రాముడు సరే! మరి లక్ష్మణుడి సంగతో...

 


రామాయణం అనగానే జగదభిరాముడైన శ్రీరాముని చరితమే గుర్తుకువస్తుంది. కానీ శ్రీరామునికి అడుగడుగునా అండగా నిలిచి, కర్తవ్య పాలనలో సహకరించిన లక్ష్మణుడి పాత్రా తక్కువేమీ కాదు. అందుకే సీతారాములతో పాటుగా రాముని నిరంతరం తల్చుకునే హనుమంతుడు, ఆయననే సతతం కొలుచుకునే లక్ష్మణుడు యుగయుగాలుగా పూజలందుకుంటున్నారు.

 

రాముడు విష్ణుమూర్తి అవతారం అయితే లక్ష్మణుడేమో ఆదిశేషుని అవతారం. దశరధుని ఇంట కౌశల్యకు రాముడు. సుమిత్రకు లక్ష్మణుడు జన్మించారు. బాల్యం నుంచి రామలక్ష్మణులు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుని వెంట వెళ్లినా, సీతాస్వయంవరంలో శివధనుసుని చేపట్టినా.... రాముని వెంటే ఉన్నాడు లక్ష్మణుడు. అందుకే సీతాస్వయంవరంలో రామునికి సీతమ్మ చేతిని అందిస్తే, లక్ష్మణుడికి ఆమె చెల్లలు ఊర్మిళను ఇచ్చి వివాహం చేశారు. అలా రామునికి లక్ష్మణుడు తమ్ముడే కాదు తోడల్లుడు కూడా!

 

చెప్పుడు మాటలు విన్న రాముని సవతి తల్లి కైకేయి, రాముని అడవులకు పంపే వరాన్ని దశరధుని నుంచి అందుకుంటుంది. తండ్రి మాటను జవదాటని కుమారుడుగా రాముడు, భర్తను అనుసరించే భార్యగా సీతాదేవి వనవాసానికి బయల్దేరతారు. కానీ తన సంసారాన్ని వదిలి లక్ష్మణుడు వారి వెంట సాగడం అసాధారణం. అడవులకు వెళ్లడమే కాదు, అక్కడ శ్రీరాముని నిరంతరం కాచుకుని ఉండేందుకు 14 ఏళ్లపాటు నిద్రలేకుండా ఉండాలన్న వరాన్ని కోరుకుంటాడు లక్ష్మణుడు. అందుకోసం లక్ష్మణుని భార్య ఊర్మిళ, 14 ఏళ్లపాటు లక్ష్మణుడి నిద్రను కూడా తానే అనుభవిస్తుంది. ఇక వనవాసంలో ఉన్న రాముని పట్ల మోహితురాలైన శూర్పనఖ ముక్కుని లక్ష్మణుడు ఖండించడంతో, రామరావణ యుద్ధానికి బీజం పడుతుంది. ఆ తరువాత లక్ష్మణుడు గీసిన లక్ష్మణరేఖను జవదాటినందుకు సీతను రావణుడు అపహరించే అవకాశం చిక్కుతుంది. ఇలా రామాయణంలో అడుగడుగునా లక్ష్మణుని పాత్ర కథను ముందుకు నడిపిస్తుంది.

 

రామరావణ యుద్ధంలోనూ లక్ష్మణుడిది ముఖ్యపాత్రే! అమిత పరాక్రమవంతుడైన రావణ కుమారుడు ఇంద్రజిత్తును సంహరించింది లక్ష్మణుడే. వారివురి మధ్యా జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిని చేరుకుంటాడు. కానీ హనుమంతుడు అందించిన సంజీవనితో లక్ష్మణుని ప్రాణం నిలబడుతుంది. కొన్ని రామాయణాలలో అయితే రావణాసురుని కూడా లక్ష్మణుడే చంపినట్లు ప్రస్తావన ఉంది. రావణ సంహారం, వనవాసం ముగిసి రామరాజ్యం మొదలైన తరువాత కూడా, లక్ష్మణుడు రాముని సేవకునిగానే ఉండిపోయాడు. అలాంటి ఒక సందర్భంలో రాములవారు, యమునితో ఏకాంతంగా సంభాషించాలనుకున్నారు. కాలజ్ఞానానికి సంబంధించిన ఆ చర్చని ఎవరూ అడ్డుకోరాదనీ, చర్చని భంగపరిచిన వారికి మృత్యువు తప్పదని హెచ్చరించాడు రాముడు. ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు స్వయంగా లక్ష్మణుని ద్వారం వద్ద నిలిపారు. కానీ ఇంతలో దుర్వాసమహర్షి రావడంతో లక్ష్మణుడికి ఏం చేయాలో పాలుపోలేదు. దుర్వాసుని ఆగ్రహం తెలిసినప్పటికీ, లోపలికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదంటూ ఆయనను నివారించేందుకు ప్రయత్నించాడు. ఆ మాటలకు ఆగ్రహించిన దుర్వాసుడు, తనను లోపలికి అనుమతించక పోతే ఏకంగా అయోధ్యనే శపిస్తానంటూ ఆగ్రహించాడు. దాంతో అయోధ్య బదులుగా తాను ఒక్కడే బలవ్వడం మేలు అనుకున్నాడు లక్ష్మణుడు. దుర్వాసులవారి రాకను తెలియపరిచేందుకు లోపలికి వెళ్లి చర్చను భంగపరిచాడు. చర్చకు భంగం కలిగించినవారికి మృత్యువు తప్పదన్న అన్నగారి మాటని నిలబెట్టేందుకు, సరయూ నదీ తీరానికి వెళ్లి తన అవతారాన్ని సమాప్తి చేసుకున్నాడు.

 

నిరంతరం తన వెన్నంటి నిలిచి, తన ఆజ్ఞలను పాలించిన లక్ష్మణుడి రుణం ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాడట రాముడు. అందుకే శ్రీకృష్ణావతారంలో, లక్ష్మణుడు బలరామునిగా జన్మించాడు. ఆ బలరాముని తమ్ముడు కృష్ణునిగా రాముడు అవతరించాడు!

...Nirjara


More Sri Rama Navami