశాను. ఇంటి యజమాని తాలూకు మనుషులు, ఇప్పటికప్పుడే ఇంటిని ఆక్రమించుకొనే ప్రయత్నంలో ఉన్నారు.
"వస్తాను" అంటూ నేనూ బయలుదేరాను.
"నువ్వు పదరా! నాక్కాస్తంత పనుంది. అది చూసుకొని సాయంత్రం బస్సుకొస్తాను" అన్నాడు రామచంద్రం.
"ఉంటాను మేష్టారూ!" అన్నది మంగమ్మ ఏడుపును దిగమింగుకుంటూ ఏమనడానికి నాకు మాట పెగిలిరాలేదు. తలొంచుకొని వీధి చివరిదాకా వచ్చేశాను. కాళ్ళు ముందుకు సాగుతున్నయ్యన్న మాటేగానీ, ప్రాణాలన్నీ మా ఆఫీసు చుట్టూరా తిరుగుతున్నాయి.
వీదిచివర రిక్షా ఎక్కుతూ, ఇంకోసారి వెనక్కు తిరిగి చూశాను. రామచంద్రం తలొంచుకొని విసవిసా నడిచిపోతున్నాడు. మంగమ్మ మాత్రం చేసంచీ పట్టుకొని, నిర్జీవంగా ఒక్కతే ఆఫీసు మెట్లుదిగువున నిలబడింది,. దూరంనుండి చూసినవారికి అక్కడో విగ్రహమున్నదనిపిస్తుంది గాని, మనిషి నిలబడి ఉన్నట్లనిపించదు.
   
                                                                            (మాధవరావు కధ సమాప్తం)
                                                                                  *    *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS