కృష్ణాతీరాన పుణ్యక్షేత్రాలు

 

 

హైందవ సంప్రదాయంలో నదికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పూజాది క్రతువులని నిర్వహించేందుకు, అర్ఘ్యపాద్యాలు అర్పించుకునేందుకు, దాహాన్ని తీర్చుకునేందుకు, వ్యవసాయాన్ని సాగించేందుకు... ఇలా ఒకటేమిటి! మన జీవన గమనంలో నదులు కూడా ఒక భాగంలా కలిసిపోయాయి. ఆ నదుల పక్కనే రాజ్యాలు సాగాయి. ఆ నదుల తీరానే పుణ్యక్షేత్రాలు వెలిసాయి. మరి ఈ కృష్ణా పుష్కరాల సందర్భంగా, కృష్ణాతీరాన ఉన్న ఆ ప్రముఖ క్షేత్రాలను ఓసారి తలుచుకుందాము.

 

అలంపురం

 

 

తెలంగాణలో కృష్ణతీరాన వెలసిన ప్రసిద్ధ క్షేత్రం అలంపురం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన జోగులాంబ వెలసిన క్షేత్రం ఇది. ఇక్కడ ఆ అమ్మవారి దవడ పన్ను పడిందని చెబుతారు. సుదీర్ఘకాలం ఈ క్షేత్రం అటు అన్యమతస్థుల దాడినీ ఇటు తుంగభద్ర వరద ఉధృతినీ తట్టుకుంటూ నిలబడింది. గడియారం రామకృష్ణ శర్మ అనే పండితుడు, ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికీ, సంరక్షించడానికీ శతవిధా ప్రయత్నించడంతో ఈ ఆలయం ఇప్పుడు పునర్‌ వైభవాన్ని సాధించింది. ఈ అలంపురం వద్దనే కృష్ణా తుంగభద్రల కలయిక జరిగి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతుంది.

 

బీచుపల్లి

 

 

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న క్షేత్రం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం. సాక్షాత్తూ వ్యాసరాయలవారే ఇక్కడి స్వామిని ప్రతిష్టించారని ప్రతీతి. అంతేకాదు! ఆయన ఒక బోయ కులస్థుడిని పూజారిగా నియమించారనీ, అప్పటి నుంచీ ఆంజనేయునికి బోయవారే పూజాదికాలు అందిస్తున్నారని ఐతిహ్యం. ఇక్కడి హనుమంతునికి ఇరువైపులా శంఖుచక్రాలు ఉండటం విశేషం.

 

శ్రీశైలం

 

 

శ్రీశైల శిఖర దర్శనభాగ్యం కలిగినవారికి పునర్జన్మ ఉండదన్నది ఓ ప్రశస్తి. అటు శ్రీశైల మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలుగొందితే, భ్రమరాంబిక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా నిలిచింది. దుర్గమమైన నల్లమల అడవుల మధ్యన వెలసిన ఈ క్షేత్రం అనాదిగా తెలుగువారికి పుణ్యధామం. శంకరాచార్యుల మొదలుకొని దత్తాత్రేయుల వరకూ కొలుచుకున్న సన్నిది- శ్రీశైలం. ఇక్కడి శిల్పకళ, మఠాలు, జలపాతాలు, దట్టమైన అడవులు... అన్నీ కూడా ఒక అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.

 

విజయవాడ

 

 

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి తరువాత అంతటి వైభవాన్ని కలిగిన క్షేత్రం ఇది. బెజవాడ కనకదుర్గమ్మగా భక్తులు పిలిస్తే పలికే దైవమిది. ఈ ప్రదేశంలోనే అర్జునుడికి అమ్మవారు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని అందించడంతో విజయవాడ అన్న పేరు స్థిరపడిందన్నది పురాణ కథనం. ఇక కీలుడు అనే యక్షుని కోరిక మేరకు పర్వతరూపంలో ఉన్న అతని మీద స్థిరపడటంతో కీలాద్రి అయ్యిందనీ.... ఇంద్రాది దేవతలందరిచేతా పూజలందుకుని ఇంద్రకీలాద్రి అయ్యిందనీ ప్రసిద్ధి. ఒకప్పుడు తెలుగునాట బౌద్ధానికి కూడా కేంద్రంగా విలసిల్లింది.

 

అమరావతి

 

 

ఇంద్రుని రాజధాని అమరావతి సంగతేమో కానీ, ఆంధ్రులకు మాత్రం వేల సంవత్సరాల క్రితమే రాజధానిగా నిలిచిన ప్రాంతం ఈ అమరావతి. గత చరిత్ర వైభవం మళ్లీ పునరావృతం అవుతుందని ఆశిస్తున్న ఆంధ్రుల సరికొత్త రాజధాని. పంచారామాలలో ఒకటైన ఇక్కడి అమరేశ్వరాలయంలో అమరలింగేశ్వరుడు, చాముండీ సమేతుడై భక్తుల కోర్కెలను నెరవేరుస్తూ ఉంటారు. పది అడుగులకు పైబడి ఉండే పాలరాతి శివలింగం ఈ ఆలయ ప్రత్యేకత.

 

వేదాద్రి

 

 

హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం, నరసింహస్వామి పంచనారసింహునిగా అంటే అయిదు రూపాలలో ఇక్కడ వెలిసాడని స్థలపురాణం చెబుతోంది. వారే ఉగ్ర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నృసింహస్వాములు. ఇక్కడి స్వామివారి మూలరూపాన్ని సాక్షాత్తూ ఋష్యశృంగ మహర్షి ప్రతిష్టించారని ప్రతీతి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని చిల్లకల్లు అనే గ్రామంలోని కృష్ణానదీ తీరాన ఈ క్షేత్రం ఉంది.

 

మంగళగిరి

 

 

పానకాల నరసింహస్వామిగా ప్రేమగా కొలుచుకునే నారసింహ క్షేత్రం ఇది. శ్రీవైష్ణవక్షేత్రాలలో ప్రముఖమైనది. రాష్ట్రంలోనే ఎత్తైన గాలిగోపురంతో, అంతకంటే ఉన్నతమైన నరసింహస్వామి ఆశీస్సులతో భక్తులను తనదరికి చేర్చుకుంటోంది. కొండ మీద ఉండే పానకాల స్వామికి ఎంత పానకాన్ని అందించినా అందులో సగభాగం ప్రసాదంగా మిగలడం ఓ చిత్రమైన అనుభూతి. ఇక అంత పానకాన్ని పోసినా చీమలూ, ఈగలూ దరికి రాకపోవడం ప్రకృతి వైచిత్రి. రామానుజాచార్యులు మొదలుకొని చైతన్య మహాప్రభువు వరకూ వైష్ణవ ప్రముఖులందరూ ఈ స్వామిని కొలుచుకున్నారని తెలుస్తోంది.

 

శ్రీకాకుళం

 

 

ఆంధ్రమహావిష్ణువుగా పేరుగాంచిన దైవపు క్షేత్రం ఈ శ్రీకాకుళం. కలియుగంలో పాపభారాన్ని తగ్గించమంటూ దేవతలు చేసిన వేడుకోళ్లను మన్నించి విష్ణుమూర్తి ఇక్కడ వెలిశాడనీ.... ఇక్కడి మూలవిరాట్టుని ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్టించాడనీ ప్రతీతి. భారతదేశంలోనే అత్యంత పురాతన దేవాలయాలలో శ్రీకాకుళం ఒకటనేందుకు సాక్ష్యంగా పెక్కు ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ మహావిష్ణువు మీద కాసుల పురుషోత్తమ కవి రాసిన ‘ఆంధ్ర నాయక శతకం’ తెలుగు సాహిత్యంలోనే ఒక అనర్ఘరత్నము. ఇక మహావిష్ణువుని వరించిన గోదాదేవి గురించి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని ఈ ప్రభువు సన్నిధిలోనే ఆరంభించడం ఒక చారిత్రక సత్యం.

 

మోపిదేవి

 

 

తెలుగునాట కాళహస్తి తరువాత, రాహుకేతు దోష నివారణకు భక్తులు విరివిగా కొలుచుకునే క్షేత్రం మోపిదేవి. సంతానం లేనివారికీ, కుజదోషాలతో ఇబ్బంది పడుతున్నవారికీ, రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవాలనుకునేవారికీ... అండగా నిలిచే స్వామి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఒకప్పటి మోహినీపురమే ఇప్పటి మోపిదేవిగా మారిందని అంటారు. ఇక్కడ నాగరూపంలో వెలిసిన కుమారస్వామిని సాక్షాత్తూ ఆ అగస్త్య మహాముని తొలుత గుర్తించి పూజించాడని ఐతిహ్యం. అంతటి ప్రసిద్ధ క్షేత్రం కాబట్టే గ్రహదోష నివారణతో పాటుగా పుట్టువెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం వంటి వేడుకలను సైతం స్వామివారి సన్నిధిలో జరుపుకొంటారు. గర్భగుడిలోని స్వామి ఒక పుట్ట మీద వెలియడం ఇక్కడ కనిపించే మరో విచిత్రం. ఆ పుట్టలో ఇప్పటికీ ఒక మహాసర్పం నివసిస్తోందన్నది భక్తుల నమ్మకం.

 

హంసలదీవి

 

 

ఇక్కడి వేణుగోపాలస్వామి ఆలయాన్ని సాక్షాత్తూ ఆ దేవతలే ప్రతిష్టించారని చెప్పుకొంటారు. ఇప్పటికీ ఆ దేవతలంతా రాత్రివేళల హంసల రూపంలో ఇక్కడే నదీస్నానాలను ఆచరించి స్వామివారిని కొలుచుకుంటారని ఓ నమ్మకం. అందుకనే ఈ క్షేత్రానికి హంసలదీవి అన్న పేరు స్థిరపడిందట. ఇదే పేరుకి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. నిరంతరం తనలో మునిగే ప్రజల పాపాలతో గంగాదేవి కొంతకాలానికి మలినం అయిపోయిందట. తన మలినాన్ని తొలగించుకునే క్రమంలో కాకి రూపంలో ఒక్కో పుణ్యతీర్థంలోనూ మునక వేయగా, చివరికి ఇక్కడి తీర్థంలో గంగమ్మ హంసరూపాన్ని పొందిందట. కథ ఏదైనా, కాకులు సైతం హంసలుగా మారేంతటి మహిమగల క్షేత్రం ఈ హంసలదీవి అన్నది భక్తుల విశ్వాసం. ఎక్కడో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌ అనే పర్వతప్రాంతంలో మొదలైన కృష్ణానది, చివరికి ఈ హంసలదీవి వద్దే బంగాళాఖాతంలోకి సంగమిస్తుంది. కృష్ణమ్మ యాత్రకు ఓ ముగింపునిస్తుంది.

కేవలం పైన పేర్కొన్న ఆలయాలే కాదు. కృష్ణాతీరానికి దగ్గరలో ఉన్న ఆలయాలన్నింటినీ పేర్కొనాలంటే అదో మహా గ్రంథమవుతుంది. కృష్ణ ఉత్తరవాహినిగా ప్రవహించే పద్దకళ్ళేపల్లి, క్షేత్రయ్య తన పదాలను అంకితం చేసిన మొవ్వగోపాలుని మొవ్వ.... ఇలా ఎన్నో ఆలయాలు కృష్ణమ్మ సిగలో నగలా భాసిస్తున్నాయి.

 

 

- నిర్జర.


More Krishna Pushkaralu