పుష్కర స్నానం చేయవలసిన తీరు

 

 


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణా పుష్కరాలు రానే వచ్చేశాయి. గురుడు కన్యారాశిలో ప్రవేశించిన తొలి 12 రోజులూ కృష్ణమ్మకు పుష్కరాలు జరుపుకొనేందుకు అంతా సిద్ధపడిపోయారు. పుష్కరాల సందర్భంగా ఏదో ఒక సమయంలో పుష్కరనదిలో స్నానం చేయడం మంచిందంటారు పెద్దలు. ఒకవేళ కుదిరితే ఆ స్నానాన్ని ఆచరించే సమయంలో కొన్ని ప్రార్థనలను కూడా సూచిస్తున్నారు. నదిలోకి దిగే సమయంలో గట్టు మీద ఉన్న చిటికెడు మాత్రమే మృత్తిక (మట్టి) తీసుకుని నీటిలో వేస్తూ...

 

పిప్పలాదాత్సముత్పన్నే క్రుత్యేలోక భయంకరి!

మృత్తికాంతే మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయ !!

 

... అనే శ్లోకాన్ని చదువుకోవాలి. పుష్కర స్నానాలు జరిగే సమయంలో వేలాదిమంది ప్రజలు వస్తూ ఉంటారు. గట్లన్నీ మట్టిమట్టిగా మారిపోతుంటాయి. వాటి మీద తడి బట్టలతో వెళ్తే కాసేపటికి అంతా బురదమయం కావడం ఖాయం. బహుశా దానికి నివారణగా ఈ ఆచారాన్ని నెలకొల్పి ఉంటారు పెద్దలు. పైగా పుష్కర స్నానం చేసే చోట నది కాస్త లోతుగా ఉంటే ప్రమాదాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. వచ్చినవారంతా తలా ఒక గుప్పెడు మట్టి తీసుకుని వేయడం వల్ల అక్కడి తీరం కాస్త మునకలు వేసేందుకు అనువుగా మారవచ్చు. ఇక పుష్కర సమయంలో వేలాదిమంది ఒక్కసారిగా స్నానాలు చేస్తుంటారు కాబట్టి చర్మవ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. ఒండ్రు మట్టి కలిసిన నీరు గరుకుగా మారి ఉన్న చర్మవ్యాధులను సైతం పోగొడుతుంది. కారణం ఏదైతేనేం ఇప్పటి పరిస్థితులు పూర్తి విభిన్నంగా ఉన్నాయి కాబట్టి, శాస్త్రార్థం ఒక చిటికెడు మట్టిని మాత్రమే విడిస్తే సరిపోతుంది. ఇక నదిలో స్నానం చేసే ముందు కృష్ణమ్మ తల్లిని అనుమతిని అర్థిస్తూ, ఈ కింది పేర్కొన్న మూడు శ్లోకాలనూ, అదీ కాకుంటే రెండో శ్లోకాన్ని చెప్పుకొంటారు...

 

పావని త్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే।

త్వయిస్నాతు మనుజ్ఞాంమేదేహి మహానదీ॥

కన్యాగతే దేవగురౌ పితౄణాం తారణాయచ।

సర్వపాప విముక్త్యర్థం తీర్థ స్నానం కరోమ్యహం॥

తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైకపావనీ।

త్వయిస్నానం కరోమ్యద్య భవబంధవిముక్తయే॥

అటుపై నదిలోకి దిగి ఆచమనం చేసి, సంకల్పం చెప్పుకొని నదీప్రవాహానికి ఎదురుగా నిలిచి స్నానాన్ని సాగించాలి. ఇక నదీ స్నానం ముగిసిన తరువాత సూర్యునికీ, కృష్ణమ్మకూ, త్రిమూర్తులకూ, బృహస్పతికీ, పుష్కరునికీ, గంగాగోదావరిలకు, సప్తర్షులకూ, అరుంధతికి అర్ఘ్యాలను అందించాలి.

 

అర్ఘ్యాలు పూర్తయిన తరువాత నదిలో మరోమారు దక్షిణదిక్కుగా మునిగి పితృదేవతలకు నీటిని వదలాలి. స్నానం ముగిసి బయటకు వచ్చిన తరువాత విభూది, కుంకుమలను అద్దుకోవాలి. ఇదంతా కుదరదు, సాధ్యం కాదు అనుకున్నవారు మనస్ఫూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి దిగి మూడు మునకలు వేసి, తమను చల్లగా చూడమంటూ ఆమెను ప్రార్థించుకుంటే సరి!

 

 

- నిర్జర.


More Krishna Pushkaralu